Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏమని చెప్పను?

[తాటికోల పద్మావతి గారు రచించిన ‘ఏమని చెప్పను?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గాయపడిన హృదయాన్ని
లాలించి మాటల లేపనంతో
నన్ను ఓదారుస్తావనుకున్నాను.
హృదయంలో రగిలిన ప్రేమాభిమాన జ్వాలల
గ్రీష్మంలో వర్షపు చినుకై రాలి
చల్లార్చుతావని ఎదురు చూశాను.
నన్ను నీలోకి ఆహ్వానించకపోతే
నేను నేనుగా మిగిలిపోతాను.

కరిగిపోతున్న కాలంలో
జీవితం ఆవిరైపోతున్నది.
ఎప్పుడో ఒకప్పుడు నీవైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి.
ఆ దేవుడి సన్నిధికి చేరేలోగా,
నా దైవం కరుణిస్తుందో లేదో!

నీ ఊసులు వినకపోతే
నిదుర లేని రాత్రులు ఎన్నో!
నీ చూపులు సోకకపోతే
వికసించదు ఈ కమలం.

శిలను శిల్పంగా మలిచావు.
నీ ఉనికి కోసం తపిస్తూ
జీవితం శూన్యమైపోతున్నది.
పంచభూతాలన్నిటిని అడిగాను.
నా మనసు ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని.

ఎలా చెప్పను. ఏమని చెప్పను.
కవితాత్మకంగా అక్షరమై కనిపిస్తావని,
కళాకృతిలో చిత్రమై పోతావని
అమాయకంగా అడుగుతున్నాను.
ఇంకా ఎంతకాలం ఈ అన్వేషణ?

నా గుండెని ఇంకా గాయం చేయొద్దు.
నీ మనసును అడిగి చూడు ఏమంటుందో!
నా హృదయపూర్వకంగా వింటే, మనసుంటే,
అది పదికాలాలు పచ్చగా ఉండాలని కోరుకుంటాను.
ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ సుఖమే కోరుకోవాలని,
చెప్పాలని ఉంది. మనసు చెప్పలేకపోతున్నది.

Exit mobile version