Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈనాటికైనా..

[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘ఈనాటికైనా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

మధ్యాహ్నం శైలు ఫోన్ చేసిన దగ్గర నుంచి, నా ఆలోచనలు పరి పరి విధాలు పోతున్నాయి. ఏం చేయాలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాను. ఇది అనుకోకుండా దొరికిన అవకాశం! వదులుకుంటే మళ్ళీ ఇలాంటిది రాదు. ఏం చేయను?

శైలు డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా చేస్తోంది. అది చిన్న కాలేజీ. జీతాలు పెద్దగా వుండవు. శైలు ఇంకా మంచి జీతం కోసం ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. తనకిప్పుడు లయోలా కాలేజీలో ఉద్యోగం వచ్చింది. తను కోరుకున్న జీతం.

ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసింది. “ఆంటీ! నేను ఇక్కడ మానేస్తున్నాను. మీరు చేరిపోండి. మా కాలేజీ చాలా బాగుంటుంది. తోటి లెక్చరర్లందరూ బాగా కలిసిపోతారు. మీరు ఈ మధ్య ‘ఏ మార్పు లేకుండా ఎల్లకాలం ఇంతేనా!ఇలా యాంత్రికం గా గడిపేయాలా!ఉద్యోగం చేస్తే బాగుండును’ అంటున్నారు కదా! ఈ మార్పు మీకు చాలా బాగుంటుంది. మీరు వస్తానంటే నేను మా డైరెక్టర్ మేడంతో చెపుతాను” అంది.

నేను తెలుగు ఎం.ఏ. చదివాను. పెళ్లయిన కొత్తలో కొన్నాళ్ళు లెక్చరర్‌గా చేసాను. తరవాత వరసగా పిల్లలు పుట్టటం, వాళ్ళను పెంచటం, వాళ్ళ చదువులు, అత్తమామలు వచ్చి మాతోనే ఉండటం.. వీటన్నింటితో ఉద్యోగం మానేయమన్నారు. అప్పటినుంచి చదివిన చదువుతో సంబంధం పోయింది. అప్పట్లో కవితలు, కథలు కూడా రాసేదాన్ని. పెళ్లి తెచ్చిన బరువైన బాధ్యతలతో నాలోని సృజనాత్మకత నా నుంచి ఎప్పుడు తప్పుకుపోయిందో కూడా నేను గమనించలేదు. కాని, ఉద్యోగం చేయాలని, ఇంటికే జీవితం పరిమితం కాకూడదని, నాదైన ప్రపంచం, నా స్నేహితులు, నావైన వ్యాపకాలు నాకుండాలనే కోరిక నాకు చాలా ఉండేది. కాని, కాదనలేని బాధ్యతలు! ఆర్థికంగా ఇబ్బంది లేని కుటుంబం. ముఖ్యంగా నేను ఉద్యోగం చేయటం ఇష్టం లేని కుటుంబ మనస్తత్వం! నా ఇష్టం ఏనాటికైనా తీరేనా!

ఇంటెడు పని. ఇంటినిండా పని. చేతి నిండా పని. ఒకే విధమైన పని. రుచులు రుచులుగా వంట చేయటం, ఇంట్లో అందరికీ వాళ్ళ టైమ్‌కి భోజనం పెట్టటం, ఒక్కొక్కళ్ళు ఒకో టైమ్‌లో తింటారు వీళ్ళు. అప్పుడప్పుడు వచ్చే బంధువులతో ఇంకొంచెం అదనపు పని సందడి. అంతే! ఎక్కడికైనా పెళ్లిళ్ళకి, శుభాలకి వెళ్లినా ఆ పని చూసుకుని వెంటనే వచ్చేయాలి. వాళ్ళందరూ కూడా మన పిల్లల పెళ్లిళ్ళకి రావాలి కాబట్టి మనం వెళ్లి అటెండెన్సు వేసుకురావాలి అనే తత్వం నా భర్తది. తీర్థయాత్రలు, విహార యాత్రలు వంటి వాటికి ఆయన చాలా దూరం. ఉద్యోగమే ఆయన లోకం. ఇల్లే నా ప్రపంచం!

ఇప్పుడు ఈ పంజరంలో నుంచి బైటకి వెళ్లే ఒక దారి దొరికింది. అవకాశం వచ్చినప్పుడు వదులుకుని తర్వాత చింతించటం మన తప్పే అని ఎవరో అంటే విన్నది గుర్తు వస్తోంది. ఆలోచించి, ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా వారి కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన బ్యాంకు మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. వేరే కంపెనీ వాళ్ళు పిలిస్తే ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇదివరకు లాగానే పొద్దున్నే భోజనం పట్టుకువెళ్లి సాయంత్రం ఆరింటికి ఇంటికి వస్తారు. వచ్చిన వెంటనే చెప్పాలి. ఇందులో ఆయన కాదనటానికి ఇప్పుడు ఏం లేదు. పిల్లలు పెళ్లిళ్లయి, దూరాన ఉన్నారు. ఎప్పుడో గాని రారు. ఒకవేళ ఆయన ఏమైనా అభ్యంతరం చెప్పినా, వయసు తెచ్చిన అనుభవంతో నేనూ గట్టిగానే చెప్పగలననే ధైర్యం ఉంది.

శ్రీవారు ఆరింటికి వచ్చారు. టీ ఇచ్చి, నెమ్మదిగా విషయం చెప్పాను.

“ఈ వయసులో నీకు ఉద్యోగం అవసరమా?” అన్నారు.

“ఈ వయసు లోనే అవసరం” అన్నాను.

“ఎందుకు అంత శ్రమ! నీకు ఎంత డబ్బు కావాలంటే అంతా నేను ఇస్తాను కదా” అన్నారు.

“నాకు డబ్బు కాదు కావలసింది. నాదైన జీవితం. బైట ప్రపంచం, స్నేహితులు, తృప్తి, నా చదువుకు సార్థకత కావాలి. ఇప్పుడు బాధ్యతలన్నీ తీరాయి కాబట్టి వెళ్లాలనుకుంటున్నాను”, అన్నాను. నేను ఆయన్ని అనుమతి అడగలేదు. నా నిర్ణయం చెప్పాను. ఆయనకి అర్థం అయింది.

“నీ ఇష్టం” అనేసారు.

రాత్రి పదింటికి శైలుకి ఫోన్ చేసాను.

“శైలూ! నేను పాఠాలు చెప్పటం మానేసి 35ఏళ్ల పైన అవుతోంది. నా వయసు 61. మరి నన్ను తీసుకుంటారా? అసలు నేను చెప్పగలనా? నాకైతే రావాలనే ఉంది”, అన్నాను.

“ఆంటీ, నేను మేడంతో మీ గురించి చెపుతాను. తప్పకుండా తీసుకుంటారు. తెలుగుకు ఎక్కువ మంది పిల్లలు వుండరు. క్లాసుకి 20 మంది కంటే ఎక్కువ ఉండరు. మీకు ఇబ్బందేం ఉండదు. రేపు తెలుగు టెక్స్ట్ తెచ్చి ఇస్తాను. రేపే మేడంతో మాట్లాడతాను”, అంది. శైలు ప్రోత్సాహం నాకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

శైలు వాళ్ళు కిందటేడాది వరకూ మా ఎదురు అపార్ట్‌మెంట్ లోనే ఉండేవారు. ఇంటివాళ్ళు ఖాళీ చేయమంటే పక్క సందు లోకి మారారు.

శైలు మర్నాడు పుస్తకం తెచ్చింది. రేపు మీరు క్లాసు తీసుకోవాలని చెప్పి ఏ పాఠం చెప్పాలో కూడా చెప్పి, బాగా చదివి సిద్ధం కమ్మని చెప్పి వెళ్ళింది. ‘సీతా సాంత్వనం’ పాఠం. చదివి, బాగా ప్రిపేర్ అయ్యాను. రాత్రంతా నిద్ర లేదు. బాగా చెప్పగలనా, లేదా, కాలేజీలో పిల్లలు గొడవ చేస్తారా, ఉద్యోగం వస్తే బాగుండును, ఎంత జీతమైనా ఫరవాలేదు, ఈ ఆలోచనలతో ఎప్పుడో కాస్త నిద్ర పట్టింది.

మర్నాడు శైలు డైరెక్టర్ మేడంకి నన్ను పరిచయం చేసింది. చిన్నావిడే. 40 ఏళ్ళు వుంటాయేమో! బాగా మాట్లాడారు. “డిగ్రీ వాళ్లకు 9 నుంచి ఒంటిగంట వరకు. మధ్యాహ్నం, ఇంటరు వాళ్లలో తెలుగు చదివేవాళ్ళు కొందరు వున్నారు. ఒక క్లాసు తీసుకోవాలి. మూడింటివరకు ఉండాలి. ఉంటారా”, అని అడిగారు.

ఉంటానని చెప్పాను.

క్లాసుకి పంపించారు. పిల్లలు శైలు చెప్పినట్లు 20 మంది దాకా ఉన్నారు. తెలుగులో తెలివి లేదు కాని, బుద్ధిగా కూర్చుని బాగానే విన్నారు. చెప్పగలననే ధైర్యం వచ్చింది. శైలు చెప్పినట్లే లెక్చరర్లు అందరూ బాగా మాట్లాడుతున్నారు. అందరూ నాకన్నా చిన్నవాళ్లే!

రోజూ, నా భర్తకి క్యారియర్ పెట్టేసి, నేనూ పెట్టుకుని భుజాన బ్యాగ్ తగిలించుకుని, చేతిలో లంచ్ బ్యాగ్‌తో కాలేజీకి వెళుతుంటే ఒక అంతులేని ఆత్మ విశ్వాసం, తృప్తి, గర్వం నాలో ప్రతి ఫలిస్తున్నాయి. రోజూ వంట కూడా ఉత్సాహంగా చేస్తున్నాను. కూరలు, పచ్చళ్ళు, సాంబారు అన్నీ లంచ్ టైమ్‌లో అందరం పరస్పరం పంచుకుంటుంటే, వాళ్ళందరూ నా వంటలు మెచ్చుకుంటుంటే, ఇంట్లో దొరకని గుర్తింపు, ప్రశంస కాలేజీలో పొందుతుంటే ఎంత సంతోషంగా ఉందో!

ఎప్పుడో చేసి వదిలేసిన ఉద్యోగం! ఇప్పటి పిల్లల ప్రవర్తన గురించి చాలా వింటున్నా, చూస్తున్నా. ఎలా వుంటారో అని భయపడ్డాను. కాని, తక్కువ మంది కావటం వల్ల బాగానే ఉన్నారు. విద్యార్థులతో కూడ మంచి అనుబంధం ఏర్పడుతోంది.

ఇంట్లో వున్నప్పుడు వయసు, మనసుకు గుర్తు చేస్తూ, లేని వ్యాధులు ఉన్నట్లు భ్రమింపజేసేది. ఇప్పుడు వయసు గుర్తుకు రావట్లేదు. ఏ నొప్పులు గుర్తించేంత తీరికా ఉండట్లేదు. ఈ పని పరుగులో ఉత్సాహం, ఉంది. చైతన్యం ఉంది. ఈనాటికి కదా నా ఇష్టం నెరవేరింది!

ఇన్నాళ్లు లేనిది ఈ వయసులో ఉద్యోగం చేయటం అవసరమా, భర్త సంపాదించి తెస్తుంటే హాయిగా ఇంట్లో కూర్చోక! అని కొందరి, బాధ్యతలన్నీ తీరాక, చదువును సార్థకం చేసుకుంటోంది. మంచి పనే చేస్తోంది అని కొందరి, బంధువుల విమర్శలు, ప్రశంసలు సమానంగా స్వీకరిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్నాను.

ఇప్పుడు కదా నేను జీవించటం మొదలు పెట్టింది! ఇది కదా జీవించటం అంటే! ఈ వయసులో ఆరోగ్యకరమైన వ్యాపకం ఏర్పడింది. నా కోసం నేను, నా వ్యక్తిత్వంతో నేను, నా అస్తిత్వంతో నేను జీవిస్తున్నది ఇప్పుడే కదా!

Exit mobile version