[బాలబాలికల కోసం ‘దుష్టబుద్ధి!’ అనే కథని అందిస్తున్నారు శ్రీ బోగా పురుషోత్తం.]
దండకారణ్యాన్ని ఓ మృగరాజు పాలించేది. దట్టమైన వృక్ష సంపదను రక్షించి తనకు పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చేందుకు తన మిత్రుడైన జంబుకేశ్వరుడు అనే ఎలుగుబంటిని సైనికాధికారిగా నియమించుకుంది.
బాగా యవ్వనంలో వున్న మృగరాజు రోజూ ఓ యాభై కేజీల మాంసం భుజించేది. ఈ లెక్కన రోజుకు నాల్గు, ఐదు జంతువులు చొప్పున నెలకు 150 జంతువులు దాకా దాని జిహ్వకు బలయ్యేవి. ఇదంతా స్వయంగా ఎలుగుబంటి స్వీయ పర్యవేక్షణలో సాగేది.
అడవిలో వున్న పెద్ద జంతువులు కొండ గ్రొరెలు, దుప్పిలు, జింకలు అన్నీ కనుమరుగయ్యాయి. దీంతో సింహానికి మంచి రుచికరమైన ఆహారం కరువైంది. తన మిత్రుడు ఎలుగుబంటిని పిలిచి “నువ్వు కర్తవ్యాన్ని సరిగా నిర్వహించలేదు.. నాకు మంచి ఆహారం లేకపోవడంతో శక్తి తగ్గుతోంది. ఇక నేను అందరికీ రక్షణ కల్పించలేను.. నీకు చేత కాకపోతే ఉద్యోగం నుంచి తప్పుకో.. నా తమ్ముడు గాడిదను సైనికాధికారిగా నియమించుకుంటాను..” అంది మృగరాజు.
ఈ మాటలు విన్న ఎలుగుబంటుకు కోపం చిర్రెత్తుకొచ్చింది. “ప్రభూ..! జంతువులకు నువ్వు ఏ రోజు రక్షణ కల్పించావు? అన్నింటిని స్వాహా చేసేస్తున్నావు.. నేను బయటకు వెళితే ఒక్క జంతువు కూడా దగ్గరకు రావడం లేదు, భయపడి దూరంగా పారిపోతున్నాయి.. వాటికి డబ్బు ఇచ్చి తెప్పించి నీకు రుచికరమైన ఆహారం వండి వడ్డిస్తున్నాను.. నా కష్టం అంతా ఇంతా కాదు.. నువ్వు గుర్తించడం లేదు.. అన్ని జంతువులు ఖాళీ అయ్యాయి. ఇక నువ్వు తినడానికి ఏమి మిగలలేదు..!” అంది ఎలుగుబంటు.
ఆ మాటలు మృగరాజుకు ఆగ్రహం తెప్పించాయి. “ఎవరూ లేకపోయినా నువ్వు వున్నావుగా?” అంటూ దానిపైకి ఉరికింది సింహం.
ఊహించని హఠాత్పరిణామానికి విస్తుపోయి చూసింది ఎలుగుబంటి. ఎగిరి గంతులేసి తప్పించుకొని అడవిలో జంతువుల మధ్య కలిసిపోయింది. అయితే ఎలుగుబంటి కసాయి మనసుకు దాన్ని దగ్గరకు చేర్చుకోలేదు. ‘ఇక తన ప్రవర్తనకు జంతువులన్ని కలిసి తగిన బుద్ధి చెప్పాయి.. ఇక ప్రాయశ్చిత్తం వెతుక్కోవాలి..’ అనుకుంటుండగా సింహం ఎదురుపడింది. అప్పటికే ఎలుగుబంటి దుష్ట బుద్ధికి అడవి జంతువులు అనుభవిస్తున్న అవస్థను గ్రహించింది గాడిద. ఇక తను కూడా సింహం మాట విని అందరికీ ద్రోహం చేస్తే తనకు కూడా చెడు ఎదురవుతుందని గ్రహించింది గాడిద.
అప్పటికే సింహం దగ్గర నుంచి తప్పించుకుని తనకు మిత్రులైన జంతువులతో కలిసి పోయింది. కళ్లెదుటే సింహం దుష్టబుద్ధికి బలైన ఎలుగుబంటిని చూసి కంటతడిపెట్టి “నాకు మంచి బుద్ధిని ప్రసాదించు..దేవుడా!” అని ప్రార్థించింది గాడిద!
