Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎడారి కోయిల

నేను నాస్తికుడిని అని చెప్పలేను కానీ మహత్యాలని నమ్మను. మనుషుల్ని మనుషులుగానే చూస్తాను కానీ దైవాంశసంభూతులుగా పరిగణించి వారికి లేని గొప్పదనాన్ని ఆపాదించటాన్ని నిరసిస్తాను.

అలాంటి నేను విజయేంద్ర శర్మ గారిని కలిశాక నా నమ్మకాలని పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఒకసారి భారతదేశం వచ్చినప్పుడు నేను అనుకోకుండా విజయేంద్ర శర్మగారిని కలిశాను, ఆయన్ని కలవటం చాలా చిత్రంగా జరిగింది.

నేనాయన్ని కలవకుంటే ఈ కథే లేదు.

***

“సామీ! మీ ముత్తాతని ఇక్కడే అతి కిరాతకంగా హత్య చేశారు”

ఆ వృద్ధుడు చెబుతున్న మాటలు విని అయోమయంలో మునిగిపోయాము నేను శర్వాణీ. ఎక్కడ మొదలు పెట్టిన అన్వేషణ ఎక్కడ ముగిసింది?

ఏమి సాధించాలని బయలుదేరాము, ఏమి వింటున్నాము?

అమెరికా నుంచి వచ్చి విమానం దిగీ దిగంగానే, జూమ్ కార్స్‌లో ఒక ఎస్.యూ.వీ.ని అద్దెకి తీస్కుని సీమలోని ఈ ప్రాంతాలకు వచ్చేశాను నేనే డ్రైవింగ్ చేసుకుంటూ. నాతోటి నా శ్రీమతి కూడా వచ్చింది.

ఆ వృద్ధుడు కావి రంగు పంచె, అదే రంగు ఖద్దరు చొక్కా ధరించి ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి తొంభై ఏళ్ళు అంటే నమ్మలేం, అంత దృఢంగా ఉన్నాడు.

మట్టి రోడ్డుపై కారాపుకుని అతని ఎదురుగా నిలబడి ఉన్నాం. అతను చెప్పుకుపోతున్నాడు “బ్రహ్మ హత్యా పాతకం ఊరికే పోదు సామి. సుక్షేత్రం లాంటి ఈ భూమి బీడు పడి పోయింది. ఆ రోజులు లేవు, ఆ రాజులు లేరు.

నువ్వు నాలుగో తరం వాడివి. మా తాత చెప్పగా అన్నీ గుర్తే నాకు. మీ అవ్వ మహాతల్లి. మొగుణ్ణి కళ్ళ ముందే చంపితే ఆ మహా తల్లి ఏమి చేయలేక పసి పిల్లల్ని ఇద్దర్నీ చంకలో వేసుకుని ప్రాణభయంతో పరిగెత్తి ఎక్కడికెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు.

అక్కడికి అదృష్టవంతురాలు. ప్రాణాలు కాపాడుకుంది. ఆ కాళరాత్ర ఒకటి కాదు రెండు కాదు, పద్దెనిమిది బ్రాహ్మణ కుటుంబాలు హతమారిపోయాయి. భూములు, ఆస్తులు నిశ్శబ్దంగా అన్యాక్రాంతమయిపోయాయి.”

ఆ ముసలాయన మాటలు వింటుంటే వెన్నులో ఏదో జర జరా ప్రాకినట్టయింది.

వేడిగాలి చెంపల్ని తాకుతోంది. మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరగుతోంది. దూరంగా ఎండమావులు కనిపిస్తూ దాహాన్ని పుట్టిస్తున్నాయి. ఎటు చూసినా బీడు పడిన భూములు, ఎండిపోయిన గడ్డి, పేరు తెలీని ఎండి పోయిన పిచ్చి మొక్కలు.

కనుచూపు మేరా పచ్చదనం అన్న మాటే లేదు.

చూపు ఆనినంత మేరా ఎడారి లాంటి బీడు భూములు, మట్టి రోడ్డు పక్కన ఊడలు దిగిన ఒక పెద్ద మర్రిచెట్టు కింద నిలబడి మాట్లాడుతున్నాము ఆ ముసలాయనతో.

ఆ స్థలంలో జరిగిన అనేక దౌష్ట్యాలకి మౌన సాక్షిలా ఉంది ఆ మర్రి చెట్టు.

“మీరు వెతుక్కుంటూ వచ్చిన గుడి నాకు తెలుసులే. నేను తీస్క పోయి సూపిస్తా” అంటున్న ఆ ముసలాయన నాకు ఆపద్భాంధవుడిలా కనిపించాడు.

నా ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.

***

నాకు బంధుత్వాలు సరిగ్గా గుర్తు ఉండవు అని ఎప్పుడు వెటకారం చేస్తూ ఉంటుంది శర్వాణి, నా శ్రీమతి. అది ఒక రకంగా నిజమే కూడా. మా నాన్న గారి వైపు గాలించి చూసినా చుట్టాలు ఉండరు. ఇది అందరు ఆశ్చర్యపడే అంశం.

మాకున్న బంధువులు అందరూ మా అమ్మ తరఫున వాళ్ళే. పెద్దమ్మలు, పిన్నమ్మలు, మేనమామలు ఇలా అందరూ మా అమ్మ తరఫున వాళ్ళే.

నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని షిమోగాలో. పేరుకు తెలుగు వాళ్ళమే కానీ చదువుకుంది, ఉద్యోగంలో చేరింది, పెళ్ళి చేసుకుంది అంతా కర్ణాటకలోనే. కానీ ఇంట్లో మాట్లాడే భాష తెలుగే.

“మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఎవ్వరూ తెలుగు మాట్లాడరు మనం ఎందుకు తెలుగు మాట్లాడుకుంటున్నాము?” ఇలా మా అమ్మా నాన్నలని చిన్నప్పుడు ఎన్నో సార్లు ప్రశ్నించే వాడిని.

మా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో రాయలసీమలో ఉందట. అది ఏ ఊరో కూడా ఎవ్వరికి తెలియదు. మా నాన్న గారి తాతగారు చిన్న వయసులోనే చనిపోయినప్పటికి ఇద్దరు మగపిల్లల్ని కష్టపడి పెంచుకుందట మా ముత్తవ్వ. ఆయన చనిపోయాక మా పూర్వీకురాలైన ఆ ముసలావిడ ఇక్కడికి వచ్చిందో, లేదా ఇక్కడే ఆయన చనిపోయారో కూడా వివరాలు నాకు తెలియవు.

వాళ్ళు ఏ కారణంతో ఈ ప్రాంతాలకు వచ్చారో తెలియదు. కానీ వాళ్ళు సీమ ప్రాంతాలలో ఉన్నప్పుడు చాలా స్థితిమంతులుగా ఉండేవారట. కోతలు అయ్యాక ఆ పంటను ఇంట్లో దించటానికి వచ్చిన బండ్లు ఒక దాని వెంబడి ఒకటి ఒక మైలు పొడవునా ఆగి ఉండేవట ఇంటిముందు. అలాంటిదిట మా పూర్వీకుల స్థితి.

అటువంటి సీమప్రాంతాలనుంచి, కర్ణాటకలోని ఈ ప్రాంతాలకు ఎందుకు వచ్చి స్థిరపడాల్సివచ్చిందో, ఎందుకు అన్ని కష్టాలు పడిందో ఆ మహాతల్లి ఎవ్వరికీ తెలియదు.

పూట గడవటమే కష్టం అనే స్థితిలో ఇద్దరు మగపిల్లల్ని తానే కష్టపడి పెంచి పోషించి పెద్ద చేసిందట ఆ మహాతల్లి. ఆవిడ పెంచి పెద్ద చేసిన పిల్లల్లో ఒకరు పెండ్లి చేసుకోకుండా మిగిలిపోయారట. మిగిలిన ఇంకో ఆయన మా నాన్నగారికి నాన్నగారు. ఇది స్థూలంగా మా వంశవృక్షం. ఇంతకు మించి ఇతర వివరాలు నాకు తెలియవు.

ఈ విశేషాలన్ని మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పినట్టు గుర్తు.

‘మా కుటుంబం ఎటూ కాకుండా ఇంత దూరం వచ్చి, భాష కాని భాష మాట్లాడే ఈ ఊళ్ళో, తెలిసిన వారు ఎవ్వరూ లేని ఇక్కడ ఎందుకు స్థిరపడింది’ అన్న ప్రశ్న నన్ను చిన్నప్పుడు చాలా వేధించేది.

నేను ఆ తర్వాత చదువుల్లో పడిపోవటం, ఉద్యోగంలో చేరటం, పెళ్ళి చేసుకుని నా జీవితంలో నేను తలమునకలు అవటం వల్ల చిన్నప్పుడు నన్ను వేధించిన ఈ ప్రశ్నని క్రమంగా మరచిపోయాను. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ అమెరికాలో స్థిరపడి పోయాను.

నాకు ఇప్పుడు నలభైఅయిదు ఏండ్లు. ఈ జీవిత పయనంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఉద్యోగాలు మారాను, ప్రమోషన్లు పొందాను, అమ్మా, నాన్నలను కోల్పోయాను. మా వంశానికి సంబంధించిన గతం గూర్చిగానీ, చిన్నప్పుడు నన్ను వేధించిన ప్రశ్నల గూర్చి గానీ నాకు ఆలోచించే సమయం ఉండటం లేదు, ఒక వేళ ఈ ప్రశ్నలు నాలో తలెత్తినా నాకు సమాధానాలు చెప్పే వారెవ్వరూ లేరు కూడా కద.

నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజిలో చదివే వయసుకు వచ్చారు. నా సమస్యలలో నేను తల మునకలుగా ఉన్నాను.

‘అమెరికాలో ఉంటున్నావు కద, అందులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనబడే ఇంద్ర సింహాసనం అధిష్టించినావు నీకేమి తక్కువ? నీకు సమస్యలు ఏమిటి’ అని నవ్వేస్తారు నా మిత్రులు.

మీరు ఎంత చెట్టుకు అంత గాలి అన్న సామెత వినే ఉంటారు. అలాగే నా విషయమున్నూ. నేను పని చేసే సంస్థ ఎంత పెద్దది అయినా, ప్రపంచాన్ని కబళించిన ఆర్థిక మాంద్యం ఆ సంస్థని వదిలిపెడుతుంది అని అనుకోవటం పొరపాటే కద. పనిలో తీవ్ర ఒత్తిడి, ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా,పెట్టే బేడా సర్దుకుని భారతదేశం వచ్చేయాలా అన్న పరిస్థితిలో దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షు అన్న చందంగా తయారయ్యింది నా ఉద్యోగ జీవితం. టీనేజికి వచ్చిన పిల్లల అజ్ఞానంతో కూడిన అహంభావ ప్రవర్తన వల్ల ఇంట్లో మానసిక క్లేశాలు, ప్రాణ మిత్రుడు అని నమ్మిన వ్యక్తి నన్ను ఆర్థికంగా మోసం చేయటం ఇవన్నీ ఒకెత్తైతే గత రెండేళ్ళుగా నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఒక్కటీ ఒక ఎత్తు.

ఇటీవల నేను చేసే ఏ ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వకపోగా బెడిసికొడుతోంది. వయసు నలభై దాటడం వల్లనుకుంటాను తీవ్రమయిన వెన్నునొప్పి సతాయించటం మొదలెట్టింది. ఆందోళన కారణంగా బోలెడు ఇతర ఆరోగ్య సమస్యలు. భయపడ్డంతా అయ్యేలా ఉంది. కంపెనీలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి.

కంపెనీలో నా కళ్ళ ముందరే అనేకమందికి ఉద్వాసన పలికారు. ఏ నాడు మాట పడని నేను పై అధికారులతో చీవాట్లు తినాల్సి వస్తోంది. బ్రతుకుజీవుడా అని రోజులు వెళ్ళదీస్తున్నాను. కంపెనీలో పెద్ద పనికి చిన్న పనికి చీటికి మాటికి భారతదేశం రావాల్సొస్తోంది. ఆరోగ్యం సహకరించినా సహకరించకున్నా ఉద్యోగం ఊడకుండా చూసుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాను.

ఒకసారి ఇలాగే భారతదేశం వచ్చినప్పుడు నేను అనుకోకుండా విజయేంద్ర శర్మగారిని కలిశాను, ఆయన్ని కలవటం చాలా చిత్రంగా జరిగింది.

నేనాయన్ని కలవకుంటే ఈ కథే లేదు.

***

భారత్ వచ్చిన ఒక సందర్భంలో, హైదరాబాద్ లో ఒక మిత్రుడి ఇంట్లో గృహప్రవేశం ఉంటే వెళ్ళాను. అమెరికా నుంచి వచ్చాను కద నన్ను చాలా ఆదరంగా చూస్తున్నారు అక్కడి బంధు మిత్రులందరు.

అక్కడ పూజాదికాలు నిర్వహించటానికి వచ్చిన వేదపండితుడే విజయేంద్ర శర్మ. వయసు మహా అంటే పాతిక మించి ఉండవు. వర్చస్సు ఉట్టిపడుతోంది ఆయన వదనంలో. వయసులో చిన్నవాడే అయినప్పటికీ అక్కడికి వచ్చిన వేదపండితుల బృందానికి ఆయన నాయకత్వ హోదాలో ఉండటం గమనించాను.

అంతకు మించి ఆయనతో ప్రత్యేకమైన పరిచయం కానీ సంభాషించటానికి అవకాశం కానీ కలగలేదు ఆ రోజు.

ఓ రెండ్రోజుల తర్వాత ఒక చిత్రం జరిగింది.

ఒక రోజు మధ్యాహ్నం నేను ఆఫీసులో పని ముగించుకుని గెస్ట్ హవుసుకి వెళుతూ ఉండగా ఆయన దారిలో తారస పడ్డాడు.

ఆయన నన్ను గుర్తు పట్టే అవకాశం లేదు. ఆయన్ని నేను కలిసింది ఒకే ఒకసారి. ఆరోజటి ఫంక్షన్‌కి వచ్చిన అనేక మంది అతిథులలో నేను ఒకడిని అంతే. ఆయన్ని నాకు ఎవరూ ప్రత్యేకంగా పరిచయం చేయలేదు కూడా. ఆయన్ని నేను గమనించానే కానీ ఆయన నన్ను గమనించి ఉండరు. ఆయన ఎదురుపడగానే చిరునవ్వుతో నేను ఆయనకు నమస్కారం చేశాను గౌరవ భావంతో.

ఆయన నాకు మాత్రమే వినపడే స్వరంతో స్పష్టంగా అన్నారు “మీరు ఒకసారి గొందికోనకి వెళ్ళి భూ గంగానమ్మకి ఒడిబియ్యం పెట్టివస్తే అంతా మంచే జరుగుతుంది. కులదేవత అయిన అమ్మవారు అలా ఆలనా పాలనా లేకుండా ఉండకూడదు కద.”

నాకు ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు.

ఆయన ఎవరో అనుకుని నాతో ఏదో మాట్లాడుతున్నారేమో అని అనిపించింది.

“క్షమించాలి. మీరు ఏమి చెబుతున్నారో నాకు అర్థం కాలేదు” అన్నాను. నేనా మాట నిజాయితీగానే చెప్పాను. నేను అలాంటి ఊరి పేరు గానీ, ఆ దేవత పేరు గాని ఎప్పుడు విని ఉండలేదు. పైగా కులదేవత అంటున్నాడు. మా కులదేవత ఎవరో నాకు తెలియదు నిజానికి.

ఆయన నా వంక ఒక సారి తేరిపారా చూసి, స్పష్టమైన కంఠంతో “ఇక్కడికి మా ఇల్లు దగ్గరే. మీకు వీలుంటే రాగలరా” అన్నారు. అందులో ప్రత్యేకంగా అభ్యంతర పెట్టవలసింది నాకు ఏమి కనపడలేదు.

“సరే పదండి” అని ఆయన వెంబడి నడక ప్రారంభించాను.

దారంతా మౌనంగానే ఉన్నాము. ఆయన నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలియదు. నా మనస్సులో రకరకాల ఆలోచనలు కలుగుతున్నాయి. ఈయన నిశ్చయంగా ఎవరో అనుకుని నన్ను పలకరిస్తున్నారు అన్న భావన మాత్రమే ఉంది నా మనసులో.

చాలా చిన్న ఇల్లు అది. డెవలప్ అవుతున్న ఆ కాలనీలో విశాలంగా ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళ మధ్య మొదటి అంతస్తు కూడా లేని ఆ చిన్న ఇల్లు చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉంది ఇంటి వాతావరణం.

చక్కగా విశాలమైన ఖాళీ ప్రదేశం. ఆ ఖాళీ ప్రదేశం మొత్తం పచ్చని చెట్లు. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, వేపచెట్లు, బిల్వ వృక్షం, అనేక పూల మొక్కలు. విశాలమైన ఆ తోట మధ్య చిన్న ఇల్లు.

ఆ తోటలో ఒక చిన్న తులసి వనం. ఆ వనం మధ్యలో మూడు తలలతో దత్తాత్రేయ స్వామి వారి చిన్న పాలరాతి విగ్రహం.

ఒక వారగా చేదబావి. దానిపక్కనే పశువుల పాక. అందులో ఒక ఆరేడు దేశీయ గోవులు. అన్నీ కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నాయి. నాకు తెలియకుండానే ఒక ప్రశాంతత అలముకుంది నా మనస్సంతా.

ఇంటిలోకి వెళ్ళే ముందు ఆయన చేదబావిలోంచి ఒక బొక్కెనతో నీళ్ళు చేదుకుని కాళ్ళూ ముఖం కడుక్కున్నాడు. నేను ఏమి చేయాలో నాకు కాసేపు అర్థం కాలేదు .

ఆయన బావిలోకి మరలా బొక్కెన వేయబోతూ నా వంక అర్థవంతంగా చూడటంతో అర్థం అయింది అది నా కోసమే అని. ఇక చేసేది ఏమి లేక, కాళ్ళకున్న షూస్, సాక్స్ విప్పి, నేను కూడా ఆయన తోడిచ్చిన నీళ్ళతో కాళ్ళు, మొహం కడుక్కున్నాను.

ఈయన అలికిడిని పసికట్టిన ఆవులు అంబా అంటు పలకరించాయి అక్కడి నుంచే. ఈయన వాటి వద్దకు వెళ్ళి ప్రేమగా వాటి మెడ నిమిరి ఏదో మాట్లాడి, ప్రేమగా నాలుగు పచ్చగడ్డి పరకలు వాటి నోటికి అందించి వచ్చాడు.

నేను అలాగే కొబ్బరి చెట్టు కింద నిల్చునే ఉన్నాను. అక్కడి ప్రశాంతతని మాటల్లో చెప్పలేను. నగరం నడిబొడ్డులో ఇలాంటి ఆశ్రమ వాతావరణాన్ని నేను కలలో సైతం ఊహించలేదు.

ఈలోగా వర్చస్సు ఉట్టి పడుతున్న ఒక నడి వయస్కురాలు ఇంటి తలుపు తీసింది. ఆయన, నేను ముందు గదిలోకి ప్రవేశించాము.

ముందు గదిలో టేబుల్, కుర్చీలు వంటి ఆధునిక ఫర్నిచర్ ఏమీ లేదు. చక్కగా చాపలు పరచి ఉన్నాయి విశాలమైన ఆ గదిలో.

గూట్లో దత్తాత్రేయస్వామి వారి పాలరాతి విగ్రహం, ఆ విగ్రహానికి ముందు నిశ్చలంగా వెలుగుతున్న నేతి దీపం. గాలి వల్ల ఆ దీపానికి ఇబ్బంది కలగకుండా ఓ గాజు చిమ్నీ, ఆ గాజు చిమ్నీని పట్టి ఉంచే ఓ ఇత్తడి కవచం.

గదిలో ఒక మూలగా చిన్న టీపాయ్ లాంటిది ఉంది. అది ఏటవాలుగా పూర్వం సినిమాల్లో కరణాల దగ్గర గుమాస్తాలు వ్రాసుకునే లాంటి చిన్న టేబుల్ లాగా ఉంది.

ఆ గదిలో జీవకళ ఉట్టిపడుతున్న దత్తాత్రేయ స్వామి పటం కూడా ఒకటుంది. అవి మినహా పెద్దగా చెప్పుకోదగ్గ వస్తువులు ఏమి లేవు. ఆ గదిలో ఫాన్, ఏసీ లాంటి సౌకర్యాలు లేకున్నా, వాతావరణం చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది.

ఇందాక తలుపుతీసిన స్త్రీ ఒక రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని వచ్చింది మేము త్రాగటానికి.

“అమ్మా నువ్వు భోంచేయి. నేను రావటానికి కాస్తా సమయం పడుతుంది.” అని ముక్తసరిగా చెప్పి ఆమె వంక భావ రహితంగా చూస్తుండిపోయాడు. వారిద్దరి సంభాషణ సంస్కృతంలో సాగుతుండటం గమనించాను.

ఆమె నా వంక చూస్తూ వెళ్ళిపోయింది. ‘మంచి ఆకలి పొద్దప్పుడు వచ్చి నా కొడుకుని భోంచేయకుండా అడ్దు పడుతున్నాడు’ అన్న భావన కనపడింది ఆమె వదనంలో నాకు.

ఆమె వెనుకే తలుపేసి ఈయన వచ్చిఆ పొట్టి బల్ల ముందు, కూర్చున్నాడు చాపపై. నన్ను కూర్చోమని దయ వర్షించే కళ్ళతో చెప్పాడు.

ఈయనెవరో పూర్తిగా తెలియదు. నన్ను ఎందుకు పిల్చుకువచ్చాడో తెలియదు. ‘మీరెళ్ళి భోంచేసి రండి’ అని చనువు తీసుకుని చెప్దామంటే అసలు నేను అక్కడికి ఎందుకు వచ్చానో నాకే తెలియదు.

“మీ పరిస్థితి నాకు అర్థం అయింది. మీరు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కూర్చోండి. అన్నీ చెబుతాను. అమ్మ దయ ఉంటే అన్నీ అవే కల్సి వస్తాయి ఇలాగే” నా గురించి ఆయనకు ఏమర్థమయిందో కానీ, నాకయితే ఆయన మాటలు అర్థం కావటం లేదు.

’మీ స్వగ్రామం గొందికోన. ఇది రాయలసీమలో ఉంది. మీ పెద్దలు కొన్ని తరాలుగా కర్ణాటకలోని షిమోగాలో స్థిరపడి పోవటం వల్ల మీకు ఎవ్వరికీ ఈ గొందికోనతో సంబంధాలు లేవు.

ప్రతి ఒక్కరికీ ఇంటి దేవుడు, కులదేవత అని ఉంటారు. ఈ గొందికోన దగ్గరే ఉన్న వేయినూతులపల్లి లోని వెంకటేశ్వర స్వామి మీ ఇంటి దేవుడు. కానీ మీ కుటుంబాలకు ఈ సంగతి తెలియదు. మీ ముత్తవ్వ ద్వారా తెలియాల్సిన ఈ విషయాలు ఆవిడ ఎవ్వరికి చెప్పకుండా దాచేసింది” ఆయన ప్రశాంత వదనంతో చెప్పుకుపోతునే ఉన్నారు.

నా అయోమయం పతాక స్థాయికి చేరుకుంది.

నా ఉద్యోగ జీవితంలోని ఒడిదుడుకులు, టీనేజి పిల్లల ఆగ్రహావేశాలు-వితండవాదాలతో నేను పడుతున్న తిప్పలు, నా ఆర్థిక ఇబ్బందులు, నా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఒక్కటొక్కటిగా ఆయన ప్రత్యక్షంగా చూసిన వాడిలా చెబుతూ ఉంటే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

మొన్నటి దాక ఒక్కసారి కూడా నేను ఏనాడు చూడని వ్యక్తి, నాకేమాత్రం పరిచయం లేని ఈ పాతికేళ్ళ మనిషి, నా జీవితంలోని అన్ని పార్శ్వాలను ఏకరువు పెడుతూ ఉంటే నోరెళ్ళబట్టి వినటం మినహా నేను ఏమి చేయలేకపోయాను.

నేను వింటూ ఉండిపోయాను.

“మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నారు?” చివరికి గొంతు పెగల్చుకుని అడిగాను

“మీకు చెప్పటం నా ధర్మం. నాకు ఇవన్నీ ఎలా తెలుసు అన్నది అంత ప్రాముఖ్యమయిన విషయం కాదు కానీ, ఇవన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానో చెబుతాను” ఆయన ఆగాడు కాసేపు

ఆ గదిలో గాలి స్తంబించినట్టనిపించింది నాకు కాసేపు.

“మీరు వీలయినంత త్వరగా ఒక సారి గొందికోనకి సతీ సమేతంగా వెళ్ళి, ఆ గుడిని సందర్శించండి. అమ్మవారికి ఒడిబియ్యం పెట్టండి. అక్కడ గుడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మీ ఆర్థిక స్థితి అనుకూలించిన తర్వాత ఆ ఆలయాన్ని వీలయినంత మెరకు పునరుద్ధరిస్తామని అమ్మవారికి విన్నవించుకోండి. అక్కడికి సంబంధించి ఏమి చేసినా మీరు మాత్రమే చేయగలరు. ఆ పద్దెనిమిది కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఆలయానికి ఏ ఇబ్బందీ లేకపోయేది”

‘ఏ పద్దెనిమిది కుటుంబాలు?’ అసలు ఏమి మాట్లాడుతున్నాడు ఈయన?

అలా చెబుతున్న ఆయన వంక విస్తుపోయి చూశాను.

నేను నాస్తికుడిని కాను. అలా అని చెప్పి విపరీతమైన పిచ్చి భక్తితో మొక్కులు, పొర్లు దండాలు, దీక్షలు స్వీకరించేటంతటి భక్తుడినీ కాను. మనకు తెలియని ఏదో ఒక అద్భుత శక్తి ఈ ప్రపంచాన్ని, మన జీవితాల్ని శాశిస్తోంది అనయితే విశ్వసిస్తాను. మనకి లభించిన ఈ చిన్ని జీవితాన్ని ఆనందంగా నలుగురికీ సహాయపడుతూ నవ్వుతూ నవ్విస్తూ, తెలిసి ఎవ్వరికీ కీడు చెయకుండా జీవిస్తే సరిపోతుంది అని భావిస్తాను. నాలాంటి వారిని ఇంగ్లీష్‌లో ‘ఆగ్నాస్టిక్ థీయిస్ట్’ అని అంటారట, ఇటీవల ఏదో వాదప్రతివాదాలలో ఒక మిత్రుడు చెప్పాడు.

“ఇదంతా మీకు ఎలా తెలుసు? నా స్వగ్రామమేదో నాకు మా పెద్దలే చెప్పలేకపోయారు. మీరు గానీ ఆ గొందికోన ఆలయాన్ని అభివృద్ది చేయటానికి ఇలా కొత్తరకం టెక్నిక్ వాడి నాలాంటి వాడిని వెర్రిగొర్రెని చేద్దామనుకుంటున్నారా?” కాస్తా మాట తూలాను, ఇటీవల ఎన్నో కొత్త రకాల మోసాల గూర్చి వింటూనే ఉన్నాం కద. అందువల్ల ఆయన మీద అనుమానమే వచ్చింది నాకు.

అప్పుడు చెప్పాడు ఆయన “గోదావరి జిల్లాలో నేను వేదం చదువుకున్నఅగ్రహారం, ఇప్పుడు నివసిస్తున్న హైదరాబాద్ మినహాయించి ఏ ఊరు చూడలేదు. ఈ గొందికోన ఎక్కడుందో కూడా నాకు తెలియదు” నాకు వెన్నులో ఏదో జర జర ప్రాకినట్టయింది.

“తెలియందే ఇంత సేపు అలా మాట్లాడారా? మీరలా చెప్పేస్తే నమ్మేస్తామా?” కాస్తా వెటకారంగానే, మేకపోతు గాంభీర్యంతో అన్నాను.

నా మాటలు చివుక్కున గుచ్చుకున్నాయి ఆయన మనస్సుకి అని అర్థం అయింది. ఆయన కళ్ళు మూసుకుని, కాసేపు బలంగా ఊపిరి పీల్చి వదిలి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకున్నారు.

ఆయన ఉన్నట్టుండి ఇలా అన్నారు “మీరు గత నెల ఇరవై రెండో తేదీ మంగళవారం మధ్యాహ్న సమయాన, అమెరికాలో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి, విరమించుకున్న విషయం నిజమా కాదా?”

నా కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్టయింది. తమాయించుకుని స్థిరంగా కూర్చోవటానికి కాస్తా శ్రమ పడాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా నిజం. ఆ సమయంలో నేను తప్పు రెండో ప్రాణి లేదు ఇంట్లో. ఇది కూడా వేలాది మైళ్ళ దూరంలో అమెరికాలో నా స్వగృహంలో జరిగింది. ఇది ఈయనకి తెలిసే అవకాశమే లేదు. కనీసం నా శ్రీమతితో కూడా ఈ విషయాన్ని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు.

“అవును మీరు మీ శ్రీమతితో కూడా ఈ విషయం ఎప్పుడు ప్రస్తావించలేదు” నా మనసులో మాటలు చదివినట్టే చెప్పాడు ఆయన.

అక్కడితో ఆగలేదు ఆయన. నాకు మాత్రమే తెలుసు అని నేను అనుకునే కొన్ని విషయాలు భావ రహితంగా ఏకరువు పెట్టారు.

ఆయన చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి.

ఆయన వదనం లోని తేజస్సు నన్ను ఆపుతోంది కానీ లేకుంటే ఏ భూతమో పూనిందేమో అన్న అనుమానం వచ్చేది. నిశ్చయంగా ఇది దైవ శక్తే అని నాకు రూఢీ అయింది.

ఆయన వంక చూస్తూ ఉండిపోయాను.

“మీ కష్టాలు అన్నీ కూడా అమ్మ కృపకి సంకేతం”

కష్టాలు కృపకి సంకేతమేమిటి? నాకు ఆయన మాటలు అర్థం అవటం మానేసి చాలా సేపే అయింది అని చెప్పాను కద.

“నేను దేవి ఉపాసకుడిని. మిమ్మల్ని తన దగ్గరికి పిలిపించుకోవటానికి అమ్మ నన్ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది . మీ విషయాలు ఏవీ నాకు గుర్తు కూడా ఉండవు.

ఈ విషయం కూడా అమ్మ అనుమతితోనే చెబుతున్నాను. నేను మీ నుండి ఏమీ ఆశించడం లేదు. కష్టాలు కృపకి సంకేతం ఏమిటి అని కద ఇందాక అనుకున్నారు. మీరు గొందికోనకి వెళితే తెలుస్తుంది. అమ్మ ఆగ్రహించిన వారి పరిస్థితి ఎలా ఉంది అన్న విషయం మీకు గొందికోనకి వెళ్ళాక తెలుస్తుంది. అప్పుడు ఒప్పుకుంటారు అమ్మ మీపై కృప చూపుతోందో, లేక కష్టపెడుతోందో. ఇక మీరు బయలుదేరవచ్చు”

అలా చెప్పేసి ఆయన నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఇంకేమి మాట్లాడటం లేదు.

ఆయన వంక చూడాలి అంటే ఏదో సంకోచంగా ఉంది నాకు.

“గొందికోన ఏ జిల్లాలో ఉంది? ఎలా వెళ్ళాలి?” అని అడిగాను చివరికి.

“నాకూ తెలియదు. అమ్మ ఏమి చెప్పమందో అంత మేరకే చెప్పాను. నాకు అంతకు మించి ఏమీ తెలియదు” అని నిజాయితి నిండిన కంఠంతో చెప్పారు.

“నాకు జాతకాలు చూడటం, శుభకార్యాలు నిర్వహించటం మాత్రమే తెలుసు. కానీ దయతో అమ్మ అప్పుడప్పుడూ నాకు కనిపించి ఏదయినా చెబుతుంది. నేను నేర్చుకున్న విద్యలన్నీ కూడా అమ్మ నేర్పించినవే. నేను తనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఆమె కనిపించదు. ఆమె ఏదయినా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే నాకు కనిపిస్తుంది. మీరు ఆమె చెప్పినట్టు చేయండి.

ఈ గొందికోన ఎక్కడ ఉందో గూగుల్‌లో చూసి వెళ్ళటమే.” అని నవ్వేశారు ఆయన.

నేను బయలుదేరబోయేలోగా, ఆయనే హఠాత్తుగా “రండి ఎండన పడి వచ్చారు. భోంచేసి వెళుదురు కానీ” నన్ను వాళ్ళింట్లో భోజనానికి ఆహ్వానించారు. ఆకలి పొద్దున ఆ ఇంట రుచి చూసిన భోజనం అమృతోపమానంగా ఉంది. అక్కడ తినింది సాధారణమైన ఆకుకూర పప్పు, గోంగూర పచ్చడి, చారు, ఆవుపాలతో తయారైన మజ్జిగ.

అయిదు నక్షత్రాల హోటళ్ళలో వేలాది రూపాయలు ఖర్చుపెట్టినా అటువంటి భోజనం లభించదు.

ఆ రోజు నాకు ఎదురైన అనుభవాల్ని నేను ఎన్నడూ మరచిపోలేను బహుశా.

***

అనుకోకుండా జరిగిన ఆ భేటీ తర్వాత నేను కొన్ని రోజులకు అమెరికా వెళ్ళిపోవటం జరిగింది.

ఆయన మాటలు నా మీద చాలానే ప్రభావం చూపాయి. ఈ విషయాన్ని నా శ్రీమతికి కూడా తెలిపాను. తను కూడా నాలాగే ఆశ్చర్యపోయింది.

నేనీలోగా గూగుల్‌లో బాగా వెదకి ఈ గొందికోన గూర్చి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. చిత్రంగా ఇంచుమించు ఆ పేరుని పోలిన మూడు పల్లెలు ఉన్నాయి. అన్నీ ఒకే జిల్లాలో ఉన్నాయి.

గూగుల్‌లో ఆ దేవత గూర్చి గానీ, గుడి గూర్చి గానీ ఏమి వివరాలు తెలియలేదు. కాస్త పనుల ఒత్తిడి నుంచి తీరిక దొరకగానే నేను చేసిన మొదటి పని సతీ సమేతంగా హైదరాబాద్ బయలుదేరడం.

వెయ్యినూతులపల్లె చుట్టుపక్కలే ఉన్న గొంది అనే పేరు ఉన్న గ్రామాలు ఒకటొకటిగా చూసుకుంటు మా అన్వేషణ మొదలుపెట్టాము. ఈ అన్వేషణలో మాకు ఎదురైన అనుభవాలు వ్రాస్తూ పోతే ఒక నవలే అవుతుంది. అంతటి విస్తృతి ఉన్న అనుభవాల సమాహారం అది. మాకు కావాల్సిన వివరాలు ఏవీ ఆ రెండు గ్రామాలలో దొరకలేదు.

చివరికి ఈ మూడో గ్రామం బాట పట్టాము.

మెయిన్ రోడ్డు మీద నుంచి లోపలికి ఒక అయిదారు కిలోమీటర్లు ఉంటుంది ఆ గ్రామం అని సూచిస్తోంది రోడ్డుపక్కనున్న మైలు రాయి.

అప్పటికి మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యుంటుంది.

కార్లో ఏసీ ఉండటం వల్ల బ్రతికిపోయాము. రాయలసీమలోని ఎండని మొదటి సారి ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను.

బయటికి దిగినప్పుడల్లా ఆ వడగాడ్పుని తట్టుకోలేకపోతున్నాము.

దారిలో అక్కడక్కడా ఆపుకుంటూ, ఎదురుగా వస్తున్న చాలామంది గ్రామస్తులను అడిగి చూశాము. అలాంటి గుడి గూర్చి గానీ, భూ గంగానమ్మ అనే దేవత గూర్చి గానీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. మా వాలకాన్ని, మా కార్‌ని కాస్తా చిత్రంగా చూస్తున్నారు వారు. మా తెలుగు కూడా వారికి సరిగ్గా అర్థం కావటం లేదనుకుంటాను. కన్నడ యాసతో కూడిన తెలుగు, మీదు మిక్కిలి చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండటం వల్ల మా యాస అదోలా ఉందనుకుంటా.

చివరికి ఓ ముసలాయన ఎదురుగా వస్తుంటే మర్రి చెట్టు కింద కారాపుకుని, అతనితో మాట కలిపాము.

అతడు మా వివరాలు కూలంకషంగా అడిగాడు.

అతని వదనంలో ఒక విస్మయం. ఒక్కో వివరం తెలిసే కొద్దీ అతడు ఉద్విగ్నుడు అవుతున్నాడు.

హైదరాబాద్ లోని పండితుడు చెప్పిన విషయాలు నేను బయటపెట్టకుండా, మా తాత ముత్తాతలది ఈ గ్రామమే అన్నట్టుగా చెప్పుకొచ్చాను.

భూ గంగానమ్మ గుడి దర్శనార్థం వచ్చామని, అమ్మ వారికి ఒడి బియ్యం పెట్టాలనే సంకల్పంతో ఉన్నామని తెలిపాను.

అతను ఎంతో ఉద్విగ్నంగా నా రెండు చేతులు పట్టుకుని, “మా తాత ముత్తాతల కాలం నుంచి మీ కుటుంబానికి రైతులుగా ఉన్నామయ్యా! మా నాన్న, తాతలు నాకు ఇక్కడ జరిగిన ఘోరాలు తెలిపారు.

సామీ! మీ ముత్తాతని అతి కిరాతకంగా ఇక్కడే హత్య చేశారు”

ఆ వృద్ధుడు చెబుతున్న మాటలు విని అయోమయంలో మునిగిపోయాము నేను నా శ్రీమతి. ఎక్కడ మొదలు పెట్టిన అన్వేషణ ఎక్కడ ముగిసింది?

ఏమి సాధించాలని బయలుదేరాము, ఏమి వింటున్నాము? అతను చెప్పుకుపోతున్నాడు

“బ్రహ్మ హత్యా పాతకం ఊరికే పోదు సామి. సుక్షేత్రం లాంటి ఈ భూమి బీడు పడి పోయింది. ఆ రోజులు లేవు, ఆ రాజులు లేరు.

నువ్వు నాలుగో తరం వాడివి. మా తాత చెప్పగా అన్నీ గుర్తే నాకు. మీ అవ్వ మహాతల్లి. మొగుణ్ణి కళ్ళ ముందే చంపితే ఆ మహా తల్లి ఏమి చేయలేక పసి పిల్లల్ని ఇద్దర్నీ చంకలో వేసుకుని ప్రాణభయంతో పరిగెత్తి ఎక్కడికెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో బస్సులూ, రైళ్ళూ కూడా ఇంత ఎక్కువ ఉండేవి కావు. బ్రిటిష్ వారి జమానా అది. ఇంతమంది ప్రాణాలు తీసినా అడిగే నాథుడే లేడు. తమకు పన్నులు వచ్చాయా రాలేదా అని మాత్రమే చూసేవారు. అందుకే ఆ తల్లి పోలీసులను కూడా ఆశ్రయించలేదనుకుంటా. ప్రాణాలు అరచేత పెట్టుకుని, పిల్లలని చంకలో వేసుకుని, చేతికి అందినంత ధనం, బంగారం కొంగున కట్టుకుని కట్టుగుడ్డలతో పారిపోయింది ఆ తల్లి. ఈ నరమేధానికి కారణం ఏ కక్షలు, కార్పణ్యాలు కాదు. కేవలం భూములమీద ఆశ, ఆస్తుల మీద ఆశ.

హతమారిపోయిన ఆ పద్దెనిమిది బ్రాహ్మణ కుటుంబాలు ఎవ్వరికీ ద్రోహం చేసి ఎరుగవు. వారందరూ సద్బ్రాహ్మణులు. ఈ రోజుల్లో బ్రాహ్మలు చెడిపోయారు కానీ ఆ బ్రాహ్మల తీరే వేరు. ఈ గ్రామానికి మంచి చెడు చెప్పి మా పెద్దల్ని సన్మార్గంలో పెట్టేవారు. వారు మనసున్న మారాజులు. మంచి వారికే కష్టాలు వస్తాయేమో. లేదా వారికి మోక్షం వచ్చిందేమో?

అక్కడికీ, ఆ మహాతల్లి అదృష్టవంతురాలు. ప్రాణాలు కాపాడుకుంది. ఇక్కడ నుంచి బ్రతికి బయట పడినది ఆమె ఒక్కతే. ఆ కాళరాత్రి ఒకటి కాదు రెండు కాదు, పద్దెనిమిది బ్రాహ్మణ కుటుంబాలు హతమారిపోయాయి. నిశ్శబ్దంగా భూములు, ఆస్తులు అన్యాక్రాంతమయిపోయాయి.”

ఆ ముసలాయన మాటలు వింటుంటే వెన్నులో ఏదో జర జరా అని ప్రాకినట్టయింది.

వేడిగాలి చెంపల్ని తాకుతోంది.

రోడ్డుకి అటూ ఇటూ దూరంగా కనుచూపు మేరకు ఎడారి లాంటి బీడు భూములు, ఊడలతో కూడిన పెద్ద మర్రి మాను. ఆ స్థలంలో జరిగిన అనేక దౌష్ట్యాలకి మౌన సాక్షిలా ఉంది.

“మీరు వెతుక్కుంటూ వచ్చిన గుడి నాకు తెలుసులే. నేను తీస్క పోయి సూపిస్తా” అంటున్న ఆ ముసలాయన నాకు ఆపద్భాంధవుడిలా కనిపించాడు.

***

అతన్ని కూడా కార్ ఎక్కించుకుని బయలుదేరాము.

అతను చెప్పిన దిశగా కార్ సాగిపోయింది. గ్రామానికి ఇంకో చివరికి చేరుకున్నాం. ఆ తర్వాత కొన్ని వందల అడుగుల దూరం సాగింది మట్టి రోడ్డుపై మా ప్రయాణం.

ఒక దగ్గర రోడ్డు వారగా కార్ ఆపమన్నాడు.

“ఇక ఇక్కడ నుంచి కార్ వెళ్ళదు. నడుచుకుంటూ వెళ్ళాలి” నెమ్మదిగా చెప్పాడు అతను.

కార్ దిగి అతని వెంబడి బీడుపడిన పొలాల మధ్య నుండినడుచుకుంటూ వెళ్ళాము.

దూరంగా ఓ రావి చెట్టు.

ఆ పెద్ద రావి చెట్టు నీడన ఆ గుడి నిజంగానే శిథిలావస్థలో ఉంది. చాలా పెద్ద ఆవరణ. కానీ పోషణ లేక పరమ దీనంగా ఉంది.

గ్రామానికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టున్న, ఆ గుడికి అటు ఇటు చాలా దూరం వరకు చూద్దామంటే కూడా పచ్చని గడ్డి పరక లేదు. హోరుమని వీస్తున్న వడగాడ్పుల మధ్య నిజంగా ఎడారిలో ఉన్నామా అన్నట్టు ఉంది అక్కడి వాతావరణం.

గర్భగుడి సైతం ఆలనా పాలనా నోచుకోక, ధూపదీప నైవేద్యాలు లేక చాలా జాలిగొలిపేలా ఉంది. ఎవరో పుణ్యాత్ములు అప్పుడప్పుడు దీపం వెలిగించి పోతున్నారు అన్న నిదర్శనంగా నూనె చారికలతో నిండి ఉన్న మట్టి ప్రమిదలు, పీఠంపై ఉన్నాయి.

గబ్బిలాలు, బూజు, దుమ్ము ఇవన్నీ చూసి చాలా బాధ అయింది.

మా ఆవిడ క్షణాల్లో నడుం బిగించి, కొంగు నడుములో దోపి, ఆ ముసలాయన సాయంతో కొన్ని కానుగచెట్టు ఆకులతో ఓ చీపురు తయారు చేసుకుని చకచకా అక్కడి ఆవరణని శుభ్రం చేసింది. కార్లో ఉన్న కాన్‌లో ఉన్న నీళ్ళని తెచ్చి అలికింది. ఆ ఆవరణ అంతా నీళ్ళు చిలకరించి రంగవల్లులు అద్దింది.

“ఈ గుడి సామాన్యమయినది కాదు స్వామి. చాలా స్థితిమంతమైనది ఈ గుడి. ఎందరో రాజులు, జమిందార్లు వందలాది ఎకరాలు ఈ గుడికి రాసిచ్చారు. ఈ గుడి చుట్టూ ఉన్న అనేక ఎకరాల పొలాలు, ఈ గ్రామంలో ఉన్న అనేక వందల ఎకరాలు ఈ దేవాలయపు మాన్యాలు సామి. నోరులేని మంచి మనుషులనే చంపి పొలాల్ని, ఆస్తుల్ని అక్రమంగా కబ్జా చేసిన భూ బకాసురులకు శిలయైన ఈ దేవత మాన్యాలను దోచుకోవటం ఎంతపని?

ఆ తర్వాత వాళ్ళు కొన్నేళ్ళు ఏమి సుఖపడ్డారో స్వామీ అంతే. ఇంచు మించు వారంతా వంశ నాశనం అయిపోయారు. వాళ్ళ వారసులు ఎవరో ఒకరిద్దరు భూకామందులుగా ఉంటూ, ఇప్పటికీ అనేక వేల ఎకరాలని తమ పేరిట పెట్టుకున్నారు. ఏమి లాభం స్వామీ, ఏమి పండదు ఇక్కడ. కేవలం వాళ్ళ పాపం పండింది అంతే. గ్రామం యావత్తు కరువున పడింది. ఆ భూ బకాసురులు కాన్సర్ వంటి జబ్బులతో తీసుకుని తీసుకుని చస్తున్నారు.

మీరు పూజ చేస్కోండి స్వామి. మీరు మీ పిల్లలు సల్లగుండాల. నేను ఒక పది నిమిషాల్లో వస్తాను” అంటూ అతను ఆ బీడు పడిన భూముల మధ్య నడచుకుంటు వెళ్ళిపోయాడు.

మా ఆవిడ దీపం వెలిగించి ఒడిబియ్యం ప్రక్రియ చేస్తున్నంత సేపు నేను, నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ కూర్చున్నాను.

నాకు హైదరాబాద్‌లో శర్మగారు చెప్పినప్పుడు అర్థం కాలేదు మొదట.

మాకు ఏర్పడిన ఈ కష్టాలు దేవత కృపకి నిదర్శనం అంటే ఏమిటో అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. మమ్మల్ని ఇక్కడికి రప్పించటానికి మమ్మల్ని జస్ట్ అలెర్ట్ చేసి పిలిపించుకుంది ఆ తల్లి అని.

ఇప్పుడు ఆ ముసలాయన చెపితే తెలిసింది, ఈ గ్రామానికి ఇంత ద్రోహం చేసిన వారి పరిస్థితి ఎలాగ తయారయ్యిందో.

ధర్మ మార్గాన్ని తప్పి, సాటి మనిషిని హింసించే వాడు ఈ భూమ్మీదనే నరకం అనుభవించే పోతాడు. తెలిసి ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు, ఎవ్వర్నీ నొప్పించకూడదు.

కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా అదే ప్రార్థించాను. సర్వే జనా సుఖినోభవంతు అని. “అమ్మా నాకు మంచి స్థితి కల్పించు. నా మూలాల్ని నాకు తెలిపావు. నాకు చేతనయినంతలో ఈ గ్రామానికి, ఈ ప్రజలకు మంచి చేస్తాను, నీ కోవెలని అభివృద్ది చేస్తాను.” అని మొక్కుకుని కళ్ళు తెరచి చూశాను. దేవతా మూర్తి చల్లని చూపులతో చిరునవ్వులు చిందిస్తూ నా వంకే చూస్తు ఉంది. దీపం వెలుగులో ఆమె వదనం ఎంతో తేజోమయంగా ఉంది.

కాసేపు అలాగే ఉండిపోయాను. ఏదో అలికిడి అయితే తల తిప్పి చూశాను.

నా పక్కనే ఇందాకటి ముసలాయన. అమ్మవారి కృప ఆయన ద్వారా ప్రసరించిందా అన్నట్టు, ఒక స్టీలు కారియర్, అరిటాకులు, ఇంకో చేత్తో ఒక బ్యాగు నిండా వేరుశనక్కాయలు, అరటి పండ్లు, మునక్కాయలు, జామ పండ్లు ఇలా ఏవేవో పట్టుకొచ్చాడు.

ఆయన చేతిలో ఉన్న ఇంకో చేతి సంచిని చాలా జాగ్రత్తగా ఒకవారగా పెట్టాడు.

“అయ్యా అందరికి మంచి జరగాలి. అందరూ బాగుండాలి. అందులో నేను, మీరు కూడా ఊండాలి. ఇదే కదయ్యా శాస్త్రాల సారం” అంటూ నిండు మనసుతో ఆకులు పరచి, నీళ్ళు చిలకరించి

“ఎప్పుడు తిన్నారో ఏమో, రండి రండి భోంచేద్దురు గానీ” అని మనసారా పిలిచాడు.

ఆ మండుటెండలో, చల్లటి చెట్టు నీడన, గుడి ఆవరణలో, అరటిఆకులో తృప్తిగా భోంచేశాము.

అప్పుడు తీశాడు ఆ పెద్దాయన, చెట్టు వారగా జాగ్రత్తగా పెట్టిన చేతి సంచిని. ఆ సంచిలో చేయి పెట్టి ఆయన తీసిన వస్తువులని చూసి మా సంతోషానికి అంతే లేకపోయింది. ఆయన బయటకి తీసిన వస్తువులు వేరే ఏవో కావు, మా ముత్తాతల కాలం నాటి ఫోటోలు.

ఆయన తన చేతి సంచి నుంచి తీసిన పాత ఫోటో ఫ్రేముల వంక భయభక్తులతో చూస్తుండిపోయాము. అవి ఎంత పాతగా ఉన్నాయంటే కాస్త గట్టిగా పట్టుకుంటే పెళుసుగా ఉన్న ఆ చెక్క ఫ్రేం ఊడి వస్తుందేమో అన్నట్టుగా ఉన్నాయి.

భోంచేసి సేద తీరుతున్న మేము ఆయన తెచ్చిన పాత ఫోటో ఫ్రేంలు చూసి ఆనందాశ్చర్యాలలో మునిగి పోయాము. ఎండలో ఆ ఆకలి పొద్దు కడుపు నిండా తిండి పెట్టి మా శరీరాలకి, ఆ ఫోటోలని తీసుకువచ్చి మా ఆత్మలకి అతను ఆనందం కలిగించాడు.

ఆయన తీసుకువచ్చిన ఫోటోలు వెలకట్టలేనివి.

ఇంతటితో నా అన్వేషణకి ఒక అర్థం పరమార్థం సిద్ధించినట్టయింది.

వాటిలో ఫ్రేం కట్టబడ్డ ఒక ఫోటో నన్ను ఎక్కువ ఆకట్టుకుంది.

చుట్టూ చెక్క ఫ్రేం మధ్యలో మసకబారిన గాజు పలక. వర్షం నీరు పడి, బూజు పట్టి కాలక్రమేణా ఆ ఫోటో మొత్తం కావిరంగుకి తిరిగింది.

అయినప్పటికీ ఆ మసక అద్దంలోంచి కూడా తేజస్సు ఉట్టి పడుతున్న పండితోత్తముడి ఫోటో చూడంగానే ఆప్యాయత పొంగి పొర్లింది నాలో. ఆయన మా ముత్తాతగారని చూడంగానే అర్థం అవుతోంది. సైడ్ పోజులో నించుని ఉన్న ఆ మూర్తిని ఎంత చూసినా తనివి తీరటం లేదు.

‘మీరు అచ్చు గుద్దినట్టు మీ తాతగారి పోలికే’ పక్కనుంచి నెమ్మదిగా అంటోంది శర్వాణి. తాతగారి నుదుటిన పెద్దకుంకుమ బొట్టు, విభూతి రేఖలు, ఆత్మ విశ్వాసం ఉట్టిపడుతున్న కన్నులు, శిరస్సు వెనుక భాగాన శిఖ.

ఫోటో కింది భాగాన ఆయన పేరు. ఆయన పేరుకి ముందర మా వంశ నామము. నాకు ఏదో తెలియని ఉద్వేగం కలుగుతోంది. నాకు తెలియకుండానే నా కళ్ళు కన్నీటితో మసక బారాయి.

ఓదారుస్తున్నట్టుగా నా భుజం మీద చేయి వేసి మృదువుగా తడుతోంది శర్వాణి.

ఆయన తీసుకు వచ్చిన ఆ అయిదారు ఫోటో ఫ్రేంలు నన్ను ఎక్కడికో తీస్కువెళుతున్నాయి.

“ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడింది మీ కుటుంబం మాత్రమే స్వామీ. అది కూడా ఆ మహాతల్లి ధైర్యం చేసి ఆ అర్ధరాత్రి అలా పారిపోవటం వల్ల సాధ్యమయ్యింది. మా తాతల కాలం నుంచి ఎదురు చూస్తున్నాము. మీ వంశం వారు ఏదో ఒక రోజు వచ్చి ఇక్కడ అన్వేషిస్తే ఈ ఫోటోలు ఇవ్వాలని ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ ఫోటోలు వస్తూనే ఉన్నాయి మా ఇంట్లో. ఇక నా బాధ్యత అయిపోయింది స్వామి” వినయంగా చెబుతున్న ఆ వృద్ధుడి వంక ఆప్యాయంగా చూస్తూ, అతన్ని మనసారా కౌగిలించుకున్నాను.

అమ్మవారి విగ్రహం దీపం వెలుగులో నవ్వుతూ మా వంక చూస్తోంది.

Exit mobile version