Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎదురుచూపు

[యువ కథకుడు రిషి బరాటం రచించిన ‘ఎదురుచూపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

అనగనగా 1970ల కాలంలో విశాఖపట్నంలో చక్రధర్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి కథలు, కవితలు అంటే ప్రాణం. చిన్న చిన్న పత్రికల్లో కథలు రాస్తూ, రాత్రిళ్లు దీపం వెలుగులో కూర్చొని కవితలు రాసేవాడు.

చక్రధర్‌కి ఒకే ఒక్క కొడుకు – దుష్యన్.

దుష్యన్ చిన్నప్పుడే అతని అమ్మ చనిపోయింది. తల్లి ప్రేమ ఏమిటో పూర్తిగా తెలుసుకునేలోపే ఆమె దూరమైపోయింది. కానీ చక్రధర్ మాత్రం తన కొడుకును చాలా ప్రేమగా పెంచాడు.

చిన్నప్పటి నుంచే దుష్యన్‌కి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. తన నాన్న రాసే కథలు వింటూ పెద్దయ్యాడు. కవితలు చదవడం, లైబ్రరీకి వెళ్లడం, కొత్త రచయితల పుస్తకాలు చదవడం.. ఇవన్నీ అతని ప్రపంచం.

పెద్దయ్యాక తాను కూడా మంచి పోయెట్ అవ్వాలని అనుకునేవాడు.

ఒక రోజు సాయంత్రం దుష్యన్ తన నాన్న దగ్గరకు వచ్చి,

“నాన్న.. నేను బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదవాలి అనుకుంటున్నాను,” అన్నాడు.

ఆ మాట విన్న చక్రధర్ ముఖంలో ఆనందం కనిపించింది.

“నువ్వు మంచి రచయిత అవుతావు దుష్యన్,” అన్నాడు.

ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్శిటీకి చాలా పేరు ఉండేది. ముఖ్యంగా లిటరేచర్ చదవడానికి. కొన్ని రోజుల తర్వాత దుష్యన్‌కి ఆంధ్ర యూనివర్శిటీలో సీట్ వచ్చింది. ఆ రోజు చక్రధర్ కన్నుల్లో కనిపించిన ఆనందం దుష్యన్ ఎప్పటికీ మర్చిపోలేదు.

అదే సంవత్సరంలో మయూరి అనే అమ్మాయి కూడా ఆంధ్ర యూనివర్శిటీలో బీఏ పొలిటికల్ సైన్స్ చదవడానికి చేరింది.

మయూరికి చిన్నప్పటి నుంచే జర్నలిస్ట్ అవ్వాలని కల. సమాజం గురించి రాయాలి.. నిజం కోసం మాట్లాడాలి.. అనేది ఆమె ఆశ.

కాలేజీ మొదలై కొన్ని రోజులు అయ్యింది.

ఒక రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా గట్టిగా వర్షం మొదలైంది. యూనివర్శిటీలో ఉన్న వాళ్లంతా పరుగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న షెడ్‌లోకి వెళ్లారు.

అప్పుడే దుష్యన్ మొదటిసారి మయూరిని చూశాడు.

నల్లటి కాటుక.. చిన్న చక్కటి నవ్వు.. ఘల్ ఘల్ మోగే పట్టీలు..

వానలో తడుస్తూ తన ఫ్రెండ్స్‌తో కలిసి షెడ్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చిన మయూరిని చూసి దుష్యన్ ఒక్కసారిగా మౌనంగా అయిపోయాడు. ఆ క్షణంలో అతనికి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపించింది. మాట్లాడాలని అనిపించింది. కానీ ధైర్యం రాలేదు.

కొద్దిసేపటికి వర్షం తగ్గింది. మయూరి తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లిపోయింది.

కానీ ఆ రోజు మొత్తం దుష్యన్ మనసులో మాత్రం వానలో పరుగెత్తుకుంటూ వచ్చిన మయూరే కనిపించింది.

తరువాతి రోజు దుష్యన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి క్యాంటీన్‌కి వెళ్లాడు. అక్కడ మయూరి కూర్చొని ఉంది.

ఈసారి ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లాడు.

“హాయ్..” అన్నాడు. మయూరి మొదట పెద్దగా పట్టించుకోలేదు.

దుష్యన్ మళ్లీ నవ్వుతూ, “హాయ్..” అన్నాడు.

ఈసారి మయూరి కూడా చిన్నగా నవ్వి, “హాయ్..” అంది.

“నా పేరు దుష్యన్. నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాను.”

“మయూరి..”

అంతే. ఆ చిన్న పరిచయం అక్కడ మొదలైంది.

కొద్దిసేపు మాట్లాడాక మయూరి, “క్లాస్ టైమ్ అయింది.. నేను వెళ్తాను,” అని వెళ్లిపోయింది.

ఆ రోజు నుంచి దుష్యన్ జీవితంలో మయూరి అనే పేరు మెల్లగా చోటు చేసుకుంది.

కొన్ని రోజుల తర్వాత దుష్యన్ తన ఫ్రెండ్ రామ్‌ని కలవడానికి మయూరి క్లాస్ దగ్గరకు వెళ్లాడు.

అప్పుడు మయూరే ముందుగా వచ్చి, “హాయ్ దుష్యన్!” అంది.

ఆ ఒక్క మాటతోనే దుష్యన్ రోజు మొత్తం హ్యాపీగా మారిపోయింది.

అలా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది. రోజూ కలిసి క్యాంటీన్‌లో భోజనం చేయడం.. లైబ్రరీలో కూర్చొని మాట్లాడుకోవడం.. యూనివర్శిటీ చుట్టూ తిరగడం.. బీచ్ గురించి, పుస్తకాల గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుకోవడం.. అలా మెల్లగా వాళ్లు చాలా క్లోజ్ అయ్యారు.

కానీ దుష్యన్ మనసులో మాత్రం ఇంకేదో పెరుగుతోంది. అది ప్రేమ.

ఒక రోజు దుష్యన్ ఫ్రెండ్ రోహిత్ అడిగాడు.

“ఏరా.. నీకు మయూరి అంటే ఇష్టమా?”

దుష్యన్ కొద్దిసేపు మౌనంగా ఉండి, “అవును..” అన్నాడు.

“అయితే చెప్పు.”

“సరైన టైమ్ వచ్చినప్పుడు చెప్తాను,” అన్నాడు దుష్యన్.

ఒక రోజు సాయంత్రం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది.

“వర్షం పడేలా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. నువ్వూ త్వరగా వెళ్లు,” అని మయూరి వెళ్లిపోయింది.

దుష్యన్ కూడా బయలుదేరాడు. కానీ అతని సైకిల్‌కి పంక్చర్ అయింది. చేసేది లేక వర్షంలో సైకిల్ తోసుకుంటూ ఇంటికి వెళ్లాడు.

ఆ రాత్రి అతనికి గట్టిగా జ్వరం వచ్చింది. మరుసటి రోజు కాలేజీకి రాలేదు. మయూరి అతన్ని వెతికింది.

స్నాక్ బ్రేక్ టైమ్‌లో కనిపించలేదు. లంచ్‌కి కూడా రాలేదు.

ఆమెకు రోజు మొత్తం ఏదో ఖాళీగా అనిపించింది. దుష్యన్ లేకుండా క్యాంటీన్ కూడా బోర్‌గా అనిపించింది.

రెండో రోజు కూడా దుష్యన్ రాకపోవడంతో రోహిత్‌ని అడిగింది.

ఆ సాయంత్రం రోహిత్ దుష్యన్ ఇంటికి వెళ్లి విషయం తెలుసుకున్నాడు.

“జ్వరం ఎక్కువగా ఉంది,” అన్నాడు.

అది విన్న మయూరి చాలా టెన్షన్ పడింది. ఆదివారం రోజు తన అమ్మమ్మ చేసిన కషాయం తీసుకుని దుష్యన్ ఇంటికి వెళ్లింది.

తలుపు తీసిన చక్రధర్, “ఎవరు అమ్మా?” అని అడిగాడు.

“నేను దుష్యన్ ఫ్రెండ్ మయూరిని..”

చక్రధర్ నవ్వుతూ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు.

దుష్యన్ గదిలో మంచంపై కూర్చొని ఉన్నాడు.

మయూరిని చూసిన వెంటనే అతని ముఖంలో ఆనందం కనిపించింది.

“లోపలికి రా..”

మయూరి అతని దగ్గర కూర్చుంది.

“ఇంత జ్వరం వచ్చిందంటే చెప్పలేవా?” అని మందలించింది.

తనతో తీసుకొచ్చిన కషాయం ఇచ్చింది.

“నాకు కషాయం అంటే అస్సలు నచ్చదు,” అని దుష్యన్ మొహం పెట్టాడు.

“మాట్లాడకు.. తాగు,” అని బలవంతంగా తాగించింది.

తల్లి ప్రేమ ఎప్పుడో కోల్పోయిన దుష్యన్‌కి ఆ చిన్న బలవంతం చాలా ప్రేమగా అనిపించింది.

ఆ రోజు నుంచి మయూరిపై అతని ప్రేమ ఇంకా పెరిగింది.

రెండు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో వాళ్లకే తెలియలేదు.

చివరి సంవత్సరం పరీక్షలు వచ్చాయి. చివరి పరీక్ష రోజు మయూరికి తన ప్రేమ చెప్పాలని దుష్యన్ నిర్ణయించుకున్నాడు. ముందు రోజు రాత్రంతా ఎలా చెప్పాలో ఆలోచిస్తూ నిద్రపోలేదు.

చివరి పరీక్ష అయిపోయాక మయూరిని క్యాంటీన్‌కి రావాలని చెప్పాడు. మయూరి వచ్చేసరికి దుష్యన్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు.

“ఏమైంది? ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నావ్,” అంది మయూరి.

దుష్యన్ మెల్లగా ఆమె వైపు చూసాడు.

“మయూరి.. నేను నీకు ఒక విషయం చెప్పాలి..” అని చెప్పి తన మనసులో ఎన్నాళ్లుగానో దాచుకున్న మాటలను కవితగా చెప్పాడు.

“వాన చినుకులు నేలను ముద్దాడుతున్న సాయంత్రం..
ఆ మబ్బుల వెనుక నుంచి నువ్వు నడుచుకుంటూ వచ్చావు.
నీ అడుగుల సవ్వడి విన్న గాలి కూడా
నెమ్మదిగా ఆగి నిన్నే చూసింది.
ఆ క్షణంలో
నువ్వు ఒక అమ్మాయి కాదు..
వానలో రెక్కలు విప్పిన మయూరివి.
నాకు తల్లి ఒడిలో నిద్రపోయిన జ్ఞాపకాలు లేవు,
అమ్మ చేతితో తల నిమిరిన అదృష్టం లేదు.
కానీ నా అలసిన రోజుల్లో
నీ మాటలు మాత్రం అమ్మ జోలపాటలయ్యాయి.
నేను మౌనంగా కూర్చున్న ప్రతిసారి
నా బాధని కళ్లలో చదివింది నువ్వే.
‘తిన్నావా?’ అనే నీ చిన్న ప్రశ్నలో
నేను కోల్పోయిన ప్రేమ అంతా దాగి ఉండేది.
నువ్వు లేని రోజులు నాకు
చాలా కష్టంగా మారిపోయాయి..
వాన ఆగిపోయిన ఆకాశంలా,
పాట మరిచిపోయిన కోయిలలా,
నీ మాటలు లేని ప్రతి క్షణం
నిశ్శబ్దంగా నన్ను బాధించింది.
అందుకే ఈ మనసు నిన్ను ఒక్కటే అడుగుతోంది..
ఈ జన్మంతా నా వెంట ఉంటావా మయూరి?”

కవిత పూర్తయ్యేసరికి మయూరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

కొన్ని క్షణాలు దుష్యన్ వైపు చూసింది.

ఆ తర్వాత చిన్నగా నవ్వి,

“ఉంటాను.. జీవితాంతం నీతోనే ఉంటాను,” అంది.

ఆ మాట విన్న దుష్యన్ ఆనందంతో ఏడ్చేశాడు.

ఆ రోజు సాయంత్రం వరకు ఇద్దరూ యూనివర్శిటీ గార్డెన్‌లో చేతులు పట్టుకుని కూర్చొన్నారు.

కానీ ఆ ఆనందం మధ్యలోనే వేసవి సెలవులు వచ్చాయి. మయూరి తన తాతయ్య ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన తాతయ్య ఇంటి టెలిఫోన్ నంబర్ దుష్యన్‌కి ఇచ్చింది.

“ఉత్తరాలు రాయాలి,” అంది.

“రోజూ రాస్తాను,” అన్నాడు దుష్యన్.

స్టేషన్‌కి బయలుదేరే ముందు ఇద్దరూ కాలేజీ గార్డెన్‌లో చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నా.. విడిపోవాల్సిన బాధ వాళ్ల మాటలను ఆపేసింది.

మయూరి మెల్లగా అడిగింది, “నిజంగా నన్ను మిస్ అవుతావా?”

దుష్యన్ చిన్నగా నవ్వి, “నువ్వు లేని క్యాంటీన్‌ని నేను ఎలా భరిస్తానో ముందుగా అదే చెప్పు,” అన్నాడు.

ఆ మాట విని మయూరి నవ్వింది. కానీ ఆ నవ్వు వెనకాల బాధ స్పష్టంగా కనిపించింది.

ఆ రెండు నెలలు వాళ్లిద్దరికీ చాలా కష్టంగా గడిచాయి. 60 రోజుల్లో 127 ఉత్తరాలు. 30కి పైగా ఫోన్ కాల్స్.

చిన్న చిన్న గొడవలు.. మళ్లీ సర్దుకోవడం.. “నిన్ను చాలా మిస్ అవుతున్నా..” అని చెప్పుకోవడం..

దుష్యన్ ప్రతి ఉత్తరాన్ని మూడు నాలుగు సార్లు చదివేవాడు. మయూరి రాసిన అక్షరాల్ని కూడా ప్రేమగా తాకేవాడు.

ఒకసారి మయూరి ఉత్తరంలో ఇలా రాసింది: “ఇక్కడ వర్షం పడింది దుష్యన్.. నువ్వు ఉంటే ఇప్పటికి బలవంతంగా బయటికి లాగేసి తడిపేవాడివి.”

ఆ ఉత్తరం చదివి దుష్యన్ చాలాసేపు నవ్వుకున్నాడు.

అలా దూరంగా ఉన్నా వాళ్ల ప్రేమ మాత్రం ఇంకా దగ్గరైంది. కానీ ఒకరి పక్కన ఒకరు లేకపోవడం మాత్రం వాళ్లిద్దరికీ చాలా బాధగా అనిపించింది.

చివరి సంవత్సరం మొదలైన రోజు దుష్యన్ పుట్టినరోజు.

మయూరి చాలా రోజులుగా దాచుకున్న డబ్బులతో ఖరీదైన హెచ్‌ఎంటీ వాచ్ కొనుక్కొని అతనికి గిఫ్ట్‌గా ఇచ్చింది.

“ఇది చాలా ఖరీదై ఉంటుందిగా..” అన్నాడు దుష్యన్.

“నీకోసం కొన్నది.. ఖరీదు చూడలేదు,” అంది మయూరి.

రెండు నెలల తర్వాత మయూరిని చూసిన దుష్యన్ ఆనందంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.

ఆ రోజు ఇద్దరూ రామకృష్ణ బీచ్‌కి వెళ్లారు.

సముద్రం ముందు కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు.

“ఈ రెండు నెలలు నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా?” అంది మయూరి.

దుష్యన్ నవ్వుతూ ఆమె చేతిని పట్టుకున్నాడు.

“ప్రతి రోజు నీ ఉత్తరాలే చదివాను,” అన్నాడు.

మయూరి నవ్వుతూ, “అందుకేనా.. అంత బాగా మడతలు పడ్డాయి?” అంది.

దుష్యన్ నవ్వేశాడు.

ఆ సముద్ర గాలి మధ్య వాళ్ల ప్రేమ ఇంకా బలపడింది.

సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుంటే మయూరి తన తల దుష్యన్ భుజంపై పెట్టుకుంది.

“ఇలానే జీవితాంతం ఉండిపోతే బాగుండును,” అంది మెల్లగా.

దుష్యన్ ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత మయూరికి జర్నలిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. దుష్యన్‌కి లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది.

ఒక రోజు ఇద్దరూ కాలేజీ గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

“మన విషయం ఇంట్లో చెప్పు దుష్యన్,” అంది మయూరి.

దుష్యన్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.

“ఇంకా నేను సెటిల్ కాలేదు మయూరి. నేను ఎంఏ లిటరేచర్ చేయాలి అనుకుంటున్నాను.”

“అయితే చదువు. నేను జాబ్ చేస్తాను,” అంది మయూరి వెంటనే.

కానీ దుష్యన్‌కి గుజరాత్ యూనివర్శిటీలో చదవాలని కల.

“రెండు సంవత్సరాలు మాత్రమే.. చదువు పూర్తయ్యాక వస్తాను,” అన్నాడు.

మయూరికి అతన్ని దూరంగా పంపడం అస్సలు ఇష్టం లేదు.

“ఇంకా దూరంగా ఉండలేను దుష్యన్..” అంది మెల్లగా.

దుష్యన్ ఆమె చేతులు పట్టుకుని,

“ఈ రెండు సంవత్సరాలు పూర్తయ్యాక.. జీవితాంతం నీతోనే ఉంటాను,” అన్నాడు.

కానీ చివరికి మయూరి ఒప్పుకుంది.

వెళ్లే ముందు రోజు దుష్యన్ మయూరికి ఒక ఉంగరం తొడిగాడు.

“నిన్ను నేను ఎప్పటికీ వదలను.. ఇదే నా మాట,” అన్నాడు.

ఆ మాట విన్న మయూరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఆమె ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది.

“రోజూ ఉత్తరాలు రాస్తాను,” అని దుష్యన్ ఆమెను ఓదార్చాడు.

మరుసటి రోజు మయూరి తన చేతులతో చేసిన కేసరి పెట్టె ఇచ్చింది.

“ట్రైన్‌లో తిను,” అంది.

స్టేషన్‌లో చక్రధర్ కళ్లలో నీళ్లు కనిపించాయి. రోహిత్ దుష్యన్‌ను గట్టిగా హత్తుకున్నాడు.

ట్రైన్ నెమ్మదిగా కదలడం మొదలైంది.

కిటికీ దగ్గర నిలబడి ఉన్న దుష్యన్ కళ్లలో మాత్రం మయూరే కనిపించింది. ట్రైన్ కనబడకుండా పోయే వరకు మయూరి అక్కడే నిలబడి చూస్తూ ఉంది.

గుజరాత్ వెళ్లిన తర్వాత దుష్యన్ కొత్త జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టాడు.

మొదటి రోజు గుజరాత్ యూనివర్శిటీ చూసినప్పుడు దుష్యన్ కొద్దిసేపు అలా నిలబడి చూసేశాడు.

పెద్ద పెద్ద భవనాలు.. నిశ్శబ్దంగా కనిపించే లైబ్రరీ.. చుట్టూ నడుస్తున్న స్టూడెంట్స్.. అన్నీ అతనికి కొత్తగా అనిపించాయి.

“ఇక్కడే ఇంకో రెండు సంవత్సరాలు..” అని తనలో తానే అనుకున్నాడు.

మొదటి కొన్ని రోజులు మయూరి గుర్తొచ్చి చాలా ఒంటరిగా అనిపించింది. క్యాంటీన్‌లో ఒక్కడే కూర్చుని టీ తాగుతూ ఉంటే.. ఆంధ్ర యూనివర్శిటీ క్యాంటీన్ గుర్తొచ్చేది. వర్షం పడితే మయూరి గుర్తొచ్చేది.

రాత్రి హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చుంటే ఆమె ఉత్తరాలే మళ్లీ మళ్లీ చదివేవాడు.

కొన్ని రోజుల తర్వాత అక్కడ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు.

అందులో అమిత్, ఫర్హాన్, రాజ్ అనే ముగ్గురు దుష్యన్‌కి బాగా దగ్గరయ్యారు.

వాళ్లకి దుష్యన్ తెలుగు కవితలు చదివి వినిపించేవాడు. అర్థం కాకపోయినా వాళ్లు ఆసక్తిగా వినేవారు.

ఒక రోజు అమిత్ నవ్వుతూ, “నీ లెటర్స్ ఎవరికో తెలుసు.. చదివేటప్పుడు నీ మొహం మారిపోతుంది,” అన్నాడు.

దుష్యన్ చిన్నగా నవ్వి, “మయూరి..” అన్నాడు.

ఆ పేరు చెబుతున్నప్పుడు అతని కళ్లలో కనిపించే ప్రేమ చూసి వాళ్లు కూడా నవ్వుకున్నారు.

కొన్ని సాయంత్రాలు దుష్యన్ యూనివర్శిటీ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివేవాడు.

ఆ నిశ్శబ్దంలో కూడా మయూరి గుర్తే అతని తోడుగా ఉండేది. కానీ ప్రతి రోజు మయూరికి ఉత్తరాలు రాస్తూనే ఉండేవాడు.

రెండు రోజులకి ఒకసారి ఫోన్‌లో మాట్లాడేవాడు.

ఒక రోజు ఫోన్‌లో మయూరి అడిగింది, “అక్కడ నన్ను మర్చిపోలేదుగా?”

దుష్యన్ నవ్వుతూ, “ప్రతి రోజు నిన్నే గుర్తు చేసుకుంటున్నాను,” అన్నాడు.

“అబద్ధం.”

“అయితే ఇప్పుడే ఏడుస్తాను చూడు.”

మయూరి నవ్వేసింది.

అలా వాళ్ల ప్రేమ దూరంలో కూడా బలంగానే ఉంది. ఒక రోజు దుష్యన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి మోర్బీ వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఆ రోజు అక్కడ గట్టిగా గాలులు వీస్తున్నాయి. అయినా ముందే ప్లాన్ చేసుకున్న ట్రిప్ కాబట్టి వెళ్లారు. కానీ వాళ్లు ఊహించని ప్రమాదం ఎదురైంది.

మచ్చూ డ్యామ్ ఒక్కసారిగా విరిగిపోయింది. భారీ వరద ఊరంతా ముంచెత్తింది. ప్రజలు అరుస్తూ పరుగులు తీశారు. దుష్యన్, అతని ఫ్రెండ్స్ వరదలో కొట్టుకుపోయారు. నీటి వేగంలో దుష్యన్ తల ఒక చెట్టుకు బలంగా తగిలింది. అతను స్పృహ తప్పిపోయాడు.

కొద్దిసేపటికి అంబులెన్స్ వచ్చి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న చక్రధర్ భయంతో వణికిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే రోహిత్‌కి సమాచారం ఇచ్చాడు.

రోహిత్ వెంటనే మయూరికి చెప్పాడు. ఆ వార్త విన్న మయూరి అక్కడికక్కడే ఏడ్చేసింది.

“నేను వెంటనే గుజరాత్ వస్తాను..” అంది.

ఇంట్లో ఆఫీస్ పని ఉందని చెప్పి చక్రధర్, రోహిత్‌లతో కలిసి గుజరాత్ బయలుదేరింది.

ప్రయాణం మొత్తం మయూరి చేతిలో దుష్యన్ రాసిన ఒక ఉత్తరం గట్టిగా పట్టుకుని కూర్చుంది.

ఆమె మనసులో ఒక్కటే ప్రార్థన. “దుష్యన్‌కి ఏమీ కాకూడదు..”

దుష్యన్ రెండు రోజులు స్పృహలోకి రాలేదు. మూడో రోజు నెమ్మదిగా కళ్లుతెరిచాడు.

చక్రధర్ ఆనందంతో అతని చేతిని పట్టుకున్నాడు.

“దుష్యన్..”

దుష్యన్ తన నాన్నను గుర్తుపట్టాడు.

కానీ కొద్దిసేపటి తర్వాత లోపలికి వచ్చిన రోహిత్, మయూరిని చూసి అయోమయంగా చూశాడు.

“వాళ్లు ఎవరు?” అని అడిగాడు.

ఆ మాట విన్న మయూరి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయింది.

డాక్టర్లు పరీక్షించి,

“తలకు బలమైన దెబ్బ తగిలింది. కొన్ని జ్ఞాపకాలు పోయాయి,” అన్నారు.

మయూరి అతని దగ్గర కూర్చొని ఎన్నోసార్లు మాట్లాడింది.

వాళ్లు కలిసి తిరిగిన విషయాలు చెప్పింది. ఫోటోలు చూపించింది. ఉంగరం చూపించింది.

“ఇది నువ్వే తొడిగావు దుష్యన్..” అని ఏడుస్తూ చెప్పింది.

కానీ దుష్యన్‌కి ఏమీ గుర్తురాలేదు. ఆమెను చూస్తే కేవలం ఒక అపరిచితురాలిలా మాత్రమే కనిపించింది.

ఆ రోజులు మయూరికి నరకంలా మారిపోయాయి. కొన్ని వారాలు గడిచిపోయాయి.

దుష్యన్ ఆరోగ్యం కొంచెం బాగవుతోంది.. కానీ జ్ఞాపకాలు మాత్రం రావట్లేదు.

ప్రతి రోజు మయూరి హాస్పిటల్‌కి వెళ్లేది.

“దుష్యన్.. నేను మయూరిని..” అని నెమ్మదిగా చెప్పేది.

దుష్యన్ మాత్రం చిన్నగా నవ్వి చూస్తాడు. అంతే.

ఆ నవ్వులో తనకి తెలిసిన ప్రేమ లేదు. అది చూసిన ప్రతిసారి మయూరికి చాలా బాధ వేసేది.

ఒక రోజు వాళ్లు కలిసి దిగిన ఫోటోలు తీసుకెళ్లింది.

“ఇది గుర్తుందా?” అని అడిగింది.

దుష్యన్ ఫోటోను చాలాసేపు చూసాడు.

“లేదు.. కానీ ఇందులో ఉన్న నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉన్నాను,” అన్నాడు.

ఆ మాట విన్న మయూరి కళ్లలో నీళ్లు తిరిగాయి.

అలా రోజులు గడిచిపోయాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు మయూరి అతని దగ్గరే ఉండేది. మందులు ఇచ్చేది. భోజనం పెట్టేది.

డాక్టర్లతో మాట్లాడేది.

కానీ ఇంట్లో మాత్రం రోజురోజుకీ ప్రశ్నలు ఎక్కువయ్యాయి.

“ఇంకా ఎన్ని రోజులు అక్కడే ఉంటావు?”

“అక్కడ నీ పని అయిపోలేదా?”

అని మళ్లీ మళ్లీ అడగడం మొదలుపెట్టారు.

మయూరి మాత్రం ప్రతిసారి, “ఇంకొన్ని రోజులు..” అని చెప్పేది.

కానీ దుష్యన్‌కి ఇంకా ఏమీ గుర్తురాకపోవడంతో ఆమె మనసు రోజురోజుకీ విరిగిపోతోంది.

ఒక రోజు రాత్రి దుష్యన్ నిద్రపోతుంటే అతని పక్కనే కూర్చొని చాలాసేపు చూసింది.

“నువ్వు నన్ను ఇలా మర్చిపోతావని ఎప్పుడూ అనుకోలేదు దుష్యన్..” అని మెల్లగా ఏడ్చింది.

చివరికి ఇంట్లో ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో మయూరి తిరిగి విశాఖ వెళ్లాల్సి వచ్చింది.

వెళ్లే ముందు చక్రధర్ చేతిలో ఒక చిన్న పెట్టె పెట్టింది.

“ఇవి దుష్యన్‌కి సంబంధించిన జ్ఞాపకాలు..” అంది.

చక్రధర్ పెట్టె తెరిచి చూశాడు.

అందులో ఉన్నాయి:

“ఒక రోజు ఇవన్నీ చదివితే.. బహుశా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది,” అంది.

ఆమె గొంతు వణికింది. “అతను నన్ను మర్చిపోయినా.. నేను మాత్రం అతన్ని మర్చిపోలేను..”

అని చెప్పి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

చాలా నెలలు గడిచిపోయాయి. దుష్యన్ మెల్లగా కోలుకున్నాడు.

మళ్లీ కాలేజీకి వెళ్లడం.. పుస్తకాలు చదవడం.. స్నేహితులతో మాట్లాడడం.. అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ అతని మనసులో మాత్రం ఏదో ఖాళీ ఉంది. ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిన భావన అతన్ని వదలలేదు.

ఒక రోజు గుజరాత్ దగ్గర ఉన్న మండ్వీ బీచ్‌కి వెళ్లాడు. సముద్రం ముందు ఒంటరిగా నిలబడి చాలాసేపు అలల్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకో అతనికి చాలా బాధగా అనిపించింది.

తన జీవితంలో చాలా ముఖ్యమైనదేదో పోయినట్టు అనిపించింది. కానీ ఏమి పోయిందో మాత్రం గుర్తురాలేదు.

ఒక రోజు రాత్రి గట్టిగా వర్షం పడుతోంది. కరెంట్ కూడా పోయింది. దుష్యన్ కిటికీ దగ్గర కూర్చొని వాన చూస్తున్నాడు. చక్రధర్ పక్కనే ఒక చిన్న లాంతరు వెలిగించి వెళ్లిపోయాడు.

ఆ వెలుతురులో దుష్యన్ చూపు పక్కనే ఉన్న చిన్న పెట్టె మీద పడింది. అది మయూరి ఇచ్చిన పెట్టె.

దుష్యన్ నెమ్మదిగా ఆ పెట్టె చేతిలోకి తీసుకున్నాడు. ‘ఇందులో ఏముంది..’ అని మెల్లగా అనుకున్నాడు.

అతను పెట్టె తెరిచాడు. పాత కాగితాల వాసన ఒక్కసారిగా అతని మనసును తాకింది.

మొదటి ఉత్తరం తెరిచాడు.

“దుష్యన్..

నువ్వు లేక క్యాంటీన్ చాలా ఖాళీగా ఉంది..”

దుష్యన్ మౌనంగా చదివాడు.

రెండో ఉత్తరం తెరిచాడు.

“ఈరోజు వర్షం పడింది.. నువ్వు గుర్తొచ్చావు..”

మూడో ఉత్తరం.

“నువ్వు జ్వరం వచ్చి పడుకున్న రోజు కషాయం తాగకుండా చేసిన మొహం ఇప్పటికీ గుర్తొస్తే నవ్వొస్తుంది..”

దుష్యన్ చేతులు మెల్లగా వణికాయి.

అతని కళ్ల ముందు చిన్న చిన్న జ్ఞాపకాలు కనిపించడం మొదలైంది. వానలో పరుగెత్తుకుంటూ వచ్చిన అమ్మాయి.. ఘల్ ఘల్ మోగిన పట్టీలు.. క్యాంటీన్.. రామకృష్ణ బీచ్..

“తిన్నావా?” అని అడిగిన స్వరం..

దుష్యన్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

చివరగా ఒక మడిచిన కాగితం కనిపించింది.

అది అతను మయూరికి చెప్పిన ప్రేమ కవిత.

దుష్యన్ మెల్లగా చదవడం మొదలుపెట్టాడు.

“వాన చినుకులు నేలను ముద్దాడుతున్న సాయంత్రం..”

ఆ కవిత చదివే కొద్దీ అతని కళ్లలో నీళ్లు నిండిపోయాయి.

ఆఖరి లైన్ చదివేసరికి..

అన్ని జ్ఞాపకాలు ఒక్కసారిగా తిరిగి వచ్చాయి.

మయూరి..

ఆంధ్ర యూనివర్శిటీ..

వర్షం..

కషాయం..

ఉంగరం..

రామకృష్ణ బీచ్..

అన్నీ ఒక్కసారిగా అతని మనసులో మెరిపించాయి.

“మయూరి..”

అని ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేశాడు.

చక్రధర్ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు.

“దుష్యన్!”

“నాన్నా.. నేను మయూరిని ఎలా మర్చిపోయాను..” అని పిల్లాడిలా ఏడ్చేశాడు.

ఆ రాత్రంతా దుష్యన్‌కి నిద్ర రాలేదు. ప్రతి ఉత్తరం మళ్లీ మళ్లీ చదివాడు. ప్రతి జ్ఞాపకం గుర్తు చేసుకుని ఏడ్చాడు.  ప్రతి ఉత్తరం చదివినప్పుడూ మయూరి కళ్లే గుర్తొస్తున్నాయి.

“నిన్ను నేను ఎప్పటికీ వదలను..” అని ఉంగరం తొడిగిన రోజు గుర్తొచ్చింది.

కిటికీ బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది.

దుష్యన్ మాత్రం ఒక్కటే ఆలోచిస్తున్నాడు.

“మయూరిని వెంటనే చూడాలి..”

మరుసటి ఉదయం దుష్యన్ వెంటనే విశాఖ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

“నేను విశాఖ వెళ్లాలి నాన్న..” అన్నాడు.

చక్రధర్ అతని భుజంపై చెయ్యి వేసాడు.

“వెళ్లు దుష్యన్.. ఈసారి మాత్రం ఆలస్యం చేయకు,” అన్నాడు.

ఆ రోజే ట్రైన్ ఎక్కాడు.

ట్రైన్ కిటికీ బయట వాన చినుకులు పడుతుంటే అతని మనసులో మాత్రం మయూరి మాటలే తిరుగుతున్నాయి.

“తిన్నావా..”

“కషాయం తాగు..”

“నిన్ను చాలా మిస్ అవుతున్నా..”

ప్రతి జ్ఞాపకం ఇప్పుడు అతని గుండెను నొప్పిస్తోంది.

విశాఖ చేరుకున్న వెంటనే మయూరి ఇంటికి వెళ్లాడు.

తలుపు తీసింది ఆమె తాతయ్య.

దుష్యన్‌ని చూసిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయాడు.

“దుష్యన్..!”

“మయూరి ఎక్కడ?” అని అడిగాడు.

ఆ పెద్దాయన కొద్దిసేపు మౌనంగా చూసి చిన్నగా నవ్వాడు.

“నువ్వు వస్తావని అది ఇప్పటికీ నమ్ముతోంది బాబు..”

దుష్యన్ కళ్లలో నీళ్లు తిరిగాయి.

“ఎక్కడుంది?”

“ప్రతి వర్షం పడితే ఒకే చోటికి వెళ్తుంది..”

దుష్యన్ వెంటనే రామకృష్ణ బీచ్‌కి వెళ్లాడు. ఆకాశం మొత్తం మబ్బులతో నిండిపోయింది. సముద్రం దగ్గర గాలి బలంగా వీస్తోంది. కొద్దిసేపటికే వర్షం మొదలైంది.

అక్కడ.. అలల దగ్గర.. తెల్లటి చీరలో మయూరి నిలబడి ఉంది. దుష్యన్ తన చేతికి తొడిగిన ఉంగరాన్ని చూస్తూ ఉంది.

దుష్యన్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

“మయూరి..” అని మెల్లగా పిలిచాడు. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది.

దుష్యన్‌ని చూసిన క్షణంలో ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు.

దుష్యన్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లాడు.

“సారీ మయూరి..” అన్నాడు.

ఆమె పెదాలు వణికాయి.

“నీకు.. గుర్తొచ్చాయా?” అని అడిగింది.

దుష్యన్ తల ఊపాడు.

“అన్నీ గుర్తొచ్చాయి..”

ఆ మాట విన్న వెంటనే మయూరి కళ్లలో నీళ్లు జారిపోయాయి.

“నేను ప్రతిరోజూ ఎదురు చూసాను దుష్యన్..” అని ఏడుస్తూ అంది.

“తెలుసు మయూరి.. చాలా ఆలస్యమైంది.”

దుష్యన్ మెల్లగా ఆమె చేతులు పట్టుకున్నాడు.

“కానీ ఇకపై నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను.”

మయూరి ఒక్కసారిగా ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. దుష్యన్ కూడా ఆమెను బిగిగా కౌగిలించుకున్నాడు. ఆ వర్షంలో ఇద్దరూ చాలాసేపు అలాగే నిలబడ్డారు. ఎన్నో నెలల బాధ.. ఎన్నో కన్నీళ్లు.. ఆ క్షణంలో కరిగిపోయాయి.

కొన్ని నెలల తర్వాత..

అదే రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్న గుడిలో వాళ్ల పెళ్లి జరిగింది.

చక్రధర్ కళ్లలో ఆనందం కనిపించింది.

రోహిత్ నవ్వుతూ దుష్యన్‌ని ఆటపట్టించాడు. మయూరి చేతికి అదే ఉంగరం ఉంది. పెళ్లి అయ్యాక ఇద్దరూ సముద్రం ముందు కూర్చొన్నారు.

మయూరి నవ్వుతూ అడిగింది. “మన కథ ఎక్కడ మొదలైందో గుర్తుందా?”

దుష్యన్ కూడా నవ్వాడు. “వానలో..”

మయూరి అతని భుజంపై తల పెట్టుకుంది.

దుష్యన్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు.

ఈసారి..

వాళ్ల ప్రేమను విడదీయడానికి జ్ఞాపకాలకూ ధైర్యం సరిపోలేదు.

~

ముగింపు

ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి నవ్వుకోవడం మాత్రమే కాదు..

కొన్నిసార్లు ఒకరి కోసం ఇంకొకరు మౌనంగా ఏడవడం కూడా ప్రేమే.

మయూరి దుష్యన్‌ని ఎప్పుడూ వదల్లేదు. దుష్యన్ కూడా మయూరిని మర్చిపోలేదు.

కానీ వాళ్ల ప్రేమని నిజంగా నిలబెట్టింది మాత్రం వాళ్లు కలిసి గడిపిన జ్ఞాపకాలే.

వాన పడిన ప్రతిసారి దుష్యన్‌కి మొదట గుర్తొచ్చేది షెడ్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి.

మయూరికి గుర్తొచ్చేది.

“తిన్నావా?” అని అడిగిన ప్రతిసారి చిన్న పిల్లాడిలా నవ్విన దుష్యన్.

కాలం వాళ్లని దూరం చేసింది. కానీ ప్రేమ మాత్రం మళ్లీ వాళ్లని ఒకటిగా చేసింది.

అందుకే..

కొన్ని ప్రేమ కథలు పుస్తకాలలో ముగిసిపోవు.

ప్రతి వర్షంలో..

ప్రతి జ్ఞాపకంలో..

ప్రతి మౌనంలో..

మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటాయి.

Story Image: Designed by the author

Exit mobile version