[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘ఎలా చెప్పను..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వాటిని ప్రతి ఉదయం తిరిగేసిన చేతన
సాహిత్య పేజీ తగిలింది నా మునివేళ్ళకు
అక్కడ నా నీడకు వింత అనుభవం లేనివాడిని,
ఎలా చెప్పను
ఏ నగిషీల సంతకం లేని నడక
ఎవరికీ పరిచయంలేని
కడు పేద కలాన్ని నేనని,
ఎలా చెప్పను
తెలిసిన చనువులేని వీర లోకంలో
సృజనే బతుకైన ఒక పద్యాన్ని నేనని,
ఎలా చెప్పను
వ్యంగ్యంలో హాస్య రసం చిలికే
పాడి ఆవును కాను
నిజ వాచకమే నా సృజన సారం
అక్షరాలు నాకు జీవం జీవితమని
ఎలా చెప్పను
ప్రగతిశీల దారిలో
అక్షరాలచాళ్ళే నా చిగుళ్ళని,
ఎలా చెప్పను
ఒక్కమాట
అచ్చుయంత్రాలు మౌన గంగిగోవులు
ఎవరికైనా తలాడించని కుర్చీలో
శల్య పరీక్ష
‘నా’ కట్టు ఒక్కటి గుండెనో మనసునో దోచేస్తే చాలు శేష ప్రశ్న
రేపటి అద్దంలో మెరుపు కవితదే!
తళతళ గలగల కిలకిల
భావోద్వేగాల విన్యాసం కవి ఆలోచనో కలం వివేచనో గాని
తెలియని వర్గ వర్ణ సందడిలో స్వర్గం ఏదైనా ఉంటే
ఆ కలదే లీలగా!!
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
