ప్రముఖ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్, కవి శ్రీ కెరె జగదీష్ గారి రెండవ దీర్ఘ కావ్యం ‘ఎల్లక్క’ చదువుతూ చదువుతూ నిలువెల్లా కన్నీళ్ళతో ముద్దయిపోయాను. నాలుగు కవితా సంపుటులు వెలయించిన జగదీష్ ఈసారి ఎంచుకున్న ఇతివృత్తం అతని మగ్నతకూ, కవిత్వ ధ్యానానికి ఉదాహరణ.
తెలుగు మాట్లాడే చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా దళిత వర్గాల్లో ఉన్న మూఢాచారం ప్రకారం ఆర్థిక స్తోమత లేని కింది కులాల్లోని స్త్రీని దేవుని పేర, ఊరి దేవత పేర వివాహితులను చేసి, ఆ పాప పెద్దదైనాకా ఊరుమ్మడి ఆస్తిగా లైంగిక దోపిడికి గురవటం జరుగుతుంది. ఈ భయంకర వాస్తవం గురించి అనేక సినిమాలు, కథలు, పుస్తకాలు లోగడ వెలువడ్డాయి. బసివి, జోగిని, ఎల్లక్క… ఎలా పిలిచినా స్త్రీల మీద జరిగే లైంగిక దాడి ఇది. ఇది బీదరికం, కులం, జెండర్ ఆధార నిర్మిత వ్యవస్థ. ఇటువంటి బాధితురాళ్ళందరి పక్షాన గొంతు విప్పిన కలం జగదీష్‌ది.
దీర్ఘకావ్యాలు చాలానే వెలువడుతుంటాయి. కాని ‘ఎల్లక్క’ నిజంగా ‘అక్క’ కాదు, ఊరుమ్మడి సొత్తు. చట్టాలెన్ని చేసినా, సంస్కరణలెన్ని జరిగినా బలమయిన వ్యవస్థలో స్త్రీలకెప్పుడూ అన్యాయమే జరుగుతుంది. ఎల్లక్క, దేవదాసి ఎవరయినా వాళ్ళ అసలు పేరు ఎవరికీ తెలీదు. పితృస్వామ్య వ్యవస్థ ఊడలు పాతుకున్న ప్రపంచంలో వివాహ వ్యవస్థతో పాటు వ్యభిచార వ్యవస్థను కూడా తప్పనిసరి చేసిన సమాజంలో గాయాలతో రక్తాన్ని, వేదననీ సహించే ఎల్లక్కల రూపాంతరాలు అనేకం.
ఆదిశక్తిగా స్త్రీని గుళ్ళలో ఆరాధించే మనుషులు సాహిత్యం ద్వారా, కళల ద్వారా స్త్రీని భోగవస్తువుగా తయారు చేశారు. ఆమెను శ్రమశక్తిగా గౌరవ ప్రదంగా వర్ణించలేదు. దేవదాసీలు అని పిలిచి భగవంతుని కోసమన్నారు. రాజుల కోసం ఆస్థాన కళాకారులను, క్రమంగా వేశ్యలను, సాని మేళాలను, రెడ్ లైట్ ఏరియాలను… ఒకటేమిటి బహురూపి అయిన స్త్రీ లైంగికత్వానికి పేర్లు మార్చారు. అలాంటి అంశాన్ని తీసుకుని చారిత్రకంగా, సామాజికంగా, ఆచార వ్యవహారాలలో, నమ్మకాలు, విశ్వాసాలు, రీతి రివాజులలో పలు విధాలుగా మారిన ఆమె జీవితం 18 భాగాలుగా రాయబడింది.
ఎల్లక్క జీవితమే ఒక మరణం. వయసు, సొగసులతో పని లేదు. ఆమె వేడి కన్నీళ్ళు అందరికీ చలి కాస్తాయి.
విశ్వ మర్మంలోని మాయాజాలాన్ని సందర్శించే కవి –
“కాలం వేసిన గాలానికి చిక్కుకుని
గాయపడిన జీవితాలెన్నో
యుగ యుగాలుగా నిశ్శబ్ద దుఃఖంలో
తడిసిపోతున్నాయి”
అనటంలో అనివార్యమైన ‘ఆమె’ జీవితానికి విముక్తి కాలగర్భంలో కలిసిపోవటంలోనే ఉందనే స్ఫురణ ఉంది.
రాజరిక, భూస్వామ్య, పురుష స్వామ్య వ్యవస్థల్లో అనుబంధ పాత్రలుగా మారిన ఆ దేహాలు రకరకాలుగా పురుషులకు శయ్యా సుఖాన్ని అందించటంలో సమిధలైపోయిన తీరును దృశ్యమానం చేశారు కవి. గ్రామదేవత ఆగ్రహించిందని ఒక బిడ్డను బసివిని చేశారు. “తుప్పు పట్టిన కత్తితో పసిగొంతును” కోశారు. ఒక్కొక్క రాత్రి మూగ వేదన చీకట్లలో కలిసిపోయింది.
“దేహాన్ని వెదురుబద్దలా చీల్చింది ఆ క్రీడ”. ఇంతకంటే అగ్నికణికలు నయం కదూ! ప్రతీ రాత్రీ దగ్ధమై బూడిదను రాల్చుకునే ఆమె దేహమంతా ఒక రక్త సరస్సు! దారి చేరని బతుకు దారిలో కడుపు కాలిన పేగు వాసనలు! ప్రతి అక్షరం, శబ్దం ‘ఎల్లక్క’ వేదనాగ్నిని ప్రతిధ్వనింపజేస్తున్నది. ఈ కవిత్వం చదవడానికి మనిషై పుట్టి ఉండాలి.
“యత్ర నార్యస్తు పీడితే
తత్ర వాసంవిపై భూతాః”
అంటూ హెచ్చరించిన కవి – కావ్యం చివర ప్రథమ పురుషలో తనదైన దుఃఖాన్ని సర్వ మానవ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ –
“ఏదో తెలియని నిశ్చైతన్యం
నాలో ఆవరించి
నా కను రెప్పల్ని తడిపి కన్నీటి
చుక్కలా నేల రాలింది (పుట 89).
ఇలా అని ఊరుకోలేదు.
“జీవిస్తూ మరణించడమా?”
మరణిస్తూ జీవించడమా?
ఈ సందిగ్ధంలో
మానవీయతను నింపుకొని బతకాలి”
అని హెచ్చరించారు.
“శక్తి స్వరూపిణిలా శత సహస్ర కిరణాల వెలుగులో
దశ హస్తాలతో పదునైన ఆయుధాలు ధరించి
ఆ దుష్టశక్తుల శిరచ్ఛేదనం చేయాలి”
అని స్త్రీలను జాగృతపరిచారు.
అనేక మంది పెద్దలు ముందుమాటలందించిన ‘ఎల్లక్క’ దీర్ఘకావ్యం పాఠకుల మనసుల్ని కదిలిస్తుందని, చైతన్యపరుస్తుందని నమ్ముతున్నాను.
***
రచన: కెరె జగదీష్
వెల: ₹ 100/-
ప్రతులకు:
#9-3-382(4)
రాజీవ్ గాంధీ కాలనీ
రాయదుర్గం (పోస్టు)
అనంతపురం (జిల్లా)
ఆంధ్ర ప్రదేశ్ 515865
మొబైల్: 9440708133, 9110772299