Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎక్కడికి ఈ ప్రస్థానం?!

[శ్రీ దోసపాటి వేంకట రామచంద్ర రావు గారు రచించిన ‘ఎక్కడికి ఈ ప్రస్థానం?!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

శుభం కళ్యాణమండపం దగ్గర ఆటో దిగాడు అనంతరామయ్య.గేటుకి ఎంతో ఆకర్షణీయంగా రకరకాల పూలతో అలంకరించారు. గేటుకిరువైపూలా ద్వారపాలకుల్లా రెండు వధూవరుల ఫ్లెక్సిలున్నాయి. తాను వచ్చింది సరియైన చోటుకేనానని మరోసారి ఫ్లెక్సీలను చూసాడు. ‘వల్లంపాటివారి పెళ్ళిసందడ’ని రాసి వుంది పెద్ద అక్షరాలతో. వధూవరుల ఫోటోలు ,పేర్లు రాసి వున్నాయి. అయితే సరైన చోటికే వచ్చానని అనుకున్నాడు. లోపలికి అడుగుపెట్టాడు.

“సార్! మీ బేగు ఆటోలో మర్చిపోయారు. తీసుకోండి” ఆటో డ్రైవరు తెచ్చి ఇచ్చాడు.

“ఓహ్! ధన్యవాదాలు బాబు” అనంతరామయ్య ఆటోవాలాకి చెప్పాడు. ఇంకా ఈ కాలంలో నిజాయితీపరులున్నారన్నారు అనుకున్నాడు అనంతరామయ్య.

సెంట్రలైజ్డు ఎసి హాలు లోకి అడుగుపెట్టాడు. హాలంతా కోలాహాలంగా వుంది.పెళ్ళికి వచ్చిన బంధువులు, స్నేహితులు నలుగురూ ఒకచోట కూర్చునేలా కుర్చీలు టేబిల్సు ఏర్పాటు చేసారు. దూరంగా కళ్యాణమండపంలో ఏదో తంతు జరుగుతోంది.దగ్గరగా వెళ్ళి చూడలేరని కాబోలు ఇరువైపులా పెద్దసైజు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. కొంతమంది యువతీయువకులు డిజే సౌండ్సుతో ఆర్కెస్ట్రా సాగుతోంది.

కేటరింగ్ అబ్బాయిలు అందరికి స్నేక్స్, డ్రింక్సు సర్వే చేస్తున్నారు. వచ్చినవాళ్ళని ఆహ్వానించడానికి హాలు ద్వారం దగ్గర ఇద్దరు అమ్మాయిలు పన్నీరు జల్లి స్వాగతం పలుకుతున్నారు. ఎవరు ఆడపెళ్ళివారో ఎవరు మగపెళ్ళివారో, ఇరువైపులా బంధువులెవరో ఏమిటో ఏమి తెలియడంలేదు. ఇప్పటి వివాహాలు తంతు అంతా ఆడంబరంగాను, అట్టహాసంగాను జరుపుకుంటున్నారు.

ఎవరి తరుపున ఎవరు వచ్చారో, ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా తెలియడం లేదు. అనంతరామయ్య చుట్టు చూసాడు. ఎవరైనా తనని పలకరించడానికి వస్తారేమోనని.

“సార్! మీరెక్కడైనా కూర్చోండి. ఇలా నిలబడితే మేము తిరగడానికి ఇబ్బందిగా వుంటుంది.” అన్నదెవరో కాదు కేటరింగ్ బోయ్.

ఒకచోట కూర్చున్నాడు.

ఆ పక్కన కూర్చున్నాయన అడిగారు “మీరు ఎవరి తరుపునండి”

అనంతరామయ్యకి ఏమని చెప్పాలో తెలియలేదు.

మళ్ళీ అతనే “ముహుర్తం ఎన్ని గంటలకండి. ముహూర్తం అయ్యాకనే భోజనాలు పెడతారా? ఇంకెంత సేపు పడుతుందో? సాయంత్రం ఏవో నాలుగు పకోడి ముక్కలు, ఒక జిలేబి స్వీటు పెట్టారండి. ఒక చిన్న గ్లాసుతో డ్రింకేదో ఇచ్చారు. అంతేనండి‌. ఆ భోజనమైనా ఎలా వుంటుందో ఏమిటో?” ఇంకా ఏదో వాగుతూనే వున్నాడు.

“ఇంతకీ మీరేమవుతారు? అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారు కదా! అందులో ఏమిటి జరుగుతుందో చూడండి” అనంతరామయ్య జవాబిచ్చాడు.

“మేమేమి బంధువలం కామండి. వాళ్ళకోలనీలో ఉండేవాళ్ళం” చెప్పాడాయన. “ఇంతకీ మీరేమవుతారో చెప్పలేదు” రెట్టించి అడిగాడు.

అనంతరామయ్య ఏదో చెప్పేలోపల “అనంతా!ఎంతసేపైందిరా నువ్వొచ్చి? ఇక్కడ కూర్చున్నావేమిటి? పద పద, మనవాళ్ళను కలుసుకుందువుగాని” అంటూ అనంతరామయ్యని తీసుకొని వెళ్ళాడు బంధువొకాయన.

అంతవరకు అనంతరామయ్యతో మాట్లాడిన వ్యక్తి ‘ఏంటో ఇప్పటి పెళ్ళిళ్ళు. కనీసం వచ్చిన బంధువులను కూడా పలకరించడానికి ఎవరూ లేకపోవడమేమిటో’ అని అనుకున్నాడు.

ఎవరో భోజనాలు రెడీ అనడంతో అటువైపు వెళ్ళిపోయాడు అతడు.

***

అనంతరామయ్యను తీసుకొని వెళ్ళిన వ్యక్తి వరుసకి అనయ్య అవుతాడు. వరుసకి అంటే తాతా సహోదరులు. వారి వారసులు ఎప్పుడో దూరమైనా బంధుత్వాలు మళ్ళీ కలుసుకొనేట్టు చేసింది అనంతరామయ్యే. వారి వంశవృక్ష వివరాల్ని సేకరించి ఉన్న వారందరిని ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేసాడు. అప్పటినుంచి వారి బంధువుల ఇల్లళ్ళో శుభకార్యాలకు అశుభకార్యాలకు సమాచారం అందేలా ఒక వారధిలా నిలబడ్డాడు.

ఇప్పుడు జరగబోయే పెళ్ళి సందడి ఏడోతరానికి చెందిన వాళ్ళది. ఇందాక అనంతరామయ్యని తీసుకొని వెళ్ళిన వ్యక్తికి పెళ్ళికొడుకు మనవడు అవుతాడు. ఆ వ్యక్తికి మనవడు కాబట్టి అనంతరామయ్య కు మనవడే.

అనంతరామయ్యను తీసుకొని వెళ్ళిన వ్యక్తి పేరు సుబ్బరామయయ్య. అతను ముందు తన వయసు వాళ్ళ దగ్గరికి ఆడామగా తీసుకొని వెళ్ళి పరిచయం చేసాడు. తనకన్నా పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాడు. వాళ్ళలో కొందరు బాగా పలకరిస్తే మరికొందరు ఓహో! అహా! అంటూ ఊరుకున్నారు. అంతేగాని కాపి తాగేరా ఏమైనా స్నేక్స్ తిన్నారని అడగలేదు. ఒకతని దగ్గర అనంతరామాన్ని కూర్చోబెట్టి సుబ్బరామయ్యే స్నేక్సు, డ్రింకు తీసుకొని వచ్చి ఇచ్చాడు.

“సుబ్బన్నయ్యా! పెద్ద వాళ్ళని పరిచయం చేసావు సరే! మన తదనంతర వారసుల్ని కూడా పరిచయం చెయ్యవా? వాళ్ళకే కదా మనమెవరిమో తెలిసేది. మన తరువాత ఈ సంబంధాలను బలోపేతం చేయడానికి కుదురుతుంది.” అనంతరామయ్య అన్నాడు.

“ఎందుకు పరిచయం చేయను అనంతా!” అని దగ్గర్లో ఉన్న యువకుడిని పిలిచాడు సుబ్బరామయ్య. “ఆనందా! ఇలా ఒకేసారి రారా!” అని.

ఆనందరావనే యువకుడొచ్చాడు “ఏమిటి కావాలి పెదనాన్నా?” అని.

“ఇదిగో ఇతను అనంతరామయ్య, నాకు తమ్ముడు. నీకు చిన్నాన్న. క్రిందటిసారి మన కుటుంబ ఆత్మీయ సమావేశం జరిపించింది ఈయనే. మరచిపోయావా?” అన్నాడు సుబ్బరామయ్య.

“నమస్కారం చిన్నాన్నగారు. ఎంతసేపైంది వచ్చి” కాళ్ళకి దండం పెట్టాడు. తన భార్యా పిల్లల్ని పరిచయం చేసాడు.

అలా కొందరిని పిలిచి పరిచయం చేస్తుంటే కొందరూ హాయ్! హల్లో! అని చేతులు వూపి ఏదో పని వుందంటూ వెళ్ళిపోయారు.

కళ్యాణ వేదిక మీద మంగళసూత్రధారణకు సమయం అయినట్టుంది. వేదిక దిగువున వున్న వారి దగ్గరికి వచ్చి పురోహితుడు తాళిని చేతితో ముట్టించి అక్షింతలు అందజేస్తున్నాడు.

మంగళవాయిద్యాల మధ్య వరుడు వధువు మెడలో తాళి కట్టాడు. వేదికమీద ఉన్నావారు అక్షింతలు వేసారు. వేదిక క్రిందనున్న వారు ముఖ్యంగా దగ్గర బంధువులు వయసులో పెద్దవారు దంపతులుగా వున్నవారు ఒక వరుసలో వెళ్ళి అక్షింతలు వేసి వస్తున్నారు. చాలామంది వెళ్ళకుండానే అక్షింతలను క్రింద పడేసి భోజనాలకు వెళ్ళిపోతున్నారు.

వేదిక మీదకి వెళ్ళినవారు వచ్చేసాక సుబ్బరామయ్య అనంతరామయ్యను వేదిక మీదకు తీసుకొని వెళ్ళి వధూవరలకు పరిచయం చేసి వాళ్ళని ఆశీర్వదించమన్నాడు. వాళ్ళు మాత్రం ఒక చిరునవ్వుతో ఆయన కాళ్ళకి దండం పెట్టారు. అనంతరామయ్య తాను తెచ్చిన బట్టలు, కానుకలు వధూవరులకు అందజేసాడు.

అనంతరామయ్యకు ఈనాటి పెళ్ళితంతూ చూస్తుంటే ఒక విధమైన అయిష్టమేర్పడుతుంది. కాని తన వాళ్ళందరిని కలుసుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు బంధువుల శుభ అశుభ కార్యాలకు కూడా వెళ్తుంటాడు.

మానవ సంబంధాలు నేడు విచిత్రంగా తయారైపోయాయి. బంధువులు, చుట్టాలు ఎవరికి ఎవరూ ఏమౌతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్ళిళ్ళు ఒకనాడు ఇళ్ళలోనే జరిగేవి. దగ్గరి చుట్టాలందరూ పది రోజులు ముందుగానే వచ్చి చేదోడువాదోడుగా ఉండేవారు. వంటవార్పు అంతా ఆడామగా కలిసే చేసేవారు. అందరూ ఆనందంగానే గడిపేవారు. ఇదిగో ఆధునిక పోకడలు అంతా ఆడంబరంగాను, అట్టహాసంగాను చేస్తున్నారు. గొప్పలకు పోయి రకరకాల వంటకాలు చేస్తారు. వాటిలో సగం వ్యర్ధంగానే పోతున్నాయి. వచ్చిన బంధువులు, స్నేహితులు ఇతర పరిచయస్థులు ‘వచ్చామా, చూస్తామా, తిన్నామా, ఇచ్చారా, పుచ్చుకున్నామా’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పెళ్ళితంతు పూర్తి కాకుండానే వెళ్ళిపోవడం. చివరివరకు పురోహితుడు, వధూవరులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అంతగా అవసరమైతే వధూవరుల తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. సమయం అయిపోయిందని కళ్యాణమండపం వాళ్ళు హెచ్చరించడంతో హడావిడిగా ఖాళీ చేసి వెళ్ళిపోవల్సిందే.

ఈ విషయాలను తలుచుకొని ఎక్కడికీ ప్రస్థానమో అనుకుంటూ మరో బంధువుల శుభ కార్యక్రమానికి వెళ్ళడానికి సుబ్ఫరామయ్యకు చెప్పి కదిలాడు అనంతరామయ్య.

Exit mobile version