Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ దారిలో నుంచి నన్నెవవరూ కూడా..!

[శ్రీ శరణ్‌కుమార్ లింబాలే గారి మరాఠీ కవితని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. గీతాంజలి.]

నేను ఎన్నుకున్న ఈ దారి నుంచి నన్నెవవరూ కూడా తప్పించలేరు!
ఎందుకంటే గొప్ప ఆత్మ విశ్వాసంతో.. మొండిగా నిలబడ్డాను నేను.
ఎవరిదైనా సరే గాఢమైన మోసపూరిత కౌగిలిలో ఇమడడానికి.,
లేదా చెట్టుని ఉన్న చోటే నిలబెట్టటానికి
తాడుతో భూమిలో పాతిన మేకులాంటి వాడిని కాలేను!
ఏదేమైనా సరే మీ చట్టాలన్నీఅమిత పాశవికమైనవి కదా!
వినండి! నన్నెవవరూ లొంగదీసుకోలేరు., భ్రష్టు పట్టించనూ లేరు!
ఎందుకంటే., బయటా-లోపలా నిర్మలమైన వాడిని నేను.
నా బలం తెలిసిన వాడిని!
నా మాటలపై నమ్మకం ఉన్నవాడిని!
నా దారిలో ఎవరూ కాలు పెట్టలేరు.
ఈ దారి నాది మాత్రమే!
రాజమార్గం కంటే కూడా ముఖ్యమైనది!
తెలుసుకోండి! ఈ దారి మీద నిలబడే నన్ను నేను ఈ లోకానికి నిరూపించుకున్నాను!
నా జీవితం ఎవరి దయాదాక్షిణ్యాల మీద నిలబడింది కాదు.
నా దారిలో నేను స్వయంభువుని!
నా దారికి ఎవరు అడ్డంకి కాలేరు.
ఇది నా దారి., జబర్దస్త్ దారి!
సరైన దిశలోనే నా బలమైన అడుగులు పడుతున్న దారిది.
చూడండీ., నాకు రాజ్యాభిషేకం జరగడమే సరి అయింది!
ఎన్ని రాజకీయాలైనా నడవనీ గాక!
ఎన్ని దుష్ప్రచారాలన్నా చెలరేగనీ.,
ద్వేషపు బాజార్లు నిండి పోనీ గాక.,
జరగాల్సింది మాత్రం నా ప్రజల రాజ్యాభిషేకమే!
ఇదిగో వినండి! నా శక్తి ఏంటో., నాకు బాగా తెలుసు!
ఇది గుర్తు పెట్టుకోండి!
నా చుట్టూ ఉన్న అసంఖ్యాకమైన .. సాధారణమైన., మనుషుల కరుణతో,
నా కలలు తడిసి ఉన్నాయి!
విముక్తి ఆకాంక్షతో ఉప్పొంగుతున్న ఆశయం నాది.
నువ్వేం చేసినా లొంగని విజేతని నేను!
నీకు తెలీదు! నా మనసులో వేల మేఘాలు ఉరుముతున్నాయి.
నా మనసు ఆ నల్లటి మేఘాలతో నిండిపోయి గర్జిస్తున్నది!
ఓహ్హ్., గాలి వేగంగా వీస్తూంది, మెరుపులు మెరుస్తూ ఉన్నాయి.
దీన జనం ఎలా రక్షణ కోసం, భధ్రత కోసం, పరుగెడుతున్నారు చూడండటు!
తుఫానుగా మారి వర్షించడానికి.,
నా దారి పూర్తిగా తెరుచుకుంది ఇప్పుడు.

~

మరాఠీ మూలం: శరణ్‌కుమార్ లింబాలే. హిందీ: రీనా త్యాగి. తెలుగు అనువాదం: గీతాంజలి.


శరణ్‌కుమార్ లింబాలే (జననం జూన్ 1, 1956) మరాఠీ భాషా రచయిత, కవి, విమర్శకులు. ఆయన 40కి పైగా పుస్తకాలు రాశారు. సరస్వతీ సమ్మాన్ పురస్కార గ్రహీత. 1984లో ప్రచురించబడిన వారి ఆత్మకథ ‘అక్కర్మశి’ అత్యంత ప్రసిద్ధ రచన. ‘అక్కర్మశి’ అనేక ఇతర భారతీయ భాషలలోకి, ఇంకా ఆంగ్లంలోకి అనువాదమైంది. ఆంగ్ల అనువాదాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ‘ది అవుట్‌కాస్ట్’ పేరుతో ప్రచురించింది. వీరి కొన్ని కవితలని రీనా త్యాగి హిందీలోకి అనువదించి ‘కౌన్ జాత్ హో’ పేరిట ప్రచురించారు.

Exit mobile version