Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎన్ని రోజులు బ్రతుకుతా?

[బాలబాలికల కోసం ‘ఎన్ని రోజులు బ్రతుకుతా?’ అనే చిన్న కథని అందిస్తున్నారు గంటి ఆశ పద్మిని.]

సింహాసిని రాజ్యానికి రాజు జగన్నాథ దేవుడు. అతను రాజ్యం పట్ల, ప్రజల సమస్యల పట్ల ఏమాత్రం పట్టించుకోకుండా, అహర్నిశలు విందులు, వినోదాలతోనే తన జీవితాన్ని గడిపేవాడు.

ఆ రాజ్యానికి ఒక వేద పండితుడు వచ్చి నివసించసాగాడు. పండితుడి ఇంటి చుట్టుపక్కల ప్రజలు ఆయన వద్దకు వెళ్లి జాతకాలు చూపించుకొని, ఆయన చెప్పే చిన్న చిన్న పరిహారాలను ఆచరిస్తూ ఎంతో ఆనందంగా జీవించసాగారు.

ఒక రోజు రాజుకు ఆ పండితుడి గురించి తెలిసింది. రాజు, ‘అంత గొప్ప పండితుడా? అతను చెప్పింది జరుగుతుందా?’ అని ఆశ్చర్యపోయి, వెంటనే ఆ పండితుడిని తీసుకురమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు పండితుడి ఇంటికి వెళ్లి, రాజుగారు పిలుస్తున్నారని చెప్పి, ఆయన్ను సభకు తీసుకొచ్చారు.

రాజు పండితుణ్ణి, “నీ పేరేంటి?” అని ప్రశ్నించగా, “నా పేరు సదాశివుడు” అని పండితుడు బదులిచ్చాడు. రాజు అవహేళనగా, “నువ్వు జాతకాలు చూసి, జాతకుడి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను చెబుతావట కదా? అంతటి పాండిత్యం నీకు ఉందా?” అని అన్నాడు.

“నేను జాతకంలో ఉన్నది చూసి చెబుతున్నాను. వాటిని జరిపించేది ఆ ఈశ్వరుడే” అని పండితుడు వినయంగా సమాధానమిచ్చాడు. రాజు ఒక జాతకాన్ని ఇచ్చి, “ఇతనికి వివాహం ఎప్పుడు జరుగుతుందో చెప్పు” అన్నాడు.

పండితుడు జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, “ఈ జాతకుడికి వివాహం ఇప్పటికే అయిపోయింది” అని బదులిచ్చాడు. పండితుడి సమాధానం విన్న రాజుకు మత్తు వదిలిపోయింది.

కానీ, పండితుడిపై ఇంకా పూర్తిగా నమ్మకం కుదరక, అతన్ని పరీక్షించాలని రాజు తన మనసులో అనుకున్నాడు. పండితుడిని మెచ్చుకుంటూ, “భళా! చాలా బాగా చెప్పావు. నా మదిలో ఒక ప్రశ్న ఉంది, నా జాతకం చూసి దానికి సమాధానం చెప్పు” అని ఆజ్ఞాపించాడు.

కుల గురువు రాజు జాతకాన్ని పండితుడికి అందించారు. జాతకాన్ని అందుకున్న పండితుడు, “మీ ప్రశ్న ఏమిటో దయచేసి తెలియజేయగలరా?” అని అడిగాడు.

రాజు “నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు సభలోని వారందరూ ఉలిక్కిపడి, కూర్చున్న చోట నుంచే లేచి నిలబడ్డారు. “నేను ఎవరికి ఆయుష్షు గురించీ చెప్పను. అది నా నియమం” అని పండితుడు బదులిచ్చాడు. ఆ మాట విన్న రాజుకు విపరీతమైన కోపం వచ్చి, “నా ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీకు శిరచ్ఛేదనమే” అని ఆగ్రహంతో పలికాడు. ఆ మాటలకు పండితుడు, “మీరు ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే” అని బదులిచ్చాడు. ఆ మాటలు విన్న రాజు, “రాబోయే వైశాఖ పౌర్ణమి నాడు నీకు శిరచ్ఛేదనం” అని ఆజ్ఞాపించాడు.

భటులు పండితుడిని కారాగారంలో బంధించారు. పండితుడిని చూసిన మిగతా ఖైదీలందరూ అతని వద్దకు వచ్చి, “మీరు చాలా విద్యావంతుల్లా ఉన్నారు. రాజు మిమ్మల్ని ఎందుకు ఇక్కడ బంధించాడు?” అని అడిగారు. పండితుడు సభలో జరిగినదంతా చెప్పాడు.

“అలాంటి తలతిక్క రాజు ఉంటే ఏంటి, పోతే ఏంటి? బాబు, మీకు సమాధానం తెలిసి ఉంటే చెప్పి ఉండవచ్చు కదా?” అని అన్నారు ఖైదీలందరు. దానికి ఆ పండితుడు, “ఒక మనిషికి తన ఆయుష్షు చెప్పడం అంటే.. ఆ మనిషిని హత్య చేసినట్టే. అందుకే నేను ఎవరికీ వారి ఆయుష్షు గురించి చెప్పను” అని బదులిచ్చాడు.

“మీరు మంచి చెప్పినా మిమ్మల్ని ఇలా కారాగారంలో బంధించారు కదా, రాజుపై కోపం లేదా బాబు?” అని ఒక ఖైదీ అడిగాడు. “శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటప్పుడు ఈ రాజుపై కోపం ఎందుకు?” అని పండితుడు అన్నాడు. పండితుడి మాటలకు ఖైదీలు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. పండితుడు వెంటనే శివజపం మొదలుపెట్టారు. అతన్ని చూసి మిగతా ఖైదీలు కూడా జపం చేశారు. ఇలా మూడు రోజులు గడిచాక, పండితుడు భటులను, “రాజుగారికి చెప్పి నా గ్రంథాలు తెచ్చి ఇస్తారా?” అని అడిగాడు. భటులు రాజుగారికి చెప్పారు.

రాజు సరే అన్నాడు. గ్రంథాలు తెప్పించి, పండితుడిని పిలిపించారు. పండితుడిని సభకు తీసుకొచ్చారు. సభలో రాజు పండితుడితో, “నీకు గ్రంథాలు కావాలంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు” అన్నాడు. పండితుడు బదులిస్తూ, “ఒక మానవుడికి ఆయుష్షు చెప్పకూడదు అని నాకు నేర్పించింది ఆ గ్రంథాలే. వాటి కోసం అవి బోధించిన నీతిని నేను వదిలేయాలా? అలాంటి పరిస్థితి వస్తే, నేను గ్రంథాలనే వదులుకుంటాను” అని అన్నాడు. సమాధానం విన్న రాజు, “ఈ గ్రంథాలు నా వద్దే ఉంటాయి. నీకెప్పుడు మనసు మారినా వెంటనే నా దగ్గరకు రా” అని చెప్పి సభను ముగించాడు.

పండితుడు కారాగారంలో శివ జపం చేస్తూ కాలం గడుపుతుండగా, రాజు పండితుడి వద్ద తీసుకున్న గ్రంథాలను చదువుకుంటూ ఉన్నాడు. ఇంతలో వైశాఖ పౌర్ణమి రాగానే, సభ ఏర్పాటు చేసి పండితుడిని పిలిపించారు. రాజు మళ్ళీ అదే ప్రశ్న సంధించాడు. పండితుడు ఏ మాత్రం భయం లేకుండా మళ్ళీ అదే సమాధానం చెప్పాడు.

రాజు తన సింహాసనం నుండి లేచి, పండితుడి దగ్గరకు వచ్చి తన ఖడ్గాన్ని బయటకు తీశారు. సభలో ఉన్నవారంతా ఏం జరుగుతుందోనని ఎంతో బాధగా, భయంగా చూస్తున్నారు. రాజు ఆ ఖడ్గాన్ని పండితుడి చేతికి ఇచ్చాడు. అది చూసి సభలోని వారంతా ఆశ్చర్యంతో లేచి నిలబడ్డారు. “మీ ఖడ్గాన్ని నాకు ఎందుకు ఇస్తున్నారు?” అని పండితుడు అడిగాడు. దానికి రాజు, “నా గర్వంతో మిమ్మల్ని నమ్మకుండా, నోటికొచ్చిన ప్రశ్న అడిగాను. కానీ మీరు మాత్రం మీ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడ్డారు తప్ప, మీ నియమాన్ని భంగం చేయలేదు,” అన్నాడు రాజు.

“నేను ఎలాగైనా సరే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కనుగొని మీకు చెప్పి, నా అహంకారాన్ని ప్రదర్శిద్దామనుకున్నాను. కానీ, మీ గ్రంథాలు నన్ను పూర్తిగా మార్చేశాయి. నా ఖడ్గం నా గర్వం. ఆ గర్వాన్ని మీకు ధార పోస్తున్నాను” అని రాజు నమస్కరించాడు. పండితుడు “ఆయుష్మాన్ భవ” అని దీవించాడు.

పండితుడు దీవించిన వెంటనే, పరరాజ్య రాజు మన రాజ్యంపై యుద్ధానికి వస్తున్నాడన్న వార్త చెప్పాడు ఒక వర్తకుడు వచ్చి. ఆ వార్త విన్న రాజు, “ఈ రోజు మీ శిరచ్ఛేదనానికి నేను ముహూర్తం పెట్టాను. కానీ, ఈ రోజే నా ఆయుష్షు ముగిసిపోవడానికి భగవంతుడు ముహూర్తం పెట్టాడు” అన్నాడు. “అదేంటి మహారాజా, వార్త యుద్ధం గురించే కదా, మీ ఆయుష్షు తీరిపోవడం ఏమిటి?” అని పండితుడు ప్రశ్నించాడు.

“నా పరిపాలన వల్ల ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. నేను ఎవరినీ పట్టించుకోలేదు. సైనికులు కూడా గత్యంతరం లేక యుద్ధానికి వస్తారు. నేను నా రాజ్యాన్ని కోల్పోతాను.”

రాజ్యం కోల్పోయాక రాజు ఇంకెందుకు పనికొస్తాడు అని రాజు అనుకున్నాడు.

పండితుడు రాజ్యంలోకి వెళ్లి ప్రజలందరికీ రాజు విలువ, రాజు లేని రాజ్యం పరిస్థితి వివరించాడు. దాంతో “మన రాజ్యం మనకే ఉండాలి, పరాధీనం కాకూడదు” అని ప్రజలందరూ యుద్ధభూమికి వెళ్లి రాజ్యాన్ని, రాజునూ కాపాడుకున్నారు.

యుద్ధం గెలిచి వచ్చిన రాజు పండితుడి వద్దకు వచ్చి తమ రాజ్యానికి రాజగురువుగా ఉండమని కోరాడు.

“తప్పకుండా రాజగురువుగా ఉంటాను” అని చెప్పి, “రాజా, ఈ రోజు మీకు ఒక గండం ఉంది, దాన్ని జయించారు. ఇక గండాలు లేవు. ఆయుష్మాన్ భవ” అని ఆశీర్వదించాడు పండితుడు.

“నేను ఈ రోజు నుండి ప్రజల పాలనలో ఎలాంటి పొరపాట్లు చేయను, నా స్వార్థాన్ని చూసుకోను, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాను” అని ప్రతిజ్ఞ చేసి, ఆ ప్రకారమే సుపరిపాలన అందించడం వలన, ఆ రాజు మరణించిన తర్వాత కూడా కలకాలం బ్రతికే ఉన్నాడు.

Exit mobile version