[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ఈ వసంత యాత్రావళిని వృథా చేయకు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ రేయి..
ఈ వెన్నెల..
మళ్ళీ తిరిగి రావేమో!?
ఈ వెన్నెల రాత్రి
సాదా సీదాగా కనిపించేది కాదు సుమా!
ఇది..
ప్రేమ ఆకాశావు అంచులు తాకిన రాత్రి!
మన హృదయాలు
భావనా శిఖరాగ్రాన వున్న
ఈ సుమధుర క్షణాలలోనే
మనం మన హృదయ గాథలను
పరస్పరం పంచుకుందాం..
రా ప్రేయసీ!
మన హృదయ భావనల్లో
మునిగి తేలుతున్న వెన్నెల..
ఈ చెట్టు కొమ్మల పైన
నిద్రలో జోగుతున్న వెన్నెల..
మరి కాసేపట్లో అలసి సొలసి
వెను తిరిగి వెళ్ళిపోతుంది!
ఈ అమృత ఘడియల సమయం
ఇంకా ఒకటి రెండు ఘడియలే!
నువ్వు పొరబాటున జాగు చేసినా..
ఈ వసంత సుమనోహర రేయి
మళ్ళీ తిరిగి రాదు కదా చెలీ!
పిల్ల తెమ్మెరల అలలపై
సువిశాల శూన్యం వేదికగా..
ప్రణయరాగం మెల్లమెల్లగా సాగుతోంది!
తడి తడి గాలులలో నిప్పు
చల్లచల్లగా రగులుతోంది!
ఈ విరహాగ్ని నా తనువును ఆవహించి
తియ్యని భాధకు గురిచేస్తోంది!
మరి.. ఈ అందమైన అగ్నిలో
నువ్వూ ఒక్కసారి కాలిపోకూడదూ!?
నీ జీవన గీతపు బాణీని
నా కోసమైనా..
ఒక్కసారి మార్చి చూసుకో!
ఈ విధంగానైనా –
మన ఇద్దరి హృదయ ధ్వనుల భాష
ఒకేసారి వెలికి రానీ!
విజ్ఞాన ఖనివైన నీకు తెలుసు..
ప్రేమంటే తీయని బాధేనని!
ప్రేమించడం అంటే..
భగ భగ మండే అగ్ని సరస్సులో
గుండె నిబ్బరంతో ఈదులాడటమేననీ!!
ప్రేమ సాగరంలో దిగిన తర్వాతే
మన ఇద్దరికీ తెలిసింది..
మధురమైన బాధ ఇదేననీ!!!
అనుభవాల రహదారులపై పయనించి
అనుభూతుల తీరానికి చేరుకుంటే..
ఆ హృదయానందమే వేరు కదా!
ఇదిగో..
మళ్ళీ వసంతం పిలుస్తోంది!
పరువాలు ఎగిసెగిసి పడుతున్నాయి కదా
నక్షత్రాల నీడల్లో
కథలు చెప్పుకోమని
వసంత రాత్రి ఆహ్వానం పలుకుతోంది!
ఈ వసంత యాత్రావళిని
వృథా చేయకు ప్రేయసీ!
ఈ రేయి కనుమరుగై పోతే..
తిరిగి ఎప్పుడొస్తుందో తెలీదు.
వసంతాల కాలమానాలు..
పరువాల నిలువెత్తు భావోద్వేగాలు..
చంద్రుడితో బాటే వెళ్ళిపోతున్న వెన్నెల..
ఇవేవీ శాశ్వతం కాదు కదా!
నక్షత్రాల వెలుగులోనైనా
కథలు చెప్పుకుంటూ..
ఈ యవ్వన కాలాన్ని
పండగ చేసుకుందాం!
వేగిరం వచ్చేసెయ్..!
సుదీర్ఘమైన నా నిరీక్షణకు
తెర దించేసి
నన్ను అనుగ్రహించు ప్రియసఖీ!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
