Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జపాన్ జానపద కథలు-7: అమాయకపు కప్పలు

[జపాన్ జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 7వ కథ ‘అమాయకపు కప్పలు’.]

పాన్ దేశంలో రెండు కప్పలు ఉండేవి. ఒకటేమో జపాన్ రాజధాని టోకియోలోని చిన్న నీటి గుంటలో ఉంటే, మరొకటేమో జపాన్ లోని మరొక ప్రధాన నగరం ఒసాకోలోని చిన్న చెరువులో ఉండేది. ఈ రెండు నగరాలు చాలా అందంగా చూడముచ్చటగా ఉండేవి. దాంతో ఎక్కడెక్కడి జనాలు వాటిని చూడటానికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అలా వచ్చినవాళ్ళు ఆ నగరంలోని వింతలు విశేషాలు చూడడమే కాక ఆ నగరాల గురించి కూడా చాలా గొప్పగా ఇతరులకు చెబుతుండేవాళ్ళు. టోకియో నుంచి వచ్చే ప్రజలు టోకియోలోని కళ్ళు మిరమిట్లు గొలిపే రాజభవనం గురించి, విందులు వినోదాలను అందించే ఖరీదైన హోటల్ల గురించి, ఆధ్యాత్మిక బౌద్ధ క్షేత్రాల గురించి చెబుతూ వుంటే ప్రజలతో పాటు అక్కడి నీటిగుంటలో వుండే కప్ప కూడా వినేది. దాంతో దానికి ఎప్పటికైనాసరే టోకియో నగరం చూడాలనే కోరిక కలిగింది.

అలాగే ఒసాకో నుంచి టోకియో వచ్చే ప్రజలు ఒసాకోలో వున్న అతిపెద్ద ఆక్వేరియం గురించి, ముచ్చటైన మ్యూజియం గురించి, అందమైన రాజుల కోట గురించి చెబుతూ వుంటే కాలువలోని కప్ప కూడా వినేది. దాంతో దానికి గూడా ఎప్పటికైనా ఒసాకో నగరం చూడాలనే కోరిక కలిగింది.

దాంతో రెండు కప్పలు ‘ఇలా రేపు ఎల్లుండి అనుకుంటూ వుంటే ముసలితనం రావడం ఖాయం. చెంగుచెంగున ఎగిరే వయసులోనే వెళ్లి రావాలి’ అనుకుంటూ ఒకేసారి, ఒకే సమయంలో బయలుదేరాయి. రెండు నగరాల మధ్య చాలా దూరం ఉంది. వాటికి ఆ ఊర్లు ఎంత దూరం ఉన్నాయో, ఎంతసేపు పోవాలో తెలియదు కదా.. అలా ఆగకుండా ఎగురుతూనే ఉన్నాయి. ఎంతదూరం ఎగిరినా ఏమీ లాభం లేదు కనుచూపు మేరలో నగరం కనబడడం లేదు.

ఆ రెండు నగరాలకు మధ్య ఒక ఎత్తయిన కొండ ఉంది. అవి ఎగురుకుంటా ఎగురుకుంటా ఆ కొండ దగ్గరికి వచ్చాయి. అలసిపోయినప్పుడు ఆగుకుంటా, ఆకలైనప్పుడు దొరికింది తినుకుంటా ఒకొక్క అడుగే పైకి ఎక్కసాగాయి. అలా నెమ్మదిగా కష్టపడి కొండ చివరకు ఒకేసారి చేరాయి. అక్కడ ఒకదాన్ని చూసి ఒకటి చాలా ఆశ్చర్యపోయాయి.

“మిత్రమా.. నీ ఊరేది. ఎక్కడినుండి వస్తున్నావు” అడిగింది టోకియో కప్ప.

దానికి ఆ కప్ప “మిత్రమా.. నాది ఒసాకో నగరం. టోకియో నుంచి మా ఊరికి వచ్చేవాళ్లు ఆ నగర అందచందాల గురించి చెబుతూవుంటే విని ఒకసారి చూసిపోదామని పోతూవున్నా. మరి నీవు” అంది.

ఆ మాటలకు టోకియో కప్ప “మిత్రమా నాదీ అదే కథ. మీ ముచ్చటైన ఒసాకో నగరం ఒకసారన్నా చూసిపోదామని టోకియో నుంచి బయలుదేరా” అంది.

“అలాగా చాలా సంతోషం. మీ నగరం ఇంకా ఎంత దూరం” అంది ఒసాకో కప్ప.

“చాలా దూరం. ఇప్పటికి నేను కేవలం సగందూరం మాత్రమే వచ్చా. మరి మీ నగరం ఎంతదూరం” అంది టోకియో కప్ప.

“మాది కూడా అంతే. ఇప్పటికి నేను కూడా సగం దూరం వచ్చానంతే. నడిచీ నడిచీ కాళ్ళు వాచిపోయాయి. అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టంగా ఉంది. అంత కష్టపడి ఆ నగరానికి పోయినా అది నేను ఊహించినంత అందంగా లేదనుకో అప్పుడు ఈ కష్టమంతా వృథానే కదా. తిరిగి రావడం ఎంత కష్టం మరలా” అంది.

“నీవు చెప్పేది కూడా నిజమే మిత్రమా. అయితే మనం ఒక పని చేద్దాం. ఈ కొండ చివర ఒక ఎత్తయిన రాయి ఉంది. దానిపైకి ఎక్కుదాం. ఒకరినొకరం గట్టిగా పట్టుకొని వెనక కాళ్లపై పైకి లేస్తే మీ నగరం నాకు, మా నగరం నీకు కనపడతాయి. నచ్చితే ముందుకు పోదాం. లేదంటే వెనక్కి పోదాం. ఏమంటావు” అంది.

దానికి ఆ ఆలోచన బాగా నచ్చింది. రెండు ‘సరే’ అంటే ‘సరే’ అనుకున్నాయి.

నెమ్మదిగా అవి అక్కడ కొండ మీద వున్న ఒక ఎత్తయిన రాయి పైకి ఎక్కాయి. రెండు ఎదురెదురుగా నిలబడి ఒకదాన్ని ఒకటి గట్టిగా పట్టుకొని నెమ్మదిగా వీలయినంతవరకు పైకి లేచాయి.

కానీ తమాషా ఏమిటంటే కప్పలకు కళ్ళు తల మీద ఉంటాయి కదా.. దాంతో అవి పైకి లేచేసరికి వాటికి ముందున్నది గాక వెనక వైపు వున్న తమ నగరమే కనపడసాగింది. పాపం ఆ విషయం ఆ కప్పలు తెలుసుకోలేకపోయాయి.

దాంతో టోకియో కప్ప “అరెరే మీ ఒసాకో నగరం ఎంతో అద్భుతంగా ఉంటుందనుకుంటినే కానీ ఇది అచ్చం ఇంచు కూడా తేడా లేకుండా మా టోకియోలాగే ఉంది. దీన్ని చూడడానికా ఇంతదూరం కిందామీదా పడతా పోతున్నది” అంటూ పకపకా నవ్వేసింది.

ఆ మాటలకు ఒసాకో కప్ప “నిజమే మిత్రమా.. మీ టోకియో కూడా అచ్చు గుద్దినట్లు మా ఒసాకో లాగానే ఉంది. అవే పెద్ద పెద్ద కట్టడాలు, అవే ఎత్తయిన కోటలు. అవే రంగురంగుల తోటలు. కొంచెం కూడా తేడా లేదు. ఈ మాత్రం దానికి ఇంత కష్టపడి పోవాల్సిన అవసరమే లేదు” అంది.

దాంతో రెండు సంబరంగా కిందికి దిగాయి. “హమ్మయ్య.. అనవసరంగా అంతదూరం పోయే పని తప్పిపోయింది. ఇప్పటికే ఎగిరి ఎగిరి ఒళ్ళు హూనమయింది. ఇక తిరిగి ఇంటికి పోవడమే మేలు” అనుకుంటూ ఆ రెండు అమాయకపు కప్పలు ఒకదానికి ఒకటి వీడ్కోలు చెప్పుకొని తిరిగి తమ తమ నగరాలకు హుషారుగా బయలుదేరాయి.

(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)

Exit mobile version