[శ్రీ వంగల సంతోష్ రచించిన ‘ఈ రాతిరి కల..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ రాతిరి కలలో ఆలోచనలతో
కునుకు తీసిన చోట
కొత్త లోకం ఒకటి
కలను చెదర గొట్టింది
పచ్చని అడవులను విధ్వంసం చేస్తున్న
కల నిజంగానే కండ్లల్లో మెదిలింది
పక్షుల అరుపులు
నన్ను కలవరపెట్టినాయి
బురక పిట్ట తన సందేశాన్ని
మా ఇంటి గుమ్మానికి మోసుకొచ్చింది
రామ చిలుక కొరికిన
పండు ఒకటి పట్టుకొచ్చింది
ఆకలిగా ఉన్న కడుపు నింపుకొని
మా గూడును కాపాడమని వేడుకుంటున్నది
నెమలి పింఛం విప్పి
నాట్యమాడుతున్నది
ఇప్పుడేం వర్షాలు పడకపోయినా
దాని దుఃఖాన్ని తేలపడానికి
దాని అందాన్ని విప్పి చూపించి
కాపాడమని కన్నీరును ఒత్తుకుంటున్నది..
ఎన్ని పక్షులని చెప్పాలి
కను రెప్పపాటులో
కనబడిన దృశ్యాలను
ఎట్లా వివరించాలి
నల్లని కోయిల తన గాత్రాన్ని
పెద్దదిగా చేసి
అడవికి కాషన్ ఇస్తున్నట్టున్నది
పావురమేమో ప్రజా పత్రాన్ని
పట్టుకొని వస్తున్నాటున్నది
ఇన్ని పచ్చుల గూళ్లను తరమానికి
ఏ లచ్చుమన రేఖ అడ్డు రాలేదు
పచ్చని భూమిలో
రక్తం ఏరులా పారుతున్నది
మూగ జీవాల ఆవాసాలు
నేల రాలుతున్న కానరాని
లోకం ఒకటి మిగిలే ఉంది..!
వన్య ప్రాణుల ఘోష
ఎవరికి పట్టింపు
మన్యమైన మైదానమైన
మానవత్వం మిగిలి ఉన్న చోట
గొంతులు పెకిలేవి
చేతులు కలుపుకుంటూ
రాగం తీసేవి
ఇప్పుడు
ఎవరి దారి వారిది అన్నట్లుగా
విడి వడి పోయి
ఓడుతున్న దృశ్యాలు
ఈ రాతిరి కల మోసుకొచ్చింది..!
అడివిలో ఉన్న
మద్ది చెట్టు
లొద్దిలోని నీళ్లను
తాగిన ఆనవాళ్లు
కానుగు చెట్టు
కార్చిన కన్నీళ్లు
వేప చెట్టు
చల్లని నీడనా
సేద తీరిన క్షణం
మర్రి ఊడలతో
ఊగిన ఉయ్యాలలు
తుమ్మ చెట్టు
జిలుగుతో అతికించిన పుస్తకం
టేకు లొద్ది
తీర్చిన ఆకలి
మోదుగు వనమే
ఆశయాల ఆలంబనయి
ఎదురేగి వస్తున్న కాలనా
ఇంకా ఎంత కాలం
ఈ ఒంటరి పోరాటమంటూ
గువ్వలు రాగమెత్తుకున్నాయి..!
నిశి రాతిరిలో కన్న కల
వెన్నెల వెలుగులో
నన్ను తట్టి లేపింది
ఇది కలేనా అనుకుంటున్న
నా మనసుకు
దృశ్య రూపం ఇచ్చింది
సమస్యల జడివానను
పరిష్కరించే మార్గాన
ఏకునాదంలా సాగమంటూ
చెప్పిన ఈ రాతిరి
నాకు వెన్నెల వెలుగే..!
