[శ్రీ షేక్ హుస్సేన్ ఆరిఫ్ రచించిన ‘ఈ చెట్లకి శతకోటి వందనాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
విత్తిన విత్తనం చైతన్యం శక్తయి
పృథ్విని చీల్చి కర్బన మాలిన్యాలను
గుండెల నిండా పీల్చి
సూర్యరశ్మిని భోంచేసి తమ పత్ర హరిత్వాన్ని చేర్చి
మానవాళికి ప్రాణ వాయువునిచ్చాయి
ఎంత ఎత్తుకు ఎదిగినా
ఒదిగి ఉన్న ఈ చెట్లు!
వనమూలికల్లో జవసత్వాలు ఖనిజాలను చేర్చి
జీవరాసులకు ఆరోగ్యకర ఆహారాన్ని అందించి
పసుపత్యాధులు మానవ మనుగడకు ఆసరాగా నిలిచి
పరోపకారమే పరమార్ధమన్నాయి ఈ చెట్లు!
భూదేవికి పచ్చని సింగారంగా చీరెసారెలనిచ్చి
జీవకోటికి ఆధారంగా నీటి నిధిని వర్షంగా కురిపించి
తలలు తెగ నరికిన సంతసంగా మళ్ళీ చిగురించి
గుట్టల్లో రాళ్లలో తడినే ఉపహారంగా సేవించి
ప్రతికూలతల్ని ఎదిరించి ఫలాలనందించి
పుడమికి పులకింతల్ని తెప్పించి మనల్ని మెప్పించి
నిత్యం వరుణ్ణి మొక్కుతున్నట్లున్నాయి ఈ చెట్లు!
దైవ పూజకు ఇంద్రధనస్సుల్ని తలదన్నే రంగుల సుమాల్ని ఇచ్చి
సుమధుర పరిమళ ద్రవ్యాలను ఎల్లెడలా వెదజల్లి
వర్ణ రంజిత పత్రాల పొదలతో ఉద్యానవన సౌందర్యాలనుంచి
ఆయురారోగ్యాల సౌభాగ్యన్ని ప్రసాదించే ఔషధాలను ఇచ్చి
ఆయుర్వేదానికే మూల మంత్రమైనాయి ఈ చెట్లు!
మన దాస్తీకానికి గొడ్డలి గాయాలకు బలైనా
కొలిమిలో వంటింట్లో చివరికి కాస్తంలో కాలి మసైనా
నిశ్చలంగా బాధలన్నీ భరించి మన సేవలోనే తరించి
నిత్యం సూర్య నమస్కారం చేస్తున్నట్లున్నాయి ఈ చెట్లు!!
