Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ రాత్రి లిల్లీలు వికసిస్తాయి!

[గీతాంజలి గారు రచించిన ‘ఈ రాత్రి లిల్లీలు వికసిస్తాయి!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]


~ ~
ఈ రాత్రి లిల్లీ మొగ్గలు వికసిస్తాయి చూడు!
అవును! లిల్లీ మొగ్గలు బాల్కనీకి
పూలని వాగ్దానం చేశాయి!
అందుకు వాటికి నిశ్శబ్దం కావాలి.
ఏకాంతం కావాలి!
రాత్రి కావాలి.
వెన్నెల కావాలి.
నక్షత్రాలు, చంద్రుడు కావాలి.
సంగీతం కావాలి.
నూర్జహాన్ గజల్,
మేఘ మల్హర్ రాగం కావాలి!
కాసిన్ని వాన చినుకులు కూడా బహుశా!
~ ~
పూసే ముందర సంతోషంతో
పొంగిపోవడం కోసం,
వికసించాక ఒక్క రోజు లోనే కమ్ముకునే
మృత్యువుని తలుచుకుని
దుఃఖించడం కోసం,
లోక వియోగ విషాదాన్ని
భరించడం కోసం,
పూలకి ఒంటరితనం కావాలి!
~ ~
మనుషుల మాటలు లేని చోట,
కుట్రలు లేని చోట,
ఏ సవ్వడి లేనప్పుడు
అవి నిశ్శబ్దంగా విరబూస్తాయి!
~ ~
ప్రేయసి ప్రియుడిని తలుచుకుంటూ
దుఃఖిస్తున్న క్షణాల్లో,
ప్రియుడు ఆమె కోసం బయలుదేరి
ఆగిపోయిన క్షణాల్లో,
తల్లి పాల కోసం బిడ్డ ఏడుస్తున్న క్షణాల్లో,
ఈ లిల్లీ మొగ్గలు మెల్లగా వికసిస్తాయి!
~ ~
పూలకు వికసించే కాలాలు,
ఋతువులూ, తావులూ ఉంటాయి!
పూలు దుఃఖంలో వికసిస్తాయి,
దుఃఖంతో వికసిస్తాయి!
మృత్యువులో వికసిస్తాయి
మృత్యు వాసనలో వికసిస్తాయి!
పూలు నవ్వుల్లో పూస్తాయి!
అమరుల త్యాగాల్లో వికసిస్తాయి!
విప్లవంలో వికసిస్తాయి!
విప్లవ విజయాల్లో వికసిస్తాయి!
పూలు కవుల కలాల్లో పాటలై పూస్తాయి!
పూలు బంధిఖానాల్లో వికసిస్తాయి!
పూలు అడవుల్లో రహస్యంగా వికసిస్తాయి!
ఎన్నెన్ని కాలాలని పూలకి?
ఈ పూలకు ఎన్ని సాకులని పూయడానికి?
~ ~
ఎక్కడో అన్నార్తుల ఆకలి తీరిన ఘడియల్లో,
శ్రామికుడి శ్రమ విలువ పెరిగిన కాలాల్లో,
రైతుల ఉరి ఆగి, ఊపిరి నిలిచిన క్షణాల్లో,
కులమో, మతమో మనిషి రక్తం తాగని క్షణాల్లో,
ఆడపిల్లపై అత్యాచారం ఆగిన క్షణాల్లో,
ఆమె – అతడు సమానమయ్యే అద్భుత కాలంలో,
ప్రశ్నించినందుకో, కవిత్వం రాసినందుకో
కవిని బంధించని కాలాల్లో,
అప్పుడిక ఆ ఎర్రని సూర్యోదయాల్లో,
ఆ శీతల చంద్రోదయాల్లో,
ఆ క్షణాల్లోనే లిల్లీలు మృదువుగా
సంతోషంగా వికసిస్తాయి!
~ ~
పూలు ఇంట్లో వికసిస్తాయి!
మనిషిలో వికసిస్తాయి!
పసివాళ్లలో, ముసలి వాళ్ళల్లో వికసిస్తాయి.
అందమైన తోటల్లో,
పాడుబడ్డ శిథిలాల్లో వికసిస్తాయి!
~ ~
పూలు
బంధించిన కవి
రహస్యంగా రాసుకుంటున్న
కవిత్వాన్ని వెన్నెల్లో
నక్షత్రాల్లా వికసిస్తాయి!
~ ~
పూలు అన్ని కులాల్లో వికసిస్తాయి!
అన్ని మతాల్లో వికసిస్తాయి!
దేశ దేశాల్లో వికసిస్తాయి!
పూలు ఈ భూగోళమంతా వికసిస్తాయి!
ఆకాశంలో నక్షత్రాలై వికసిస్తాయి!
పూలు సముద్రంలో ముత్యాలై మెరుస్తాయి!
~ ~
మరి పూలు వికసించిన వెంటనే
ముచ్చట్లాడడానికి పిల్ల తెమ్మెరొకటి
సిద్ధంగా ఉండాలి!
వెన్నెల లిల్లీ పూల సుగంధంతో సంగమించి
పూల రెక్కలకి మంచు చెమటను అద్దాలి!
గాలి కూడా పూలకి వెచ్చని
నీరెండ స్పర్శనిచ్చి,
పూల పరిమళాల్ని దొంగలించి,
పూలని కౌగలించి, పారిపోవాలి!
~ ~
లిల్లీ మొగ్గలు ఉన్న చోట నువ్వెందుకు చెప్పు?
ఉండకు!
నువ్వక్కడ ఉండడం లిల్లీ లకి ఇష్టం ఉండదు!
పూయమని మొండికేస్తాయి!
అవును మరి!
లిల్లీలకి పూయడానికి తనదైన కాలం కావాలి!
~ ~
పూలకు ఏమీ తెలీదనుకోకు!
లిల్లీలకి ఈ లోక రీతి, నీతి రెండూ తెలుసు!
తెల్లారితే తన పయనం మృత్యుశయ్య మీదికో,
పెళ్లి హారంలోకో, పూల కుండీలోకో
ఎక్కడో లిల్లీలకి బాగా తెలుసు!
పూలు విరాగులు కూడా!
అందుకే.,
నీ ప్రేయసి పేరు, ఊరు
పూల చెవుల్లో రహస్యంగా చెప్పి,
బాల్కనీ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపో!
పూలు రహస్యంగా వికసించడాన్ని అందంగా కలగను!
సుగంధాన్ని, లిల్లీ రెక్కల
లాలిత్య సౌందర్యాన్ని
ఆ పూల సౌజన్యాన్ని
వెన్నెలకీ, రాత్రికి తెమ్మెరకూ వదిలి పెట్టు!
లిల్లీలకి వికసించడానికి నిశి రాత్రి వేళ
రహస్య క్షణమొకటి కావాలి!
~ ~
ఇక రాత్రిని మోహించిన లిల్లీలని ఉదయం దర్శించు!
పూల తలలను ప్రేమగా నిమురు!
కాసిన్ని ముద్దులివ్వు!
నీ ప్రియురాలికి నువ్వు
పూల పరిమళాలతో పంపిన
సందేశం ఇచ్చిన లిల్లీలు
బాధ్యతగా, బరువుగా, సౌందర్యంగా,
పరిమళంగా ఒకింత విషాదంగా
నవ్వుతాయి చూడు!
ఎందుకంటే నువ్వప్పటికే
పువ్వుగా మారిపోయి ఉంటావు!

Exit mobile version