Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ద్విపర్ణ!

[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘ద్విపర్ణ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

దివారం మధ్యాహ్నం మూడు గంటలవుతుంది. శ్రావ్య ఏకాగ్రతతో తన స్టూడెంట్ రాసిన అసైన్మెంట్స్ చదువుతూ గ్రేడ్స్ ఇవ్వసాగింది. ఇంతలో సెల్ మ్రోగింది. తల్లి ఫోను.

“హలో అమ్మా!”

“శ్రావ్యా! అన్నం తిన్నావా? ఒక్కొక్కసారి పనిలోపడి తినడం ఆలస్యం చేస్తావు కదా! అందుకే అడిగాను. ఈ వీకెండ్లోనైనా ఇంటికి తప్పకుండా వస్తావనుకున్నాను. అసలు నువ్వు ఇంటికొచ్చి నెలరోజులవుతుంది. తెలుసా? అంత బిజీగా ఉన్నావా? నిన్ను చూడాలనిపిస్తోంది. కనీసం వచ్చే వీకెండ్కైనా వీలుచూసుకుని రా!” అంది సరళ.

శ్రావ్య గిల్టీగా ఫీలయింది.

“అలాగేనమ్మా! తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను. రఘు ఎలా ఉన్నాడు? బాగా చదువుతున్నాడా?” అని ఎం.ఏ. ఫైనలియర్లో ఉన్న తమ్ముడి గురించి అడిగింది.

“ఆ! బాగానే చదువుతున్నాడు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని, మంచి యూనివర్సిటీలో పీహెచ్డీ సీటు సంపాదించాలని పట్టుదలగా ఉన్నాడు”

“వెరీగుడ్!” అని మిగతా చిన్న చిన్న విషయాలేవో మాట్లాడి ఫోను పెట్టేసింది.

శ్రావ్య హైదరాబాద్లోని యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‍గా సంవత్సరం నుంచి పనిచేస్తుంది. అదే యూనివర్సిటీలో సోషియాలజీలో ఎమ్.ఏ., పిహెచ్.డి. చేసింది. మెరిట్ స్టూడెంట్ అవడం వలన అక్కడే జాబు దొరికింది. యూనివర్సిటీ వాళ్లిచ్చిన క్వార్టర్స్‌లో ఉంటున్నది.

తల్లిదండ్రులుండే ఇల్లు కొంచెం దూరమే. కానీ దానికంటే కూడా శ్రావ్యకి వేరుగా ఉండడం ఇష్టం. స్వేచ్ఛగా ఏ బాదరబంధీ లేకుండా ఉండాలనుకుంటుంది. తల్లిదండ్రుల దగ్గర ఉంటే పెళ్లి గురించిన ప్రశ్నలు, అనేక విషయాల్లో ఆంక్షలు. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగా పర్మిషన్లు. ఒకవేళ బయటికి వెళ్లి రావడం ఎప్పుడైనా ఆలస్యం అయితే కంగారు పడటాలు. ఇవన్నీ శ్రావ్యకు చికాకు కలిగిస్తాయి. అందుకే యూనివర్సిటీకి ఇల్లు దూరం అన్న వంకతో వేరుగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లొస్తూ ఉంటుంది.

శ్రావ్య తండ్రి మల్లికార్జునరావు ఇంటి దగ్గరలో నున్న కాలేజ్లో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. తల్లి హౌస్‌వైఫ్. వాళ్లిద్దరికీ ఒకటే దిగులు. ముప్పయ్ ఏళ్ళు దాటినా శ్రావ్య పెళ్లి మాటెత్తితే చికాకు పడటం, ఇంకా నాకు టైమివ్వండి అనడం, మంచి జాబ్లో సెటిలయినా పెళ్లి పోస్ట్‌పోన్ చెయ్యడం వాళ్ళకి అర్థం కాని విషయం. శ్రావ్య ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఎప్పుడు సంబంధాలు చూద్దామా? అని ఎదురు చూడసాగారు.

***

అసలు రహస్యం వేరే ఉంది. శ్రావ్య ఇంటర్మీడియట్లో కోఎడ్యుకేషన్ కాలేజీలో చేరింది. అక్కడే రాజ్‌కిరణ్ సింగ్ రాథోడ్ అనే రాజస్తానీ అబ్బాయితో పరిచయం అయింది. నెమ్మది నెమ్మదిగా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడడటం జరిగింది. చివరికి ప్రేమలోకి దారి తీసింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత రాజ్‌కిరణ్ డ్రెహ్రడూన్లో ఉన్న మిలటరీ అకాడమీలో చేరాడు. ట్రెయినింగ్ అయిన తర్వాత చండీఘర్, లక్నో లాంటి ప్రదేశాల్లో పోస్టింగ్ వేశారు. ప్రస్తుతం లదాక్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు. హైద్రాబాద్ వచ్చినప్పుడల్లా ఇద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. రాజ్‌కిరణ్ కుటుంబం ఎన్నో సంవత్సరాలనుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. తండ్రి బల్వీర్ సింగ్ రాథోడ్‌కి హైదరాబాద్‌లో పెద్ద బట్టలషాపు ఉంది.

దూరంగా ఉంటున్నా వాళ్లిద్దరి మధ్య ప్రేమ తగ్గలేదు. అతని రాక కోసం ఆమె ఎదురుతెన్నులు చూసేది. ఎప్పుడు లీవ్ దొరుకుతుందా ఎప్పుడు ఆమెని చూద్దామా అని అతడు తహతహలాడేవాడు. అతని తల్లిదండ్రులవి సాంప్రదాయ భావాలైనా, శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళని ఒప్పించగలనన్న ధైర్యం అతనికుంది.

కానీ శ్రావ్యకే సంకోచం. అతన్ని పెళ్ళి చేసుకుంటే అతనికెక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్ళక తప్పదు. ఒక్కోసారి ఏ సౌకర్యాలు లేని దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇంత చదువు చదువుకుని, కెరీర్ మీద దృష్టి పెట్టి సంపాదించిన ఈ ఉద్యోగం వదులుకుని, అతనితో వెళ్లి, కేవలం హౌస్‌వైఫ్‌గా స్థిరపడటం శ్రావ్యకి ఇష్టం లేదు. స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం వదులుకోవడం ఆమెకి అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఒకవైపు రాజ్‌కిరణ్ పట్ల గాఢమైన ప్రేమ, ఇంకోవైపు కెరీర్ – ఈ రెండిరటి మధ్య ఆమె నలిగిపోతున్నది. ఆలోచనలతో విసిగి వేసారిపోతున్నది.

***

ఆ సమయంలోనే శ్రావ్యకి రుద్రాంశు చటర్జీతో పరిచయం కలిగింది. అతను ఆ యూనివర్సిటీలోనే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. బెంగాలీ యువకుడు. మంచి భావుకుడు. ఇంగ్లీషులో, బెంగాలీలో కవితలు రాస్తాడు. బాగా పాడతాడు కూడా. రవీంద్ర సంగీతం అంటే ఎంతో ఇష్టం. అతనికి శ్రావ్య మొదటి పరిచయంలోనే నచ్చింది. మెరిసే చామనఛాయ, కళకళలాడే ముఖం, పొడుగాటి జుట్టు, చక్కని ఫిగర్‌తో అందంగా ఉండే శ్రావ్యని పదే పదే కలిసి మాట్లాడాలని అనిపించేది అతనికి.

మొదట్లో శ్రావ్య అతన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ తనని కలవాలని అతను చేసే ప్రయత్నాలు, మాటలు కలపాలని పడే ఆరాటం, తను లైబబ్రరీకి వెళ్ళే టైములోనే రావడం, టీ తాగుదాం రమ్మని ప్రాధేయపడటం, ఇవన్నీ ఆమె దృష్టిలో పడి అతన్ని గమనించేట్లు చేశాయి. చూడటానికి బాగానే వుండి, ఆడవాళ్ళ పట్ల అత్యంత గౌరవభావంతో మెలుగుతూ, మృదువుగా మాట్లాడే రుద్రాంశు పట్ల ఆమె కూడా నెమ్మదిగా ఆకర్షితురాలైంది. స్నేహితుల గ్రూప్‌లో తనవైపు ఆర్ద్రంగా చూస్తూ అతను పాడే ప్రేమ గీతాలు ఆమెను సమ్మోహన పరచేవి. కానీ రాజ్‌కిరణ్ పట్ల గాఢమైన ప్రేమ ఉన్న ఆమె తనని తాను సంభాళించుకుని దూరాన్ని పాటించేది.

***

అప్పుడే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. అందరూ ఇళ్ళల్లో బందీలయ్యారు. తన ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యసాగింది శ్రావ్య. పని మనిషి గంగమ్మ పని మానెయ్యలేదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా పని చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోయేది. ఒక రోజు నీరసంగా వచ్చింది. గొంతు నొప్పి, వళ్ళునొప్పులు అని చెప్పి దగ్గసాగింది. శ్రావ్యకి భయం వేసి రేపటి నుంచి పనికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకి శ్రావ్యకి బాగా జ్వరం వచ్చింది. గొంతునొప్పి కూడా వచ్చింది. బాగా నీరసపడిపోయింది. ఆన్లైన్ క్లాసులు చెయ్యలేనని ఆఫీసు వాళ్ళకి తెలియపరచింది. తర్వాత మంచం మీద నుంచి లేవలేకపోయింది. ఏమన్నా చేసుకుని తినే ఓపిక అసలే లేదు. ఇంటికి ఫోను చేస్తే గాబరా పడతారని చెయ్యలేదు. అలాగే మంచానికి అంటుకుపోయింది.

మరుసటి రోజు ప్రొద్దున్నే కాలింగ్‌బెల్ మ్రోగింది. లేచి తలుపు తియ్యలేకపోయింది. కాసేపటికి బెడ్రూమ్ కిటికీ కొట్టినట్లు వినిపించింది. చూస్తే రుద్రాంశు నుంచుని ఉన్నాడు. తలుపు తియ్యమని సైగ చేశాడు. ఎలాగో ఓపిక తెచ్చుకుని తలుపు తీసి, తన బెడ్రూమ్‌కి వెళ్లి, తలుపు కొంచెం తెరచి అతన్ని దూరంగా ఉండమని తన పరిస్థితి వివరించింది. శ్రావ్యని లోపలే ఉండమని కోవిడ్ టెస్ట్ ఏర్పాట్లు చేశాడు. శ్రావ్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు తెప్పించాడు. స్వయంగా వంట చేసి తీసుకొచ్చేవాడు. తను శ్రావ్య డ్రాయింగ్ రూమ్‌లో ఉంటూ ఆమెకి కావాల్సినవన్నీ సమకూర్చి ఆదుకున్నాడు. శ్రావ్యకి నెగెటివ్ రావడానికి పదిహేను రోజులు పట్టింది. కానీ పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలలు ఆమెని కంటికి రెప్పలా కాపాడాడు.

కొంచెం కోలుకున్న తర్వాత మధ్య మధ్యలో తల్లికి ఫోను చేసి తన పరిస్థితి చెప్పకుండా తను బాగానే ఉన్నట్లు చెప్పేది శ్రావ్య.

పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకరోజు ఆమె, రుద్రాంశు సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు. హఠాత్తుగా శ్రావ్య ఎంతో ఉద్వేగంగా రుద్రాంశు వైపు చూస్తూ,

“నీ వలనే నేను బతికాను రుద్రాంశూ. లేకపోతే చచ్చిపోయి ఉండేదాన్ని!” అంది.

అంతలోనే ఆమెకి ఏడుపు వచ్చి ఏడ్వడం మొదలెట్టింది. రుద్రాంశు గబుక్కున లేచివచ్చి, పక్కన కూర్చుని, ఆమెని ప్రేమగా హృదయానికి హత్తుకుని,

“పిచ్చిపిల్లా! అలా ఏడవకు! నువ్వు నాకెంతో ప్రియమైన దానివి. నిన్ను నీ కోసం కాదు, నా కోసం రక్షించుకున్నాను” అన్నాడు ఎంతో భావోద్వేగంగా.

శ్రావ్య అతనికి హత్తుకుపోయింది. అతని కౌగిలిలో చెప్పలేని ప్రశాంతత, భద్రత కలిగిందామెకు. ఇద్దరూ ఎంతోసేపు అలా ఉండిపోయారు. అప్పటి నుంచి వారిద్దరు ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు.

***

అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. హఠాత్తుగా ఒకరోజు రాజ్‌కిరణ్ దగ్గరి నుంచి ఫోను వచ్చింది. ఇన్నాళ్ళ తర్వాత నిన్ననే బేస్ కాంప్కి వచ్చానని, అందుకే ఫోన్ చెయ్యలేదని, కోవిడ్ వలన హైదరాబాద్ రావడానికి కుదరలేదని, ఇంకో పది రోజుల్లో వస్తున్నానని చెప్పాడు. త్వరలో రాజ్‌కిరణ్‌ని చూడబోతున్నందుకు శ్రావ్య అమితానందపడిరది.

చెప్పినట్లుగానే రాజ్‌కిరణ్ పది రోజుల్లో వచ్చాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలుసుకునే రెస్టారెంట్లో ఫ్యామిలీ రూమ్‍లో కలుసుకున్నారు.

“చూశావా? నీ కోరిక ప్రకారం నేను ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వచ్చాను” అన్నాడు రాజ్‌కిరణ్.

ఆరడుగుల ఎత్తుతో, దృఢంగా, బలంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న రాజ్‌కిరణ్ ఆమెకి అసలైన సైన్యాధికారిగా కనిపించాడు. అతన్ని రెప్పవాల్చకుండా చూడసాగింది. రాజ్కిరణ్ ఆమెని నవ్వుతూ చూస్తూ,

“ఏంటి అలా చూస్తున్నావ్? నాకు దిష్టితగులుతుందేమో?” అన్నాడు.

శ్రావ్య సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది.

రాజ్కిరణ్ శ్రావ్యని దగ్గరికి తీసుకుంటూ “నువ్వు చాలా చిక్కిపోయావు. కోవిడ్ తన ప్రభావం నీ మీద బాగా చూపింది. ఆరోగ్యం జాగ్రత్త!” అన్నాడు.

శ్రావ్య రుద్రాంశు తననెలా కాపాడింది చెప్పాలనుకుంది. కానీ ఎందుకో సంకోచించింది. అతని వంక తప్పు చేస్తున్నట్లు చూసింది.

ఆ తర్వాత మాటల్లో “చూడు శ్రావ్యా! మనిద్దరం ఇక సెటిల్ అవడం గురించి ఆలోచించాలి. మన పెళ్ళి గురించి నా పేరెంట్స్‌తో మాట్లాడతాను. నాకెక్కడ పోస్టింగ్ వేస్తే అక్కడికి నువ్వు రానక్కరలేదు. నువ్విక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు. నాకు సెలవు దొరికినప్పుడు నీ దగ్గరికి వస్తాను. కొన్నాళ్ళు అలా మేనేజ్ చేద్దాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో ముందు ముందు ఆలోచిద్దాం” అన్నాడు రాజ్‌కిరణ్.

హఠాత్తుగా రాజ్‌కిరణ్ తీసుకున్న నిర్ణయానికి శ్రావ్య ఆశ్చర్యపడిoది. తన ఆలోచనలు, తనలో జరుగుతున్న అంతర్మథనం అర్థం చేసుకుని, కేవలం తన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె గ్రహించింది. ఆమె మనస్సంతా అతని పట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.

“నువ్వు కోరుకున్నట్లే మన పెళ్లి ఏ ఆడంబరం లేకుండా సింపుల్‌గా  జరిగేటట్లు నా తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాను. మీ అమ్మా, నాన్నల్ని ఒప్పించే బాధ్యత నీది” అని కూడా అన్నాడు.

ఇది విని తన సెంటిమెంట్స్‌కి రాజ్‌కిరణ్ ఎంత విలువనిస్తాడో అర్థమై, ప్రేమగా అతని భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది.

***

కానీ అప్పటి నుంచి ఆమె మనస్సులో సంక్షోభం చెలరేగింది. మనిషి ఎటూ తేల్చుకోలేని ఇరకాటంలో పడిపోయింది.

రాజ్కిరణ్, రుద్రాంశు ఇద్దరూ తనకి ప్రియమైన వాళ్ళే! ఎవరినీ వదులుకోలేదు తను. నిజమైన దేశభక్తుడు రాజ్‌కిరణ్! తన ప్రేమ కోసం దేశం పట్ల ఉండాల్సిన బాధ్యతని విస్మరించలేదు. అందుకే రెండింటికి న్యాయం చేకూర్చే నిర్ణయం తీసుకున్నాడు.

రుద్రాంశు కవి. సున్నితమైన ప్రేమికుడు. కోవిడ్‌ని కూడా లెక్కచెయ్యకుండా తనని కాపాడాడు.

ఇద్దరికీ తనంటే పంచప్రాణాలు. తను కూడా మనసారా వాళ్ళిద్దర్ని కావాలనుకుంది. ఒక స్త్రీ ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం తప్పా? ఇద్దరితో కలిసి ఉండాలనుకోవడం నేరమా?

అసలు ముందు రాజ్‌కిరణ్, రుద్రాంశులు దీనికి ఒప్పుకుంటారా? కుటుంబ సభ్యులు ఆమోదిస్తారా? సమాజం అంగీకరిస్తుందా? నేను ఇద్దరితో ఉంటూ పరస్థితులకు తట్టుకుని నెగ్గుకు రాగలనా? ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఇలా ఆలోచించుకుంటూ, మానసిక ఒత్తిళ్ళకు గురవుతూ తల్లడిల్లసాగింది శ్రావ్య.

***

ఆ ఊరు మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్. అది నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ (నేహు) కాంపస్. అందులోని ఒక బిల్డింగ్‌లో రెండవ అంతస్తులో ఉన్న ఫ్లాటులో..

“శ్రావ్యా! ఉప్మా చేశానమ్మా! టేబుల్ మీద పెట్టాను. తిందువు గాని రా!” పిలిచింది సరళ.

లోపల బెడ్రూమ్‌లో యూనివర్సిటీకి వెళ్ళడానికి తయారవుతున్న శ్రావ్య “వస్తున్నానమ్మా! ఒక్క నిమిషం” అంది.

ఈ లోపల టీ కూడా తయారు చేసి తీసుకొచ్చింది సరళ. ఇద్దరూ కలిసి టిఫిన్ తినడం మొదలుపెట్టారు.

మాట కలుపుతూ “నేను వచ్చి ఇరవై రోజులవుతుంది. అక్కడ రఘు, మీ నాన్నగారు నేను లేకుండా ఎలా ఉంటున్నారో? ఇక నా టికెట్ బుక్ చెయ్యి” అంది సరళ.

“అలాగేనమ్మా! ఇంకో వారం రోజులుండి వెళుదువుగాని. నువ్వు రావడం నాకెంతో బాగుంది. అప్పుడప్పుడు నన్ను గుర్తు పెట్టుకుని వస్తుండు” అంది తల్లి వైపు ఆత్మీయంగా చూస్తూ.

“అలాగే! నువ్వు కూడా హైదరాబాద్ వస్తుండు” అంది సరళ.

ఇక టైమయిందని హడావిడిగా టీ తాగేసి వెళ్లిపోయింది శ్రావ్య.

సరళ టేబుల్ మీద గిన్నెలన్నీ సర్దేసింది. పని మనిషి వస్తుందని ఇల్లు సర్దడం, డస్టింగ్ చెయ్యడం మొదలెట్టింది. శ్రావ్య బెడ్రూమ్ లోకి వెళ్లింది. కిటికీ నుంచి వచ్చే గాలికి టేబుల్ మీద తెరచి ఉన్న డైరీ పేజీలు రెపరెపలాడసాగాయి. డైరీ మూద్దామని అనుకుంటుంటే ఆ రోజే రాసిన కుదురయిన అక్షరాలు ఆమె కళ్ళబడ్డాయి. చదవకూడదు అనుకుంటూనే కళ్ళు అక్షరాల వైపు పరుగుతీసాయి.

అందులో శ్రావ్య ఇలా రాసుకుంది..

‘జీవితం ఎంత విచిత్రమైంది? ఇటువంటి మలుపు తిరుగుతుందని నేను ఊహించానా? రాజ్‌కిరణ్, రుద్రాంశులు ఎలా ఉన్నారో? ఇద్దరినీ వదిలేసి ఇక్కడికి వచ్చేశాను. ఒకళ్ళతో ఉండి ఇంకొకళ్ళను వదిలేస్తే జీవితాంతం వదిలేసిన మనిషిని గుర్తు చేసుకుంటూ నరకం అనుభవించేదాన్ని. అందుకే ఇద్దరినీ దూరం చేసుకుని, వారి జ్ఞాపకాలు, ప్రేమ, స్నేహం మనస్సులో పదిలం చేసుకుని, రొజుకొకసారైనా వాళ్ళని తలచుకుంటూ రోజులు నెట్టుకొస్తున్నాను. ఇక్కడికి రావాలని నిర్ణయం తీసుకుని, ఉద్యోగం రాగానే, వారిద్దరికీ ఉత్తరాలు రాసి వచ్చేసి, అజ్ఞాతంగా జీవనం గడుపుతున్నాను. ఆ ప్రేమమూర్తులిద్దరూ తనని నెమ్మదిగా మర్చిపోయి ఆనందంగా, సుఖంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సమాజంలో నా హృదయం ఆశించినట్లుగా నా ప్రియతములిద్దరితో ఉండటం ఊహించలేని విషయం. దానికి బదులుగా వంటరిగా ఉంటూ ప్రశాంతంగా బతకాలన్న ఆశతో ఇక్కడికి వచ్చాను.’

ఇది చదివి నిర్ఘాంతపోయింది సరళ. ఇంతదూరం వచ్చి ఉంటున్న కూతురి జీవితంలోని అసలు రహస్యం ఆమెకి అర్థం అయింది. అందుకే శ్రావ్య తానిక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దనీ ప్రాధేయపడింది. తనకు జీవితంలో పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఇక లేదని చెప్పేసింది.

ఏకాకిగా జీవిస్తున్న కూతుర్ని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది సరళ. ఏదైనా మిరాకిల్ జరిగి, కూతురి జీవితాన్ని తిరిగి నందనవనం చెయ్యమని దేవుడికి దండం పెట్టుకుంది.

Exit mobile version