[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘ఏది అచ్చతెలుగు?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలుగు మాటల్ని 1. సంస్కృతానికి చెందిన తత్సమాలు, 2. సంస్కృతంలోంచి పుట్టిన తద్భవాలు; 3. అచ్చంగా తెలుగులో పుట్టిన దేశ్యాలు, 4. కొద్దివాళ్లు మాట్లాడే గ్రామ్యాలు ఇలా వేరు చేసి ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు.
మనం మాట్లాడే లేదా వ్రాసే తెలుగు మాటల్ని లెక్కబెడితే, నూటికి 60కి పైగా సంస్కృతం మాటలే ఉన్నాయి కాబట్టి, ఈ వరుసలో తత్సమాలు తద్భవాలను ముందు చెప్పి, అచ్చతెలుగు మాటలకు మూడో చోటునిచ్చారు. తెలుగు మాటల్ని ఇలా తక్కువ చేయటం అవుతోందని, ఇది కూడదని ఆనాటివాళ్లకు తట్టలేదు! ఇది వెయ్యేళ్లుగా సాగుతూ వచ్చిన తంతు.
తెలుగు నుడిపాటింపులు (భాషాసంప్రదాయాలు), నుడిమార్పులు (భాషాపరిణామాలు) లోతైన చూపున పెట్టుకుని చేసిన పని ఈ పని చేయలది, సంస్కృతానికి పెద్దపీట వేయటం కోసమే చేశారని 1968 మార్చి భారతిలో “తెలుగు-సంస్కృతము” పేరున నిడుదవోలు వెంకటరావుగారు కటిక చేదుగానే వ్రాశారు.
తెలుగు మాటల్లో తత్సమాలు మొదటి మాట ఎలా అవుతాయని ఆయన నిలదీశారు,
“సంస్కృత పదములను తెలుగు భాషలో మొదటివనుట భాషాస్వభావ విరుద్ధముగదా?” అనడిగారాయన. దీనికి ఈ నాటికీ నుడివేత్తలు బదులివ్వలేదు. దాన్ని పట్టించుకోవలసినదిగా అవాళ్లు ఏనాడూ అనుకోలేదు.
- తెలుగులో ఏర్పడని, తెలుగువి కాని సంస్కృతం మాటల్ని తెలుగుమాటల్లో మొదటగా చెప్పటం మన నుడికి జరిగిన మొదటి అపపాడి (అన్యాయం)
- తెలుగు మాటలకు 3వ చోటివ్వటం రెండవ అపపాడి.
- చదువుకున్నవారి నోట పలికే మాటల్ని దేశ్యం అనీ, చదువులేని కొద్దివాళ్లు మాట్లాడేది గ్రామ్యం అని, అచ్చతెలుగుని మళ్ళీ విడకొట్టి గ్రామ్యాలకు, మాండలికాలకు చివరి చోటివ్వటం మూడవ అపపాడి
వెనకటి ఇలాంటి తప్పుల్ని ఇప్పుడు మనం ఒప్పాల్సిన పనిలేదు. అలాగని అప్పటి నుడివేత్తల్ని పట్టుకుని ఇప్పుడేదో అనాల్సిన పనికూడా లేదు.
ఏది అచ్చతెలుగు
1963లో నిడదవోలు వెంకటరావుగారు అచ్చతెలుగు పలుకులనగా నందఱకు తెలివిడియైన మాటలు. ఉదా: పాలుపెరుగు, నేయి మొదలగునవి.
దేశి పలుకులనగా అచ్చతెలుగులో నొకప్పుడు అందఱకు తెలిసినవై కాలక్రమమున కవి ప్రయోగము వలన గ్రంథస్థము లైనవి. ఉదా: ఎఱకువ (తెలివి), వేనలి (జడ)
నిడుదవోలు వారి ఈ విరివివ్రాత కేవలం వ్రాత కాదు, తెలుగును తక్కువ చేసేవారికి పెట్టిన వాత! ఆయన వ్రాతని బట్టి తెలుగు మాటలంటే, వాడకంలో ఉన్నవీ, వాడకం మరిచిపోయినవీ అని రెండు రకాలు. ఈ రెండింటిలో వాడ్కంలో ఉన్నవాటిని అచ్చతెలుగనీ మరిచిపోయి కబ్బాలలో బతికున్నవి దేశ్యాలని ఆయన తలంపు.
మనవైన తెలుగు మాటలుకొల్లలుగా ఉండగా వదిలి మనం సంస్కృతాన్నో ఆంగ్లాన్నో పట్టుకుని గబ్బిలం లాగా వ్రేలాడవలసిన పని లేదు! ఒక పాడుబడిన మేడలో వందలాది గబ్బిలాలు చేరి చూరు పట్టుకుని వ్రేలాడుతుంటాయి. ఒక గబ్బిలం వ్రేలాడే చోట ఒక చిన్న చుక్క పెడితే ఆ గబ్బిలం తిరిగొచ్చి మళ్ళీ ఆ చుక్క ఉన్న చోటే వ్రేలాడుతుంది. మనం కూడా మనవి కాని మాటల్ని పట్టుకుని అలానే వ్రేలాడుతున్నాం!
ఇప్పటి మనం మన తెలుగుకు మిన్నతి కలిగించటానికి ఏం చెయ్యాలన్నదే మన ముందున్న మొదటి పని!
ఇన్నాళ్ళూ నుడికట్టు కబ్బాల్లో ఉన్న వాటిని ఇప్పుడు మన బతుకు తీరుకు వీలైనంతగా మార్పులు చేసుకోవటానికి నడుం బిగించాల్సి ఉంది.
చదువుకున్నా, చదువుకోకపోయినా తెలుగునాట తెలుగువాని నోట పలికే ప్రతీమాటా దేశ్యమే! చదుకున్నవాడు మాటాడేదే దేశ్యం అనటాన్ని మార్చాలని కోరుతున్నాం!
పైగా, తెలుగు కాకుండా ఇతర చదువులు చదివిన వారి తెలుగు ఎనిమిది వంకర్లూ తిరిగి ఉంటుంది. వారు మాడ్లాడే తెలుగు నంతా దేశ్యం అనలేం కదా! కాబట్టి, సంస్కృతంతో చుట్టరికం లేని తెలుగు మాటలన్నీ దేశ్యాలే నని మొదట మనం ఒప్పుకోవాలి.
గ్రామ్యాలను వేరుగా చూపించటం వలన ఇప్పటి మన తెలుగుకు ఒనగూరేదేమీ లేదు.
“లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యంబు” అని చిన్నయ సూరిగారు చెప్పిందాన్ని కూడా మనం ఇప్పటి మన వ్రాతతీరుకు ఒప్పేదికాదని గట్టిగా చెప్పాలి! చిన్నయ సూరిగారిది కబ్బాల బాసకు చెందిన మాట! కానీ, ఇప్పటి వాడుక మాటల కొచ్చేసరికి ఈ కట్టు కుదరదు. బాసని బట్టి నుడికట్టు (లక్షణం) ఏర్పడాలి గానీ, లక్షణాన్ని బట్టి నుడిని కట్టడి చేస్తానంటే కుదరదు.
గ్రామ్యాల్ని, మాండలికాల్ని, కబ్బాలలో వ్రాతరులు పుట్టించిన మాటల్ని, ఏ చదువూ లేని పూర్తి కొంచెగాడు పుట్టించిన దోమలచుట్ట (మస్కిటో కాయిల్), పైవంతెన (ఫ్లై ఓవర్), తవ్వోడ (డ్రెడ్జర్) నిలుపు రెక్క (సిగ్నల్), దారివత్తిడి (ట్రాఫిక్ రద్దీ) ఇలాంటి మాటల్ని కూడా అచ్చతెలుగు మాటలుగానే చెప్పాలి. వాటిని వేరు చేయటం వలన తక్కువచేయటమే అవుతుంది.
మాండలికాలు పల్లె ఉసురు లాంటివి. తెలుగు వ్రాత అనేది పల్లెలకే కూకటిగా చెందినది. కాబట్టి పల్లెపలుకుల్ని లక్ష్ణాల పేరుతో తక్కువ చేస్తే మనం ఒప్పుకోవలసిన అవసరం లేదు.
జరగవలసిందేమిటి?
- అచ్చతెలుగు మాటలు (దేశ్య, గ్రామ్య మాండలికాలు అన్నీ కలగలిసిన మాటలు), 2. సంస్కృతంతో చుట్టరికం ఉన్న తత్సమాలు, 3. సంస్కృతంలోంచి పుట్టిన తద్భవాలు, 4. లాతిపలుకులు (అన్యదేశ్యాలు), 5. ఎరుకమినుకులు (కంప్యూటర్ లాంటి శాస్త్ర సాంకేతిక పదాలు) ఇలా తెలుగులో మనం వాడుతున్న మాటల్ని 5 తీరుల్లో విడమరచి వేరుపరచి చెప్పాలి. అందుకు తగిన కొత్త నుడి కట్టులు (వ్యాకరణ సుత్రాలు ) వ్రాయాలి. తెలుగు నెనరు కలిగిన నుడివేత్తల పని ఇది.
ఇప్పుడు మనం పట్టవల్సిన నోము ఏమంటే మన మాటల్లో వ్రాతల్లో అచ్చతెలుగుని వాడుతూ, మరిచిపోయిన, మరగున పడిన, వెనకటి వ్రాతరులు వాడిన పాత తెలుగు మాటల్ని (దేశ్యాల్ని) తిరిగి వాడకంలోకి తెచ్చి వాటినీ అచ్చతెలుగులోకి మార్చాలి. చివరికి దేశ్యం అంటీ ప్రత్యేకంగా ఏదీ లేదు, అన్నీ అచ్చతెలుగు మాటలే మిగలాలి!
పాత మాటల్ని (దేశ్యాల్ని) పాత తీరునే వాడనవసరం లేదు, వాటిని ఇప్పటికాలపు వాడకానికి తగ్గటుగా కొత్త తలంపులకు ఇమిడిక చేసుకోవచ్చు. మచ్చుకు ఒకటి రెండు చెప్తాను:
అంగమచ్చ/అంగమచ్చము అని ఒక పాత తెలుగు మాట ఉంది. మన “నుడిలిబ్బిపొత్తాలు” (నిఘంటువులు) ఈ మాటకి పుట్టుమచ్చల్లాంటి ఒంటిమీద ఉండే గుర్తులని వ్రాశాయి. కానీ రామాభ్యుదయం కబ్బంలో అయ్యలరాజు రామభద్రుడు పాత తెలుగు మాటలకు కొత్త వాడకాలను చాలాచెప్పాడు. చక్కని తెలుగు మాటలు తెలియాలంటే మనం రామాభ్యుదయం చదవాలి.
సరే! అంగమచ్చని ఆయన “మార్గంబున దైత్యుని యంగమచ్చములు గన్గొని” అంటే అడుగుజాడలు అనే తీరున వాడాడు. పరవస్తు చిన్నయ సూరి మిత్రభేదంలో మరో అడుగు ముందుకేసి “భృత్యుండు ఱేని కోప ప్రసాదముల యంగమచ్చము ‘లెఱిఁగి మెలఁగనేనిఁ దదను గ్రహమునకుఁ బాత్రుఁ డవును” అని దమనకుడిచేత అనిపిస్తాడు.
ఇక్కడ అంగమచ్చ అంటే శరీరం మీద గుర్తులో, అడుగుజాడలో కాదు… మూడడుగుల కొక అడుగు వెయ్యటాన్ని అంగ వెయ్యటం అంటారు. వేగంగా కదలటాన్ని ఈ మాట చాటుతుంది.
ఏలికల దగ్గర బంటుగా ఉండటం అంటే కత్తి మొనమీద గంతులేయటం లాంటిది. ఆంగ్లంలో మూడ్ అంటామే అది తెలుసుకుని ఏలికతో మెలగాలి. ఆయన కినుకమీద ఉన్నాడో, ఉవ్వాయిగా ఉన్నాడో … అంగమచ్చలని ఎరిగి మెలిగే వాడిని ఆ ఏలికగారు చక్కగా ఏలుకొంటారట!
చిన్నయసూరిగారుదీన్నిఅంగమచ్చలెరిగి నడచుకోవాలన్నాడు. దీన్ని ఆంగ్లంలో బోడీ లాంగ్వేజి అంటారు.
మనం ఎవరితోనైనా మాట్లాడేప్పుడు అతనికి మనం చెప్తోంది బుర్రకెక్కుతోందో లేదో అతని అంగమచ్చల్ని (బోడీ లాంగ్వేజీ) బట్టి మనకి ఇట్టే తెలిసిపోతుంది గదా! బోడీ లాంగ్వేజి అనేదానికి ఇక్కడ ఒక తెలుగుమాట దొరికింది. పాతమాటల్ని వెదికి ఇలా కొత్త వాటికి అంటి చెప్పటం అనేది ఇప్పుడు జరగవలసిన పని.
అచ్చతెలుగు కదలికలో ఇదంతా కూకటి (ముఖ్యమైన) చేరిక. అచ్చతెలుగు అనే కదలికకు ప్పుడు మనం కొత్త నిలుపుని ఇస్తున్నాం.
- అచ్చతెలుగంటే ఎవరికీ తెలియని మాటలు కాదు, ఎల్లరూ ఎరిగిన తెలుగు మాటలవి! వాటిని విరివిగా వాడదాం. “టెంపుల్ కెళ్ళి కోకోనట్ బ్రేక్ చేసి రా…” లాంటి వంకరకూడిక (సంకరం) మాటల్ని వదిలేద్దాం.
- వాడకంలోంచి మరుగున పడ్డవాటిని ఏరి తెచ్చుకుని వాటిని ఇప్పటి మన తీరుకు తగ్గట్టుగా వాడుకుందాం.
- ఎరుకమినుకుల్ని (శాస్త్ర సాంకేతిక పదాలు) కుదిరితే అచ్చతెలుగున చెప్పుకుందాం. కుదరనప్పుడు సంస్కృతాన్ని తెచ్చుకోవటం లేదా ఎవరికీ అందని ఏవేవో మాటలతో అచ్చతెలుగు పేరున వంకర మాటలు పుట్టించటం రెండూ ఆపేసి ఉన్న మాటని ఉన్నట్టుగా వాడుకుందాం.
ఎదపెట్టి వ్రాతరులు వ్రాయాలి!
చాలామంది వ్రాతరులు తాముకొద్దివాళ్ల (సామాన్యులు) కోసమే వ్రాస్తున్నామంటారు. కానీ, వాళ్లు వ్రాస్తున్న మాటల్లో ఆ కొద్దివాళ్లకు తెలిసే మాటలు ఎన్ని ఉన్నాయో ఎవరూ వెనక్కి చూసి తలపోయటంలేదు.
ఒక పత్రిక రచనల పోటికి పిలుపునిస్తూ వ్రాసిన ఒక చాటింపు ఇలా ఉంది.
“పోటీ ప్రపంచంలో రోజుకో సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో విద్య వైద్యం, ఆరోగ్యం, కుటుంబ నేపథ్యం, ప్రేమ, సహజీవనం లోని లోటుపాట్లు… సామాజిక సమస్యలు, జరిగే క్రైమ్ వెనుక నేపథ్యం… వైవాహిక సంబంధాల్లో అగాథం, ఆధునిక పోకడలో నేటి యువత, పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయభూములు, స్త్రీ స్వేచ్ఛ-పరిరక్షణ సమస్యలు ఎన్నో… కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు ఆలోచించాలే కాని, ప్రతి సమస్యలకు పరిష్కారం చూపగల అపరబ్రహ్మలు… మన రచయితలు. మనవంతు సమస్యను గుర్తిద్దాం, పరిష్కారం అందిద్దాం.”
ఇలా సాగిన ఆరువరుసల ఈ చాటింపులో ఆరంటే ఆరే తెలుగు మాటలున్నాయి. ఇది ఆ పత్రికని తక్కువ చేయటం కాదు, ఇలా వ్రాయటానికి అలవాటు పడిపోయామని ఎత్తి చూపటం కోసమే! అచ్చంగా తెలుగులో వ్రాస్తే ఎవ్వరికీ అర్థం కాదని ఒక చెడుగడు తలంపు ఏదో మనలో నాటుకుపోయింది.
అచ్చతెలుగులో వ్రాసిన ఒక చాటింపు ఇలా సాగింది:
2026లో కృష్ణాజిల్లా వ్రాతరుల కూటమి వారు నవంబరు 15న బెజవాడ టాగూరు పొత్తముల గుడిలో ‘అచ్చతెలుగు – కొత్త కదలిక’ అనే దానిపైన ఒక చావడి ఏర్పాటు చేశారు. సొంత మోత అనుకోకుండా ఉంటే, దాని చాటింపుని ఇక్కడ ఇస్తున్నాను.
“చేమోడ్పులు! తెలుగు మాటల వాడకం పెరగాలి, తెలుగువి కాని మాటల వాడకాన్ని తగ్గించాలన్నది ఇప్పటి కదలిక. తెలుగును కాపాడుకోవటానికి ఇది కూకటి అనదగిన పని. దీని గురించి అందరమూ కలిసి మాట్లాడుకుందాం. నవంబరు 15 సాయంకాలం 5కి విజయవాడ టాగూరు ‘గ్రంథాలయం’లో ‘అచ్చ తెలుగు – కొత్త కదలిక’ అనే దాని మీద జరిగే చావడికి మీకు పిలుపు. తప్పక రాగోరుతున్నాము.
‘తెలుగు మాటల వాడకమే తెలుగుకు కాపుదల’ అనే దానిపై వ్రాతరులు తమ కైతలు కూడా చదువుతారు. వారికి పెద్దలచే శాలువా మిన్నతి (సత్కారం) ఉంటుంది. మీరు తప్పక రావాలని మరీమరీ కోరిక”.
ఎదపెడితే త్రోవ దానికదే కనిపిస్తుంది. మనం అచ్చతెలుగున చదువరులకు చదువు రానివారిక్కూడా తెలిసేలా వ్రాయవచ్చు. అచ్చతెలుగు వ్రాయటమూ తేలికే, చదవటమూ తేలికే!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
