Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈ తరం అత్తగారు

[శ్రీమతి గాడేపల్లి పద్మజ రచించిన ‘ఈ తరం అత్తగారు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

పూజగదిలో దేవుడి ముందు కూర్చున్న సుభద్రకు చూపు దేవుడి మీద ఉన్నదే కానీ ఆలోచన మాత్రం ఇక్కడ లేదు. ‘రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వాల’ అంటూ నోరు అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తున్నా, ఆమె మనసు మాత్రం కోడలు కావ్య కట్టుకున్న చీర మీదే ఉంది. ‘ఎంత బావుందో ఆ చీర’ అనుకుంటున్న సుభద్రకు అమ్మవారు తనవైపే అదోలా చూస్తున్నట్లనిపించింది. ‘ఏం చెయ్యనమ్మా, నువ్వంటే రాగద్వేషాలకు అతీతురాలివి. నేను సాధారణ మానవమాత్రురాలిని. నాకా శక్తిలేదు. క్షమించమ్మా’ అంటు పూజకు చరమాగీతం పాడింది.

పూర్వకాలంలో దేవతావస్త్రాలుండేవట. మెత్తటి పాము కుబుసంలా, పట్టులా ధగధగ మెరిసి పోతూ చాలా అందంగా ఉండేవట. అసలు కావ్య కట్టుకునే ప్రతి చీర అలాగే ఉంటుంది. ఒక రోజు డ్రస్సు, ఒక రోజు చీరలో అందంగా తయారయి ఆఫీసుకు వెళ్తుంది కోడలు. ఆమె బట్టలు చూస్తుంటే సుభద్రకు రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది. ఆమె చీరల ముందు తన ముతక చీరలు ఎందుకు పనికిరావు. పేటేరు, నారాయణపేట అని ఎన్ని పేర్లు పెట్టినా, తన ముతక చీరలన్నీ ఒకే రంగుతో సన్యాసి బట్టల్లా ఉంటాయి. అసలు తను చిన్నప్పటి నుండి ఒక మంచి చీర కట్టి ఎరిగుందా? ‘సంప్రదాయం, చట్టు బండలు ఆడపిల్ల ఇంటిగడప దాటకూడదు. ఫ్యాషన్‌గా ఉండకూడదు, రకరకాల కోరికలు కోరకూడదు’ అంటూ ఆంక్షలతో పెంచారు. అత్తగారింటికి వచ్చిన తర్వాత, “ఏమే సుభద్రా ఆ గంధప్పొడి రంగు చీర నువ్వు తీసుకో, ఈ వంగపండు రంగు చీర నేను తీసుకుంటా” అంటూ అత్తగారు తన చీరలను ఆవిడ గుప్పెట్లో పెట్టుకుంది. అప్పటి నుండి తన కోరికలకు కళ్ళాలు వేస్తునే ఉంది. ఇంక తనకు అవన్నీ అందని చందమామలే అనుకుంది సుభద్రమ్మ.

ఆ మధ్య బంధువుల ఇంటికి పెండ్లికి వెళ్ళింది. తన వయసు వాళ్ళనీ తన కంటే పెద్దవాళ్ళని కూడ గమనించింది సుభద్రమ్మ. అత్తలు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ ఒకే రకం బట్టలు, నగలతో మిలమిల మెరిసిపోతూ కనిపిస్తున్నారు. అందరికే నల్లగా నిగనిగలాడే హెయిర్ స్టైల్‌తో వయను ఓ ముపై ఏళ్ళు తగ్గినట్లు కనిపిస్తన్నారు. తనొక్కతే పురావస్తుశాఖలో దొరికిన వస్తువులా వెలవెలబోతోంది. తనకంటే పదేళ్ళు పెద్ద వసుంధర పిన్ని తన చెల్లెలులా ఉంది. “ఏమే సుభద్రా నువ్వేమి మారలేదే?” అన్నది తనవంక ఎగాదిగా చూస్తు. అక్కడికి తను ఎవ్వరికి కనబడకుండా తలకు రంగు వేసుకుంటూనే ఉంది. కోడలు చూస్తే ఏమన్నా అనుకుంటుందేమో అని భయం. కళ్ళెం వెయ్యలేని తన కోరికలను ఓ రోజు తన భర్త ముందు వెళ్ళబోసుకుంది. రెండు నైటీలన్నా తెచ్చిపెడితే, చాటుగా ఎవరు చూడకుండా వేసుకుంటానని అడిగింది. “ఛీ, ఛీ ఈ వయసులో ఇవేం పాడు కోరికలు? నువ్వు ఈ ఇంటికి పెద్దదానివి. వయసుకు తగ్గట్టుగా ఉంటేనే అది పెద్దరికమవుతుంది. పిల్లలు చూస్తే నవ్వుకుంటారు” అన్నాడు భర్త వేదాంతరావు సీరియస్‌గా. మరోసారి అడగడానికి సాహసించలేదు సుభద్ర. కానీ మనసులో కోరిక ఇంతింతై మహావృక్షమైంది. ఎలాగైనా తన కోరికలన్నీ తీర్చుకోవాలి.

మెత్తగా జారిపోతూ ఉండే ఆ బట్టలు వేసుకోవాలి. జుట్టును అలా వదిలేసి, లిప్‌స్టిక్ పెట్టుకుని, ఎత్తు చెప్పులేసుకుని, అందమైన బ్యాగ్ తగిలించుకుని బయటకు వెళ్ళాలి. ‘అది కదా జీవితం’ అనుకుంది సుభద్ర. ఆ రోజు ఏదో మీటింగ్ ఉన్నదంటు కొడుకు, కోడలు తొందరగా ఆఫీసుకు వెళ్ళిపోయారు. వేదాంత రావు ఏదో పని మీద ఊరు వెళ్ళాడు. అదే అదనుగా కోడలి బీరువాలో నుండి తనకెంతో ఇష్టమైన లెమన్ ఎల్లో చీర బయటకు తీసింది. గబగబ చీర కట్టుకుని అద్దంలో చూసుకుంది. అబ్బ, తన్ను తానే నమ్మలేక పోయింది. కావ్యకు అక్క అంటే నమ్మచ్చు. తొందరేం లేదు. ఇప్పట్లో ఎవరూ రారు. ఎంత జాగ్రత్తపడ్డా అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు తొంగి చూసి వెక్కిరిస్తూనే ఉన్నాయి. తన కుంకుమబొట్టు చెరిపేసి కోడలు పెట్టుకునే రంగు స్టిక్కర్ పెట్టుకుంది. అందంగా లిప్‌స్టిక్ వేసుకుంది. అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోయింది సుభద్ర.

ఇంతల్ కాలింగ్ బెల్ మ్రోగింది. ‘ఈ టైం ఎవరు వచ్చుంటారు. ఆ, ఏ కొరియర్ వాళ్ళు అయ్యుంటారు. కాసేపు డోర్ ఓపెన్ చెయ్యకపోతే వెళ్ళిపోతాడు’ అనుకుంటూ తలుపు తియ్యలేదు. రెండు నిముషాల తర్వాత తలుపు దబదబ కొడుతున్నారు. కొరియర్ కాదేమో? ఈ టైంత ఇంట్లో వాళ్ళెవరు రారు కదా! పోనీ ఇలాగే వెళ్ళి తలుపు తీస్తే? ఎవరు వచ్చారో ఏమిటో? చూద్దాం అనుకుంది సుభద్రమ్మ. అప్పుడు ఫోన్ రింగయింది. అది కోడలు కావ్య నంబరు. ఫోన్ తియ్యగానే, “అత్తయ్యా, నేను. డోర్ ఓపెన్ చెయ్యండి. ఏం చేస్తున్నారు?” అన్నది కావ్య. ఇంక కాళ్ళల్లో వణుకు మొదలైంది సుభద్రమ్మకు.

“వస్తున్నా” అంటూనే గబగబ చీరమార్చుకుని, మడతపెట్టి బీరువాత పెట్టింది. ముఖం మీద స్టిక్కర్ తీసేసింది. టవల్‌తో గబగబా లిప్‌స్టిక్ తుడిచేసుకుంది. ఎంత తొందరగా చేసినా పది నిముషాలు పట్టింది. అత్తగారు తలుపు ఎందుకు తియ్యడం లేదా అనే ఆత్రుతతో కిటికీ దగ్గరకు వెళ్ళిన కావ్యకు అత్తగారు లిప్‌స్టిక్ టవల్‍తో గబగబా తుడుచుకోవడం, విరబోసిన జుట్టు ముడివేసుకోవడం కనిపించింది. ఏమీ తెలియనట్లు డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండిపోయింది. అత్తగారి పోకడలు కొద్దిగా అర్థమై నవ్వుకుంది.

పది నిముషాల తర్వాత వచ్చి తలుపు తీసింది సుభద్ర. ఆవిడ మొహంలో తడబాటు అర్థమైంది కావ్యకు. ఏమీ తెలియనట్లు “ఎందుకు అత్తయ్యా? అలా ఉన్నారు! ఒంట్లో బాలేదా? అయ్యో, బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారా అత్తయ్య?” అని అడిగింది. తను స్టిక్కర్ తీసి కుంకం పెట్టుకోలేదనే విషయం గుర్తొచ్చి ఖంగుతిన్నది సుభద్ర. ఏమీ జరగనట్లు గబగబా బొట్టు పెట్టుకుని వచ్చింది. ‘తను మర్చిపోయిందే అనుకో అలా బొట్టు పెట్టుకోలేదత్తయ్యా’ అని అడగాలా? చూసే ఉంటుంది కిటికీలో నుండి. మరేం పర్వాలేదులే. అందరు చేసే పనేగా. తనెందుకు అంతలా భయపడటం, అంటూ సముదాయిస్తున్న మనసును సమర్థిస్తూ మరో ప్రయత్నం చేద్దామనుకుంది.

రెండు రోజుల తర్వాత ఓ రాత్రి నిద్రలో సుభద్రమ్మకు ఓ బంగారు లాంటి కల. కలలో సుభద్ర అందమైన సిల్క్ చీర కట్టుకుని హాండ్‌బ్యాగ్ ఊపుతూ హడావిడిగా తిరుగుతోంది. తన చీరను, తన అందాన్ని అందరూ మెచ్చుకోలుగా, ఈర్ష్యగా చూస్తున్నారు అనుకున్నది సాధించిన ఆనందంతో ఆమె మనసు ఉరకలు వేస్తోంది. ఆ ఆనందంతో తనెక్కడ ఉన్నదో అర్థం కాక మంచం మీదనుండి జారి దబ్బుమని క్రిందపడింది. ‘అయ్యో’ అంటూ అందరు ఆమె చుట్టు చేరారు. ఆమెను పైకి లేపి కూర్చోబెట్టారు.

“అదేమిటి సుభద్రా అలా పడ్డావేంటి?” అన్నాడు భర్త.

కాలు నొప్పిచేసి అడుగువేయడం కష్టంగా ఉంది. డాక్టర్ వచ్చి కట్టుకట్టి నెలరోజుల వరకు మంచం దిగొద్దని వార్నింగ్ ఇచ్చివెళ్ళాడు.

‘ఛీ, ఛీ. నెలరోజుల వరకు ఇలాగే పడుండాలా’ అనుకుని నిరాశ పడింది సుభద్ర.

కోడలు మాత్రం, “అత్తయ్యగారు స్వప్నలోకంలో ఉన్నారేమో మామయ్యా” అంటూ గడుసుగా అనేసి వెళ్ళిపోయింది.

(సమాప్తం)

Exit mobile version