[ఇటీవల కర్నాటకలోని ‘సక్రెబైలు’ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఆ అనుభవాలను పంచుకుంటున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]
అనంతమైన ప్రకృతి శోభను తిలకిస్తూ, ఆస్వాదిస్తూ సాగుతున్న మా పర్యటనల అనుభవాలను ఎప్పటికప్పుడు ‘సంచిక’ పాఠకులకు అందిస్తున్నాను.
ముఖ్యంగా మన దేశపు అటవీ సంపద గురించి, వన్యప్రాణుల గురించి మా యాత్రానుభవాలలో వివరించడం జరిగింది.
పశ్చిమ కనుమల్లోని కార్వార్, ఆగుంబె అభయారణ్యాల తరువాత మా పర్యటన మలనాడు ప్రాంతపు అడవుల వైపు సాగింది. పశ్చిమ కనుమల్లో దట్టమైన అరణ్యాల మధ్య సస్యశ్యామలమైన ప్రాంతం మలనాడు. గొలుసు కట్టులా పరచుకున్న ఎత్తయిన కొండల మధ్య నుంచి ప్రవహించే తుంగ, భద్ర నదుల సోయగం వర్ణించనలవి కాదు. జనావాసానికే కాక పశుపక్షాదులకు, ముఖ్యంగా వన్యప్రాణులకు స్వర్గసీమ లాంటిది ఈ ప్రదేశం.
26 డిసెంబర్ 2024 ఉదయం మా పర్యటన మొదలైంది. బెంగళూరు నుంచి దాదాపు ఏడు గంటలు ప్రయాణం చేసి ‘శివమొగ్గ’ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సక్రెబైలు’ అనే అటవీ ప్రాంతాన్ని చేరాము.
ఇక్కడ కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మరియు పర్యాటక శాఖ వారు ఉమ్మడిగా నిర్వహించే వసతి గృహాలలో మా బస ఏర్పాటు చేయబడింది. స్వచ్ఛమైన తియ్యటి జలాలకు ప్రసిద్ధి చెందిన ‘తుంగా’నది బ్యాక్ వాటర్స్ ఒడ్డున అన్ని వసుతులతో కాటేజీలు నిర్మించారు. ఖర్చు ఎక్కువే అయినా పర్యాటకులకు అన్ని సదుపాయాలు సమకూరుస్తారు.
ఈ ప్రాంతం ముఖ్యంగా రక్షిత ఏనుగుల పునరావాస కేంద్రము. గున్న ఏనుగుల నుంచి పెద్ద ఏనుగుల వరకు దాదాపు 30 ఉన్నాయి. వీటికి వివిధ రకాల శిక్షణ ఇస్తూ ఉంటారు. పర్యాటకులు ఎలాంటి భయాలు లేకుండా ఈ ఏనుగులతో కలసి మెలసి ఉండవచ్చు. కొద్ది సేపు మేము ఈ ఏనుగులతో బంతి ఆట ఆడుకున్నాము. చిన్న పిల్లలతో సహా అందరూ గజరాజులతో ఫోటోలు దిగారు. ఇది ఓ వింత అనుభూతి.
సాయంత్రం తుంగా నది ప్రయాణం ఏర్పాటు చేశారు. బోటింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛమైన నదీ జలాలు, చుట్టూ అడవులు పర్వతాలతో కూడిన ప్రకృతి అందాలు మనసుల్ని పరవశింపచేస్తాయి. ఇక్కడి వృక్ష సంపద పలు రకాల పక్షులకు నివాసం. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి డిసెంబర్ నెలలో ఇక్కడికి వలస వచ్చే అరుదైన పక్షులను చూసాము. ముఖ్యంగా ‘రివర్ టర్న్’ అనే పక్షి గురించి చెప్పుకోవాలి. శరీర పై భాగం బూడిద రంగులో క్రింది భాగం తెల్లగా, తలపై నల్లగా మెరిసిపోతూ ఉంటుంది. వీటి ముక్కు పసుపు రంగులో కాళ్లు ఎర్రటి రంగులో ఉంటాయి. అలా అందమైన ఈ పక్షులకు విశిష్టమైన జీవనశైలి ఉంది. మగ పక్షి ఆడ పక్షితో జత కట్టాలి అనుకున్నప్పుడు ఓ సాంఘిక ఆచారాన్ని ప్రదర్శిస్తుంది. మగ పక్షి రెండు చిన్న చేపలను ముక్కులో కరచుకొని ఆడ పక్షులు వద్దకు వెళుతుంది. ఏ ఆడపక్షైతే తన నుంచి ఒక చేపను తీసుకొని తింటుందో ఆ ఆడపక్షితోనే జత కడుతుంది. ఈ పక్షులు నేపాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల నుండి డిసెంబర్‍లో ఇక్కడకు వలస వస్తాయి. తిరిగి ఏప్రిల్ మే నెలల్లో వెళ్ళిపోతాయి. వీటితోపాటు పెలికాన్స్, నీటి బాతులు, మంచినీటి కాకులు, వుడ్ పెక్కర్ తదితర పక్షులను చూసాము. ఈ పక్షులను దగ్గరగా చూడటానికి అవసరమైన బైనాక్యులర్స్ వంటి పరికరాలను పర్యాటక శాఖ వారే ఇస్తారు. ఈ అరుదైన పక్షులతో పాటు నది ఒడ్డున సేద తీరుతున్న పెద్ద పెద్ద మొసళ్లను కూడా చూసాము.
రాత్రి చలిమంట కాసుకుంటూ రుచికరమైన భోజనము చేసాము. మరుసటి రోజు ఉదయం జరగబోయే అత్యంత ఉత్సాహకరమైన కార్యక్రమాన్ని గురించి తలచుకుంటూ నిద్రపోయాము.
***
ఉదయం ఎనిమిది గంటలకల్లా ఉపాహార విందు చేసి తుంగా నది ఒడ్డున ‘గజ స్నాన ఘట్టానికి’ చేరుకున్నాం. అప్పటికే అక్కడ వందల మంది ఏనుగుల రాక కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు. పిల్లలైతే మరీ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. కొంతసేపటి తరువాత మెల్లగా ఒక్కొక్క ఏనుగు రావడం నీళ్ళల్లోకి వెళ్లి మునగడం జరిగింది. మావంటి వాళ్ళ పర్యవేక్షణలో తెలుగులో ఏనుగుల స్నానాలు మొదలయినాయి. జట్లు జట్లుగా పర్యాటకులను ఏనుగుల వద్దకు పంపారు. ఏనుగులకు స్నానం చేయించడం ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. వయోభేదం లేకుండా పర్యాటకులు ఏనుగులతోపాటు నీళ్ళల్లో మునగడం, ఏనుగుల శరీరాలను రుద్దడం వాటి తొండంలో నుంచి చిమ్మిన నీళ్లల్లో కేరింతలు కొట్టడం నేత్రానందం కలిగించింది. పెద్ద ఏనుగులు చిన్న పిల్లల వలె పిల్లల వద్ద ఒళ్ళు రుద్దించుకోవడం స్నానం చేయడం నిజంగా అపురూపమైన దృశ్యం. ఈ అనుభవం, అనుభూతి కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి దూర ప్రయాణాలు చేసి ఇక్కడికి వస్తారు జనం. ఏనుగులతో స్నానం చేసిన మా వింత అనుభూతి, ఆనందం వర్ణించడానికి మాటలు చాలవు. ఈ అనుభవాన్ని చవిచూచిన ఎవరికైనా ఏనుగంటే భయం పోతుంది. చిన్నపిల్లలు కూడా అంత పెద్ద జంతువులతో స్నేహం చేయాలనుకుంటారు.
స్నానాలు అయిన తర్వాత మావటి వాళ్లు ఏనుగులను సురక్షితంగా అడవిలో వదిలేసి వస్తారు. మేము కూడా కాటేజ్ లకు వెళ్లి స్నానాలు ముగించుకొని ‘భద్ర’ అభయారణ్యములకు ప్రయాణమైనాము.
‘కేతనమక్కి’ కొండమీద నిర్మించిన నేచర్ రిసార్ట్‌లో ముందుగానే గదులు బుక్ చేసుకున్నాము. సాయంత్రం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన జీపులో బయలుదేరి పర్వత అంచులకు చేరుకున్నాము. అడవులు దాటుకొంటూ దారిలేని దారిలో రాళ్లపై ప్రయాణం చేయడం భయం కలిగించింది. గమ్యం చేరిన తర్వాత అక్కడి ప్రకృతి అందాలను చూసి ప్రయాణ బడలిక, భయం మర్చిపోయాము. చుట్టూ ఎత్తయిన పర్వత శ్రేణుల సముదాయం, చల్లటి గాలి, అస్తమిస్తున్న సూర్యుని అందాలు వర్ణించడానికి భాష అందదు.
మరుసటి రోజు ‘భద్ర’ అడవుల్లో ఉన్న ప్రాచీన జైన గుహలను, వివిధ జలపాతాలను చూస్తూ దట్టమైన అడవుల్లో కాలినడకన పర్యటించాము. వివిధ రకాల వన్యప్రాణులను దగ్గరగా చూసి ఆనందించాము. ఈ పర్యటనలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది మాకు ఎంతగానో సహాయం చేశారు. వీరి కార్యానిరతి, వన్యప్రాణులపై ప్రేమ ఎంతగానో మెచ్చుకోదగింది. వీరు తమ ఇళ్లను, కుటుంబాలను వదలి వారాల తరబడి అడవిలోనే సంచరిస్తూ అడవి దొంగలను, జంతు హంతకులను పట్టుకుంటూ ఆపదలో ఉన్న వన్యప్రాణులను రక్షించడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు. అంతేకాక అడవుల్లో నివసించే గిరిజనులకు, ఆటవిక తెగలకు కూడా రక్షణ కల్పిస్తారు. ఒక్కోసారి అడవి ఏనుగుల, క్రూర మృగాల దాడిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ అడవుల్లో నడవడం కూడా ప్రమాద భరితమే. అత్యంత విషపూరితమైన నల్లత్రాచులకు, కొండచిలువలకు నిలయం ఈ అభయారణ్యాలు. ఎన్ని ప్రమాదాలు దాగి ఉన్నా కానీ, ఈ ప్రకృతి అందాలను చూడడం అద్వితీయం – అమోఘం.