Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వివాహబంధంపై విశ్లేషణాత్మక నవల ‘ఎదలోపలి ఎద’

[ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘ఎదలోపలి ఎద’ అనే నవలని పరిచయం చేస్తున్నరు శ్రీమతి పుట్టి నాగలక్ష్మి]

వివాహబంధం ఆత్మీయంగా, అనురాగంతో నిలవాలి. కాని అనాదిగా అది ఒక బంధనమయింది. అందులో బందీలయి మానసిక, శారీరక క్షోభకి గురయ్యేవారే ఎక్కువ. ఈ ఆధునికయుగంలో, మారిన మారుతున్న పరిణామ క్రమంలో ఈ క్షోభ కొత్తపుంతలు తొక్కుతోంది. అది ప్రేమ వివాహమయినా, పెద్దలు కుదిర్చిన పెళ్ళయినా సమస్యలు సమస్యలుగానే మిగులుతున్నాయి.

ఈ హైటెక్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి చెందింది, దీనికి సంబంధించిన టి.వి. ఛానల్స్, ముద్రణారంగంలోను చాలా ఎక్కువ మార్పులు సంభవించాయి. ఈ రంగాలలో పనిచేస్తున్న మూడు జంటల జీవితంలో ఎదురైన సమస్యలను ఆధునిక దృక్కోణంలో పరిశీలించి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అందించిన విశ్లేషణాత్మక నవల ‘ఎదలోపలి ఎద’.

ఇందులో మనకి మూడు జంటలు కనిపిస్తాయి. రెండు జంటలు వివాహం చేసుకుని సమస్యలతో సతమత మయ్యేవి. మూడో జంట పెళ్ళి వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకుని, సహజీవనాన్ని ప్రారంభించి, ఎదురయిన సమస్యలను భరించలేక పెళ్ళి చేసుకున్న జంట.

సకల ఒక టి.వీ ఛానెల్ యాంకర్. ఆ ఛానెల్ అనుబంధ పత్రికలో పనిచేస్తాడు ఆమె భర్త శైలేష్. ఎదుగుతున్న భార్యని చూసి ఆత్మ న్యూనతాభావాన్ని పెంచుకుంటాడు అతను. తన ఎదుగూ బొదుగు లేని ఉద్యోగంలో ఇమడలేక, వేరే సంస్థలోకి వెళ్ళడానికి మనస్కరించక ఆలోచనలో మునిగి, చివరికి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి చిన్నస్కూలు పెట్టి, ఆమెని కూడా వచ్చెయ్యమంటాడు. కాని సకల నిరాకరించి తన యాంకరింగ్ పనిలోనే ఎదిగి తల్లిదండ్రులతో కలసి ఉండి పోతుంది.

వైవిధ్య టి.వి సీరియల్ సింగర్, ఆమె భర్త వాస్తవ్ చిరుద్యోగి, కాలక్రమంలో మంచి ఉద్యోగంలో చేరతాడు. వైవిధ్య తన కెరీర్లో పైపైకి ఎదుగుతున్న క్రమంలో పిల్లలని కనాలని, ఇల్లు చూసుకుంటే చాలని ఒత్తిడి తెస్తాడు వాస్తవ్. కుటుంబాన్ని వదులుకోలేక రాజీ పడి గృహిణిగా, తల్లిగా స్థిరపడుతుందామె,

ఇక ఈ నవలలో అతి ముఖ్యపాత్రలు విరజాజి, హరిశ్చంద్రలు, విరజాజి తన అమ్మానాన్నల వివాహ జీవితంలోని గొడవలు, తమ బంధువులలోని గృహిణుల బాధలు, వెతలు, స్నేహితుల కుటుంబాలలో స్నేహితురాళ్ళ బాధలను చూసి, విని పెళ్ళి పట్ల విముఖతతో ఉంటుంది.

హరిశ్చంద్ర కూడా అంతే. తన తండ్రితో తల్లి పడిన మానసిక వేదన, పెళ్ళిళ్ళయి బాధలు పడుతున్న స్నేహితులను చూసి, వివాహం పట్ల అయిష్టతని పెంచుకుంటాడు.

వీరిద్దరూ ఒక కవి సమ్మేళనంలో పాల్గొని, కలసి ఆస్వాదించిన తరువాత- పరస్పరం తమ కవితలను మెచ్చి మిత్రులవుతారు, సాహితీ చర్చలు, వివిధ విషయాలను చర్చల ద్వారా స్నేహితులై – సన్నిహితులవుతారు. ఒకరిని గురించి ఒకరు పరస్పర అభిరుచులు, అభిప్రాయాలు, అనుభూతులను పంచుకుంటారు. అంతే కాదు అప్పుడప్పుడు చిరుచిరు అలకలు, బ్రతిమిలాటలు సరదాగా సాగుతాయి.

శ్రీశ్రీ గారన్నట్లు మనసున మనసై-బ్రతుకున బ్రతుకై-తోడొకరుండిన అదే భాగ్యమూ-అదే స్వర్గమూ! అన్న చందాన మనసులు కలవడం-ఎదలోపలి ఎద సవ్వడులను విన్నవించుకోవడం సహృదయ పాఠకులకు ఆహ్లాదాన్నందిస్తుంది.

వీరిరువురి సంభాషణలలోని హాస్యోక్తులు, సాహితీ సంబంధ విషయాలు, వెటకారాలు, సున్నితమైన ప్రేమానుభూతులను రచయిత్రి పాఠకుల మనసులను దోచే రీతి సరస, హాస్యసంభాషణలలో వెలయించారు.

ఒకరి కొకరు మనసున మనసై కలబోసుకున్న వీరి ఎదలోపలిఎద సవ్వడులు వీరిని సహజీవనం వైపు మళ్ళించాయి. కొంతకాలం హాయిగా, ప్రశాంతంగా తాము అనుకున్నట్లే సాగించారు, కాని చివరకు పెళ్ళిచేసుకోక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ పరిస్థితులేమిటి? వీరి పెళ్ళికి దారి తీసేటందుకు వారికి ఎదురయిన అనుభవాలను తెలుసుకోవాలంటే నవల చదివి తీరవలసిందే!

ఈ నవలలో మూడు జంటలు కథలతోపాటు ఇంకా చాలా విషయాలను గురించిన చర్చలు కన్పిస్తాయి. సినిమాలకి సంబంధించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్లు జరిగే తీరు, సినిమా సీనియర్ హీరోల ఇంటర్యూలు తదితర విషయాలను.. టి.వి సీరియల్స్, టీ.వీ ఛానల్స్‌కు సంబంధించిన చర్చలను వివిధ పాత్రల మధ్య సృష్టించారు.

***

విరజాజి, హరిశ్చంద్రల మధ్య జరిగిన సాహితీ విషయక చర్చలు, వారు వ్రాసుకున్న కవితలు, వివిధ సందర్భాలలో తన సమకాలీన కవులు, కవయిత్రుల కవిత్వాన్ని పాత్రల ద్వారా ప్రస్తావింపజేసి తన సాహితీ ప్రియత్వాన్ని చాటుకున్నారు రచయిత్రి.

అక్కడక్కడా కనిపించే చిన్నచిన్న పాత్రల ద్వారా వివాహబంధాలు, బంధనాలు, విడాకులకు సంబంధించిన చర్చలు పాఠకులని ఆకర్షిస్తాయి.

వివిధ దర్శనీయ ప్రదేశాలకు వెళ్ళినపుడు ఆయా ప్రాంతాల భౌగోళిక, చారిత్రక అంశాల వివరణ పాఠకులకి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించి వాటిని దర్శించాలని ఆకాంక్ష కలుగుతుంది.

ఇంకా మరిన్ని విషయాలను పొందుపరిచి వ్రాసిన ఈ నవల సహృదయ పాఠకుల మనసులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

***

ఎదలోపలి ఎద (నవల)
రచన: శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 167
వెల: ₹ 75
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643

 

Exit mobile version