Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎదలో తెలుగు ఎలమి ఉంటేనే అచ్చతెలుగు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ఎదలో తెలుగు ఎలమి ఉంటేనే అచ్చతెలుగు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ఒకరు ఏది చేస్తే గొర్రె దాటులా అదే త్రోవన అలాగే చేయటం సాజమే! మొదట ఆ చేసినవాడే ఒళ్ళు దగ్గరున్నవాడైతే చెడు కమ్ముకోకుండా ఆగుతుంది.

వ్రాయితలు గొర్రెదాటు వెర్రిని మీరినవారుగా ఉండాలి. సొంత బుర్ర లేనివాడికి కైతలు చెప్పే చెల్లుబడి ఎలా ఉంటుంది..?

ఒక్కోసారి, ఒక్కో నాడునిబట్టి, ఒక్కో వాడుకనిబట్టి ఈ ‘సొంతం’ అనేది వ్రాయితలకు సాగిరాకపోవచ్చు. అయినప్పటికీ సొంత గొంతును విడవకుండా వ్రాయితలు వ్రాతను కొనసాగిస్తూ పోవాలి.

ప్రాకృతం పలుకుబడుల్లోంచి బైటపడి తెలుగు సొంతంగా గొంతు వినిపించటానికి నన్నయ కాలానికి కుదిరినంతే కుదిరింది. తిక్కన ఎర్రనలు నన్నయను మించి సొంత గొంతుకను పెంచుకుంటూ భారతాన్ని తెనిగించే పని పూర్తి చేశారు. శ్రీనాథుడు పాత గొంతుకకీ కొత్త గొంతుకకీ మధ్య సొంత గొంతుక అనే వంతెన వేశాడు.

అన్నమయ్య తెలుగు నుడిని జల్లించి అచ్చమైన తెలుగు మాటల్ని ఏరి సొంత గొంతు అంటే ఏమిటో చవి చూపించాడు. కబ్బం కూర్చాలంటే తెలుగు ఒక్కటే అయితే చాలదనే వారికి చెంపదెబ్బ అన్నంతగా తెలుగుని నింపి ముప్పదివేల పదాలతో వెనకటయ్యకు బువ్వపు బోగం (నైవేద్యం) పెట్టాడు. ఇవ్వాళ అన్నమయ్యకు కొనసాగింపు ఏదీ..?

విజయనగరం ఏలికలు కనుమరుగై ఒరుల పాలనలోకి మనం వెళ్లిపోయాక ఎంత సంస్కృతం వాడితే అంత వాడి కలిగిన వ్రాత అనుకునే వ్రాయితలు పెరిగారు. పొడవైన సమాసాలు వేసి, ప్రాసలు, అనుప్రాసలతో తెగనింపి ఇదంతా తెలుగును పైకెత్తటంగా చెప్పుకునే వాళ్లు ఎక్కువయ్యారు.

ఆంగ్లేయుల ఏలుబడిలో తెలుగుని ఎంత తక్కువ వాడితే అంత మేటి అనుకోవటం ఎక్కువయ్యింది. సంస్కృతం మల్లులు, ఆంగ్లం భీములు అనదగినవారు పెరుగుతూ వచ్చారు. తెలుగెట్లా పోతే మనకెందుకు అనుకున్నవారే ఎక్కువ.

ఇలా అన్నానని కినుకపడవద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు కదా.. ఇప్పటికైనా వీలైనన్ని తెలుగు మాటల్నివాడటం వలననే నుడికాపుకు వీలు కుదుర్తుందనే యావ వ్రాయితల్లో తక్కువగానే ఉంది.

మనం మాట్లాడే తెలుగులో నూరు మాటలకు 60 వరకూ సంస్కృతం మాటలే ఉంటున్నాయి. మిగిలిన నలబైలో ఒరుల నుడువులే ఎక్కువగా ఉండగా తెలుగు మాటలు నూటికి 20 కూడా ఉండటం లేదు. ఒక్క 20 మాటలతో మనం తెలుగు సేవ చేస్తూ 80 మాటల్ని మరుగున పెడుతున్నాం. నుడి ఊడిగం అంటే ఇదా?

పద్యాలను ఈసడించిన తెలివిడి గల పెద్దలు సంస్కృతాన్ని వదలాలని ఒక కదలికను తెలుగులో తీసుకురాలేక పోయారు. కనీసం తగ్గించండని కూడా చిన్న పిలుపు ఇవ్వలేక పోయారు.

తెలుగు మాటలనే వాడతానన్న పొదలిక అరుదయ్యింది. ఆది కుదరాలంటే వ్రాయిత ఎద నిండా తెలుగు నెనరు నిండి ఉండాలి.

తెలుగు పర్యాయపద నిఘంటువు ఉంది మనకి. అందులో ఒక్క తెలుగు మారుమాట (పర్యాయపదం) కూడా లేని మోపుదలలు (ఆరోపాలు) వందలకొద్దీ వున్నాయి. సంస్కృతం మాటకు సరైన, సమానమైన తెలుగు మాటని ఇవ్వటానికి ఈ నిఘంటువు పెద్దగా ఎత్తికోలు చెయ్యలేదు. ఆ చూపు మనవాళ్లకు తక్కువనేదే చెప్పవలసినది ఇక్కడ!

తెలుగున కబ్బం వ్రాయాలంటే అచ్చంగా తెలుగులోనే వ్రాయాలనే తలంపు మొదటగా పొన్నగంటి తెలుగన్న బుర్రలో మెదిలింది. ఆయన పేర్లని బిరుదుల్నీ తప్ప తక్కిన అన్నిసంస్కృతం మాటల్నీ వదిలేసి అచ్చంగా తెలుగులోనే వ్రాస్తానని ‘ఒట్టు’ పెట్టుకుని కొత్త త్రోవన నడిచాడు.

నూటికి 80 వరకూ సంస్కృతం మాటలుంటేనే అది ఎన్నదగిన వ్రాతగా లెక్కగట్టేవాళ్లే ఎక్కువగా ఉండేవారు అప్పట్లో. అలా కాదని పొన్నగంటి తెలుగన్న తాను అచ్చమైన తెలుగున వ్రాస్తాననే చిన్న ఎత్తికోలుని మొదలుపెట్టాడు. అందుకు యయాతి చరితని ఎంచుకున్నాడు. యయాతి శర్మిష్ఠల కథ గురించి మనం చెప్పుకోవలసిందానికన్నా ఆయన తెలుగున లేని మాటలను వాడాల్సి వచ్చినప్పుడు ఎలా నెగ్గుకొచ్చాడన్నదే ఇక్కడ చూడ గలగాలి.

“మున్నెవ్వరు నొడువని యీ
తెన్నిడి, కడు మీఱి, యచ్చ తెనుఁగుం గబ్బం
బెన్నక మీఱఁగున్ జెప్పిన
నిన్నుం బొగడంగఁ గలడే నెలతాల్పయినన్”

ఇంతకు మునుపు ఎవ్వరూ చెప్పని రీతిలో అచ్చ తెలుగులో ఈ కబ్బాన్ని ‘మీరి’ చెప్తుంటే నిన్ను పొగడటానికి అ నెలతాలుపు (చంద్రశేఖరుడైన శివుడు) క్కూడా చేతకాదని ఆయన్ని అందరూ మెచ్చుకునేలా వ్రాస్తాననేది ఆయన పెట్టుకున్న ఒట్టు!

“అగడితలోఁ గెందామర
మొగ్గలు గనుపట్టెఁ జాలమూఁకై చూడం
దగి మున్నీటం దేలుచు
బెగడని వార్వంపు టగ్గిపిల్లలు వోలెన్”

అగడిత అంటే కోట బయట చుట్టూ లోతైన కాలువలా త్రవ్విన కందకం (పరిఖ)లో కెందామరమొగ్గలు (ఎర్రతామర మొగ్గలు) పెద్ద మూకలా బోళ్ళెడన్ని ఉన్నాయిట. చూస్తుంటే అవన్నీ కడలి లోంచి బైటకు వచ్చి బెదురు లేకుండా ఆడుకుంటున్న వార్వంపు అగ్గిపిల్లలు (బడబాగ్ని శిశువులు) మాదిరిగా ఉన్నాయంటాడు.

అచ్చతెలుగున తొలి కబ్బం వ్రాసిన తెలుగన్నకు దక్కిన చోటు కాదన లేనిది. అచ్చతెలుగు మాటల్లో ముప్పాతిక మువ్వీసం ఆయన పుట్టించినవే ఎక్కువ. వాటిలో ఇప్పటికీ కొన్ని వాడకంలో ఉన్నాయి.

తెలుగు నుడికలిమిని (నిఘంటువు) కూర్చిన వారిలో తెలుగు మాట కన్నా సంస్కృత మాటకే పెద్ద పీట వేసి వ్రాసిన వారే ఎక్కువ. నిఘంటు గౌరవం పేరుతోను, గ్రామ్యాలు పేరుతోను చాలా తెలుగు మాటల్ని నుడికడలి తయారుచేసిన వాళ్ళు వదిలేశారు. అయినా అక్కడక్కడా అచ్చతెలుగు మాటలు తళుక్కు మన్నాయంటే వాటిలో పొన్నగంటి తెలుగన్న వాడినవే ఎక్కువ.

తెలుగన్న తరువాత చెప్పుకోదగిన అచ్చతెలుగు రామాయణ కవి కూచిమంచి తిమ్మన్నది! వీరిద్దరికన్నా కొంచెం ముందువాడు కొరవిగోపన్న సింహాసన ద్వా త్రింశిక వ్రాశాడు.

కొరవి గోపరాజు, పొన్నగంటి తెలుగన్న, కూచిమంచి తిమ్మకవి ఈ ముగ్గుర్నీ అచ్చతెలుగు ముమ్మేనులు (ముమ్మూర్తులు)గా చెప్పుకోవాలి! వారి చెమట అగచాటుని మనం పట్టించుకోలేదు.

కొంచెము తీరిక, ఇంచుక కోరిక, రవంత ఓపిక, పిసరంత పొనుపు చవి చూడాలనే యావ ఉంటే చాలు అచ్చతెలుగును చదవటమూ వ్రాయటమూ రెండూ తేలికే! చక్కదనాన్ని మెచ్చుకునే తీరు ఎదలో ఉండాలే గానీ అచ్చతెలుగే ఎక్కువ బుర్రకెక్కుతుంది చదువరికి.

నోరుతిరగని సంస్కృతం మాటలు సంస్కృతం బాగా వచ్చినవారికి ఇంపుగా కనిపిస్తాయి. కొంచెకాడు అనదగిన చదువులేనివాళ్లకి తిరుపతి వేంకట కవుల పద్యాలు నోటికొచ్చినంతగా, వేమన శతకం కంఠతావచ్చినట్టుగా తక్కినవి రాకపోవటాన్ని గుర్తించగలగాలి.

ఆచ్చ తెలుగు వ్రాయితలు సంస్కృత మాటల్ని ఉన్నవి ఉన్నట్టుగా వ్రాడకూడదు కాబట్టి, వాటిని తెలుగు నుడి కట్టుకు తగ్గట్టుగా మార్చుకుని వాడసాగారు. అలా మార్చిన మాటల్నే తద్భవాలంటాం. ఈ తద్భవాలలో ఇప్పటికే పల్లెకారుల నాలుకల పైన కూడా చేరి తెలుగు నుడిలో కలిసిపోయినవి కొన్ని కాగా, వ్రాయితలు ( కవులు) కబ్బంలో పద్యం పూర్తి కావటానికి కొన్ని సంస్కృత మాటల్ని తద్భవాలుగా మార్చి వాడినవీ ఉన్నాయి. (శ, షలు సకారంగా మారడం, సంయుక్తాక్షరాలు అసంయుక్తాలు గానో, ద్విరుక్తాలుగానో మారడం, మహాప్రాణాలు అల్పప్రాణాలుగా మారడం ఇందుకు ఉదాహరణం) వీటిని మనం అచ్చతెలుగులోకి మార్చటం కోసం ఎవరికీ అర్థం కాని తీరున వండటం కన్నా మూలపదాన్ని లేదా తద్భవాన్ని వాడుకోవటం ఉత్తమం. పైన చెప్పిన పొన్నగంటి తెలుగన్న వ్రాసిన తామరపూల పద్యంలో “వార్వంపు టగ్గిపిల్లలు: అనేది ఇలా వాడుకున్న మాటే!

భక్తిని బగితి, లక్ష్మిని లచ్చి, లచ్చిమి ఇలా మార్చటంవలన సంస్కృతాన్ని కొంతవరకూ తెలుగు నుడి తీరును అనుసరించి మార్పు చేసుకున్నట్టవుతుంది.

తెలుగు మాటలు ఏవో, సంస్కృతం మాటలు ఏవో, తత్సమాలు, తద్భవాలు ఏవేవో గుర్తించగలిగితే అచ్చతెలుగులో వ్రాయటం తేలికే! అంతకన్నా ముందు ఎదలో తెలుగు నెనరు, ఎలమి, కూరిమి మోగుతూ ఉండాలి!

Exit mobile version