[శ్రీ దర్భముళ్ళ చంద్రశేఖర్ గారు రచించిన ‘ఎండల్లో వాన’ అనే కవితని అందిస్తున్నాము.]
గొంతు పిడచ కట్టుకు పోతున్న
పూపిట్టల రెక్కలపై
చల్లని చలివేంద్రాలు
చటాలున నిర్మించినట్టు
కొత్తగా పెళ్ళై అత్తారింటికెళ్ళిన
ఆకతాయి అమ్మాయి
చెప్పాపెట్టకుండా
వచ్చి
అమ్మను చకితను చేసినట్టు
ఉరుమురిమి, ఉరుమురిమి
ఊరిపైకి
ఒక ఉత్సవ సంతోషమే
ఉవ్వెత్తున దూకేసినట్టు
అప్పటి దాకా ఎండి పడున్న
బీడు గుండెపై, కాడు దండెపై
జారుతున్న జలద్రావకానికి
బలభ్రామకమైనట్టు
అదిగో
జ్యేష్ఠమాసపు వాన..,
జల్లులు జల్లులుగా
జల్లులు జల్లులుగా కురుస్తోంది!!!
