Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎంత కాలం ఈ మౌనం

[శ్రీ వజ్జీరు ప్రదీప్ రచించిన ‘ఎంత కాలం ఈ మౌనం’ అనే కవితని అందిస్తున్నాము.]

జీవితంలో అన్నీ ఎదురుదెబ్బలే
కాలం పగబట్టిందో మరి
నా తలరాతను దేవుడు ఇలా ఎందుకు
రాయాలనుకున్నాడో తెలియదు
నేను అన్నింటిని మౌనంగా భరిస్తున్నాను

సంతోషం ఎక్కడ దొరుకుతుందో
తెలియక నేను వెతుకుతున్నప్పుడు తెలిసింది
చిన్న పిల్లల నవ్వులలో..
పక్షుల కిల కిల శబ్దాలలో
పూవులో కొమ్మలో
కోయిలపాటలో వుంటుందని గ్రహించాను

ఇక్కడ మనుషులంతా
స్వార్థపరులుగా మారిపోయారు
నా ఒంటరితనం అన్నీ నేర్పింది
కల్మషంలేని మనసులను చదవడం
నలుగురు నా వాళ్ళే..
అనే అలోచనతో బతకడం నేర్చుకున్నాను
ప్రకృతిని ఆరాధిస్తూ
దేవుడిని పూజిస్తూ సాగుతున్నాను..
ఇది నీకు ఇష్టమో! కష్టమో! నాకైతే తెలియదు

మరి నువ్వెందుకు నన్ను చూసిచూడనట్టే వుంటావు
శరత్ కాలపు వెన్నెల గాలులలో
నీ మౌనం మరో కొత్త జ్ఞాపకాలకు తెరతీస్తుందో..
కఠిన శిలవై గాయం చేసి వెళ్థావో నీ ఇష్టం!

Exit mobile version