[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘ఎంత మంచివాడవురా!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కష్టపడి నోరు పెగల్చుకుని, “సరేరా!” అంటూ బయటపడి దారంట నడుస్తున్నాను కానీ, విశ్వనాథం ప్రసాదించిన దిగ్భ్రాంతినుంచీ ఇంకా తేరుకోలేదు.
మంత్రిత్వ శాఖలు వేరైనా, ఇద్దరిదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నౌకరీయే. పదవీవిరమణ తర్వాత, నేనుంటున్న ఊరికే వాడూ చేరుకున్నాడు. పదవీవిరమణ సదుపాయాలతో కట్టుకున్న డాబా ఇంట్లో మేముంటున్నాము. మేమంటే నేనూ, మా ఆవిడా. రెక్కలు వచ్చిన పిల్లలిదదరూ మేం ఉద్యోగాలలో ఉండగానే వలసపోయారు. ముందు మా బరువులు దించే, పెళ్లిళ్లు చేసుకున్నారు.
వాడి సంగతీ అంతే. ఎటొచ్చీ, వాడి తరహా వేరు కాబట్టి, అందుకు తగ్గ ఉద్యోగం చేయబట్టి, పిల్లల మీద ఆధారపడకుండానే బ్రతుకు సాగింది. కానీ, వాడి భార్య ముచ్చట మేరకు అధునాతనంగా కట్టించుకున్న ఇంట్లో చేరిన ఏడాది తిరగకుండానే, ఆమె వెళ్ళిపోయింది.
ఆ ఇల్లేమో మా ఇంటికి దగ్గరగా ఉండడంతో, అక్కడున్న వాడున్నన్నాళ్లూ రోజూ ఉదయపు నడకకి కలిసే వెళ్లేవాళ్ళం. ఆవిడ చనిపోయిన ఆరు నెలలకి మరో కాలనీలో ఉన్న వాడి దూరపు బంధువు ఇంటిలో ఒక వాటాకి మారిపోయాడు.
“అంత ఇల్లుంచుకుని ఈ ఇరుకు వాటాలో కాపురం ఏంట్రా?” అని ఆశ్చర్య పోతే, “ఒక్కడినీ ఆ ఇంట్లో ఉండలేనురా. కొన్నాళ్ళు ఇక్కడుండి మనసుకుదుటపడితే ఆ ఇంటికే వెళ్తాను. అందుకే ప్రస్తుతానికి ఆ ఇల్లు ఖాళీగానే ఉంచాను” అన్నాడు.
“అదీకాక, నా మంచి చెడ్డలు చూడడానికి, వండి పెట్టడానికి మాధురి ఉంది కూడా” అని జోడించాడు. నిజమే కదా. వాడు దిగిన అద్దె ఇంట్లో పనిమనిషి మాధురి. చూడచక్కని రూపం. పాతిక దాటినా పెళ్లి చేయని తాగుబోతు తండ్రి. తల్లి ఎప్పుడో చచ్చిపోయింది.
“కష్టమేరా. మీ ఆవిడ కోరుకున్నట్టు ఇల్లు కట్టించావు. ఆవిడ తొందరపడి వెళ్ళిపోయింది. అక్కడే ఉంటే ఆ జ్ఞాపకాలతో నీకు మనశ్శాంతి ఉండదు” అన్నాను. అదోలా చూసాడు. నేను మరి ఆ సంభాషణ పొడిగించలేదు.
ఐతే, నా ఉదయపు నడకదారిలో లేదా ఇల్లు. దాంతో రోజూ కలుసుకునే వాళ్ళం, వారానికో, పదిరోజులకో ఒకసారి కలుసుకుంటున్నాం. మూడు నెలలు గడిచాయి. ఓ ఇరవై రోజుల పాటు యాత్రలు ముగించుకుని నిన్ననే ఇంటికి వచ్చాము.
ఇవాళ ఉదయం ఎప్పటిలాగే సముద్ర తీరం వేపు నడుస్తుంటే, ఆశ్చర్యం.
వాడి స్వంత ఇంటి గుమ్మంలో విశ్వనాథం!
వెళ్లి, వాడి పక్కన కుర్చీలో కూర్చున్నాను.
“చెప్పా చేయకుండా మాధురి పని మానేసిందిరా” అన్నాడు నేనడగకుండానే.
మాధురి కాకపోతే మరొక పనిమనిషి. మంచిగా పనిచేసే వాళ్ళకిక్కడ కొదవ లేదే. అందుకని వీడెందుకు ఇల్లు మారడం! వెర్రి ముఖం వేసాను.
“నీకు చెప్పలేదురా. ఏదో ఆ ఇంట్లో ఉండి, మాధురిని మచ్చిక చేసుకుని, కాలక్షేపం చేద్దామనుకున్నాను. సందు కుదిరినప్పుడల్లా, “మీ అయ్య నీకెలాగూ పెళ్లి చేయడు. వాడి గురించి నువ్వు సుఖపడకుండా మాడడం ఎందుకు?” అంటూ బోధపరుస్తుండే వాడిని. ‘నేను లేనా’ అనలేదు గానీ, అలాంటి సూచనలేవో చేస్తూ వచ్చాను. దానికి బాగానే తలకెక్కింది. పదిరోజుల క్రితం వాళ్ళ ఊరు వాడినొకడిని గుళ్లో పెళ్లాడేసింది” .
మరి వినలేకపోయాను.
“ఓరి దుర్మార్గుడా!”
అనలేక, “సరే రా!” అంటూ బయటపడ్డాను.
