Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏకాంత స్పర్శ

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఏకాంత స్పర్శ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీవు నీ నుండి విడిపోయినా సరే
నీతో కలసి చేసే ప్రయాణమే ఏకాంతం.

మెదడు మైదానంలో
మనసు అనుభవించే ఘనమైన స్వేచ్ఛ

నీ తనం తవ్వి తోడే నిజాలు
ఏకాంత స్పర్శకు తడిసి ముద్దయ్యాయి

పొలిమేర దాటిన అనుభవం
నిజం స్వరంతో విహరిస్తూ పోతే

యాతన ఆంచులపై
కష్టం కళ్ళు మూసుకుని నడిచే ధైర్యానికి

కలల చిరునామా చూపుతూ
కాలం దారి వదులుతుంది.

లోకం ఓ ప్రశ్నాపత్రంగా
ఇష్టాలతో పని లేని పరీక్షలో

ఒక్కో ప్రశ్న రాత్రంత పొడవు
ఓ రోజంత బరువు.

వయసుకి రెట్టింపు
ఆలోచన కురిసి

మనిషెత్తు తపన పారితేనే
మనసు పదునెక్కి
బతుకు జీవితమయ్యేది.

Exit mobile version