Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ద్విభాషా పాండిత్యం..!

[శ్రీమతి అనూరాధ బొడ్ల గారు రచించిన ‘ద్విభాషా పాండిత్యం..!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“నానమ్మా! నన్ను క్యాచ్, నేను మెట్లు ఎక్కింగ్”, అంటూ మూడేళ్ల నిఖిల గబగబా మెట్లు ఎక్కడం మొదలు పెట్టింది.

“ఏం భాషనే తల్లీ! నా తలకాయ లాగే ఉంది నీ భాష. ముందు తిను. తరువాత ఆడుకుందాం” అంటూ పిలిచింది వాళ్ల నానమ్మ లలిత.

“నో, ఐ పొట్ట ఫుల్”, అంటూ పైన రూమ్స్ లోకి పరిగెత్తింది నిఖిల.

లలిత, రామ్మోహన్ దంపతులు ఒక వారం రోజుల క్రితమే అమెరికాలోని కొడుకు దగ్గరికి వచ్చారు. వాళ్లకి ఒక కొడుకు హేమంత్, కూతురు మేఘన, కూతురు కూడా అమెరికాలోనే అక్కడికి దగ్గరలోనే ఉంటుంది. కోడలు సునీత, హేమంత్, ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఇద్దరూ ఇంట్లోంచే వర్క్ చేస్తారు. వాళ్లకి ఇద్దరు అమ్మాయిలు, నిత్య, నిఖిల. చిన్నది నిఖిల మహా గడుగ్గాయి. అల్లరి ఎక్కువ. నిత్య సెకండ్ క్లాస్ చదువుతుంది. నిఖిల ఒక రెండు మూడు నెలలనుంచే డే-కేర్‌కి వెళుతుంది. రెగ్యులర్‌గా ఫోన్ కాల్స్‌లో చూస్తూ ఉండడం వల్ల పిల్లలు లలితకూ, రామ్మోహన్‌కూ త్వరగానే అలవాటయ్యారు. ఆరోజు ఆదివారం కనుక పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. హేమంత్ బయటకి వెళ్ళాడు, ఇంట్లోకి కావలసిన సరుకులు తేవటానికి. లలిత నిఖిలకి అన్నం తినిపిస్తుంటే ఆ అల్లరి పిల్ల అటూ ఇటూ తిరుగుతూ నానమ్మని సతాయిస్తుంది

“సునీతా, దీన్ని చూడు ఒకసారి. ఇది తినటం లేదు. దీనికి నువ్వే తినిపించుకో అమ్మా!” అంటూ కోడలిని కేకేసింది లలిత.

“మీరు, దాన్ని బాగా గారాబం చేస్తున్నారు అత్తమ్మా. మళ్ళీ వినటం లేదూ అంటారు. దాన్ని అలా వదిలేయండి. మీరు కొంచెం ఈ స్టవ్ మీద కూర చూడండి! నేను దాన్ని చూస్తాను” అని అనింది సునీత.

లలిత వంటింట్లో పొయ్యి మీద కూర కలుపుతుంటే, సునీత గబగబా పైకి వెళ్ళి నిఖిలని ఎత్తుకుని కిందికి తీసుకొచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది. “ఏయ్, నీకు ఆటలు ఎందుకు తినేటప్పుడు? జస్ట్ సిట్ హియర్ అండ్ ఈట్! ఫినిష్ దిస్,” అని కొంచెం గదుముతూ, అన్నం కలిపిన ప్లేటు తన ముందు పెట్టింది.

“నో, ఐ పొట్ట ఫుల్, అమ్మమ్మ ఇచ్చింగ్ బిగ్ అన్నం,” అంటూ దాని చేతులు చాచి, వెడల్పుగా పెట్టి అమ్మమ్మ చాలా ఇచ్చింది అన్నట్టుగా చూపించింది. అది విన్న లలిత, అక్కడే ఉన్న రామ్మోహన్ ఫక్కున నవ్వారు.

“ఇదిగో మీతో ఇదే చిక్కు అత్తమ్మా! దాని మాటలకి మీరు నవ్వుతారు. నవ్వితే అది అలుసుగా తీసుకుంటది. కాస్త గట్టిగా ఉండకపోతే ఆడుకుంటది నాతో,” అంది సునీత, తను కూడ వచ్చే నవ్వును ఆపుకుంటూ. అమ్మ ముఖంలో కూడా నవ్వు కనిపెట్టేసిన నిఖిల, “అమ్మా, ఐ గోయింగ్ ప్లే,” అంటూ తుర్రుమంది.

“నా గారాబాలూ, నీ గట్టితనాలూ సంగతి సరే కానీ, పిల్లల భాషేమిటమ్మా ఇలాగుంది? అటు ఇంగ్లీషు కాదు, ఇటు తెలుగూ కాదు. చక్కగా మీరు తెలుగు మాట్లాడితే వాళ్లకీ వస్తుంది. మీరే సగం ఇంగ్లీషులో మాట్లాడుతారయ్యె,” అన్నది లలిత.

 “ఏం చెయ్యగలం అత్తమ్మా? ఇక్కడ ఇంట్లో, మా ఆఫీస్ కాల్స్ అయినా, బయటకు వెళ్ళినా ఇంగ్లీషే వినపడుతుంది వాళ్లకి. స్కూల్లో ఇంగ్లీషే వింటారు. అదే అవసరం కూడా వాళ్లకి,” అంది సునీత.

“నిజమే అనుకో! అయినా మన భాష కూడా నేర్పించాలి కదా!” అంది లలిత.

“అలాగే అనుకుని మొదటి మూడేళ్లు మేము తెలుగే నేర్పించాము నిత్యకి. కానీ, నిత్య స్కూలుకు వెళ్ళగానే, ఈ తెలుగు కాస్తా వదిలేసింది. కోప్పడుతూ ఉంటే కొంచెం రెండు భాషలూ మిక్స్ చేసి మాట్లాడుతూంటది. నిజానికి మొదట్లో ఇంగ్లీషు తెలియక, అందరితో కలవటానికి కష్టపడింది కూడా అది.” అంది సునీత.

“పోయినసారి ఇండియాకి వచ్చినప్పుడు, చిన్నది తెలుగు బాగానే మాట్లాడిందిగా, ఇప్పుడేమయింది దానికి?” అడిగింది లలిత.

“ఇదిగో, అది కూడా స్కూల్‌కి వెళ్ళటం మొదలయింది కదా! ఇటు అక్క మిక్సింగ్ భాష, స్కూల్లో ఇంగ్లీషు కలిపి, దీని మిక్సింగ్ వీర లెవెల్లో ఉంది.” అంటూ వాపోయింది సునీత.

“మరే, మీరు తెలుగు పదాలు, ఇంగ్లీషు పదాలు కలిపి వాక్యాలు చేస్తుంటే, అది రెండు భాషల అక్షరాలు కలిపి కొత్త పదాలు సృష్టిస్తుంది,” అని లలిత అనగానే ముగ్గురూ నవ్వుకున్నారు.

***

పిల్లలకు నానమ్మా తాతయ్యలతో ఉండటం సరదానే. వాళ్ల చుట్టూతా తిరిగుతూ అవీ ఇవీ అడుగుతూ ఉంటారు. లలిత పిల్లలకు కచ్చగాయలు, అష్టచెమ్మ లాటి చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ ఉంటుంది. రామ్మోహనేమో వాళ్లకి కథలు చెపుతూ ఉంటాడు. రాత్రి పూట పిల్లలు వాళ్ల దగ్గరే పడుకుంటున్నారు. రోజూ రాత్రి, ఒకరికి తాతయ్య కథ చెప్పాలి, ఒకరికి నానమ్మ పాట పాడాలి, వాళ్లు పడుకునే ముందు. అలా పెద్దవాళ్లకీ ఒక కాలక్షేపం.

ఆ మధ్యాహ్నం, అందరి భోజనాలు అయ్యాక, సునీత, హేమంత్ కాసేపు పడుకుంటాం అని వాళ్ల రూం లోకి వెళితే, పిల్లలు నానమ్మా, తాతయ్యల రూం లోనే ఆడుకుంటున్నారు. లలిత వాళ్లనే చూస్తూ, “ఏమండీ, వీళ్ళ తెలుగు మరీ దారుణంగా ఉంది. మనం ఉన్న నాలుగు రోజులయినా, ఈ పిల్లలకు కాస్త మంచి తెలుగుని, గట్టిగా నేర్పించాలండీ,” అన్నది లలిత రామ్మోహన్‌తో.

“లలితా, నీ పిచ్చి గానీ, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, ఏమయినా బాగుందా తెలుగు? ఇంగ్లీషు అవసరాలు పెరిగి, తెలుగుకి ఎప్పుడో తెగులు పట్టింది. అక్కడ పిల్లలూ, తెలుగు చదవటం ఎప్పుడో వదిలేశారు. చుట్టూ మాట్లాడే వాళ్లు ఉన్నారు కనుక కొంత మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడ గురించి బెంగ ఎందుకు? మనం నేర్పించి వెళ్ళినా, నాలుగు రోజుల్లో వాళ్లు మర్చిపోతారు. ఏ గూటి చిలుక ఆ పలుకు పలుకుతుంది.” అన్నాడు రామ్మోహన్.

“నిజమే లెండి,” అన్నది లలిత.

“కాస్త పెద్దవాళ్లయితే వాళ్లే నేర్చుకుంటారు. అందాకా వాళ్ల తెంగ్లీషుని ఎంజాయ్ చెయ్యి,” అని నవ్వాడు రామ్మోహన్. “సరే,” అంటూ నవ్వింది లలిత.

“రాత్రి నిత్య ఏమడిగిందో విన్నావా? తాతయ్యా, నాకు స్టోరీ లిసన్ చెయ్యాలని ఉంది. వన్ బిగ్ స్టోరీ చెప్పండి అన్నది.” అన్నాడు రామ్మోహన్.

“అవునండీ విన్నాను, నవ్వుకున్నాను కూడా. ఈ చిన్నది ఏమన్నా తక్కువా, నానమ్మా, నాకు సాంగ్ పాడు, ఐ వినింగ్ అన్నది,” అని నవ్వింది.

“అంతే వాళ్ల మాటలు విని నవ్వుకోవటమే. మనకి అర్దమవుతుందిగా!” అన్నాడు రామ్మోహన్.

***

సాయంత్రం అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. లలిత పిల్లలిద్దరికీ, ఒకరి తరువాత ఒకరికి, తలలకి నూనె రాసి, జుట్టు దువ్వింది. నిత్యకి, రెండు జడలు వేసింది. నిఖిల జుట్టు చిన్నగా ఉండటంతో, రెండు పక్కలా రెండు రబ్బరు బ్యాండ్లు పెట్టి చిన్న పిలకలుగా వేసింది.

“బాగున్నాయే నీ పిలకలు.” అంటూ అందరూ నవ్వారు.

పిల్లలిద్దరూ వాళ్ల జడలు చూసుకుంటూ లోపలికి వెళ్ళారు, అద్దంలో చూసుకుంటామని. పెద్దవాళ్లు నాలుగు మాటలు మాట్లాడుకునే లోపు లోపల్నుంచి గొడవ, ఏడ్పులు వినపడ్డాయి.

“ఆహా, రాకాసులు అప్పుడే తగువు మొదలుపెట్టేసారు,” అనింది సునీత. నిమిషాల్లోనే ఇద్దరూ ఏడ్చుకుంటూ వచ్చారు. ఇటు నిత్య జడలు, అటు నిఖిల పిలకలూ, రెండూ మాయమయి, ఇద్దరూ జుట్టు వీరబోసుకుని వచ్చారు.

‘సీ అమ్మా, చెల్లి నా ప్లెయిట్స్ పుల్ చేసేసింది’, అంది నిత్య.

‘ఐ క్యాచ్ అక్క జడ, టు సీ. అక్క కొట్టింగ్. అక్క పీక్ మై పిలక,” అంటూ క్యారుమంది నిఖిల.

అందరూ గొల్లున నవ్వారు, వాళ్ల భాషకి. లలిత, రామ్మోహన్ ఒక పది నిమిషాలు నవ్వు ఆపుకోలేకపోయారు.

“అబ్బా! నవ్వీ, నవ్వీ పొట్ట చెక్కలయితుందమ్మా,” అన్నాడు రామ్మోహన్. వీళ్ళ నవ్వులెందుకో అర్దం కాక, చిన్నది మరింత పెద్దగా ఏడుపు మొదలు పెట్టింది.

“మీరూ, మీ నవ్వూ! పిల్ల దడుచుకుంటుంది. ఆగండి!” అంటూ “ఊర్కో తల్లీ ఊర్కో! పర్లేదులే నేను మళ్లీ వేస్తాను జడలు, ఇలా రా,” అంటూ చిన్నదాన్ని సముదాయించి కూర్చోపెట్టింది లలిత. అలాగే పెద్దదాన్ని కూడా కూర్చోపెట్టి వాళ్లకి మళ్లీ జడలు వేస్తూ, “వీళ్ళ తెలుగుకి నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదే,” అంది లలిత.

“అమ్మా, ఇదేం విన్నావు. చిన్నది అప్పుడప్పుడూ, గబగబా తింటూ ఉంటది. ఒక ఇడ్లీ మొత్తం నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తది. అలా ఒక్కసారే కుక్కుకోకే నోట్లో, దగ్గొస్తది. చిన్న చిన్న ముక్కలు తిను,, అని చెప్తూ ఉంటది వాళ్ల అమ్మ. అది వినీ వినీ, ఇప్పుడు అది, ‘ఐ ఆమ్ నాట్ కుక్కింగ్’ అని చెప్తుంది,” అని నవ్వాడు హేమంత్.

‘కుక్కింగ్’ ఏంటే అని అడిగితే, అది నోరు తెరిచి, చేతులతో నోట్లొ కుక్కుకుంటున్నట్టుగా ఇలా, ఇలా అంటూ యాక్షన్ చేసి చూపించింది. ఇదిగో చూడు, అది వీడియో కూడా తీసాము అంటూ ఆ వీడియో చూపించాడు హేమంత్.

లలిత, రామ్మోహన్ ఆ భాషా ప్రయోగాన్ని గురించి, నోరు తెరుచుకుని విన్నారు, ఆ వీడియో చూసి ఇద్దరూ ఒకటే నవ్వు.

“ఇక్కడే కాదత్తమ్మా, పోయిన వారం మా అనితక్కకి వీడియో కాల్ చేసాను. అప్పుడు అక్క, బావ వాళ్లు పానీపూరి తింటున్నారు. అది చూసి ఈ చిన్నది అక్కతో, “పెద్దమ్మా, డోన్ట్ కుక్ ఇన్ మౌత్, యు విల్ దగ్గు”, అని చెప్పింది. అక్క, బావలకి కాస్త టైం పట్టింది అర్థమవటానికి. వాళ్లిద్దరూ ఒకటే నవ్వు,” అంది సునీత నవ్వుతూ.

“బాగుందే, చిన్న దాని ద్విభాషా పాండిత్యం. దీనితో ఒక కొత్త భాష పుట్టేలా ఉంది,” అంది లలిత.

అందరూ పెద్దగా నవ్వారు. పిల్లలిద్దరూ ఏం అర్థం కాక, చూస్తూ కూర్చున్నారు.

“మనిషికీ, మనిషికీ మధ్య భావప్రసారం జరగటమే భాష పరమార్థం. వాళ్ల భాష మనకి అర్దమవుతుంది కదా! అదే సంతోషం,” అన్నాడు రామ్మోహన్.

అవునన్నట్టుగా అందరూ తల పంకించారు.

Exit mobile version