[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘దుఃఖం’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
పెదవులపై ఉన్న చిరునవ్వుకు తెలుసు
వెనక ఎంత దుఃఖం ఉందో
కనుల కొలనులో వచ్చే
ఉప్పెనకు తెలుసు
కల్లోలమయ్యే దుఃఖం ఎంతో
గుప్పెడంత గుండెల్లో దాగిన
బడబాగ్ని..
ఏ మహా ప్రవాహంతో చల్లారుతుంది!
ఆవేదనతో.. గుండె నుండి
కనులలోకి ఉబికి వచ్చే
కన్నీటి ధారకు కట్టడి ఉందా
మహా సముద్రంలో పుట్టిన
తుఫానుకు
ఆకాశానికెగసిపడే అలల్లా..
ఆవేదన.. తరంగాల్లా
ఎగసిపడుతుంటే..
ఎన్ని కళ్లు కావాలి
ఎన్ని స్రవంతులు కావాలి
అరుణ కాంతులను చూసి
నవ్వు పులుముకునే
ప్రయత్నం చేస్తున్నా
వికసించే పువ్వును చూసి
కష్టం మరచి
దుఃఖాన్నే చిరునవ్వుగా
మలచుకోవడానికి..
ప్రయత్నిస్తున్నా
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.