Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎంత చేరువో అంత దూరము-15

[శ్రీమతి పువ్వాడ శారద గారు రచించిన ‘ఎంత చేరువో అంత దూరము’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[పిల్లాడి నిక్కర్ వెతుకుతూ కామన్ బాత్‌రూమ్‍లో అడుగుపెట్టిన ఊర్మిళ, కాలు జారి పడిపోతుంది. శబ్దం విన్న జాహ్నవి పరిగెత్తుకు వచ్చి కంగారు పడి, మెల్లిగా పిన్నిని లేపి కూర్చోబెడుతుంది. ఆఫీస్ బెల్ కొట్టి, ఇంటర్‍కమ్‍‍లో మాట్లాడిన స్టాఫ్ వేణు ద్వారా నాన్నకి వార్త అందిస్తుంది. ఆనంద్, వేణు క్రిందకి వస్తారు. వేణు కారు స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచగా, ఆనంద్ ఊర్మిళను ఎత్తుకుని కార్లో కూర్చోబెట్టి హాస్పటల్‍కి తీసుకువెడతాడు. తుంటి ఎముక, మోకాలికి ఫ్రాక్చర్స్ అవడంతో రెండు వారాలు హాస్పటల్‍లో ఉండాలని చెప్తారు డాక్టర్లు. ఇంట్లో పిల్లల్ని జానూ చూసుకుంటుంటే, ఆనంద్ అటు ఆఫీస్ పనితోనూ, ఇటు హాస్పిటల్‍కి తిరగడంలోనూ బిజీగా ఉంటాడు. ఓ రోజు పార్కులో తమ్ముళ్ళని ఆడించి తీసుకువస్తుంటే ఒకావిడ జానూని ఆపి నువ్వు ఆనంద్ మొదటి భార్య కూతురివట కదా, మీ అమ్మని పిలిపించకపోయావా అని అడుగుతుంది. కోపం వచ్చినా, కంట్రోల్ చేసుకుని తమ్ముళ్ళతో ఇంటికి వచ్చేస్తుంది జానూ. కొందరు తమ గురించి చీప్‍గా మాట్లాడుకోడం విని బాధ పడుతుంది. అక్కడ మాలతి టీ.వీ. సీరియల్స్‌కి అలవాటు పడి, సమయం వృథా చేసుకుంటూ తానే ఓ నెగటివ్ క్యారెక్టర్‍లా మారుతుంది. ఓ రోజు టీవీలో చూసిన వార్త ఒకటి బాగా కలవరపరచగా, భద్రం గారిని కేకేసి పిలుస్తుంది. ఆ వార్త చూడండి నాన్నా అంటుంది. అప్పట్నించి ఆమెకు మరింత భయం పెరుగుతుంది. హైదరాబాద్ వెళ్ళి జానూని తీసుకొచ్చేస్తానని మొండిపట్టు పడుతుంది. చివరికి శ్రీనివాస్‍ని వెంట తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఊర్మిళకి జరిగిన ప్రమాదం గురించి తెలిసి, ఆమె పని చేసే స్కూలు నుంచి టీచర్లు, పిల్లలు వచ్చి చూసి వెడతారు. ఆనంద్ ఫోన్ మోగుతుంది. మైసూర్ నుంచి మాలతి హైదరాబాద్ వస్తోందని కబురు చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఈ అస్తవ్యస్త పరిస్థితులలో మాలతి వస్తోందా అనుకుంటూ విస్తుపోతాడు ఆనంద్. – ఇక చదవండి.]

అధ్యాయం 15

జాహ్నవికి తాతగారు ఈ విషయం చెప్పలేదు.

ఆనంద్‌కు తెలిస్తే ఆమెకూ తెలుస్తుందనుకున్నారు. ‘ముందుగా తెలిస్తే బాధా, కంగారునే కదా, బంగారు తల్లికి. తండ్రి దగ్గర ఉన్నన్నాళ్ళు ప్రతి క్షణం ఆనందాన్ని ఆస్వాదించనీ!’ అనిపించింది ఆయనకు.. ‘బహుశా ఈ దశ జాహ్నవికి జీవితంలో మళ్ళీ రాక పోవొచ్చు కూడా’ అన్నది ఆయన భావం. మనవరాలిపై ఉన్న ప్రేమ ఆయనను సున్నిత కోణంలో అలా ఆలోచింప జేసింది.

కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసిన జాహ్నవి ఎదురుగా మాలతిని చూసి నివ్వెరపోయింది.

“ఓహ్! అమ్మా! నువ్వు వచ్చావా!” తల్లిని చూసిన ఆనందంలో జాహ్నవి పెదవులు ఇంక విచ్చుకోను వీలు లేనంత విచ్చుకున్నాయి. గభాల్న తల్లిని వాటేసుకుంది.

కానీ సంతోషాన్ని కూడా సంపూర్తిగా అనుభవించలేని పరిస్థితి జాహ్నవిది.

నాన్న వస్తే ఏమి గొడవలవుతాయో అన్న భయం కలిగింది వెంటనే.

తన కన్నా మూరెడు తక్కువ ఉన్న తల్లిని పసిపిల్లకు మల్లె అక్కున జేర్చుకుంది. మాలతికి కూడా జాహ్నవిని చూసి, హృదయం తేలిక పడింది. ఎప్పటికన్నా కాస్త ఒళ్ళు చేసింది. రంగు కూడా తిరిగింది. జాహ్నవిని అలా చూసి, ఆమె మనసులో ఆందోళన క్రమంగా కనుమరుగయ్యింది. తాను ఏవేవో ఊహించుకున్నందుకు లోలోపల కించపడింది.

“ఇలా అయిపోయావేమిటి అమ్మా! నేను ఇంట్లో లేకుంటే తినవా నువ్వు. పాపం తాతగారు నువ్విలా ఉంటే ఎంత బెంగ పెట్టుకుంటారు”

జాహ్నవి కోపం హాయిగా ఉంది మాలతికి. తన జానూను ఎవరూ మార్చలేరు, అనుకుంది. కానీ, ‘ఎవరూ మార్చాలనుకోలేదు’ అనుకుని ఉంటే బాగుండేది. మాలతికి ముఖ్యంగా ఊర్మిళ విషయంలో అంత పాజిటివ్ దృక్పథం ఎప్పుడూ లేదు.

తల్లీ కూతుళ్ళు రిరువురూ మాటి మాటికి ఆలింగనం చేసుకుంటూ ఎన్నడూ ఎరుగని ఇన్నాళ్ల ఎడబాటును మర్చిపోయారు.

అమ్మ వచ్చిందని నాన్నకు చెప్పాలి కదా!

‘ఎస్! దటిజ్ గుడ్!’ అనుకుంది.

“అవసరం లేదు. తాతగారు చెప్తానన్నారు, లే!” అంది మాలతి.

ఎన్నో సంశయాలు –  జాహ్నవిలో!

నాన్న వస్తే గొడవ అవ్వదు కదా!

జాహ్నవికి మొదటిసారి తన మీద తనకు జాలి వేసింది.

ఏమిటీ పరిస్థితులు! ఏమిటీ సమస్యలు!

“పొరుగు వాళ్ళ పాప లాగా పెట్టి పుట్టలేదు లే!

అమ్మతో నాన్నతో హాయి నోచుకోము లే!

నాన్నా! తెలుసునా!

జాలి కలుగునా”

ఉహు! ఎవరూ తగ్గరేమో!

జాహ్నవి తానిప్పుడు ఏమి చేయాలో ఆలోచించింది.

ఆనంద్ లాప్టాప్ ముందు పెట్టుకొని, టికెట్ బుకింగ్ చూడ సాగింది.

“అమ్మా! మరో మూడు గంటల్లో మనకు ఫ్లయిట్ అవైలబుల్ ఉంది.” అంది.

“అయితే!” అంది మాలతి.

“హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోదాము” .

“అక్కడ హ్యాపీ లేదు అనే కదా, ఇక్కడకు వచ్చావు” అంది కాస్త కోపంగా.

“సారీ అమ్మా!” అంటూ తల్లి  చుట్టేసింది.

దాసుని నేరం దండంతో సరి..

అమ్మ కోపం హగ్గుతో హరి!

నిజానికి మాలతికి కోపం ఎక్కడ ఉంది.

చల్లని తల్లి మనసు మరింత చల్లనయ్యింది.

“ఇంట్లో ఎవరూ లేరేమిటి జానూ!” అంది మాలతి.

జాహ్నవి జరిగింది చెప్పింది.

స్నానం చేసి వచ్చింది మాలతి. బడలిక కాస్త తగ్గింది.

“అమ్మా! స్విగ్గీ నుండి ఏదయినా తెప్పిస్తాను.” అన్న జాహ్నవి మాటలకు

“వద్దులే!” అంటూ వంట యింట్లోకి వెళ్ళింది.

“అమ్మా! మరి కాస్సేపయితే అన్నమ్మ వచ్చి, వంట చేస్తుంది లే!” అంది జాహ్నవి.

మాలతి వినలేదు.

కమ్మగా వండి చిన్న పిల్లలకు, జాహ్నవికి పెట్టింది.

గడియారం వంక చూస్తూంది.

“అమ్మా! నువ్వు తిను. హర్ట్ ఎన్లార్జ్ మందులు వేసుకున్నావా!” అంది జాహ్నవి.

మాలతి మాట్లాడలేదు

“నువ్వు తింటే మనము బయలుదేరదాము. టికెట్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి.” అంది

“నాకు నీరసంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికీ కదల లేను.”

మాలతి మాటలకు జాహ్నవి నిస్సహాయంగా చూసింది. ‘నాన్న రావాల్సిందేనా! గొడవ జరగాల్సిందేనా!’ అనుకుంది.

***

మాలతి రాక వల్ల ఆనంద్‌కు హాస్పిటల్ లోనే ఉండక తప్పలేదు. మతి లేని మనిషి ఏమి గొడవ చేస్తుందో, పిల్లల ముందు ఎలాంటి మాటలు విసురుతుందో! ఊర్మిళ పిల్లల్ని తెచ్చి చూపించమంది. నొప్పులు ఎక్కువై బాధ పడుతూన్న ఆమెను చూస్తూ ఇదీ పరిస్థితి అని చెప్పలేక పోతున్నాడు.

జాన్విని ఉద్దేశ్యపూర్వకంగానే పంపలేదని నిందలేసినా ఆశ్చర్యం లేదు. ఇన్నేళ్ళు తన దగ్గరే కదా, జాన్వి ఉంది. కొన్ని రోజులు తన దగ్గరుంటే ఎంత సీన్ చేస్తున్నారు. ‘ఓవర్ పొసెసివ్’ అనుకున్నాడు. జానూ కూడా ఫోన్ చేయలేదు. వాళ్ళమ్మ మాట విందేమో!

మరో రెండు రోజులు చూసినా జాహ్నవి నుండి ఫోన్ రాలేదు. ఇద్దరూ వెళ్ళిపోయి ఉంటారేమో! అనుకున్నాడు.

పిల్లలు ఎలా ఉన్నారో! అన్నమ్మకు వాళ్ళను మేనేజ్ చేయడం కష్టమే! వెళ్ళి ఉంటారని కారు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. జానూ లేని ఇల్లును తలుచుకుంటే బాధగా ఉంది. అక్కడి నుండయినా తనకు ఫోన్ చేయకుండా ఉంటుందా! “నాన్నా, వెళ్ళిపోయాము. అప్పుడు మీకు చెప్పలేకపోయాను” అని చేస్తుందేమో! ఆనంద్ కనుకొలుకుల్లో నీళ్లు నిలిచాయి. జానూ వెళ్తున్నానని చెప్పలేకపోయింది. వెళ్ళేటప్పుడు తాము దగ్గర ఉండలేక పోయారు. ఆలోచనల్లో ఉండగానే కారు ఇల్లు చేరింది.

కాంపౌండ్ గేట్ ప్రక్కనే కారు పార్క్ చేసి, గేట్ తెరిచి లోపలికి వెళ్ళాడు.

***

ఇంట్లోకి అడుగు పెట్టేందుకు అంత దూరంలో ఉండగానే – గాలికి కదులుతున్న పరదాలు స్వాగతిస్తూ కనిపించాయి, కనిపించని ఆహ్వానం ఏదో దాగి ఉన్నట్టు ఉంది. సందిగ్ధంగా కర్టెన్ జరిపాడు. లేత కనకానంబరం రంగు నెటెడ్ పరదాలపై అందంగా కుట్టి ఉన్న జంట నెమళ్ళు.. కుట్టిన వారి పనితనం చెప్తూంటే, అతని స్మృతిపథంలో ఏదో మెరిసి క్రిందకు చూసాడు. ‘మాలతి’ అని అందంగా, పొందికగా ఉన్న అక్షరాలు.. కదిలే గాలితో వెనక్కు వెళుతూ, తమతో రమ్మంటున్నాయి.

దేవుని మందిరం నుండి, చిర పరిచిత బాంధవ్యంలాంటి సుగంధ పరిమళాలు.. గోడకున్న ఫోటో ఫ్రేమ్‌లో కాటుక దిద్దన కళ్ళతో మాలతి.. ఒక్క క్షణం ఆగి చూసాడు.

పాల బుగ్గల, పసిడి నవ్వుల పాపాయి ఎత్తుకున్న మాలతి..

మాలతి భుజాలపై చేతులు వేసిన పెద్ద జాహ్నవి.

తానెక్కడికి వచ్చాడు. తన ఇంటికేనా!

ఆమె కనిపించకున్నా, మాలతీ వనంలో అతని మనసంతా విహరిస్తూన్న అనుభూతి కలిగించేలా ఉంది ఇల్లు.

సున్నితంగా పాదాల అలికిడి.. చిర పరిచిత మెట్టెల ధ్వని..

మాలతి వెళ్ళలేదా!

“మాలతీ” అన్నాడు.

ఆ పిలుపుకు చకోరంలా ఆమె..

చేతిలో చల్లని నీళ్ళ గ్లాస్‌తో తడబడుతూ వచ్చి అతని ముందు నిలుచుంది. ఆనంద్ మాలతినే చూస్తున్నాడు..

మాలతి యేనా ఈమె!

కళ్ళు అలసిన నక్షత్రాల్లా.. వెలుగు తగ్గిన చూపులు గమ్యం కోల్పోయిన బాటసారివి లా.. మోము వడలిన పుష్పంలా..

ఆనంద్ హృదయం ద్ర వించింది

మాలతి కళ్లెత్తి అతని వంక సూటిగా చూడలేక పోతోంది.

అవతన శిరయై కళ్లెత్తి చూసింది.

ఇరువురిలోనూ కాలం తెచ్చిన మార్పులు..

నీళ్ళ గ్లాస్ ముందుకు చాపింది. ఉద్వేగంతో చేయి సన్నగా వణుకుతూంది.

ఆనంద్ తీసుకోలేదు. హాల్లోకి నడిచాడు.

అతని నిరసన ఆమెకు తెలుస్తూనే ఉంది. మాలతి ముఖం చిన్నబోయింది.

అతను హాల్లోకి వచ్చాడు. అలసటగా సోఫాలో వాలాడు. విపరీతమైన ఎండలు.

మాలతి, జాన్వీతో వెళ్ళిపోయిందనుకున్నాడు. అన్నమ్మ ఏదో వండి పడేసి ఉంటుంది, పిల్లలకు తినిపించి తానూ తిని వెళ్ళాలనుకున్నాడు.

సోఫాలో తల వెనక్కి వాల్చాడు ఆనంద్. కళ్ళు మూసుకున్నాడు.

ఆనంద్ కఠినుడు కాడు.

మనసులో బాధగా ఉంది అతనికి. మాలతి ఆరోగ్యం క్షీణింపజేసుకుందనిపించింది.

“భోజనం సిద్ధంగా ఉంది” అంది మాలతి.

అతనికి నవ్వు, కోపం వచ్చాయి. ఏమి సాధిద్దామని ఇప్పుడీ ప్రేమలు.

“జాన్వీ నా దగ్గర ఉంటే నీకు బాధ ఏమిటి!” అన్నాడు.

బాధ కాదు భయం అనీ అతని కెలా చెప్తుంది.

మాలతి మాట్లాడలేదు. ఆనంద్ కూడా ఇంకేమి మాట్లాడలేదు. ‘బాడీ లాంగ్వేజ్’ అంటారు. ఆలాగే మనసు లాంగ్వేజ్ కూడా ఉంటుందేమో!

‘ఇంకా ఎందుకున్నావు, నీ బిడ్డను తీసుకొని వెళ్ళక’ అన్న మాట అతని నోటి వెంట రాలేదు. అది అతని అంతర్లీనమైన యాక్సెప్టెన్స్‌ను తెలియజేస్తోందా! ఏమో తెలియదు.

అలా వెనక్కి తల వాల్చి పడుకుని ఉన్న ఆనంద్‌కు హాస్పిటల్‌లో నిద్ర సరిగా లేనందుక వల్లనేమో కన్ను మలిగింది.

సమీపంలో ఏదో అలికిడి. కళ్ళు తెరిచాడు మాలతి ఏడుస్తోంది. తిరునాళ్ళలో తండ్రి చేయి విడిచి వెళ్ళిన పాపాయికి తన తప్పు తెలిసినట్టు! మాలతి సోఫా పై కాకుండా క్రిందే కూర్చుని ఉంది.

“జానూను మీ నుండి దూరం చేసాను. అది ఎంత తప్పో తెలిసింది.”

చందనపు పూత పూసింది ఆ మాటతో!!

ఇన్నేళ్ళుగా ఏమి నష్టపోయాడో అతనికి తెలుసు.

“కాలం తిరిగి రాదు”,  అన్నాడు.

ఆమె తలాడించింది.

దోషి తప్పు ఒప్పుకుంది. న్యాయస్థానమే ఇక శిక్ష తగ్గించాలి.

చేయి అందించి సోఫాపై కూర్చోబెట్టాడు.

కన్నీళ్లు తుడుచుకుంది.

“భోజనానికి రండి!” అంది.

“తినాలని లేదు.”

 “వెళ్ళిపోతాను కదా! వెళ్ళిపోయే దాని మీద పంతం ఎందుకు!” అంది.

 “పిల్లలు..?”

“తిన్నారు!”

“జాన్వీ?”

“ఇంకా తినలేదు.”

“మీరు రండి!” అంది.

కఠినంగా తిరస్కరించలేకపోయాడు.

చాలా ఏళ్ళ తర్వాత కూడా తన కిష్టమైన వంటకాలు అన్నీ గుర్తు పెట్టుకుంది. తనకు తెలుసు. తన భార్య తననెప్పుడూ మరిచిపోదని!

మాలతి మెడలో అదే ఇంత లావు మంగళసూత్రం గొలుసు.. భద్రం గారి ఏకైక కూతురిగా మాలతికి సంబందాలు చాలానే వచ్చినా, తన కోసమే బ్రతికింది. అవునూ! ఇంతకీ మాలతి తిన్నదా! ఉహు! తాను తినకుండా తినదు. ఆమె ఆలోచనలు ఎప్పుడూ సనాతనమే! అతను చేతి గడియారం వంక చూసుకున్నాడు. ఓహ్ చాలా ఆలస్యం అయ్యింది. అతనికి బాగా ఆకలి వేస్తుంది. గబగబ తినేసాడు.

కంచం తీయబోతూంటే, అప్రయత్నం గానే మాలతి అతని చేయి పట్టుకుంది. ఆ విషయం గమనించనట్టు

ప్లేట్ వదిలేసి, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు.

మాలతి టవల్ అందిస్తూండగా, అప్పుడు వచ్చింది జాహ్నవి.

పిల్లలిద్దరినీ చెరొక చేయి పట్టుకొని మెట్ల మీద బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన జాహ్నవి ఆ దృశ్యం చూసి స్థంభించి పోయింది. కలా! నిజామా!

కాంపౌండ్ గేట్ బయట పార్క్ చేసిన కారును చూసి గుండెలు గుబేలుమంటూంటే గాబరాతో వచ్చింది..

ఇక్కడ ఈ దృశ్యం – నమ్మలేక తల తిరిగినట్టు అయ్యింది. మనో భావనకు సంబంధం లేని దృశ్యం – బాహ్య నేత్రానికి గోచరిస్తూంటే – స్థాణువయ్యింది.

సంతోషించే విషయమే అయినా గ్రాహ్యం కాలేక పోయింది.

“ఏమైంది జానూ!” అంటూ మాలతి నుదుటి పై చేయి వేసి చూసింది.

“వాట్ హాపెండ్ రా!” అన్నాడు ఆనంద్ చేయి తుడుచుకుంటూ!

ఏక కాలంలో అమ్మా, నాన్నల లాలన.. ఇది తన జీవితమేనా!

ఇప్పుడు అన్నం తినే స్థితిలో లేదు ఆమె మనసు. ఒంటరిగా గడపాలని ఉంది. తన గది లోకి వెళ్ళి పడుకుంది.

అమ్మా, నాన్న.. ఇద్దరి మధ్య అన్యోన్యతలో తాను.. ఇది నమ్మాలి. అంతా కలగా ఉంది.

తాతగారు గుర్తుకు వచ్చారు. నీలి గుర్తుకు వస్తోంది.

నాన్నకు ఉత్తరాలు వ్రాయడం, అమ్మ భయపడడం, తాతగారి హెచ్చరికలు.. రీళ్ళలా తిరిగి పోతున్నాయి.

తాను హైదరాబాద్ ట్రైన్ ఎక్కిన ఆ క్షణం, తన మానసిక స్థితి.. అమ్మ ఇక్కడికి వచ్చాక, నాన్నతో గొడవలవుతాయని తాను పడిన భయం, బాధ..

అంతా.. అంతా దూదిపింజల్లా కళ్ళ ముందు ఎగిరిపోతున్నాయి. ఓలాంటి నిశ్చింతను అనుభవిస్తూ అలా కళ్ళు మూసుకొని పడుకుంది జాహ్నవి.

సంతోషంలో కూడా మనసు ఒంటరితనాన్ని కోరుకునే పరిస్థితి చాలా తక్కువ సందర్భాలలో ఉంటుందేమో!

ఆనంద్ వెంటనే హాస్పిటల్‌కు బయలుదేరాడు. మాలతితో ఇంకే సంభాషణ జరుగలేదు.

మాలతి జాహ్నవి కోసం ఇలా వచ్చిన విషయం ఊర్మిళ కు కాస్త పెయిన్స్ తగ్గగానే చెప్పాలి అనిపించినా, కాస్త వీలు చూసుకుని చెప్పేయడమే బెటర్, మరెవరి ద్వారానో ఊర్మిళ వినే పరిస్థితి రాకూడదు అనిపించింది.

***

ఊర్మిళ ఇంకా నిస్సత్తువగానే ఉంది. ఆమెను చూస్తూ చెప్పలేకపోతున్నాడు.

కానీ మాలతియే వచ్చి జాహ్నవిని తీసుకొని వెళుతున్న విషయం ఆమెకు చెప్పాలి. రేపటి రోజున ఊర్మిళ ఇంటికి వచ్చే వరకు మాలతి, జాహ్నవి వెళ్ళి పోతారు. కానీ ఆమెకు విషయం చెప్పడం తన సంస్కారం. అందుకే మాలతి వచ్చిన విషయం ఊర్మిళతో అన్నాడు.

ఊర్మిళకు ఈ నిజం కొరుకుడు పడలేదు. అసలు అర్థం కూడా కాలేదు. “మాలతి గారు రావడమేమిటి?”

ఆనంద్ మళ్ళీ అన్నాడు, “జాహ్నవిని తీసుకొని వెళ్దాం అని వచ్చింది.”

జానూ వచ్చేప్పుడు ఒక్కతే కదా వచ్చింది, అనుకుంది.

ఊర్మిళకు అంతా అయోమయంగా ఉంది.

(ఇంకా ఉంది)

Exit mobile version