[చైనా జానపద కథల సీరిస్లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 9వ కథ ‘ఏది అదృష్టం ఏది దురదృష్టం’.]
చైనాలో సాయివెంగ్ అనే ఒక ముసలాయన ఉండేవాడు. అతను చాలా మంచివాడు. నెమ్మదస్తుడు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడేవాడు. దేనికి అనవసరంగా ఆనందించడం కానీ తొందరపాటుతో బాధపడడం కానీ చేసేవాడు కాదు. అతను ఒక వ్యాపారి. నగరంలో సరుకులు కొని చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకు పోయి అమ్ముతూ ఉండేవాడు. అతని దగ్గర చాలా చురుకైన ఒక మంచి మేలుజాతి గుర్రం ఉండేది. ఎన్ని సరుకులు అయినా సరే సులభంగా మోసుకుంటూ చకచకా చలాకీగా తిరుగుతూ ఉండేది. దానివల్ల ఆ ముసలాయన వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగిపోతూ ఉండింది.
ఒకసారి ఉదయం ఆ ముసలాయన లేచి చూస్తే ఆ గుర్రం కనపడలేదు. ఎక్కడికి పోయిందో తెలియక ఊరంతా వెతికాడు. లాభం లేదు అది పక్కనే ఉన్న అడవుల్లోకి వెళ్లిపోయింది.
ఆ విషయం తెలిసి చుట్టుపక్కల జనాలంతా వాళ్ళ ఇంటికి వచ్చారు. “ఈ వయసులో నీకు ఎంత దురదృష్టం పట్టింది. ఇకముందు నీ వ్యాపారం ఎలా జరుగుతుందో ఏమో” అంటూ సానుభూతి చూపించసాగారు.
ఆ మాటలకు ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి “ఇది దురదృష్టమని అప్పుడే ఎలా చెప్పగలం. ఈ లోకంలో ఏదీ ఒక్క రోజులోనే నిర్ణయించకూడదు. కొంతకాలం ఆగితేగానీ దురదృష్టమో అదృష్టమో అర్థం కాదు” అన్నాడు చిరునవ్వుతో.
తామంతా పోయి అతన్ని ఓదార్చాలి అనుకుంటే అతనేమో చిరునవ్వుతో కొంచెం కూడా బాధ పడకుండా తమకే నీతులు చెబుతున్నాడు. అది చూసి జనాలు “వీని ఇంటికి రావడం మనదే బుద్ధి తక్కువ” అనుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు.
కొంతకాలం గడిచింది. ఆ ముసలాయన తన కొడుకుతో కలసి సరుకులు స్వయంగా తీసుకొనిపోయి చుట్టుపక్కల అమ్ముకోసాగాడు. ఒకరోజు పొద్దున్నే ఇంటిముందు తలుపు కొట్టిన చప్పుడు అయింది. “ఈ సమయంలో ఎవరబ్బా” అనుకుంటా లేచి బయటకు వచ్చాడు. చూస్తే ఇంకేముంది.. ఇంటి ముందు తన గుర్రంతో పాటు మరో రెండు అడవిగుర్రాలు కనబడ్డాయి. అడవిలోకి పారిపోయిన గుర్రం మరో రెండింటిని అక్కడినుంచి తీసుకుని వచ్చింది. ఆ ముసలాయన చిరునవ్వుతో ఆ మూడింటిని తన పెరటిలో కట్టివేశాడు.
ఆ విషయం తెలిసి ఊరు ఊరంతా ఆశ్చర్యపోయారు. పరుగు పరుగున వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి “ఆహా.. అదృష్టం అంటే నీదే. ఒకటి పోయింది అనుకుంటే ఇప్పుడు మరో రెండు వచ్చాయి. ఇక నిన్ను వ్యాపారంలో కొట్టేటోడు ఎవడు లేడు” అన్నారు.
దానికి ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి “ఇది అదృష్టమని అప్పుడే ఎలా చెప్పగలం. కొన్ని రోజులు ఆగితే గానీ ఏ విషయం తెలియదు. తొందరపడి దేనికి సంబరపడకూడదు” అన్నాడు.
“వీడింతేలే దేనికీ ముచ్చటపడడు. మూలన కూర్చొని ఏడవడు” అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.
నెమ్మదిగా కాలం గడవసాగింది. మూడు గుర్రాలు ఉండడంతో సరుకులు ఇంకా ఎక్కువ తీసుకువచ్చి అమ్మడానికి వీలయింది. వ్యాపారం బాగా పెరిగి లాభాలు కూడా ఎక్కువయ్యాయి. కొంతకాలానికి ఆ ముసలాయన ఆ ఊరిలో ఒక పెద్ద ధనవంతునిగా మారిపోయాడు.
ఆ ముసలాయన కొడుక్కి గుర్రంస్వారీ అంటే చాలా ఇష్టం. దాంతో సమయం చిక్కినప్పుడల్లా గుర్రాలపోటీల్లో పాల్గొనేవాడు. ఒకసారి అడవిగుర్రం మీదికి ఎక్కాడు. కొత్తగా వచ్చిన ఆ అడవిగుర్రం అతనికి ఇంకా పూర్తిగా మచ్చిక కాలేదు. అది కొంతదూరం పోగానే ఒక్కసారిగా ముందు కాళ్ళు రెండు ఎత్తి పైకి లేచింది. అది హఠాత్తుగా అలా లేచేసరికి ఆ యువకుడు పట్టుతప్పి దభీమని కిందపడ్డాడు. దాంతో అతని కాలి ఎముక విరిగింది. బాధతో అల్లాడిపోసాగాడు. విషయం తెలిసిన ముసలాయన ఆ యువకున్ని తీసుకుపోయి గట్టిగా కట్టు కట్టించాడు. “ఆరు నెలలపాటు కాలు కదపకుండా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే విరిగిన ఎముక తిరిగి అతుక్కుంటుంది” అన్నారు వైద్యులు.
ఆ విషయం తెలిసి చుట్టుపక్కల జనాలంతా చూడడానికి వచ్చారు. “అరెరే.. ఒక్కగానొక్క కొడుకు. ఈ ముసలి వయసులో నీకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకుంటే ఇలా మూలనపడ్డాడే. నువ్వు ఎంత దురదృష్టవంతుడివి” అన్నారు విచారంగా.
దానికి ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి “అదృష్టమో దురదృష్టమో అప్పుడే ఎలా నిర్ణయించగలం. నోరు ఉంది కదా అని తొందరపడి అనవసరంగా మాట్లాడకూడదు. కొంతకాలం వేచి చూద్దాం” అన్నాడు.
సొంత కొడుకు కాలు విరిగి మూలనబడితే కూడా ఆ ముసలోని మొహంలో కొంచెం కూడా విచారం వాళ్లకు కనపడలేదు. “వీడింతే ఎప్పటికీ మారడు. వీన్ని పరామర్శించడం మనదే తప్పు” అని గొణుక్కుంటూ వాళ్లు వెళ్లిపోయారు.
కొంతకాలం గడిచింది. వాళ్ళ పక్కనే ఉండే రాజ్యం వీళ్ళ రాజ్యం మీదికి దండెత్తింది. రెండింటికీ మధ్య పెద్ద యుద్ధం మొదలయింది. దాంతో రాజు “రాజ్యంలో ఉన్న యువకులందరినీ సైన్యంలోకి చేర్చండి. ఒక్కన్ని గూడా వదలకండి” అని ఆజ్ఞాపించాడు. దాంతో సైనికులు ఒక్కొక్క ఊరిలోని యువకులను పట్టుకుంటూ ఆ ఊరికి వచ్చారు. ఊరిలోని యువకులందరినీ బలవంతంగా సైన్యంలో చేర్చసాగారు. ముసలాయన కొడుకు కాలు విరిగి మంచం మీద పడి ఉండడంతో అతన్ని మాత్రం వదిలివేశారు.
అదిచూసి ఆ ఊరి జనాలు “నీవు చాలా అదృష్టవంతుడివి. కాలు విరిగిన నీ కొడుకు కనీసం కళ్ళ ముందున్నాడు. యుద్ధానికి పోయిన మా పిల్లల్లో ఎవరు తిరిగి వస్తారో, ఎవరు రారో తెలియడం లేదు” అన్నారు విచారంగా.
ఆ ముసలాయన చిరునవ్వు నవ్వి “ఏది అదృష్టమో ఏది దురదృష్టమో మనం అప్పుడే నిర్ణయించకూడదు. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. మంచి అనుకున్నది చెడుగా మారవచ్చు. చెడు అనుకున్నది మంచిగా మారవచ్చు. తొందరపడకండి” అన్నాడు.
“అవును నిజమే. నీ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఇప్పుడు మాకు బోధపడుతూ వుంది” అన్నారు జనాలంతా.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
