[జపాన్ జానపద కథల సీరిస్లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 10వ కథ ‘తలతిక్కల రాజు’.]
జపాన్ను ఒకసారి ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచోడే గానీ అప్పుడప్పుడు కొంచెం తలతిక్కలుగా ఆలోచించేవాడు. ఆయన మాటంటే మాటే. ఎదురు తిరిగినా, కాదని అడ్డం చెప్పినా ఎవరిని ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కోపం ఎప్పుడూ ముక్కు మీదనే ఉండేది. అలాంటి ఆ రాజు ఒకసారి “ముసలోళ్లతో ఈ దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు, వాళ్ళు ఏ పనీ చేయలేరు. అనవసరంగా తిండి దండగ. కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన వాళ్లందర్నీ తీసుకపోయి దూరంగా ఉన్న దయ్యాల కొండలో వదిలేసి రావాలి. ఎవరైనా ఇంటిలో ముసలివాళ్ళను ఉంచుకుంటే వారికి శిక్ష తప్పదు” అని ఒక శాసనం చేశాడు.
రాజు సంగతి అందరికీ తెలుసు కదా.. దాంతో ఇంట్లో వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఏమీ చేయలేక అందరినీ తీసుకుపోయి ఆ దయ్యాల కొండలో వదిలివేయసాగారు. వదలని వాళ్లను సైనికులు వీధుల్లోకి తీసుకువచ్చి కొరడాలతో కొట్టసాగారు. కారాగారంలో బంధించసాగారు.
ఆ రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో ఒక్కతే ధైర్యంగా కష్టపడుతూ, పొలం పని చేస్తూ, పెంచి పెద్ద చేసింది. తాను తిన్నా తినకపోయినా పిల్లలకు మాత్రం కడుపునిండా పెట్టిన్ది. మనసులో ఎంత బాధ వున్నా పెదవులపై మాత్రం చిరునవ్వు చెదరినివ్వ లేదు. అమ్మా నాన్నా అన్నీ తానే అయి తండ్రి లేని లోటు రాకుండా చూసుకుంది. పిల్లలు నెమ్మదిగా తిరిగి పెద్దగయ్యారు. తమను ఎంతో ప్రేమించిన తల్లిని ముసలితనంలో కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకోసాగారు.
కానీ కాలం ఎవరికోసం ఆగదు కదా.. ప్రవాహంలా పరుగులు తీస్తూనే ఉంటుంది. నెమ్మదిగా ఆమెకు కూడా అరవై సంవత్సరాలు దగ్గర పడ్డాయి. వాళ్లకు అమ్మను అందరిలా దయ్యాలకొండ మీద వదిలి వేయడం ఇష్టం లేదు. ఇంటిలోనే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి అనుకున్నారు. కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు. “నాయనలారా.. మీకు నేనంటే ఎంత ప్రేమనో నాకు తెలుసు. కానీ పొరపాటున ఈ విషయం రాజభటులకు తెలిస్తే నా కళ్ళముందే మిమ్మల్ని కొరడాలతో కొట్టి, కారాగారంలో బంధిస్తారు. నేను అది చూడలేను. ఈ రోజో రేపో రాలిపోయే పండుటాకులాంటి నా కోసం మీరు దిగులు పడకండి. నన్ను తీసుకపోయి ఆ కొండ దగ్గర వదిలేయండి. లేదంటే నేనే ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోతాను చూడు” అంది. దాంతో అన్నదమ్ములు ఏమీ చేయలేక కళ్ళనీళ్లు పెట్టుకొని తల్లిని తీసుకొని బయలుదేరారు.
ఆ కొండ చాలా దూరం. ఒక దట్టమైన అడవిని దాటి అవతలికి పోవాలి. దాంతో అమ్మ నడవలేదని ఆమెను ఒక డోలీలో కూర్చోబెట్టుకొని మోసుకుంటూ తీసుకుపోసాగారు. అలా పోతూవుంటే ఆ తల్లి అడవి దారిలో వరుసగా చెట్లకొమ్మలు తుంచి ఇరువైపులా వేసుకుంటూ రాసాగింది. సాయంకాలానికి వాళ్లు ఆ కొండ దగ్గరికి చేరుకున్నారు. “నాయనలారా.. ఈ అడవి చాలా భయంకరంగా దట్టంగా ఉంది. రాత్రిపూట జంతువులు తిరుగుతా ఉంటాయి. చీకటి పడకముందే తొందరగా బయలుదేరండి. నేను వచ్చేటప్పుడు దారి వెంబడి అక్కడక్కడ చెట్లకొమ్మలు విరిచి వేస్తూ వచ్చాను. వాటిని చూసుకుంటూ దారి తప్పకుండా వెళ్ళండి” అంది. వాళ్లు ఆమె కాళ్ళు మొక్కి కళ్ళనీళ్ళతో తిరిగి బయలుదేరారు.
కానీ కొంచెందూరం వెళ్లారో లేదో కాటుక లాంటి చిక్కని చీకటి అడవంతా అలముకుంది. అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా మారింది. దాంతో వాళ్లు దారి తప్పిపోయారు. రాత్రంతా అడవిలోనే తిరుగుతూ మరలా పొద్దునకి అమ్మను ఎక్కడైతే వదిలేశారో అక్కడికే చేరుకున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ “నాయనలారా.. నా వెంబడి రండి. బయటకు వెళ్లే దారి చూపిస్తాను” అంటూ వాళ్ళను తీసుకొని అడవి వైపు వెళ్ళింది. కొంచెం దూరం పోయాక దారిలో ఒకచోట విరిగిన చెట్టుకొమ్మ కనపడింది. అది పిల్లలకు చూపిస్తూ “చూడండి.. ఇలా దారిలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు కనపడతాయి. వాటి వెంటే వెళ్ళండి. మీరు భద్రంగా ఇంటికి చేరుకుంటారు. ఇక నేను నెమ్మదిగా తిరిగి కొండ వైపు వెళ్తాను” అంది.
ఆ సమయంలో కూడా తమ భద్రత గురించే ఆలోచిస్తున్న అమ్మను అలా ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళడానికి వాళ్ల మనసు ఒప్పుకోలేదు. “అమ్మా.. నువ్వు ఎన్నయినా చెప్పు. చావైనా బతుకైనా నీతోనే. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళము” అని ఆమె ఎంత నచ్చచెప్పినా వినకుండా ఆరోజు రాత్రి రహస్యంగా ఎవరికీ కనపడకుండా ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. ఇంట్లో భూమి కింద ఒక గది కట్టి అందులో అమ్మను దాచిపెట్టి భద్రంగా చూసుకోసాగారు.
ఒకసారి ఆ ఊరి రాజుకు తన రాజ్యంలో తెలివైనవాళ్లు ఉన్నారో లేదో తెలుసుకోవాలని ఒక వింత కోరిక కలిగింది. దాంతో అందరినీ పిలిపించాడు. “మీలో ఎవరైతే బూడిదతో తాడు చేసుకుని వస్తారో వాళ్లకు పదివేల బంగారు వరహాలు కానుకగా ఇస్తా” అని ప్రకటించాడు. జనాలందరూ ‘బూడిదతో తాడు అల్లాడమా ఇది అసాధ్యం’ అనుకుంటూ వెళ్లిపోయారు.
ఇద్దరు అన్నదమ్ములు ఆరోజు రాత్రి అమ్మతోపాటు అన్నం తింటూ ఈ విషయం చెప్పారు. అది విని ఆమె “ఇది చాలా సులభం. మా చిన్నప్పుడు ఇలాంటి సరదా ఆటలు ఎన్నో ఆడేవాళ్ళం. ఒక తాడు తీసుకుని ఉప్పు నీళ్లలో నానబెట్టండి. అది ఎండిన తరువాత ఒక గాజుపెట్టెలో పెట్టి అంటించండి. తాడు కాలి బూడిదగా మారుతుంది. కానీ ఉప్పు ఆ బూడిదను పట్టి ఉంచడం వల్ల తాడు ఆకారం అలాగే ఉండి బూడిదతో తాడు అల్లినట్లుగా ఉంటుంది. గాలి తగలకుండా దానిని భద్రంగా తీసుకుపోయి రాజుకు చూపించండి” అంది. వాళ్ళు అమ్మ చెప్పినట్టుగానే చేసి రాజు వద్దకు తీసుకుపోయారు. రాజు అది చూసి “ఆహా.. అద్భుతం. ఈ రాజ్యంలో ఎవరూ చేయలేని పని మీరు చేశారు” అంటూ మెచ్చుకొని పదివేల బంగారు వరహాలు కానుకగా అందించాడు.
ఆ తర్వాతరోజు రెండవ ప్రశ్న అడిగాడు. “మీలో ఎవరైనా శంఖంలోంచి దారాన్ని అవతలి వైపు నుంచి ఇవతలికి వైపుకు తీసుకొని రాగలరా. ఎవరైతే అలా దారాన్ని లోపలినుంచి తెస్తారో వారికి పదివేల బంగారు వరహాలు కానుకగా ఇస్తాను” అన్నాడు. ‘శంఖంలోకి దారాన్ని పంపినా అది అవతలి వైపు నుంచి అస్సలు బయటికి రాదు. లోపలే చుట్ట చుట్టుకొని ఉండిపోతుంది. ఇది అసాధ్యం’ అని ఎవరూ ముందుకు రాలేదు.
ఆ ఇద్దరు అన్నదమ్ములు విషయం తల్లితో చెప్పారు. దానికి ఆమె చిరునవ్వు నవ్వి “ఇది చాలా సరదా ఆట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఎలా ఆడాలో చెప్పేవాడు. ఒక చిన్న చీమను పట్టుకొని దాని నడుముకు సన్నని నూలు దారాన్ని కట్టాలి. దానిని నెమ్మదిగా శంఖం పైభాగంలో వుండే చిన్న రంధ్రం గుండా లోపలికి వదలాలి. శంఖం రెండవ వైపు బైటకు వచ్చే దారిలో రెండు తేనె చుక్కలు వేయాలి. తియ్యని వాసన పసిగట్టిన చీమ ఆ తేనె చుక్కను వెతుక్కుంటూ దారంతో పాటు నెమ్మదిగా బయటికి వస్తుంది” అంది. వాళ్ళు అమ్మ చెప్పినట్టుగానే చీమ సాయంతో దారం మధ్యలో వుండేలా శంఖాన్ని తయారుచేసి రాజుకు అందజేశారు. రాజు అది చూసి సంబరపడి వాళ్లకు మరలా పదివేల బంగారు వరహాలు కానుకగా ఇచ్చాడు.
ఆ తర్వాతరోజు మూడో ప్రశ్న అడిగాడు. “మీలో ఎవరైనా సరే.. కొట్టకుండానే మోగేటటువంటి ఢమరుకాన్ని తయారు చేయగలరా” అని. అందరూ ఆశ్చర్యపోయారు. ‘కొట్టకుండా ఏ ఢమరుకమైనా ఎలా మోగుతుంది. ఇది అసాధ్యం’ అనుకున్నారు. ఆరోజు రాత్రి విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వి “ఇది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఒక ఢమరుకాన్ని తీసుకువచ్చి దానికి పైభాగాన సన్నని రంధ్రం చేసి అందులోకి కొన్ని తేనెటీగలను వదిలి మరలా మూసేయండి. ఎవరైనా దాన్ని పైకెత్తి కదిలించినప్పుడు లోపల ఉన్న తేనెటీగలు గాల్లోకి ఎగిరి అటూ ఇటూ ఝుమ్మని తిరుగుతూ ఢమరుకం రెండు వైపులా తగులుతాయి. దాంతో కొట్టకుండానే అది మనోహరంగా మోగుతుంది” అని చెప్పింది. వాళ్ళు అలాగే చేశారు. రాజు కొట్టకుండానే మోగే ఆ ఢమరుకాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. “అద్భుతం మీలాంటి తెలివితేటలు ఉండేవాళ్ళు మా రాజ్యంలో ఉండడం మాకు చాలా అదృష్టం” అని మెచ్చుకున్నాడు.
అప్పుడు వాళ్లు “రాజా నిజానికి ఈ అభినందనలు, పొగడ్తలు, మెచ్చుకోళ్ళు దక్కాల్సింది మాకు కాదు. మా అమ్మకు. ఎందుకంటే ఈ సమాధానాలన్నీ మాకు చెప్పింది మా అమ్మనే” అన్నారు వినయంగా.
“అలాగా అయితే వెంటనే మీ అమ్మను పల్లకీలో కూర్చోబెట్టి ఈ సభకు తీసుకురండి. అందరిముందు ఆమెను ఘనంగా సత్కరించాలి” అన్నాడు రాజు.
దానికి వాళ్లు “రాజా.. మీరు మమ్మల్ని మన్నిస్తామంటే మీకు అసలు విషయం చెబుతాము. మా అమ్మకు ఇప్పటికే అరవై ఏళ్ళు నిండిపోయాయి. ముసలివాళ్లు అంటే కేవలం పనులు చేయలేని వాళ్లు మాత్రమే కాదు. అనుభవాన్ని, జ్ఞానాన్ని, సంస్కృతిని తర్వాతి తరాలకు అందజేసే వారధులు వాళ్ళు. మాకు, పిల్లలకు ప్రేమను పంచుతూ ఇంటికి పెద్దదిక్కుగా నిలిచే అమృతమూర్తులు. అందుకే అమ్మను తీసుకుపోయి ఆ కొండమీద వదలలేకపోయాం. మా పిల్లలకు తరతరాల నుంచి వచ్చే జ్ఞానాన్ని, తెలివితేటల్ని అందించేది వాళ్లే కదా” అన్నారు.
ఆ మాటలతో రాజుకు తాను అంతవరకు చేసిన పొరపాటు అర్థమైంది. మనసులో చీకటి తొలగిపోయింది. దాంతో వెంటనే తాను చేసిన శాసనాలను రద్దు చేశాడు. ఆ దయ్యాల కొండకు సైనికుల్ని పంపించి అక్కడున్న పెద్ద వాళ్ళందరినీ గౌరవంగా తిరిగి రాజ్యానికి తీసుకువచ్చాడు.
(జపాన్ జానపద కథలు సమాప్తం. త్వరలో చైనా జానపద కథలో మళ్ళీ కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
