Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చైనా జానపద కథలు-8: అన్నకు తగ్గ తమ్ముడు

[చైనా జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 8వ కథ ‘అన్నకు తగ్గ తమ్ముడు’.]

చైనాలోని ఒక చిన్న పల్లెటూరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లు చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం చిన్న తమ్ముడు “అన్నా.. ఎంత కాలమని ఈ చిన్న పల్లెటూరిలో ఎదుగూబొదుగూ లేకుండా జీవితం గడపడం. మనం ఈ ఊరు దాటి చుట్టుపక్కల గ్రామాలలో వ్యాపారం విస్తరిద్దాం. మరింత సంపాదిద్దాం. ఏమంటావు” అన్నాడు.

దానికి అన్న నవ్వి “నీవన్నది నిజమే తమ్ముడు.. కూర్చున్న చోటికి దానంతటదే ఏదీ రాదు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది. ఈ పల్లెటూరు దాటి పెద్ద నగరంలోకి అడుగుపెడదాం” అన్నాడు. ఇద్దరు సరే అంటే సరే అనుకున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడబెట్టుకుని చైనాలో ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ నగరానికి చేరుకున్నారు.

“అన్నయ్యా.. మనిద్దరం ఒకేచోట కలసి వ్యాపారం చేయడం వలన మనకు మనం పోటీ కావడం తప్ప ఏమీ లాభం లేదు. నువ్వు తూర్పు వైపు, నేను ఉత్తరం వైపు పోదాం. విజయం సాధించిన తర్వాత మరలా కలుద్దాం. ఏమంటావు” అన్నాడు.

“అలాగే తమ్ముడు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో. డబ్బు చాలా విలువైంది. పది లక్షలు సంపాదించేంతవరకు మనం సొమ్మును ఎటువంటి విలాసాలకు ఖర్చు పెట్టకూడదు. తేనెటీగ లెక్క పైసా పైసా దాచిపెడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నమ్మకం, నిజాయితీ, కలుపుగోలుతనం, నిరాడంబరత్వం ఇవే వ్యాపారానికి నిజమైన పెట్టుబడులు. వీటిని ఎప్పుడు వదులుకోకూడదు” అన్నాడు.

ఇద్దరూ ఒకరి భుజాలు ఒకరు తట్టుకొని వీడ్కోలు చెప్పుకున్నారు. పెద్దోడు తన వద్ద వున్న ధనంతో ఒక చిన్న బట్టలకొట్టు మొదలుపెట్టాడు. తక్కువ ధరకు మన్నికైన బట్టలు తీసుకురాసాగాడు. చుట్టుపక్కల వున్న పెద్ద వర్తకుల కన్నా పది రూపాయల తక్కువకి అమ్మసాగాడు. పేద ప్రజలు బాగా వచ్చేవాళ్ళు. అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు. వాళ్ల పేర్లు గుర్తుపట్టి పిలిచేవాడు. ఒకసారి వచ్చినవాడు మరలా మరలా వచ్చేటట్లు చూసుకునేవాడు. అలా నెమ్మదిగా ఆ చుట్టుపక్కలంతా మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఎప్పుడూ అంగడి తెరిచి ఉంచుతాడని, అందరితో ఆప్యాయంగా ఉంటాడని, ఎవరిని మోసం చేయడని, పొరపాటున బట్టలు చినిగినా రంగు పోయినా మార్చి వేరేవి ఇస్తాడని అందరూ మెచ్చుకోసాగారు. అలా ఒకరినుంచి మరొకరికి ఆ అంగడి పేరు వ్యాపిస్తూ నెమ్మదిగా చుట్టుపక్కల ఊర్ల వరకు పాకింది. దాంతో చిన్న బట్టలకొట్టు కాస్త పెద్ద అంగడి అయింది. చేతినిండా డబ్బు ఆడడం మొదలుపెట్టింది. కానీ ఎంత సంపాదించినా విలాసాల వైపు అడుగుపెట్టలేదు. బతకడానికి తినాలి గానీ తినడానికి బతకకూడదు అనుకునేవాడు.

ముందుగా అనుకున్నట్టు పది లక్షలు కూడ పెట్టడం మొదలుపెట్టాడు. పది లక్షలు పూర్తయినా గర్వం తలకెక్కించుకోకుండా ఆ వీధిలోకి మొదట అడుగు పెట్టినప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడూ అలాగే ఉండసాగాడు. సాధారణమైన బట్టలతో నిరాడంబరంగా జీవించసాగాడు.

ఇంకొకవైపు తమ్ముడు వెళ్ళాడు కదా.. చిన్నోడు కూడా మొదట్లో బాగా సంపాదించడం మొదలుపెట్టి వెనకేసుకోసాగాడు. కాస్త ధనం చేతిలో కొంచెం ఎక్కువ కనపడేసరికి మనసు నెమ్మదిగా విలాసాల వైపు లాగసాగింది. “మంచి తిండి, మంచి బట్టలు, ఖరీదైన ఇల్లు లేకుండా ఇలా ఎంతకాలం చేతులు కట్టేసుకుని బతకడం. అసలు సంపాదించేదే బాగా తిని తిరగడానికి కదా.. వచ్చినదానిలో సగం దాచి సగం నా కోసం ఖర్చు పెట్టుకుంటాను” అనుకున్నాడు. దానితో నెమ్మదిగా విలాసాల వైపు మరలాడు.

నాలుక ఒకసారి రుచిమరిగితే అది తరువాత మన మాట కూడా వినదు. నెమ్మదిగా స్నేహితులు ఎక్కువయ్యారు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి పిలిచేవాళ్ళు. కొట్టు కట్టేసి వెళ్లేవాడు. వినోదాలతో జల్సాగా కాలం గడిపేవాడు. కడుపునిండా తిండి తినేసరికి నిద్ర ఎక్కువైంది. మనిషి లావు పెరిగాడు. బద్ధకం పెరిగింది. పనిమీద శ్రద్ధ తగ్గింది. అంగడి కూడా సమయానికి తెరిచేవాడు కాదు. దాంతో జనాలకు నెమ్మదిగా అతనిమీద నమ్మకం పోయింది. అంగడికి రావడం తగ్గిపోయింది. కొండలైనా కూర్చుని తింటే కరిగిపోతాయి అన్నట్లు చేతిలోని ధనమంతా అయిపోయింది. బతకడం కష్టమైపోయింది. స్నేహితులు కూడా మాయమయ్యారు. ఇక అక్కడ ఉండలేక అన్న గుర్తుకు వచ్చి అన్న దగ్గరికి బయలుదేరాడు.

పెద్దోడు చిన్నోడిని చూసి చాలా సంబరపడ్డాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. “తమ్ముడూ.. అయిపోయిందేదో అయిపోయింది. ఏమీ బాధపడకు. భయపడకు. మన ఇంటి వెనక ఒక గది ఉంది. హాయిగా అక్కడ ఉండు. నెలకు కావలసిన సరుకులు పంపిస్తాను. చేసుకొని తిను” అన్నాడు. కానీ ఆ సరుకుల్లో బియ్యం, పప్పు, ఉప్పు, కారంలాంటి సాధారణమైనవి మాత్రమే ఉన్నాయి. రోజూ వాటినే తినేసరికి కొన్ని రోజులకు నాలుక చప్పబడిపోయింది. బాగా విలాసాలకు అలవాటు పడి ఉండడంతో ఒకరోజు “అన్నా.. రోజూ ఇవే తినీ తినీ విసుగు వస్తోంది. భోజనంలో ఏదైనా మార్పు ఉంటే బాగుంటుంది కదా” అన్నాడు. పెద్దోడు నవ్వి “మన తోటలో ఒక చిన్న ఇల్లు ఉంది. అక్కడికి పో. నీకు చిన్నప్పటినుంచి చింతచిగురు అంటే చాలా ఇష్టం కదా. అక్కడ ఒక చింతచెట్టు ఉంది. హాయిగా తిను” అన్నాడు. చిన్నోడు తోటలోకి మారాడు. అక్కడున్న చిన్న చింతచెట్టు చిగురు పప్పులోకి, కూరలోకి వేసుకొని కమ్మగా తినేవాడు. కానీ కొద్దిరోజులు గడిచేసరికి చెట్టుకున్న ఆకులన్నీ అయిపోయాయి. బోడిగా మారిపోయింది. దాంతో మరలా ఉత్త అన్నం, పప్పే మిగిలాయి.

దాంతో అన్న దగ్గరికి పోయి “అన్నా.. చెట్టుకున్న చిగురంతా అయిపోయింది. నోరంతా మరలా చప్పబడిపోయింది. నాలుక మంచి భోజనం కోసం తనకలాడుతా ఉంది. ఏదైనా విందు భోజనం పెట్టవచ్చు కదా” అన్నాడు.

అన్న చిరునవ్వు నవ్వి “కొద్దిరోజులు ఆగు. నువ్వు కోరిన కోరిక నెరవేరుతుంది. అంతలోపు ఒక పని చెయ్. మనకు ఇంకొక పెద్ద తోట ఉంది. అందులో ఒక పెద్ద చింతచెట్టు ఉంది. దాని చిగురు అయిపోగానే చెప్పు. నీకు ఆ తర్వాతరోజు నుంచి కావలసినంత విందు భోజనం ఏర్పాటు చేస్తాను” అన్నాడు.

తమ్ముడు ‘సరే’ అని తోటకు పోయాడు. పెద్ద చింతచెట్టు చిగురుతో కళకళలాడుతూ కనపడింది. “ఈ చిగురు అంతా అయిపోతే చాలు. అన్న నాకు రోజూ మంచి భోజనం ఏర్పాటు చేస్తాడు. హాయిగా కాలు మీద కాలేసుకుని బతుకవచ్చు” అనుకున్నాడు. ఎక్కువెక్కువ తెంపుకొని పప్పులో వేసుకోసాగాడు. కానీ ఎన్ని రోజులు గడిచినా ఎలా ఉన్న చింతచెట్టు అలాగే ఉంది. ఒక కొమ్మకు చిగురు తెంపుతే మరొక కొమ్మకు పూయసాగింది. ఎంత తెంపినా చెట్టు మీద చిగురు కొంచెం కూడా తగ్గకపోగా మరింత పెరగసాగింది. దాంతో విసిగిపోయి అన్నను చేరుకున్నాడు.

“అన్నా.. ఆ చెట్టు మీద చిగురు అంతా తినడం నావల్ల కాదు. ఎంత తెంపినా పూస్తూనే ఉంది. నువ్వు నాకు ఖరీదైన భోజనం పెట్టకూడదనే ఆ చెట్టును చూపించావు కదా” అన్నాడు.

అన్న నవ్వి “తమ్ముడు.. నీకు డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన జీవిత సత్యం అర్థం కావాలనే అలా చేశాను. మొదటి చెట్టుకు చిగురు తక్కువ. తింటూ పోతే కొన్ని రోజులకే అంతా అయిపోతాది. అలాగే మనం కూడా సంపాదించింది తక్కువ ఉన్నప్పుడు తింటూవుంటే చివరికి చిన్న చింతచెట్టు లాగే అయిపోతాది. అదే పెద్ద చింతచెట్టును చూడు. ఎంత కోసుకున్నా మరలా మరలా పూస్తూనే ఉంది. కొంచెం కూడా తగ్గడంలేదు. అందుకే ధనాన్ని మొదట కావలసినంత సంపాదించాలి. ఆ తరువాత డబ్బే డబ్బును సంపాదించడం మొదలు పెడుతుంది. నువ్వు ఎంత తిన్నా అందులో ఇంకా మిగులుతుందే తప్ప తగ్గదు.

నేను పెద్ద చింత చెట్టు లాగా మారేవరకు ధనాన్ని పైసా పైసా కూడబెట్టాను. అందుకే ఇప్పుడు కాలు మీద కాలేసుకుని బతుకుతున్నాను. కానీ నువ్వు చెప్పిన మాట మరచిపోయి చెట్టు పెరిగి మానుగా మారకముందే అంతా కోసుకొని తిని వీధిలో పడ్డావు” అని చెప్పాడు.

తమ్మునికి తాను చేసిన తప్పు పూర్తిగా తెలిసి వచ్చింది. అన్న చెప్పిన పాఠాన్ని అర్థం చేసుకొని అన్న ఇచ్చిన ధనంతో మరలా వ్యాపారం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే అన్నకు తగ్గ తమ్మునిగా మంచిపేరు సంపాదించుకున్నాడు.

(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)

Exit mobile version