Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏకాదశ శివక్షేత్రాలు

[మహాశివరాత్రి సందర్భంగా ‘ఏకాదశ శివక్షేత్రాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు గోనుగుంట మురళీకృష్ణ.]

లింగము అంటే ఆద్యంతములు లేనిది అని అర్థం. అగోచరమైన దివ్యతత్వమును మానవులు గ్రహించటానికి నిదర్శనముగా లింగము ఉద్భవిస్తున్నది. ఆ లింగ స్వరూపుడే పరమేశ్వరుడు. సర్వ జీవుల హృదయాల్లో ఆత్మరూపుడై వెలసిన పరమేశ్వరుడు ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనని పూజించుకోవటానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు. వీటిలో తనకు తానుగా స్వయంగా వెలసినవి కూడా ఉన్నాయి (వేరొకరు ప్రతిష్ఠించినవి కాకుండా). వాటిలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవి *ద్వాదశ జ్యోతిర్లింగాలు.

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి కాదు గానీ కొన్ని శివక్షేత్రాల ప్రస్తావన సంబంధించి ఒక చక్కని పాట ‘దేవకన్య’ (1968) చిత్రంలో ఉన్నది. ఇందులో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పేరుబడిన వాటిలోవి కొన్ని ప్రస్తావనకు వస్తాయి. ఈ పాట టి.వి.రాజు సంగీత నిర్వహణలో ఘంటసాల గానం చేశారు. వీటూరి రచించారు. కాంతారావు నటించారు. ఈ పాటను విశ్లేషించే ముందు పాట యొక్క నేపథ్యం గుర్తుచేసుకుందాం.

అలకాపురాధీశ్వరుడైన కుబేరుడు ప్రతిరోజూ తన సరోవరంలో పూసిన రుద్ర పారిజాతాలతో పరమేశ్వరుని అర్చిస్తూ ఉంటాడు. అందుకు విద్యాధరుడు అనే గంధర్వుడిని నియోగిస్తాడు. విద్యాధరుడు ఆ పారిజాత కుసుమాలు కోసుకువచ్చి కుబేరుడికి అందిస్తూ ఉంటాడు. ఒకరోజు ప్రియురాలు కిన్నెరతో ప్రణయ పారవశ్యంలో పడి ఒక కుసుమం ఆమె సిగలో అలంకరిస్తాడు. దైవపూజకు వినియోగించాల్సిన పవిత్రమైన పూజాకుసుమం అపవిత్రం అయి అంతర్ధానం అయిపోతుంది. జరిగిన విషయం తెలుసుకున్న కుబేరుడు వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శపిస్తాడు. మన్నించమని వేడుకున్న విద్యాధరుడితో ఒక్కజాములో పదకొండు శివక్షేత్రాలను సందర్శించగలిగితే శాప విమోచనం అవుతుంది అని చెబుతాడు కుబేరుడు.

విద్యాధరుడు భూలోకంలో జన్మిస్తాడు. కథ అనేక మలుపులు తిరిగిన తర్వాత శత్రువులు అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు దాడిచేస్తారు. అతడితో యుద్ధం చేసి, స్పృహతప్పి పడిపోతే మరణించాడని అనుకుని అతడి శరీరాన్ని విసిరేస్తారు. అది వెళ్లి ఒక చెట్టుకొమ్మల్లో చిక్కుకుంటుంది. అదృష్టవశాత్తూ అది సంచారవృక్షం. ప్రతిరోజూ పదకొండు శివక్షేత్రాలను దర్శించి వస్తుంది. విధ్యాధరుడికి మెలకువ వచ్చి చూసేసరికి సంచారవృక్షం ఆకాశంలో తేలుతూ వెళుతూ ఉంటుంది. గగనమార్గంలో నుంచే శివక్షేత్రాలను దర్శిస్తూ ఇలా ప్రార్ధిస్తూ ఉంటాడు.

“ఈశా గిరీశా మహేశా జయ కామేశ కైలాస వాసా!”

“గంగా తరంగాల కలుషాలు మాపే కాశీ పురాధీశ విశ్వేశ్వరా!
మోక్షద్వారము దాక్షారామము భవభయ దూరా భీమేశ్వరా!
భక్తవ శంకర భ్రమరాంబికావర శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా!”

గంగానది యుక్క పాపాలను పోగొట్టే కాశీపురంలో వెలసిన విశ్వేశ్వరుడా! అని మొదటిగా ప్రార్దిస్తున్నాడు. గంగానది పవిత్రమైనది కదా, పాపాలు పోగొట్టటమేమిటి? అని సామాన్యులకు సందేహం రావచ్చు. మానవులందరూ గంగాస్నానం చేసి పునీతులైతే వారి పాపాలు గంగాదేవిని పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటిని పోగొట్టి తిరిగి పవిత్రతను కలిగించేవాడు పరమేశ్వరుడు. కాశీక్షేత్రంలో వెలసిన ఈశ్వరుడి గురించి ఒక కథ ఉంది.

ఈ బ్రహ్మాండం యొక్క వైశాల్యం యాభైకోట్ల యోజనాలు అని అప్పటి మునుల అంచనా. ఇంత పెద్ద బ్రహ్మాండంలో బ్రహ్మచేత సృష్టించబడే జీవకోటి పడబోయే శ్రమలను ముందుగానే గుర్తించిన పరమశివుడు జీవులను ఉద్దరించే నిమిత్తం ఒక పట్టణం ఏర్పరచాడు. అదే కాశీపట్టణం. బ్రహ్మాదిదేవతలు అందరూ ఈశ్వరుడిని ప్రార్థించి “స్వామీ! నువ్వు ఇక్కడే శాశ్వితంగా నిలిచి ఈ పట్టణాన్ని కాపాడు” అని ప్రార్ధించారు. శివుడు వారి ప్రార్ధనలు మన్నించి విశ్వేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగ రూపంతో వెలశాడు. విశ్వాన్ని కాపాడటం కోసం అవతరించాడు కాబట్టి విశ్వేశ్వరుడు అని పేరు వచ్చింది.

కాశీ పట్టణం వరుణ, అసి అనే రెండు నదుల మధ్య ఉండటం వలన దీనికి ‘వారణాసి’ అని పేరు వచ్చింది. ఆదిశక్తి అన్నపూర్ణగా వెలిసి నిరతాన్నదానం ప్రసాదిస్తున్నది. ఇక్కడ పవిత్రమైన గంగలో స్నానం చేయటం వలన పాపాలన్నీ నశించిపోతాయి. కాశీలో మరణించిన వారికి శివసాయుజ్యం లభిస్తుంది.

భవబంధాలలోని భయాలను పోగొట్టి మోక్షాన్ని ఇచ్చే ద్వారం లాంటిది దక్షారామం (పూర్వం దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దక్షారామం గా ప్రసిద్ది చెందింది. కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది) అక్కడ వెలసిన ఈశ్వరుడు భీమేశ్వరుడు. ఇక్కడ భీమేశ్వర లింగం స్వయం భూలింగం (తనకు తానుగా భూమిపై ఏర్పడినది). భరద్వాజుడు మొదలైన మహర్షులు భీమేశ్వరలింగ ప్రతిప్రతిష్ఠా మహోత్సవం కోసం ఒక శుభ ముహూర్తం నిర్ణయించారు. ఆ ప్రాంతంలో ప్రవహించమని ప్రార్థించటానికి గోదావరి దగ్గరకు వెళ్ళారు. ఈ కార్యం నెరవేర్చటంలో అనుకోకుండా కొద్దిగా ఆలస్యం అయింది. వారు వచ్చి చూసేసరికి భీమేశ్వరలింగంకు పూజలు జరిగి ప్రతిష్ఠితమై ఉంది. ఏం జరిగిందో అర్థంకాని మునీశ్వరులు మథనపడుతూంటే గ్రహించిన సూర్యుడు “మునులారా! ఇది ఎవరూ ప్రతిష్ఠించలేదు. కాలహరణం జరుగుతుందని భావించి శివుడే తనకు తానుగా ప్రతిష్ఠితమైనాడు” అని చెప్పాడు.

పార్వతీదేవి కూడా “దక్షారామం నాకు పుట్టిల్లు. నేను కూడా మీతో పాటే నివసిస్తాను” అని అడిగింది. గణపతి, కుమారస్వామి కూడా వారితో వస్తామని అన్నారు. దానితో శివుడు సమస్త దేవతల సమేతంగా ఆ ప్రాంతానికి చేరుకొని భీమేశ్వర లింగంలో ప్రవేశించాడు. అప్పటి నుచీ దక్షారామం రెండవ కైలాసంగా విలసిల్లుతూ ఉంది.

భ్రమరాంబికాదేవి చేత వరింపబడి భక్తులను కాపాడేవాడు శ్రీశైలంలో వెలసిన మల్లికార్జునుడు. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ రాజు శతృరాజులతో యుద్ధానికి వెళ్ళవలసివచ్చింది. ఆ సమయంలో అతడి భార్య గర్భవతిగా ఉంది. ఆ యుద్ధం సుదీర్ఘకాలం పాటు అంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు జరిగింది. అనంతరం విజయం సాధించి తిరిగి వస్తుంటే దారిలో శివలింగానికి పూజ చేస్తున్న ఒక యువతి కనపడింది. ఆమె అద్భుత సౌందర్యానికి రాజు మొహావేశుడై చెరపట్ట బోయాడు. అప్పుడు మహారాణి వచ్చి ఆ అమ్మాయి చంద్రవతి తన కుమార్తె అని, రాజు యుద్ధానికి వెళ్ళిన తర్వాత పుట్టిందనీ చెప్పింది. ఆమెని తను చూడలేదు, పెంచలేదు కుమార్తె ఎలా అవుతుంది? అంటూ రాజు ఆమె వెంటబడ్డాడు.

చంద్రవతి కోపంతో “మోహావేశంతో వావివరసలు పాటించని నువ్వు బండరాయివి అయిపో!” అని తండ్రిని శపించి, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ మల్లెపూలతో అర్చిస్తూ ఉండేది. ఆమె భక్తికి శివుడు సంతోషించి ప్రత్యక్షమై “ఏం వరం కావాలో కోరుకో!” అని అడిగాడు. నా స్వహస్తాలతో నిన్ను అలంకరించటానికి అనుమతి ఇవ్వమని అడిగింది. శివుడు సరే అన్నాడు. ఆమె మల్లెమాల అయన జటాజూటం మీద అర్ధచంద్రాకారంలో అలంకరించింది. “కుమారీ! నీకూ నాకూ గల ఈ పుత్రికా అనుబంధం శాశ్వతమౌనట్లు నేటి నుంచీ నేను మల్లికార్జునుడు అనే పేరుతో ఇక్కడ కొలువై ఉంటాను” అని చెప్పాడు. అప్పటినుంచీ నేటివరకూ అసంఖ్యాకమైన భక్తులకు ఆరాధ్య దైవమై వెలుగొందుతూ ఉన్నాడు మల్లికార్జునుడు. ఇక్కడ శివుడు తృణమో పణమో అర్పించి పరిశుద్దమైన మనసు అర్పించే భక్తులకు వశంకరుడై ఉంటాడు.

తర్వాత చరణంలో దారిలో వచ్చే జ్యోతిర్లింగాలను దర్శిస్తూ ఇలా ప్రార్ధిస్తూ ఉన్నాడు విద్యాధరుడు.

“వాయులింగ వర గర్భ భంగ ధవళాంగ శ్రీకాళహస్తీశ్వరా!
కాంచీపురీవర ఏకాంబరేశ్వర కామేశ్వరీ వామ భాగేశ్వరా!
శ్రీ సుందరేశ మీనాక్షి మనోజ నమో దింగబర నటరాజా!
కరుణేoదు శేఖర అరుణాచలేశ్వర సాకార ఓంకార అమలేశ్వరా!
శ్రితజన మందార కేదారేశ్వరా! రామప్రతిష్ఠిత సైకత లింగ
రమ్య శుభాంగ రామలింగా! శ్రీరామలింగా!”

శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం. అంటే కాళహస్తీశ్వరాలయం లోని గర్భగుడిలో ఏమాత్రం గాలి చొరబడని చోట రెండు నిత్యజ్యోతులు నిరంతరంగా గాలికి చెలిస్తూ ఉంటాయి. ఇది వాయులింగం అనేందుకు ఇదే సాక్షీభూతం. అక్కడ మొత్తం అయిదు దీపాలు ఉంటే కేవలం రెండు మాత్రమే గాలికి చలిస్తూ ఉంటాయి.

ఈ ప్రాంతంలో అర్జునుడు పాశుపతాస్త్రము కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. అతడిని పరీక్షించాలని మూకాసురుడు అనే రాక్షసుడిని పంపించాడు శివుడు. అతడు అడవిపంది రూపం ధరించి అక్కడికి వచ్చాడు. అటువైపు నుంచీ అర్జునుడు, ఇటువైపు నించీ శివుడు బాణాలతో దాన్ని కొడతారు. ఈ వేట నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకుని యుద్ధం చేస్తారు. అర్జునుడు కోపం పట్టలేక గాండీవంతో భిల్లుడి రూపంలో ఉన్న శివుడి తలమీద కొట్టాడు. అర్జునుడి పరాక్రమానికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించి, పవిత్రమైన తపోదీక్షలో ఉన్నా కిరాతుడిలా ప్రవర్తించినందుకు వచ్చే జన్మలో కిరాతుడిగా జన్మిస్తావు అని చెప్పాడు. అర్జునుడు తర్వాత జన్మలో తిన్నడు అనే కిరాతుడిగా జన్మించి శివభక్తుడు అవుతాడు.

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరుడి గురించి ఒక కథ ఉన్నది. పార్వతీదేవి కాంచీపురంలో ఒక సైకతలింగాన్ని ఏర్పరచి తపస్సు చేయసాగింది. ఆమె తపోగ్నిజ్యాలలకు కైలాసం మొత్తం వేడెక్కి పోయింది. శివుడు గంగతో “గౌరీదేవి తపస్సుతో లోకాలన్నీ దహించుకుపోయేలా ఉన్నాయి. కనక నీవు తక్షణం కంచికి వెళ్లి ఆమె తపోజ్వాలలను నీ జలాలతో చల్లబరచు” అని ఆదేశించాడు. వెంటనే గంగ ప్రళయరూపిణిగా మారి కాంచీపురం మీదకు రూకింది. పార్వతి చెలికత్తె అయిన దుర్గను ఆ జల నివారణకై పంపింది. దుర్గ ఒక కపాలంలోకి ఆ జలాలను మొత్తం ఆకర్షించింది. శివుడు కోపించి జలప్రవాహాన్ని కొన్ని వేల రెట్లు పెంచాడు. కపాలం ఆ జలప్రవాహాన్ని ఆపలేకపోయింది.

గౌరీ భయపడి సోదరుడైన విష్ణువుని ప్రార్ధించింది. శివుడే గతి అని శరణు వేడుకో! అని విష్ణువు ఉపాయం చెప్పాడు. గౌరీ వెంటనే భయంతో సైకత లింగాన్ని గట్టిగా కౌగలించుకుంది. ఆమె స్పర్శకు శివుడు పులకించి శాంతించాడు. తర్వాత శివుడి కోరికపై విష్ణువు పార్వతిని ఇచ్చి వివాహం చేశాడు. శివుడు ఆమెను కరుణించి “దేవీ! నీ కంటిచూపులతోనే భక్తుల కోరికలను తీరుస్తూ ఇక్కడ కామాక్షీదేవి అనే పేరుతో వర్ధిల్లగలవు” అని వరం ఇచ్చాడు. తాను ఏకామ్రేశ్వరుడు అనే పేరుతో వెలసి కామాక్షీదేవిని వామభాగాన నిలుపుకున్నాడు అని ఈ స్థలపురాణం.

మధురై మీనాక్షి దేవాలయంలో వెలసిన శివుడు సుందరేశ్వరుడు. ఇక్కడ శివుడు అత్యంత సుందరమైన వాడుగా ప్రసిద్ది.. అందుకే సుందరేశ్వరుడు అనే పేరు వచ్చింది. సృష్టిలోని అనంతకోటి జీవరాశి లోనూ అందం చూడాలని సందేశం ఇస్తుంది ఈ పుణ్యక్షేత్రం. ఇక్కడ పార్వతీదేవి మీనాక్షీ దేవి రూపంలో కనిపిస్తుంది.

ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువు “నాయనా! క్షేమమా!” అని అడిగి కూర్చోమని శేషతల్పం మీద చోటు చూపించాడు. బ్రహ్మకు కోపం వచ్చింది. “సృష్టికర్తనైన నేను వస్తే, లేచి అర్ధ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించకపోగా, నీ పాదాల దగ్గర చోటు చూపించి అవమానిస్తావా!” అన్నాడు. “నా నాభి కమలంలో నుంచీ జన్మించావు నువ్వు. నీకు నేను తండ్రిలాంటి వాడిని. పుత్రుడిని తండ్రి గౌరవిస్తే అది అతడికి ఆయుక్షీణం” అన్నాడు విష్ణువు.

ఇద్దరికీ మాటామాట పెరిగింది. నేను అధికుడనంటే నేనని ఇద్దరూ వాదులాడుకుని యుద్ధానికి తలపడ్డారు. ఆ యుద్ధం నిరవధికంగా అనేక రోజులపాటు సాగింది. అయినా జయం ఎవరిదో తేలలేదు. అంతకంతకీ యుద్ధం తీవ్రం అయింది. బ్రహ్మ పాశుపతాస్త్రము ప్రయోగిస్తే విష్ణువు మహేశ్వరాస్త్రం ప్రయోగించాడు. పరమేశ్వర ప్రసాదిత దివ్యాస్త్రాలు రెండూ చండ ప్రచండ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ డీకొనటానికి వస్తుంటే ముల్లోకావాసులూ హాహాకారాలు చేస్తూ “శంకరా!.. పాహి.. పాహి..” అంటూ ఆక్రోశించారు.

రెండు అస్త్రాలు ఒకదానిని ఒకటి మార్కొనబోతూ ఉండగా ఒక్కసారిగా బ్రహ్మాండమైన తేజస్సుతో జ్వాలాస్తంభం ప్రత్యక్షమై రెండు అస్త్రాలూ అందులో లీనమైపోయాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో “మీలో ఎవరు ముందుగా ఈ జ్వాలాస్తంభము యొక్క మొదలు గానీ, తుది గానీ దర్శించివస్తారో వారే అధికులుగా గుర్తించబడతారు. ప్రయత్నించండి”  అని ఆకాశవాణి చెప్పింది. స్తంభం తుది కనుక్కోవటానికి బ్రహ్మ ఆకాశంలోకి, మొదలు కనుక్కోవటానికి విష్ణువు పాతాళం లోకి ప్రయాణించారు. ఎంతదూరం వెళ్ళినా మొదలు, తుది తెలియలేదు.

బ్రహ్మ, విష్ణువు తిరిగి వచ్చారు. తనకు స్తంభం మొదలు తెలియలేదు అన్నాడు విష్ణువు. “నేను ఈ స్తంభం శిరసు దర్శించి వచ్చాను. ఈ గండకీ పుష్పమే (ఉమ్మెత్త పువ్వు) సాక్ష్యం. కాబట్టి నేనే అధికుడను” అన్నాడు బ్రహ్మ. శివుడు ప్రత్యక్షమై “స్వయం ప్రకాశుడనై ఆద్యంతాలు లేకుండా దశదిశలలో వ్యాపించినది నేనే! ఈ విషయం తెలియజేయటానికి నేనే ఈ జ్వాలాస్తంభం కల్పించాను. విష్ణువు సత్యం చెప్పాడు గనుక ముల్లోకవాసులతోనూ పూజలందుకుంటాడు. బ్రహ్మ కపటోపాయంతో అధికుడనని నిరూపించుకోవటానికి అసత్యం చెప్పాడు. అసత్యదోషానికి పాల్పడినందుకు ముల్లోకాలలో ఎక్కడా బ్రహ్మకు ఆలయం అన్నది లేకుండు గాక! కూటసాక్ష్యం (అబద్దపు సాక్ష్యం) చెప్పినందుకు ఈ కేతకీ పుష్పం కూడా నా పూజకు పనికి రాదు” అని శపించాడు.

పాతాళం నుంచీ ఊర్ధ్వ లోకాలకు వ్యాపించి యున్న ఆ జ్వాలా స్తంభం అదృశ్యమైపోయి ఆ ప్రదేశంలో చలనం లేని గిరిరాజమై అవతరించాడు పరమేశ్వరుడు. అలా అరుణకాంతులీనుతూ జ్వాలలను గర్భంలో దాచుకుని కాలాగ్నికి ప్రతిరూపంగా వెలసినదే ఈ “అరుణాచలము”. అరుణాచలం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన వారు సర్వశుభాలు పొంది, అంత్యంలో శివసాయుజ్యం పొందుతారని ప్రతీతి.

హిమాలయ పర్వతాలలో గల కేదారక్షేత్రంలో వెలసిన వాడు కేదారేశ్వరుడు. నరనారాయణులు ఈ కేదారక్షేత్రానికి వచ్చి అక్కడ పార్ధివ లింగంను నిర్మించి శివుడిని ఆరాధించారని స్థల పురాణం. శ్రీరాముడి చేత ప్రతిష్టింపబడిన లింగం రామలింగేశ్వరుడు. రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు వెళుతూ మధ్యలో గంధమాదన పర్వతం మీద ఆగి, అక్కడ మునీశ్వరులను దర్శించి “రావణుని వధించటం వలన బ్రహ్మహత్యా దోషం చుట్టుకున్నది. ఈ పాపం తొలగే మార్గం చెప్పండి” అని అడిగితే, “శివలింగ ప్రతిష్ఠ వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి” అని చెబుతారు.

“నువ్వు తక్షణం కైలాసం వెళ్లి శివలింగం తీసుకురా!” అని ఆంజనేయుడి తో చెబుతాడు రాముడు. కానీ ముహూర్తం సమీపిస్తున్నా ఆయన తిరిగి రాకపోయేసరికి మహర్షుల ఉపదేశం అనుసరించి సీతారాములు సైకతలింగం చేసి ఆ ముహూర్తానికే ప్రతిష్ఠాపన చేశారు. హనుమంతుడు తిరిగి వచ్చి సైకత లింగం పెకలించి, తను తెచ్చిన లింగం ప్రతిష్ఠించాలని కోరి, తన బలం అంతా ఉపయోగించినా సైకత లింగం ఇసుమంత కూడా కదలలేదు.

రాముడు నవ్వి “ఇది పేరుకి సైకతలింగమే కానీ ముహూర్తబలం వలన పరమేశ్వరుడే ఇందులో అవతరించాడు. నేను ప్రతిష్ఠించిన ఈ సైకత లింగం ‘రామలింగేశ్వరుడు’ పేర ప్రసిద్ది కాగలదు” అని చెప్పాడు. గంగాజలంతో రామేశ్వర లింగంకు అభిషేకం చేస్తే వారు జీవన్ముక్తి పొందుతారు.

ఈ విధంగా పదకొండు శివక్షేత్రాలు దర్శించగానే సంచారవృక్షం రూపంలో ఉన్న గంధర్వుడికి శాపవిమోచనం అవుతుంది. “నాతో పాటు నీవూ శివక్షేత్రాలు దర్శించినందుకు పునీతుడవైనావు. ఇక నీకూ మంచిరోజులు వస్తాయి” అని విద్యాధరుడిని దీవించి వెళ్ళిపోతాడు.

ఇదీ ఈ పాట విశ్లేషణ.

(‘ఈశా గిరీశా మహేశా జయ కామేశ కైలాస వాసా’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=XRi_TNNwDN4)

(*ద్వాదశ జ్యోతిర్లింగాలు – సోమనాధేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, మహాకాళేశ్వరుడు, ఓంకారేశ్వరుడు, వైద్యనాధేశ్వరుడు, భీమ శంకరుడు, రామలింగేశ్వరుడు, నాగేశలింగము, విశ్వేశ్వర లింగము, త్ర్యంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఘశ్మేశ్వర లింగము)

Exit mobile version