Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-6

సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి జాలువారిన ‘ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

క్కడ సోఫాల్లో కూచునేవారు. ఆ పక్కనే ఓ టేబుల్ మీద కెటిల్ దాని పక్కనే ట్రే. అందులో బోర్లించిన కప్పులు సాసర్లు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ కూచుని కాఫీ తాగేలాంటి ప్రొవిజన్ అది. ముగ్గురూ కలిసి టీ తాగేవారు. ఆ ముగ్గురులో శివరామ్, తనూ ఉన్నారు, మూడో మనిషి కావేరి గుర్తొచ్చింది. అసలు ఆమెని మర్చిపోతే కదా, గుర్తుకు రావడానికి. ఈ క్షణంలో కూడా ఇక్కడెక్కడో ఉన్నట్టుగా అనిపిస్తోంది.

బలవంతంగా ఆమె ఆలోచనల నుంచి మనసుని తిప్పాడు.

ఓ వైపున ఉన్న ఫైర్ ప్లేస్‌లో చిన్న చితుకులు మండుతున్నాయి.

నిజానికి ఓ ఫైర్ ప్లేస్ అక్కడి వాతావరణానికి అవసరం లేదు. కాని, తండ్రి ఇంగ్లాండ్‌లో ఉండి చదువుకుని వచ్చారు కాబట్టి , ఇది కూడా ఉండాలని ఈ హాల్లో కట్టించారు. అంతే కాకుండా ఆ భవనం ఓ ఎత్తైన గుట్ట మీద ఉంది. చుట్టూ ఇళ్ళు లేవు. పెద్ద పెద్ద చెట్లతో నిండిన ఓ అడవి, ఈ అన్ని కారణాల వల్ల చలికాలం నాలుగు నెలలు బాగా చలి ఉంటుంది. అప్పుడు ఇక్కడే చితుకులు వేసి మంట వేసుకుని దాని ముందు కూచుని కాలం గడిపే వాళ్ళు. ఇప్పుడు కూడా ఆ సంప్రదాయాన్ని చలికాలాల్లో కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ కూచున్నారు. మండుతున్న చితుకుల్లోంచి తెరలు తెరలుగా వేడి వాళ్ళదగ్గరికి వస్తోంది. ఆ పక్కనే ఉన్న కొవ్వొత్తులు నాట్యం చేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఆరిపోతుందేమోనని తలుపులు కూడా మూసేసారు. పనివాళ్ళు అన్నీ అమర్చి వెళ్ళి పోయారు.

ఇప్పుడు ఆ గదిలో ఉన్నది వాళ్ళిద్దరే. తోడుగా మసక వెలుతురు.

“ఇప్పుడు సరిగ్గా, ఆరోజుల్లో మనం కూచున్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మనిద్దరం ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్లం. డెబ్బై దాటిన వాళ్లం. ఇంకా ఎన్నేళ్ళు బతుకుతాం అన్నది మనకేమీ తెలీదు. మహా అయితే ఓ ఏడాది, రెండేళ్ళు. అంతే. ఈ విషయం గురించి నేను చాలా సార్లు ఆలోచించాను. నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, ఈ విషయం నువ్వు ఆలోచించావో లేదో తెలీదు.

మనం విడిపోయి దగ్గర దగ్గర నలభైమూడేళ్ళుఅయింది. అంటే చాలా కాలం, ఈ సమయంలో అంతా అయిపోతుందనుకున్నావు కదా. అవునా! కాని కాదు. అంతా అయిపోలేదు. ఇన్నేళ్ళ తరవాత ఎన్నో ఊళ్ళు తిరిగి ఇప్పుడు వచ్చావు,

నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మనిద్దరికి తెలుసు, ఎప్పుడో ఓరోజున మనిద్దరం కలుసుకుంటాం అని. ఎందుకో కూడా తెలుసు. ఓ రహస్యం మనిద్దరి మధ్య రాజుకుంటోంది. ఇదే జీవించడానికి మానసిక బలాన్నిస్తోంది. ఈ భూమ్మీద చెయ్యాల్సినవి ఏవో ఉండీ ఉంటాయి. అందుకే మనిద్దరం బతికి ఉన్నాం.

ఈ పెద్ద బంగళాలో నేను ఒక్కడినే చుట్టూరా ఉన్న ఈ అడవి లాంటి ప్రదేశంలో, ఈ తోటలో ఒక్కడిని బతికి ఉన్నాను. ఎందుకో తెలుసా, నీకు చెప్పాల్సినవి, నిన్ను అడగాల్సినవి, నేను వినాల్సినవి చాలా ఉన్నాయి.

ఇన్ని ఏళ్ళు ఒక్కడినే ఇక్కడుండి పోయాను. ఒంటరిగా. వ్యాపారాలు చూసుకుంటూ అప్పుడప్పుడు విదేశాలకి వెళ్ళినా, నేను మర్చిపోలేని మనిషి కావేరి నా జ్ఞాపకాలలో తోడుగా ఉన్నా, అయినా ఒంటరి వాడిగానే ఉన్నాను.

ఒంటరితనం చాలా చిత్రమైనది. బోర్ అనిపించినా పాఠాలు నేర్పిస్తుంది. ఎలా ఉండాలో నేర్పించింది. ఎలా ఉండకూడదో కూడా నేర్పించింది. ఎన్నో ప్రమాదాలని ఎదుర్కొన్నాను. ఎన్నింటికో ఆశ్చర్యం వేసేది. ఈ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో అన్నీ కూడా ఒంటరితనంలో ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల్లో నాలో ఎన్నో జరిగాయి. ఆ జరిగినవి నీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు వినాల్సిందే. ఇంక పారిపోడానికేం లేదు.” అని ఆగాడు.

వెలుగు నీడల్లో శివరాం మొహం సరిగా కనిపించ లేదు. అతని కవళికలు గమనించడానికి అవకాశం లేదు.

“మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. నలభైమూడేళ్ళ క్రితం సంగతి ఇది.”

ఔను అన్నట్లు తల ఊపాడు శివరామ్.

“ఆరోజున, నీకు అన్ని వసతులు ఉన్న ఈ ఇల్లుంది. అయినా పారిపోయావు. ఈ ఇంట్లో అందరూ నీకు గౌరవం ఇచ్చారు. కావేరి కూడా నీతో ఎంతో స్నేహంగా ఉండేది. మా మూలంగా నీకు ఎన్నడూ కూడా అసౌకర్యం కలగలేదు.

ఈ చిన్న ప్రపంచం నీకు నచ్చలేదు. అందుకే ఓ పెద్ద విశాలమైన ప్రపంచానికి వెళ్ళిపోయావు. అది కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. అది నీ వ్యక్తిగతం అని నువ్వనుకోవచ్చు. అన్నింటికన్నా విషాదం ఏంటంటే, నువ్వు గతాన్ని మర్చిపోయావు. లేదు నటిస్తున్నావు. ఇన్నేళ్లూ ఏం చేసావు, ఓ సన్యాసిలా, డిసిప్లీన్డ్‌గా ఉన్నావు. ఒక్క ఏడాది కాదు, నలభైమూడేళ్ళు ఇటువైపు రాలేదు. నన్ను కలవడానికి ప్రయత్నించలేదు. ఎందుకు అన్నది అర్థం కాని విషయం.

కాని నేను మాత్రం ఈ నలభై మూడేళ్ళు, ఈ క్షణం కోసం ఎదురు చూస్తూండి పోయాను. ప్రతీరోజూ ప్రాక్టీసు చేసేవాడిని యుద్ధం ఎలా చేయాలి అని, ఏదో ఓ రోజున యుద్ధం జరుగుతుంది. ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా ఉన్నాను.

ఏ ఆయుధంతో యుద్ధం చేసానో తెలుసా, జ్ఞాపకాలతో, ఒంటరితనం పోగొట్టుకోడానికోసం. జీవితంలో ఈ ద్వంద్వ పోరాటాలు కత్తులు కటార్లు లేకుండా. కాని అది చాలా ప్రమాదకరం. ఏం అంటావ్?” అని ఎంతో మర్యదగా అన్నాడు బ్రహ్మాజీ.

“నిజమే అంగీకరిస్తున్నాను.” అని శివరాం ఒప్పుకున్నాడు.

“చాలా సంతోషంగా ఉంది. నువ్వు అదే విధంగా ఆలోచిస్తున్నావు. ఇది నాకు ఊపిరిని ఇస్తుంది. కాని దానికి ఓ లిమిట్ ఉంది. నువ్వు వస్తావని తెలుసు కాని ఎప్పుడు వస్తావో తెలీదు. వస్తున్నానని ముందుగానే ఉత్తరం రాసి ఉండాల్సింది. తెలిస్తే నేను నిన్ను రిసీవ్ చేసుకునే వాడిని. నిన్ను చూడడానికి వచ్చేవాడిని. నీ ఉత్తరం చూసి ఉంటే, నేను దుబాయ్ వెళ్ళే వాడిని కాదు. ఏదైనా నిన్ను దుబాయ్‌లో నేను గుర్తుపట్టి, పలకరించాను.”

అవునన్నట్లు తలూపుతూ సిగరెట్ వెలిగించాడు.

“నాకు ఇక్కడ టెలిఫోన్ లేదు. ఉన్నది నేను వాడను. రేడియో లేదు. బయటి శబ్దాలు నేను వినదల్చుకోలేదు. నేను పుట్టి పెరిగిన ఈ ప్రపంచం నా స్వతంత్రాన్ని లాగేసింది.”

ప్రతీక్, కోడలు, పిల్లలు శని, ఆదివారాలు ఉదయం మాట్లాడుతారు, అని బ్రహ్మాజీ చెప్పలేదు. అది ఇప్పుడు ఇక్కడ అనవసరం అనిపించింది.

ఇప్పుడు అది ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయావు అన్నది కాదు. నామీద ద్వేషం పెంచుకుని నన్ను చంపాలని అనుకున్నావు ఎందుకు అనాలని అనుకున్నాడు. కాని ఇది సమయం కాదు అనిపించింది.

ఇంకా కరెంటు రాలేదు. చీకట్లోనే కూచున్నారు.

“నువ్వు ఇందాకా అన్నావు, నేను విశాలమైన ప్రపంచంలోకి వెళ్ళి పోయానని, నీకు చెప్పలేదని, చెప్పకుండా వెళ్ళిపోయానని, నువ్వన్న మాటలకి అర్థం ఏంటీ, నేను వెళ్ళానంటే నాకు వెళ్ళే స్వతంత్రం ఉంది. ఆ హక్కు కూడా ఉంది. కారణం కూడా ఉంది. నువ్వన్నది నిజం, నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. నాకు మరో మార్గం లేదు. నా సమస్యకి అదే సరి అయినది అనుకున్నాను.”

శివరాంని ఆశ్చర్యంగా చూసాడు బ్రహ్మాజీ.

“మరో మార్గం లేదా? ఇదే సమస్యకి సరి అయినదా? అదే ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలి. దీనికోసమే ఇన్నాళ్లూ ఎదురు చూసాను. తల బద్దలు కొట్టుకున్నాను.” అంటూ చీకట్లోనే శివరాంని చూసాడు.

అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

“ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను. ఇన్ని రోజులు నా బాల్యం గురించి, ఆతరవాత రోజుల గురించి, ఆలోచిస్తూ గడిపాను. ఇది చాలా సహజం. గతించిన జీవితంలోనివి ఎన్నో గొంతులు, ఎన్నో ముఖాలు ఎంతో స్పష్టంగా ఉన్నాయి. అందులో నీతో మాకు వరిచయం. మా నాన్నగారితో నీ పరిచయం. ఓసారి గుర్తు చేస్తాను. వినాల్సిందే.

మన హాస్టల్‌కి, స్కూలుకి ఆ రోజు నుంచి సెలవులు. అందరి పేరెంట్స్ వచ్చి వారి వారి పిల్లలని తీసుకెళ్తున్నారు. నాకోసం మా నాన్నగారు వచ్చారు. మీ ఇంటి నుంచి నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు. నవ్వు మీ నాన్న గారి కోసం ఎదురుచూస్తూ ఏడుపు మొహం పెట్టుకుని ఉన్నావు. నేను వెళ్ళకుండా నీకోసం ఆగాను.

నిన్ను వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు. అంత పెద్ద ఆవరణలో ఒక్కడివి ఎలా ఉంటావు. అప్పుడు నిన్ను మాఇంటికి తీసుకెళ్ళాలని అనుకున్నాను.

నేను ఒక్కడిని వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేక పోయాను. నాన్నగారికి నీ గురించి చెప్పాలనుకున్నాను. నిజానికి నీ గురించి నాక్కూడా సరిగ్గా తెలీదు. నా క్లాస్‌లో నాతో పాటూ చదువుకుంటున్నావు. అంతే. హాస్టల్‌లో మన రూములు కూడా వేరు. కాని, ఆ సమయంలో నిన్ను చూసి జాలి వేసింది. ఎవరూ రాకపోతే ఎంత సేపు ఇక్కడ ఉంటావు, అందుకని మా నాన్నగారు అంగీకరించేలా చెప్పాలి. అది స్పాంటేనియస్‌గా తీసుకున్న నిర్ణయం.

నీ వాళ్ళు ఎందుకు రాలేదో నీకు తెలీదు. మీ ఊరినుంచి వాళ్ళు వస్తారో లేదో కూడా నీకు తెలీదు. ఒకవేళ, వాళ్ళు గనక రాక పోతే, నీ సంగతి ఏంటీ, ఒక్కడివి ఎలా ఉంటావు, నాతో తీసుకెళ్దామని అనుకున్నాను.

మనిద్దరం ఓ చెట్టు కింద నుంచున్నాం. ఆ చెట్టు మన హాస్టల్ ప్రధాన ముఖద్వారం ఎదురుగా ఉంది.

అక్కడ మా నాన్నగారికి నీ గురించి చెప్పాను. ఆయన నవ్వి, తన చేయిని నీకందించారు. చేయి కలిపారు. అప్పుడు ఆయన ఏం అన్నారో చెప్తాను, నీతో స్నేహాన్ని మేం ఇద్దరం గౌరవిస్తున్నాం, జీవితంలో స్నేహం కన్నా గొప్పది మరేం ఉండదని ఆయన అనుకున్నారు. అవునా….

అంతే కాదు, ఆయన ఇంకా అన్నారు. ఆ రోజున ఆయన అన్న మాటలు మరోసారి గుర్తు చేసి చెప్తాను. మా బ్రహ్మాజీ స్నేహితుడు నాక్కూడా స్నేహితుడే. నేను మా అబ్బాయిని నమ్ముతాను. నమ్మాను. వాడు నిన్ను నమ్ముతున్నాడు. ఈ నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధం మొలకెత్తదు, మానుగా మారదు. మీ స్నేహం ఇలాగే ఎప్పటికీ ఉండాలి.

ఇది పరిచయం చేసిన రోజున మా నాన్న గారు మనతో అన్నారు. ఆ రోజు నీ జీవితం మలుపు తిరిగిన రోజు.”

అవునన్నట్లుగా తల ఊపాడు.

“థాంక్యూ, ఒప్పుకున్నందుకు, గుర్తున్నందుకు. ఏం జరిగిందో నీకు వరసగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.”

(సశేషం)

Exit mobile version