Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏమో..!

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘ఏమో..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

డిచిపోయిన కాలపు జ్ఞాపకాలు
సాలెగూళ్ళు ఆక్రమించిన పుస్తకాల దొంతరల్లాగా
నిరంకుశంగా కాలం గుచ్చిన వాడి ముళ్ళలాగా
ప్రళయ ప్రభంజనానికి రాలి
వాడిన పూలగంధం లాగా
చందనకాష్టం రాపాడించిన సానరాయి
పైనుండి తేలివస్తున్న తెమ్మెరలా
దైవప్రతిమను అభిషేకించిన
ద్రవ్యాల మనోహర సుగంధంలా
మంగళ వాద్యాల కర్ణపేయమైన ధ్వని తరంగాల్లా,
మంచీ చెడుల కలయికలా అనిపిస్తున్నాయి.
మస్తిష్కంలో తామరతంపరగా
పుట్టుకొస్తున్న ఆలోచనలు
సంజెకెంజాయ వర్ణాన్ని అలముకుంటున్నాయి.
గమ్యమెక్కడో తెలియకపోయినా
దూరమెంతో తెలియకపోయినా
నిరంతర నిరంతర ప్రయాణంలో
అలుపెరుగని బాటసారిలా
కాలం జరిగి పోతూనే ఉంది.
చతుష్కూటముల్లో ఆగి ఆగి
కదులుతున్న జనసమూహాల్లా
అనంతంగా సాగుతున్న అక్షరాల అల్లరికి
సమాధానం చెప్పడానికి జీవితకాలం సరిపోదేమో!

Exit mobile version