[జపాన్ జానపద కథల సీరిస్‌లో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న 8వ కథ ‘కొంగ పెళ్ళాం’.]
అది ఫిబ్రవరి నెల. జపాన్ లో మంచు విపరీతంగా కురిసే కాలం. ఆ చల్లని చలిలో ఒక తెల్లని దేవతా కొంగ ఆకాశంలో ఎగురుకుంటూ పోతూవుంది. అదే సమయంలో ఒక వేటగాడు గురిచూసి ఆ కొంగ మీదకు బాణం వదిలాడు. అది గాలిని సర్రున చీల్చుకుంటూ పోయి సరిగ్గా దాని కుడివైపున డొక్కకు గుచ్చుకుంది. దెబ్బ తగిలిన కొంగ కింద పడుతుందేమోనని వేటగాడు ఎదురు చూశాడు. కానీ అది తన శక్తినంతా కూడగట్టుకొని అలాగే ఎగురుకుంటూ ముందుకు పోయింది.
కానీ.. అలా కొంచెం దూరం పోయాక ఇక ఎగరలేక మంచులో ఒకచోట పడిపోయింది. ఆ గడ్డకట్టే చలిలో అది ఎటూ కదలలేక అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా రక్తం కారిపోతూ ఉంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. శక్తి నంతా కోల్పోతూ వుంది. ఇక చావడం ఖాయం అనుకుంది.
అదే సమయంలో ఒక యువకుడు అటువైపు వచ్చాడు. అతడు అనాథ. చిన్నప్పుడే అమ్మానాన్న చచ్చిపోయారు. ఆ యువకుడు పేదవాడే కానీ అతని మనసు చాలా మంచిది. చీమకు కూడా అపకారం చేయడు. ఎవరికి ఎటువంటి ఆపద కలిగినా ధనసాయం చేయలేకపోయినా మాటసాయం చేసేవాడు. పనులలో చేయి కలిపేవాడు.
ఆ యువకుడు మంచులో పడిపోయిన కొంగను చూశాడు. దాని కళ్ళు దీనంగా చూస్తున్నాయి. గొంతులో నుండి మూలుగు చిన్నగా వినబడుతోంది. దాన్ని అలా చూస్తూవుంటే అతనికి చాలా జాలి కలిగింది. దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఆ పెద్దకొంగను పైకి తీశాడు. వంటిమీద పడిన మంచునంతా శుభ్రం చేశాడు. అంగీ విప్పి వణుకుతున్న దాని ఒంటి చుట్టూ చుట్టాడు. ఇంటికి తీసుకుపోయాడు. గోరువెచ్చని నీళ్లతో ఒళ్లంతా కడిగాడు. గాయాన్ని శుభ్రం చేసి మందు పూసి కట్టు కట్టాడు. ఇంట్లో వున్న గింజలు దగ్గర కూర్చొని ఒక్కొక్కటి నెమ్మదిగా తినిపించాడు.
అట్లా.. ఒక పదిరోజులు జాగ్రత్తగా చూసుకునేసరికి ఆ కొంగ నెమ్మదిగా లేచి నిలబడింది. ఇంకొక పదిరోజుల్లో గాయం పూర్తిగా మానిపోయింది. మరొక పదిరోజుల్లో హాయిగా ఇంతకుముందులా ఎగరసాగింది. దాంతో ఆ యువకుడు ఆ కొంగను తీసుకొని పక్కనే వున్న అడవికిపోయి “ఇక నీవు హాయిగా నీ ఇష్టం వచ్చిన చోటికి ఎగిరిపోవచ్చు. నీకు ఎటువంటి భయం లేదు” అంటూ దానిని గాల్లోకి ఎగురవేశాడు.
ఆ దేవతా కొంగకు అతని మీద చాలా ప్రేమ కలిగింది. చనిపోయే స్థితిలో వున్న తనను మరలా మామూలుగా చేసినందుకు ఋణం తీర్చుకోవాలి అనుకుంది. అతనికి ఎవరూ లేరు కదా.. దాంతో అన్నీ తానే అయి ప్రేమను పంచాలి అనుకుంది. వెంటనే ఆ దేవతా కొంగ ఒక అందమైన అమ్మాయిగా మారిపోయింది.
తర్వాతరోజు ఉదయాన్నే పోయి ఆ యువకుని ఇంటి తలుపు కొట్టింది. “నాకెవరూ లేరు. ఒక్కదాన్నే. కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి చోటిస్తావా” అని దీనంగా అడిగింది. అతను ‘సరే’ అని ఇంటి ముందు వున్న చిన్నగది చూపించాడు. కొద్ది రోజుల్లోనే వాళ్ల మధ్య అనుబంధం పెరిగిపోయింది. ఒక మంచిరోజు చూసుకుని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తనకు ప్రాణం పోసిన ఆ అనాథ యువకునికి అమ్మానాన్న అన్నీ తానే అయి అపురూపంగా చూసుకోసాగింది.
ఒకసారి ఆ ఊరిలో పెద్ద కరువు వచ్చింది. వానలు లేవు. పంటలు లేవు. పనులు లేవు. తినడానికి తిండి కూడా కష్టమైంది. ఏం చేయాలో తోచక ఆ యువకుడు దిగులు పడసాగాడు. అప్పుడు ఆ యువతి “నువ్వేమీ బాధపడకు. నేను ఒక చీర నేసి ఇస్తాను. కానీ మరలా మరలా అలాంటివి కావాలని అడగకూడదు. అలాగే నేను నేయడం మొదలు పెట్టినప్పుడు నువ్వు చూడకూడదు. చూస్తే అదే మన బంధానికి చివరి రోజు అవుతుంది. ఏం సరేనా” అంది.
ఆ యువకుడు ‘సరే’ అని ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశాడు. అందులో చీర నేయడానికి ఒక మగ్గాన్ని ఉంచాడు. వండుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆమె లోపలికి పోయి తలుపులు మూసేసుకుంది. వెంటనే కొంగగా మారిపోయింది. తన ఒంటి మీద వున్న ఒక్కొక్క ఈకా పీకుతూ అందులోంచి సన్నని దారాన్ని తీసి వడకసాగింది. ఈకలు పీకుతున్నప్పుడల్లా నొప్పితో అల్లాడిపోసాగింది. కానీ తనకు ప్రాణం పోసిన ఆ యువకుని కోసం అన్నీ భరించింది. మొత్తం పావుభాగం ఈకలు అయిపోయాయి. ఒక అపురూపమైన చీర.. పట్టుకుంటే జారిపోయేలా, మెత్తగా నున్నగా తయారయింది. ఆ అద్భుతమైన బంగారు రంగు అంచు గల తెల్లని చీరను తీసుకొని ఆమె మరలా మనిషిగా మారింది. ఆ యువకుని చేతిలో పెట్టింది.
ఆ యువకుడు ఆ చీర చూసి ఆశ్చర్యపోయాడు. ధగధగా వెండి వెన్నెలలా మెరుస్తా ఉంది. చాలా విలువైన, మన్నికైన, ఖరీదైన చీర అది. అటువంటి నాజూకైన దారం ఎక్కడా దొరకదు. దాన్ని తీసుకొని ఆ ఊరి యువరాణి దగ్గరికి పోయాడు. ఆమె చీర చూసి చాలా మచ్చట పడింది. వెంటనే వెయ్యి బంగారు వరహాలు కానుకగా ఇచ్చింది. అతడు ఆ వరహాలతో సంబరంగా ఇంటికి చేరుకున్నాడు. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ కరువు కాలంలో కూడా మూడుపూటలా కమ్మగా కడుపు నిండా తినసాగారు.
అట్లా కొంతకాలం గడిచింది. ఆ యువకునికి ‘తమకు ఒక మంచి ఇల్లు వుంటే బాగుంటుంది కదా’ అనిపించింది. దాంతో ఒకరోజు ఆమె దగ్గరికిపోయి “మనకు పెళ్లయి ఇంత కాలమైనా ఒక చిన్న సొంత ఇల్లు కూడా లేదు. ఇంకో చీర నేసి ఇవ్వు. దాన్ని అమ్మి ఇల్లు కట్టుకుందాం” అన్నాడు.
చీర నేయడం ఎంత కష్టమో అతనికి తెలియదు కదా.. కానీ ఆ యువకుని మాట ఆమె కాదనలేకపోయింది. “సరే.. కానీ ఇదే చివరిసారి. ఇంకొకసారి ఎప్పుడూ అడగకూడదు” అంటూ ఒట్టు వేయించుకుంది. ఒక గదిలో అన్ని ఏర్పాట్లు చేసుకుని లోపలికిపోయి తలుపులు మూసేసుకుంది. మరలా ఇంతకుముందులా కొంగగా మారిపోయింది. వంటి మీది ఒక్కొక్క ఈక పీకుతూ, చీర నేయడం మొదలుపెట్టింది.
ఈకలు పీకుతున్నప్పుడల్లా ఆమె ఒంట్లో శక్తి కొంచం కొంచం తగ్గిపోసాగింది. నెమ్మదిగా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. అయినా బాధను పళ్ళబిగువున అదిమిపెట్టి చీర నేయడం మొదలుపెట్టింది. ఆ కొంగ శరీరంలో సగభాగం ఈకలు అయిపోయాయి. ఈసారి ఇంతకుముందు కన్నా మన్నికైన, అద్భుతమైన, అందమైన చీర పున్నమి చందమామ వెలుగులు విరజిమ్ముతూ తయారైంది. ఆ యువకుడు దానిని తీసుకొని ఆ ఊరి మహారాణి దగ్గరికి పోయాడు. ముట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా, తెల్లని వెలుగులు విరజిమ్ముతూ, చందమామతో పోటీ పడుతున్న ఆ చీరను చూసి ఆమె చాలా మురిసిపోయింది. “నా జీవితంలో ఇంత అద్భుతమైన చీరను చూడడం ఇదే మొదటిసారి. దీనికి ఎంత ఇచ్చినా తక్కువే” అంటూ పదివేల బంగారు వరహాలు చేతిలో పెట్టింది.
ఆ ధనంతో అద్భుతమైన మేడ కట్టుకొని ఇద్దరు హాయిగా బ్రతకసాగారు. కొంతకాలం గడిచిపోయింది. మరలా ఆ యువకునిలో ఆశ మొదలైంది. ‘చెరువు పక్కన పది ఎకరాల పొలం కొనుక్కుంటే హాయిగా పంటలు పండించుకుంటూ, కాలు మీద కాలేసుకుని బతకవచ్చు కదా’ అనుకున్నాడు. దాంతో ఆమె దగ్గరికిపోయి “మనకు పెళ్లయి ఇంతకాలమైనా చిన్న పొలం కూడా లేదు. సొంత పొలం లేనివాన్ని సొంత ఊరిలో ఎవరూ గౌరవించరు. చివరిసారిగా ఇంకొక చీర నేసి ఇవ్వు. ఆ ధనంతో మంచి పొలం కొనుక్కుందాం” అన్నాడు.
ఆ మాటలకు ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. ఇప్పటికే శరీరంలో సగభాగం శక్తి కోల్పోయింది. కానీ తన ప్రాణాలు కాపాడిన ఆ యువకుని మీద ప్రేమతో “సరే. ఇదే చివరిసారి. ఇంకొకసారి అడిగితే నేను బ్రతికినా చచ్చినట్లే” అంటూ ఒట్టు వేయించుకుంది. ఒక గదిలో అన్ని ఏర్పాట్లు చేసుకుని లోపలికిపోయి తలుపులు మూసేసుకుంది. మరలా కొంగగా మారింది.
ఒంటిమీద ఈకలు ఇప్పటికే సగానికి సగం తగ్గిపోయాయి కదా.. దాంతో చాలా పలుచగా ఉన్నాయి. ఒక్కొక్క ఈక పీకుతావుంటే నొప్పికి అల్లాడిపోసాగింది. ఒళ్లంతా ఎర్రగా మాంసం ముద్దలాగా మారిపోసాగింది. నొప్పికి కళ్ళలోంచి నీళ్లు కారిపోతా ఉన్నాయి. పని ఇంతకుముందులా వేగంగా సాగడం లేదు. అయినా నొప్పి అలాగే భరిస్తూ చీర నేయడం మొదలుపెట్టింది.
బయటవున్న ఆ యువకునిలో అత్యాశ మొదలైంది. ‘ఆమె అంత అద్భుతమైన చీర ఎట్లా నేస్తుందో తెలుసుకుంటే తాను కూడా తయారుచేసి ఇంకా ఎక్కువ సొమ్ము సంపాదించుకోవచ్చు కదా’ అనుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి నెమ్మదిగా తలుపు సందులోంచి లోపలికి తొంగి చూశాడు. ఏమీ కనపడలేదు. దాంతో తలుపులు కొంచెం ముందుకు తోశాడు. కానీ లోపల గడ సరిగా వేయకపోవడంతో తలుపు ఒక్కసారిగా ధడేలుమని తెరుచుకుంది.
చూస్తే ఇంకేముంది..
లోపల పెద్ద కొంగ ఒళ్లంతా కారుతున్న రక్తంతో చీరను నేస్తా ఉంది. ఒక్కసారిగా ఆ యువకుడు లోపలికి రావడంతో ఆ కొంగ కంగారుపడి అతని కళ్ళముందే యువతిగా మారిపోయింది. ‘నేను పెళ్లి చేసుకున్నది ఆ కొంగనా’ అని అతనికి కోపం వచ్చింది. “నిజం చెప్పకుండా నన్ను ఇంతకాలం మోసం చేశావు. ఇకపై నీలాంటిదానితో కలసి కాపురం చేయలేను. ఇంకొక్క క్షణం గనుక నువ్వు ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పో ఇక్కడనుంచి” అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడు.
అత్యాశకు లోనై ఇచ్చినమాట తప్పిన ఆ యువకుని చూసి ఆ దేవతా కొంగకు చాలా బాధ కలిగింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి కొంగగా మారిపోయింది. కళ్ళనీళ్ళతో ఒక్కసారిగా గాలిలోకి ఎగిరింది. అంతే… ఆ తరువాత ఆ దేవతా కొంగ ఏమైందో ఎవరికీ తెలియదు. మరలా ఎప్పుడు అటువైపు రాలేదు. రక్తంతో సగం నేసిన చీర ఎర్రగా మగ్గం మీద సూర్యునిలా వెలుగుతూనే ఉంది.
(వచ్చే వారం మరో జానపద కథతో కలుద్దాం)
వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులైన డా. ఎం. హరికిషన్ ప్రసిద్ధ బాలసాహితీవేత్త. 19 మే 1972 నాడు ప్రస్తుత నంద్యాల జిల్లా లోని పాణ్యంలో జన్మించారు. ఎస్.కృష్ణవేణమ్మ, ఎం. హుసేనయ్య తల్లిదండ్రులు. పెరిగినది, చదివినది, ఉంటున్నది, ఉండబోతున్నది – కర్నూలు నగరం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు.
బాలసాహితీ రత్న (2011), అజో విభొ కందాళం విశిష్ట బాలసాహితీ రచనా పురస్కారం (2023), తెలుగు బంధువు పురస్కారం 2023, రాష్ట్ర ప్రభుత్వ గిడుగు భాషా పురస్కారం 2023, మంగాదేవి బాలసాహిత్య పురస్కారం 2024, చిన్న బుచ్చి నాయుడు స్మారక పురస్కారం 2025, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం – 2025 వంటి పురస్కారాలు లభించాయి.
సెల్ నంబర్: 94410 32212
