[జపాన్ జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న మొదటి కథ ‘కోతి రాజు’.]
ఒక అడవిలో ఒక పెద్ద కోతుల గుంపు ఉండేది. ఆ గుంపుకి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు చాలా తెలివైనవాడు. గుంపులోని కోతులకు ఎటువంటి ఆపద కలగకుండా కాపాడేవాడు. ఆహారానికి లోటు లేకుండా చూసుకునేవాడు. దాంతో ఆ కోతులన్నిటికీ తమ రాజు అంటే చాలా గౌరవం, నమ్మకం. రాజు మాట కాదని ఏదీ ఏ పనీ చేసేది కాదు.
ఆ అడవిలో ఒకసారి కరువు వచ్చింది. తాగడానికి నీళ్లు, తినడానికి పళ్ళు దొరకడం కూడా చాలా కష్టమైంది. దాంతో అవన్నీ కలసి ఆహారాన్ని వెతుక్కుంటూ ఇంకో అడవికి బయలుదేరాయి. ఆ కొత్త అడవికి చేరుకోగానే కోతిరాజు “మిత్రులారా.. మనకు మన అడవిలోని ప్రతి చెట్టు, గుట్ట అన్నీ తెలుసు. కానీ ఈ అడవిలో ఏ చెట్టు కాయలు తినవచ్చు, ఏవి తినకూడదు, ఏ చెరువు నీళ్లు తాగవచ్చు, ఏవి తాగకూడదు, ఎక్కడ పడుకోవాల, ఎక్కడ తిరగాల అనేది అస్సలు తెలియదు. కాబట్టి ఈ కొత్తచోటులో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నా వెంబడి రండి. నా అనుమతి లేకుండా తొందరపడి ఏవీ తినవద్దు, తాగవద్దు” అని చెప్పాడు. అన్నీ ‘సరే’ అన్నాయి.
అవి అలా పోతూవుంటే ఒకచోట ఒక పెద్ద పళ్ళచెట్టు కనపడింది. దాని నిండా ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా పళ్ళు విరగకాసి కనబడ్డాయి. మధురమైన మాగిన వాసన రారమ్మని పిలుస్తావుంది. ఆ ఎర్రని పళ్ళను చూస్తానే కోతులన్నిటికీ నోరూరింది. అప్పటికే వాటికి బాగా ఆకలి అవుతావుంది. దాంతో అవి తమ రాజు వంక తిరిగి “రాజా.. పిల్లలు పొద్దున్నుంచీ ఏమీ తినక ఆకలితో అల్లాడిపోతా వున్నారు. కాయలేమో కమ్మగా కనబడుతున్నాయి. చూస్తున్నకొద్దీ నోట్లో నీళ్ళూరుతూ, ఆకలి రెట్టింపు అవుతూ వుంది. ఏం చేయమంటారు. తినమంటారా, వద్దా” అని అడిగాయి.
కోతిరాజు ఆ చెట్టును పరిశీలనగా చూస్తూ “మిత్రులారా.. తొందరపడకండి. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి. కానీ వాటిలో వేటికీ నిండుగా ఇన్ని కాయలు లేవు. ఇవి తినేవే అయితే ఇప్పటికే ఉడతలు, పక్షులు వీటి మీద చేరి అల్లరి చేస్తూ కనపడాలి. కానీ ఒక పక్షిగానీ, చిన్న జీవిగానీ కనపడటం లేదు. నాకు అనుమానంగా ఉంది. చెట్టుకిందంతా గమనించండి” అని చెప్పాడు. కోతులు చెట్ల కింద వున్న పొదలలో బాగా వెతికాయి. అక్కడక్కడ కొన్ని ఉడతలు, పక్షులు చచ్చిపడి ఉన్నాయి. అది చూసి “నిజమే రాజా.. నీవు చెప్పింది. ఈ పళ్ళు తిన్నవన్నీ ఈ పొదల్లో చచ్చిపడి ఉన్నాయి” అని చెప్పాయి.
దాంతో అవన్నీ మరలా ముందుకు బయలుదేరాయి. కొంచం దూరంలో ఇంకొక పళ్ళచెట్టు కనపడింది. పైన పక్షులు పళ్ళు తింటూ కిచకిచలాడుతూ ఉన్నాయి. వెంటనే కోతిరాజు “మిత్రులారా ఇదే మనకు సరిపోయే మంచిచెట్టు. అల్లరి చేయకుండా పైకెక్కి హాయిగా అందరూ సమానంగా తినండి” అని చెప్పాడు. కోతులన్నీ గబగబా పైకెక్కి తీయతీయని పళ్లన్నీ తెంపుకుంటూ కడుపునిండా తిన్నాయి. అలా తిన్న కాసేపటికి వాటికి బాగా దాహం వేయసాగింది. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. దాంతో అవన్నీ నీటి కోసం వెతుక్కుంటా బయలుదేరాయి.
అలా చాలా దూరం పోయాక ఒకచోట ఒక చెరువు కనిపించింది. ఆ నీళ్లను చూడగానే అవి సంబరంగా రాజువంక తిరిగి “రాజా ఇప్పటికే నడిచీ నడిచీ దాహంతో నోళ్ళు పిడిచగట్టుకుపోయాయి. పాపం పిల్లల మొహాలు అలసి వాడిపోయాయి. చెరువులో దిగి నీళ్ళు తాగమంటారా” అని అడిగాయి.
కోతిరాజు ఆ చెరువు చుట్టూ తిరుగుతూ జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ తర్వాత మిగతావాటి వంక తిరిగి “మిత్రులారా.. ఈ చెరువులోకి జంతువులు వెళుతున్న పాదముద్రలు అన్నివైపులా కనిపిస్తున్నాయి గానీ తిరిగి బైటికి వస్తున్న పాదముద్రలు మాత్రం ఎక్కడా కనపడటం లేదు. అంటే ఈ చెరువులో ఏదో దాగి ఉంది. దిగిన జంతువును దిగినట్టు పట్టి మింగేస్తా ఉంది. కాబట్టి మనం వేరే చెరువు వెతుక్కోవడం మంచిది” అన్నాడు.
ఆ మాటలకు మిగిలిన కోతులు “రాజా.. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా మరొక చెరువు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే పొద్దున్నుంచి నీళ్లు లేక పసిపిల్లలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇదేనేమో. ఇంకోదారి ఏదైనా వుంటే చూడండి” అని అడిగాయి.
“సరే తొందరపడకండి. కొంచెంసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏదో ఒకదారి ఖచ్చితంగా కనిపిస్తుంది” అన్నాడు.
“సరే” అని అవి చెరువు దగ్గరే ఒక చెట్టుకింద కూర్చుని చెరువు వంకే చూడసాగాయి.
ఆ చెరువులో ఒక జల రాక్షసుడు ఉన్నాడు. ఏవైనా జంతువులు నీళ్ల కోసం అడుగుపెట్టిన మరుక్షణం నీళ్ల కిందినుంచి చప్పుడు కాకుండా దూసుకొచ్చి వాటి కాళ్లు పట్టుకొని క్షణాల్లో లోపలికి లాక్కొని పోయేవాడు. కోతులన్నీ చెరువు దగ్గరికి రాగానే “ఆహా దొరికింది విందుభోజనం. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా యాభైకి పైన్నే ఉన్నాయి. ఈరోజు పండగే పండగ” అనుకుంటూ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎంతసేపు వున్నా ఒక్క కోతి కూడా నీళ్ళలోకి దిగడం లేదు. దాంతో చూసీ చూసీ విసిగిపోయి దానికి చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా చెరువులోనుంచి సర్రున పైకి లేచాడు.
“ఏం కోతులారా.. దాహంగా లేదా. రండి.. ఈ తీయని నీళ్లు తాగి హాయిగా ఈదులాడండి. మీకేం భయం లేదు” అన్నాడు.
కోతిరాజు ఆ రాక్షసున్ని చూస్తూ “ఓహో.. నీవేనా దాహంతో దిగిన జంతువులను దిగినట్లు పట్టి తింటున్నది. నీ మాయమాటలు, దొంగచేష్టలు నా వద్ద పనికిరావు. నాకంతా తెలుసు” అన్నాడు.
జలరాక్షసుడు చిరునవ్వు నవ్వి “ఓ కోతిరాజా.. ఈ అడవిలో చుట్టుపక్కల ఇంకొక చెరువు కనుచూపుమేరలో ఎక్కడా లేదు. ఇప్పటికే మీ మొహాలన్నీ అలసటతో వడలిపోయి అడుగుతీసి అడుగేయడం కూడా కష్టం అనేలా ఉన్నాయి. నన్ను తప్పించుకొని ఈ చెరువులో నీళ్లు మీరెవరూ తాగలేరు, అలాగని వెనక్కు వెళితే నీళ్లు దొరక్క దారిలోనే అందరూ చస్తారు. కాబట్టి నాదొక మాట. మీలో సగంమంది నాకు ఆహారంగా మారండి, మిగతా సగాన్ని వదిలేస్తా. ఏమంటారు” అన్నాడు.
ఆ మాటలకు కోతిరాజు “ఓ రాక్షసా.. నేను ఉన్నంత వరకు నా గుంపులోని ఒక్క కోతిని కూడా నీవు ముట్టుకోలేవు. అలాగే నీ చెరువు నుండి నీటిని తాగడం కూడా ఆపలేవు. చూస్తూవుండు. మరో గంటలో నీకు దొరక్కుండా నీ చెరువులో నీళ్ళు కడుపునిండా తాగి ఎలా బయటపడతామో” అన్నాడు.
ఆ మాటలకు రాక్షసుడు “అలాగా.. అదీ చూద్దాం. ఈరోజు వరకు నా చేతినుండి ఒక్క జంతువు కూడా తప్పించుకోలేదు. నీవు చెప్పినట్టు చేస్తే నేను ఈ చెరువును వదిలేసి శాశ్వతంగా వేరేచోటుకు వెళ్ళిపోతా” అన్నాడు.
“సరే అదే మాటమీద వుండు” అంటూ కోతిరాజు పరిశీలనగా చుట్టూ చూడడం మొదలుపెట్టాడు. చెరువు చుట్టూ బాగా ఎత్తుగా పెరిగిన వెదురుబొంగులు కనపడ్డాయి. వెంటనే వాని మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. కోతులు అన్నిటినీ పిలిచి ఏం చేయాలో చెప్పాడు. అన్నీ కలసి వెదురు బొంగులు నరకడం మొదలుపెట్టాయి. కాసేపటికి తలా ఒక వెదురు బొంగు వాటి చేతిలోకి వచ్చింది. సన్నని పొడవైన కర్ర తీసుకొని బొంగు మధ్యలో అక్కడక్కడ అడ్డంగా వున్న వెదురును తొలగించాయి. దాంతో అవి పెద్ద గొట్టాలుగా మారిపోయాయి. వెంటనే కోతులన్నీ చెరువు చుట్టూ చేరాయి.
జల రాక్షసుడు ఏం జరుగుతుందో అర్థం గాక చుట్టూ చూస్తూ వున్నాడు. కోతిరాజు వెంటనే గట్టిగా “ఒకటి.. రెండు.. మూడు..” అని అరిచాడు.
అంతే.. రాక్షసుని వెనుక వైపున్న కోతులు నీళ్లలోకి దిగకుండా, ఒడ్డునే నిలబడి, వెదురు బొంగులు చెరువులో వేసి, నీళ్లు పీల్చుకొని తాగడం మొదలుపెట్టాయి. అదిచూసి జల రాక్షసుడు వేగంగా అటువైపు దూసుకుపోయాడు. వాడు దగ్గరికి వచ్చేలోపు అటువైపు వున్న కోతులన్నీ వెదురు బొంగులు బయటికి లాగేసుకున్నాయి.
రాక్షసుడు అటువైపు కదిలిన మరుక్షణం ఇటువైపు వున్న కోతులు వెదురుబొంగులు చెరువులో పెట్టి నీళ్లు తాగడం మొదలుపెట్టాయి. రాక్షసుడు అటూ ఇటూ ఆగకుండా వేగంగా సర్రున దూసుకుపోతూ వున్నాడు గానీ ఒక్క కోతి కూడా దొరకడం లేదు. అటుపోతే ఇటు, ఇటుపోతే అటు.. చెరువు చుట్టూ నిలబడి చకచకా నీళ్లు కడుపునిండా తాగుతూనే ఉన్నాయి. తిరిగీ తిరిగీ రాక్షసుడు అలసిపోయాడు. కోతులన్నీ పకపక నవ్వుతూ హాయిగా నీళ్లన్నీ తాగేశాయి. రాక్షసుడు అవమానంతో చెప్పిన మాట ప్రకారం ఆ చెరువునే కాదు ఏకంగా ఆ అడవిని కూడా వదిలేసి వేరే చోటికి వెళ్లిపోయాడు. కోతిరాజు పాలనలో కోతులన్నీ హాయిగా బతకసాగాయి.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
