Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఈయన కాఫీతోనే రోజూ తెల్లారుతుంది!!

[ఫేస్‌బుక్‌లో ‘కాఫీ విత్..’ శీర్షిక నిర్వహించే ఎ. రజా హుస్సేన్ గారిని పరిచయం చేస్తున్నారు శ్రీమతి సత్యగౌరి మోగంటి.]

ఎ. రజా హుస్సేన్ జీ కి సాహిత్యంతోనే తెల్లవారుతుంది. సాహిత్యంతోనే పొద్దుపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఆయనకు అదే జీతం భత్యం లేని ఉద్యోగం. అన్ని ప్రక్రియల్లో సాహిత్యం లోతు పరిశీలన చేసి పరిచయం చేస్తారు. ఈయన ఊపిరే సాహిత్యమనుకుంటా!

‘కాఫీ విత్..’ శీర్షిక అబ్దుల్ రజాహుస్సేన్ గారి సాహిత్య ప్రయాణంలో ఒక మహోన్నత అంశం.

ఈ శీర్షిక ద్వారా వారు ఎందరో కవులు, రచయితలు, కళాకారులను పరిచయం చేశారు. ఇప్పటికి 3224కి పైగా ఎపిసోడ్స్ లో వివిధ సాహితీవేత్తల జీవితం, వారి సాహిత్య సేవలను విశ్లేషించారు.

వివిధ సాహితీవేత్తల జీవితం,వారి సాహిత్య సేవలను విశ్లేషించడం, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను పరిచయం చేయడం వీరి ప్రత్యేకత. ఇందులో భాగంగానే మరుగునపడిన అనేక మందిని వెలుగులోకి తీసుకురావడం, సాహిత్య ప్రేమికులకు ఒక నూతన దిగంతాన్ని చూపడం ఆయన అలవాటు.

సాహిత్యంలో ఒక అద్భుత దృగ్విషయంగా మారిన కాఫీ శీర్షిక, అబ్దుల్ రజాహుస్సేన్ గారు సాహిత్యాన్ని నిత్యావసర సరుకుగా పాఠకులకు పంచడం విశేషం.

రజా హుస్సేన్‌ ప్రాచీన తెలుగు సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్య వరకు అన్ని ప్రక్రియలను విశ్లేషిస్తారు. నన్నయ్య నుంచి నా దాకా అన్నట్లు, తరం ఏదైనా ఆయనకు మాత్రం ఒకటే.. ముఖ్యంగా.. సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్) ఆయన సాహిత్యం తోనే తెల్లవారుతుంది. సాహిత్యంతోనే పొద్దుపోతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు అక్షరార్చనే..

సమయం దొరకపుచ్చుకుని సాహితీవేత్తలను కలుస్తుంటారు. వారితో సాహిత్య చర్చలు కొనసాగిస్తారు.

అలాగే సాహితీ సమావేశాలకు సభలకు హాజరవుతుంటారు.. సభలో కార్యక్రమం పూర్తయ్యేలోగానే అక్కడి విషయాలను లైవ్ రిపోర్ట్ పేరుతో అప్పటికప్పుడే పోస్ట్ చేసి ఆశ్చర్యపరుస్తుంటారు.

పద్యం, కవిత్యం, జానపదం, కథ, సాహితీవిశ్లేషణ, ప్రోత్సాహం, విమర్శలతో ఎంతో మంది సాహితీవేత్తల సాహిత్యపు లోతులను పరిశీలించి, పరిశోధించి పాఠకులకు అందిస్తారు. కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారుల  జీవితాలను స్పశించి, వారి ఆలోచనలు, భావాలు, సాహిత్యం జీవన శైలిని అందరికీ అందిస్తుంటారు.

సాహిత్యంలో ఫలానా అని కాకుండా, విమర్శ, విశ్లేషణ, కవిత్వం, చిత్రకళ.. కథ, నవల ఒకటేమిటి? ఆయన కళ్ళల్లో పడితే పాఠకులకు చేరాల్సిందే..

అక్షరాలతో ఆయనకు విడదీయలేని బంధం. రచనల ద్వారా ఏమీ ఆశించరు సరికదా! పుస్తకాల ముద్రణకు తన పెన్షన్‌ డబ్బుని కూడా ఖర్చు చేస్తూ సాహితీ సేవకు అంకితమైపోయిన అక్షర తపస్వి ఆయన.

వర్తమాన మనిషి.. మనిషితనం, మానవత కోల్పోతున్నాడని, డబ్బు, స్వార్థం, ద్వేషం వంటి దుర్గుణాలకు లోనవుతున్నాడన్న ఆవేదన ఆయనది.. ఆయన కవిత్వంలో ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది..

ఆయనెప్పుడూ ఇలాగే  వివిధ సాహితీవేత్తల జీవితంవారి సాహిత్య సేవలను విశ్లేషిస్తూ.. సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను పరిచయం చేస్తూ, సాహిత్యంలో మరుగునపడిన అనేక మందిని కాఫీవిత్ శీర్షిక ద్వారా వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటూ..!!

Exit mobile version