[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఈ కవిత్వమే ఓ గోలీలాట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆట నేర్చిన పసిచెలిమి
తేనెల నవ్వు సిరిసిరి పూలైంది
ప్రశ్నలే లేని
ఏ బాధలు తెలియని పసి(డి)తనం
చెలిమి ఆటలో బతుకు
ఆకుపచ్చ చెట్టైంది
ఆట నా ఊరు
దాని పర్యాయపదమే నా పేరు
ఆకుల గలగలలు నిండిన
విశాల మైదానం నా జీవితం
బాల్యం ఓ వెన్నెల దోసిట
పరుచుకున్న బోసినవ్వుల సంచి
ఎంత అద్భుతం మరి
ఎంత గొప్ప అనుభవం
అక్షర గోలీలాటలో
దాచిన అపూర్వ చిరునామా ఇదేకదా!
చిటపట చినుకుల వానలా
మట్టిని తాకింది మాట్లాడే మౌనం
ఆ శబ్ద నిశ్శబ్దమే
ఓ గోలీలాటైన కవిత్వం
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.