Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎదుర్కోళ్ళు

[వజ్జీరు ప్రదీప్ గారి ‘ఎదుర్కోళ్ళు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

షాడమాసం కావడం వలన అందరు బోనాలు జేసుకుంటున్నారు.

కొండయ్య ఎక్కడనుండి తెచ్చిండో ఓ మంచి కోడిని తీసుకువచ్చినాడు. అది ఎరుపు పసుపు వర్ణంతో భలే అందంగా వుంది. అది తల పైకెత్తినప్పుడల్లా దాని తల మీది ఎర్రనికుచ్చు చక్కగా ఎగురుతుంది. సందు దొరికితే చాబు దూకుదామని చూస్తుంది.

కోడి మెడమీద నిమిరుతూ “ఏడదెచ్చినవ్ నాయిన” అన్నడు పెద్దన్న.

“ఏన్నో తెచ్చినతీయి బిడ్డ. దాన్ని జెర పైలంగా గంప కిందగమ్ము”

“గట్లనే నాయిన” అని దాన్ని తన చేతులకు తీసుకుని సాయబాన్లకు బోయిండు.

ఎక్కనుంచి చూసిందో గౌరి ఉరికచ్చింది “అన్న నేను పట్టుకుంటనే”అని పెద్దన్న చుట్టు కలెతిరిగింది.

“ష్!.. నాయినింటే లొల్లి బెడుతడే” మెల్లగా నోటికి చేయి అడ్డంబెడుతు జెప్పిండు.

“ప్లీజ్! అన్నా” అంది బుంగమూతి పెడుతూ.

“సరే నేను గంప తీసుకువస్తాను. నువ్ దీన్ని గట్టిగా పట్టుకో”

“సరే అన్నా”

కోడి గౌరి చేతులబెట్టి గంపకు బోయిండు పెద్దన్న.

గంప దెచ్చేటాల్లకే గౌరి చేతులకెల్లి కోడి ఎగిరి సందుగల అర్రలకు బోయింది.

“నేను జెప్పలే అది నీకు ఆగదని నాయినకు తెలిస్తే కోప్పడుతడు. జెర లొల్లిజేయకుండా ఏ తిప్పలో పడి దొరకబడుదాం”అని అర్ర తలుపేసిండు పెద్దన్న.

కో.. కో.. కో అంటు గుర్రుగా చూస్తాంది. దాన్ని ఎలాగైన పట్టుకుంటామనేమో ఓరకంట జూస్తుంది.

పెద్దన్న దిక్కు గౌరి ఓ దిక్కు కూసుండి ఎవరికో ఒకరికి దొరకకబోతుందాయని చేతులతో అందుకోబోయిండ్లు గని అది ఇద్దరు చేతుల నడిమికెళ్ళి కో.. కో.. కో..అనుకుంటా సరం మీదికెళ్ళి అటుకు మీదకెక్కింది. అటుకుమీది తడుకను పెద్దన్న కట్టెతోటి ఊపిండు.

కోడి మెల్లగా కిందికి దిగింది. అట్లనో ఇట్లనో మెల్లగా దొరకబట్టిండ్లు. దాంతో గౌరి మురిసిపోయింది.

పుంజును మెల్లగా గంప కింద కమ్మిండ్లు.

యాదమ్మ దేవునింట్ల బోనంకు కావలసినవి తయారుచేస్తుంది.

“పెద్దోడా నాలుగు యాప మండలు దీసుకురారా” అంది యాదమ్మ.

తటారం ఎక్కి యాపకొమ్మలిర్సిండు పెద్దన్న.

వాకిట్లకు హీరో హోండా మోటరు బండి వచ్చి ఆగింది.

“బావ నమస్తే అక్క ఎట్లున్నవే” అల్లున్ని దగ్గరకు తీసుకుంట అన్నడు పెద్దన్న.

బండి సప్పుడిని భయటకచ్చిండ్లు యాదమ్మ గౌరి.

“బాగున్నవా బిడ్డా!” అల్లున్ని బిడ్డను జూసుకుంట అంది.

“ఆ బాగేనత్తా” అన్నడు.

పెద్దన్న కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చిండు.

కాళ్ళు కడుగుకుని ఇంట్లకు బోయిండ్లు. పెద్దన్న తుడుచుకోడానికి తువ్వాలిచ్చి దర్వాజలకు మామిడాకులు గట్టిండు.

గౌరి చాయజేసుకుని వచ్చి అక్క బావకిచ్చింది.

అక్క కొడుకును దగ్గరకు దీసుకుని అక్క పక్కన కూసుంది గౌరి.

“మమత ఎక్కడుందే?” అన్న అక్క మాటకు ఏం చెప్పాల్నో వద్దో అని ఆలోచిస్తుంది. అక్క మళ్ళమళ్ళ గట్టిగా అడుగబట్టింది. మమత అక్క చిన్నప్పటిసంది జిగిరి దోస్తులు. ఎటు బోయిన ఇద్దరు కలిసి తిరిగెటోళ్ళు.ఇద్దరు పెండ్లయిన కానుంచి కలుసుకున్నదే పండక్కో ఎప్పుడో జరిగేది. ఇద్దరు ఒకలకొకలు పాణంలెక్కుండెటోళ్ళు.

“మమత ప్రాణం మంచిగలేదే పట్నంల బాగ సంపాదిస్తుండని ఓ దిక్కుమాలినోనికిచ్చిండ్లు. ఇంతఉన్నోళ్ళు అని చూసిండ్లు గని వాడు మహాశాడిస్టట. దాన్ని చావుదాక తోలుకపోయచ్చిండు. ఒళ్ళంత సిగరేటుతో కాల్చిన గుర్తులు ఎవరిని నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో యాదస్తే పాణం జడితిస్తాంది” గుండెకాడ చేయిపెట్టుకునంది గౌరి.

“అదెక్కడుంది” ఆత్రంగా అడిగింది వనజ.

“ఇక్కన్నేవుంది”

“ఒక్కసారి దాన్ని చూశద్దామే”

“ఈ పనులన్ని గాన్నివ్వు బిడ్డ పొద్దుబూకినంక బోయి మాట్లాడత్తువుగని” చిన్నగా దేవునర్రలకెళ్ళి అన్నది యాదమ్మ.

అమ్మకు ఏదో పనిలో ఆసరైదామని గౌరి వనజ అర్రలకు బోయిండ్లు. దేవుని ఫోటోలన్ని చక్కగా అలంకరించింది యాదమ్మ.

“జర గా పూలన్ని దండలల్లుండ్లి బిడ్డా!” అన్నది యాదమ్మ.

చాపల గుర్చుండి బంతిపూలన్నిముంగటేసుకున్నరు గౌరి వనజ.

“బిడ్డా! నేను బోనంకు బియ్యం బెడుత. మీరు జెల్ది గానియండ్లి” అని చెప్పి సాయబానలకు బోయింది యాదమ్మ.

ఇద్దరు జెల్ది జెల్ది దండలల్లి దేవునికేసిండ్లు. మిగిలిన పూలను మామిడాకులను దేవుని పందిరికి అలంకరించిండ్లు. యాదమ్మ బోనం వండితెచ్చింది. దానికి పసుపు కుంకుమలుబెట్టింది. యాపాకు, పూలు దండగట్టేసింది,

ఊర్లెకు బోయిన కొండయ్య గలమకాడికి రాంగనే “పనితీరిందానే పొద్దెక్కుతాంది” అన్నడు.

“ఆ.. ఆ.. అయినట్టే” దేవునర్రలకెల్లి జెప్పింది యాదమ్మ.

“నమస్తే మామ!” అన్నడల్లుడు.

“ఎప్పుడచ్చిండ్లు బిడ్డా అమ్మ బాపు మంచిగున్నరా?”

“మంచిగనే వున్నరు మామ”

“అందరు ఓ సారి రాండ్లయ్య” కేకేసింది యాదమ్మ.

అందరు దేవుని అర్రలకచ్చిండ్లు. కళ్ళు సీస తెచ్చిండు కొండయ్య. పెద్దన్న కోడిని దెచ్చిండు. అందరికి బొట్టు పెట్టింది యాదమ్మ. గిన్నెలున్న గుడాలు తీసి విస్తార్లో పెట్టింది వనజ.

అందరు బెల్లం కల్లుశాగ మొక్కినంక కొబ్బరికాయలు కొట్టిండ్లు, గౌరమ్మ పెండ్లి కుదిరితే మేడారం సమ్మక్క – సారక్క జాతర్ల ఎదుర్కోల్లెగురేస్తనని మొక్కిండ్లు యాదమ్మ కొండయ్య. కోడిని గోసింనక పెద్దన్న ఇంటెనుకకు తీసుకపోయి శుభ్రంచేసి వంట వండిండ్లు.

జామ చెట్టుకింద మంచమేసిండు పెద్దన్న. అందరు గుడాలు కూర ముక్కలతో కళ్ళు తాగిండ్లు.

“బిడ్డా! గా తిర్మలగిరి పిలగాని ముచ్చటేమైంది. అత్త ఒకటే రందిబడుతాంది.”

“పిలగాడు కట్నం కాడ కిరి కిరి బెడుతాండు. అందుకే నేను వనజ మా తరుపున్నే ఏనన్న చూద్దామనుకున్నము”

“పిలగాని గుణం మంచిది గావాలే బిడ్దా” యాదమ్మ అల్లుని దిక్కు జూసన్నది.

“నువ్ నారాజు పడకవ్వ గౌరికి శివునసంటోడస్తడు. నువ్ రంది బడి ప్రాణం ఆగమాగంజేసుకోకు సరేనా.”

భోజనాలు అయినంక పగటికునుకు దీయ తలో దిక్కు ఒరిగిండ్లు.

గౌరి వనజ మమత దగ్గరికి పోయిండ్లు.

***

పందిట్ల మొగురంకొరిగి నారాజుగ కూసున్నది మమత. బక్కచిక్కి అస్థిపంజరం గూడులాగుంది. మొఖంపైన ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాల తాలుకు మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె మమతే అని పోల్చుకోడానికి ఓ నిమిషం పట్టింది వనజకు. వనజను చూడగానే బావురుమని మీదపడి ఏడ్చింది మమత.

శాడిస్టు భర్త పెట్టిన వేధింపులు, అత్త ఆడబిడ్డల ఆరల్లు అన్ని ఒక్కొక్కటి మెల్లగా చెప్పింది.

“మమత నువ్ చదువుకున్న దానివే గదా! ఇలా ఎలా పడుతు కూర్చున్నావే? పోలీస్ కంప్లేంట్ ఇవ్వకపోయినావా? గృహహింస చట్టం వుందని తెల్వదా? కేసు పెడితే వాళ్ళను బొక్కలేసి మక్కలిరగదందురు”

“ఎప్పుడు పెద్దమనుషులల్ల పంచాయితి పెట్టడం రాజీ కుదుర్చడం, మల్లి ఆ తరువాత కథ ఎప్పటిలానే ఎప్పుడు తెల్లారుతుందో నా కథ ఎలా ముగుస్తుందో నన్న బాధ,”

“పడేవాళ్లున్నంతకాలం కొట్టేవాళ్లు ఎప్పుడు తయారుగనే వుంటరు. స్ర్తీ స్వేచ్ఛ, స్త్తీకి సమానత్వం చట్టం కల్పించిన హక్కు. మనం మౌనంగా వున్నంతకాలం ఈ వెధవలు ఇలానే చేస్తరు. ఎంత చదువుకున్న ఎక్కడ కుటుంబం పరువు రోడ్డున పడుతుందో తల్లిదండ్రుల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతింటుందోనని అనుకున్నంతసేపు ఈ సమాజం ఇలానే వుంటుంది. ఇప్పటికైన స్టేషన్లో కంప్లేంటు ఇవ్వు. వారి సంగతేదో వాళ్ళే చూసుకుంటారు” వనజ ఆవేశంగా మాట్లాడడం జూసి గౌరి కూడ నిర్ఘాంతపోయింది.

అక్కలోని ఆవేశం చూస్తుంటే ఓ ఝాన్సి రాణిలా వీర శౌర్యం పునికిపుచ్చుకున్న రాణి రుద్రమ్మలా కనిపించింది.

దుఃఖం నిండిన నిండు మేఘంలావున్న మమతను ఓదార్చి బరువైన హృదయంతో ఇద్దరు ఇంటికచ్చిండ్లు.

***

అందరు నిశబ్దంగా కొండయ్య చెప్పింది వింటున్నారు. ఎవరు ఏమడుగతలేరు. ఒక పెద్దన్న మాత్రం “చెల్లెకు ఇష్టంలేకుండా పెండ్లేంది నాయిన” అన్నడు.

“నీకేం తెలుసురా అది చిన్నపిల్ల గట్లనే అంటది. దానికి నువు వత్తాసు పలుకుడేంది.” కోపంగా అన్నడు కొండయ్య.

ఆ కోపం వెనుక ఏదో భయం ఆ కండ్లల్ల కనిపిస్తుంది. కొండయ్య మాటకు పెద్దన్న కాస్త తగ్గిండు.

నాయన గిట్లెందుకు మాట్లాడుతుండో అర్థంగాక పెద్దన్న దిక్కుజూసిండు.

యాదమ్మ మెల్లగా కొడుకు దిక్కు జూసి సైగ జేసింది. మంచేదో చెడేదో మాట్లాడే రాజయ్య మామైతే వున్నడు. మామకు సైగ జేసిండు పెద్దన్న.

“జెరసైసు” అన్నడు చిన్నగా రాజయ్య.

కొట్టంల మొగురం బట్టుకుని గౌరి విచారంగ జాస్తాంది. పాపం దానికి మనసులో ఏం తట్టిందో గని వద్దంటే వద్దని మంకు పట్టు పట్టింది.

“గీ దినం నీకేమైంది బావ. ఇంట్లో అందరిని విచారించినంక నిర్ణయం దీసుకోకపోతివి వాళ్ళెవలో ఏందో తెల్వకుండా లగ్గం కాయం జేసుకుంటే ఎట్లా? అన్ని దెలిసినోనివి మళ్ళోసారి గట్టిగా సోంచాయించు.”

“అన్ని ఎరుకుండే పెట్టుకున్న బావ. పెద్దబిడ్డఅల్లుడు చూసిన సంబంధం. వాళ్ళ చుట్టాలపిలగాడు. పిలగానికి M.R.O ఆఫీసుల కొలువచ్చిందట. నలుగుదినాలు పోతే M.R.O గుడ అయితడట. గౌరిని ఎవల పెండ్లిల్నో జూసిండట. గీ సంబంధం కాయం జేయమని పెద్దది పట్టుబట్టి చెబుతుంది బావ” అన్నడు రాజయ్య దిక్కు జూసి.

నోట్లెకెల్లి బీడిదీసి తటారం అవతల తుపుక్కున ఉమ్మి “పెద్దది అల్లుడు జెప్పిండ్లంటే పిలగాడు మంచోడే అయివుంటడు పైగా గవర్నమెంటు నౌకరి. ఇ ల్రేపు నౌకరుంటే చాలు తరతరాలకు సరిపడేంతా లక్షలకు లక్షలు కట్నం అడుగుతాండ్లు ఒప్పుకో తల్లి” గౌరి దిక్కు జూసి అన్నడు రాజయ్య.

వనజ ఫోన్ జేసి చెల్లెతోటి మాట్లాడింది. అట్లనో ఇట్లనో గౌరి పెండ్లికి ఒప్పుకుంది.

శుక్రవారం పంచమి మంచిరోజు పిలగానోల్లు పిల్లను జూడడానికి వస్తమని చెప్పమని అల్లుడు ఫోన్‌ల జెప్పిండు.

వచ్చినోల్లను ఎట్టెట్ట అరుసుకోవాల్నో ఎమేంతేవాల్నో అందరు కూసుండి విచారించుకున్నరు.

యాదమ్మ కొండయ్య ఊపిరి పీల్చుకున్నరు.

***

ఇంటి ముందు కారు వచ్చి ఆగింది పిలగాడు వాళ్ళామ్మ నాయన అక్క చుట్టాలతను దిగిండ్లు. అందరిని రాచమర్యాదలతో తోడ్కోని ఇంట్లో కచ్చారు అందరికి కుర్చిలేసి కూసో బెట్టిండ్లు. పిల్ల పిలగాడు చూసుకుని సరె అనుకున్నరు. పెదన్నఅయ్యగార్ను తీసుకవచ్చిండు. చూడ ముచ్చటైన జంటను చూసి దీవించి లగ్గం కాయంజేసిండు. పెండ్లి వారంలనే వచ్చింది.

యాదమ్మ కాసింత ఆలోచించింది. తలో చేయేస్తే ఎంతసేపు? నువ్వేం ఫికర్ పడకన్నడు రాజయ్య. పిలగానికి ఓ తువ్వాల కప్పి తోచినకాడికి చేతులబెట్టిండు కొండయ్య. లగ్నపత్రిక పట్టుకుని వెళ్ళిఆ సాయంత్రమే శుభలేఖలు కొట్టిచ్చిండ్లు. నాలుగు రోజులలో శుభలేఖలు పంచినారు. పెండ్లి సామాను తీసుకున్నరు. ఇంటిముందు శామియాన వేసి వేములవాడ రాజేశునికి శావ దీసి పసుపు కొమ్ములు దంచి పెండ్లి పనులు మొదలు పెట్టిండ్లు. చుట్టాలంత ముందే వచ్చిండ్లు. చప్పులోల్లు రాగానే పుట్టమన్ను తెచ్చిండ్లు. కురాడ్లు బట్టినంక తల్వాలు గల్పిండ్లు. పిలగాన్ని తీసుకరాను బోయినొల్లు విడిదింట్ల దిగినమని చెప్పంపిండ్లు. వాళ్ళకు చాయ టిఫిన్ ఇచ్చినంక ఎదుర్కోళ్ళకు (ఎదురేగి) బోయి పిలగాని నోరు తీపిజేసి పిలగాన్నితోడ్కోని వచ్చిండ్లు. పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పగింతలప్పుడు గౌరి అవ్వ నాయన మీద బడి ఒకటే ఏడుపు. చిన్నప్పట్నుంచి ఎరిగినోళ్ళంత కండ్ల నీళ్ళు పెట్టుకున్నరు. పెద్దన్న చెల్లి మీధ బడి గుండెలవిసేలా ఏడ్చిండు. ఆ ఏడుపు మిన్నంటింది. అందరు ఊకుండ బెట్టి కార్ల కూకుండ బెట్టి సాగనంపిండ్లు.

***

ఇద్దరు బిడ్డలు అల్లులను తీసుకుని వేములాడకు పోయచ్చి మేడారం బోయిండ్లు. కాలేద్దమన్న సందులేదు అడివంత పరుచుకున్న డేరాలు వనజాతర్ల ఓ మంచి చోటు జుసుకుని వెదురు బొంగులతో డేరా వేసి చిన్న కుటీరం జేసుకున్నరు. జంపన్న వాగుల స్నానాలు జేసినంక బిడ్డ ఎత్తు బెల్లం కోడిని దీసుకుని లైనుల నిలుచున్నరు. కనుచూపుమేరల జనం, శివసత్తుల పూనకాలు, ఇలలు, గోళలు చిలకల గుట్టనుండి సమ్మక్కను తీసుక వస్తున్నారు. పోలీసులు సర్వ విధాలుగా కంట్రోల్ జేస్తున్నరు. తప్పిపోయిన వారి గురించి మైకులో అనౌన్సులు. ఒకరిని తోసుకుని ఒకరు ముందుకు వెళ్థున్నారు. ఎన్ని రకాల దుకాణాలున్నాయో చూస్తుంటే ఎంత బాగుంది. రంగులరాట్నం కాడ కేరింతలు కోయదొరలు నెమలికలతో భవిష్యత్తు జాతకాలు చెప్పడం. ఎవరి కుటుంబాలను వాళ్ళు గమనిస్తునే వారందరి నోళ్ళలోను వనదేవతల పేర్లే నానుతున్నవి. అమ్మ చల్లంగా చూసినందుకు శుభకార్యం ఏ అటంకం లేకుండా జరిగిందని సమ్మక్క – సారక్కలను భక్తితో కొలిచి ‘ఎదుర్కోళ్ళ’ దగ్గర కోడిని ఎగిరేసిండు కొండయ్య. ఆ తరువాత గద్దెల దగ్గరికి పోయి అమ్మలకు నిలువెత్తు బెల్లం బంగారం సమర్పించుకుని మొక్కులు ముట్టినంక మెల్లగా ఆ జనంలో నుండి డేరా (కుటీరం) దగ్గరకు వచ్చి భోజనాలు వండుకుని తిన్నరు. మల్లీ సారక్క వచ్చే వరకు అక్కడే వుండి కుంకుమ బరణిల సమ్మక్క – సారక్కల వనదేవతలను మళ్ళీ దర్శించుకున్నారు. ఆ తరువాత జాతరంత మల్లీ తిరిగి కావల్సినవి కొనుక్కుని తృప్తిగా వెనుదిరిగిండ్లు.

Exit mobile version