Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా॥ వి.ఆర్. రాసాని మూడు పుస్తకాల పరిచయ సభ – నివేదిక

అరుదైన జీవితాలను ఆవిష్కరించిన అరుదైన రచయిత రాసాని

వి, కథ, నవలా, నాటక రచయిత డా. వి.ఆర్. రాసాని ఇటీవల ముద్రించిన ‘సీమయవనిక’ నాటకాల బృహద్గ్రంధం; యాచక, గిరిజన, సంచారతెగలపై రాసిన ‘నాలుగో నాటకం’ కథల సంపుటీ; చిత్తూరు మాండలిక భాషలో రాసిన ‘మావూరి కథలు’ పుస్తకాల ఆవిష్కరణ మరియు పుస్తకాల పరిచయం సభ ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో అట్టహాసంగా జరిగింది.ఆచార్య పి.సీ.వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహిస్తూ ఎవరూ గమనించని సామాజిక వర్గాల వారి బాధల్ని రికార్డు చేసిన అరుదైన రచయిత రాసాని అని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ సాంస్కృతిక శాఖాధ్యక్షులు ఆచార్య బి. మురళీ ధర్ గారు రచనని యజ్ఞంలా భావించుకునే వాళ్లు తప్ప ఇన్ని ఉత్తమ రచనల్ని మామూలు మనుషులు చేయలేరని చెప్పారు.

‘సీమయవనిక’ లోని శ్రవ్య, దృశ్య నాటికల గురించి చెబుతూ రాసాని స్వయంగా నటుడు, నాటక రచయిత, నాటక ప్రయోక్త కావడం వల్లనే గొప్ప నాటకాలని రాశాడనీ, తనకు తెలిసిన విభిన్న జీవితాలు గురించి ఏది రాసినా విశ్వజనీనమైన సందేశాన్ని తన నాటకాల ద్వారా ఇచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి రాసాని అని కవి, పరిశోధకుడు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి కొనియాడారు.

ఆ తర్వాత గిరిజన సంచార తెగల గురించి రాసిన ‘నాలుగో నాటకం’ కథల సంపుటాన్ని,కథకుడు, జర్నలిస్టు అయిన డా: ఆర్ ఎం. ఉమామహేశ్వరరావు సమీక్షిస్తూ నక్కలవారి గురించి పయనం, దొమ్మర్ల గురించి అదృశ్యం విధ్వంసం, ఎలుగ్గొడ్లోళ్ల గురించి నాలుగో నాటకం వంటి అరుదైన కథలు రాసిన విశిష్టత రాసానిది అన్నారు.

చివర చిత్తూరు మాండలికంలో రాసిన మావూరి కథల్లోని హాస్యాన్ని, సుందరమైన ఒకప్పటి పల్లెల వాతావరణాన్ని ఆవిష్కరించిన కథలు ‘మావూరి కథలు’ అని కొత్వాలు అమరేంద్ర చెప్పారు.ఇంకా రాసాని కథలను ముద్రించిన బాలా బుక్స్ – ప్రత్యూష ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఈ సభను సాంస్కృతిక శాఖ కన్వీనర్ నిర్వహించిన పత్తిపాటి వివేక్, మూరిశెట్టి గోవిందు, జి.ఎస్.ప్రసాద్, నాగార్జున, ఏనుగు అంకమనాయుడు, ఆదిశేషూ, ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మి, ఆర్టిస్టు బాలసుబ్రమణ్యం లాంటివారు పాల్గొన్నారు.

ఇదే సెనేట్ హాలులో మధ్యాహ్నం సాహితీవేత్తలైన మల్లేశ్వరరావు, కొత్వాలు అమరేంద్ర. కృష్ణారెడ్డి, బాలా ప్రచురణకర్త ప్రత్యూష లాంటి సాహితీవేత్తలతో విద్యార్థులు పుస్తకాలు పైన చర్చ సాగించారు. ఈ సందర్భంగా బాలా పుస్తక ప్రచురణ వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన వచ్చిన జనాన్ని విశేషంగా ఆకర్షించింది. పుస్తకాలు కూడా ఎక్కువగా అమ్ముడు పోవడం విశేషం.

Exit mobile version