[శ్రీ కల్లూరు జానకిరామరావు గారు రచించిన ‘ఎప్పుడు? ఎప్పుడు?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎందుకీ యుద్ధోన్మాదం
మధ్యప్రాచ్యదేశాలలో,
ప్రాక్పశ్చిమ దేశాలానాడు
ఘోరంగా పోరాడి పోరాడి
నరకాన్ని సృష్టించిన గత
చరిత్రను మరచిపోయారా వీరు!
శాంతియుతంగా ఉండనిచ్చిందెప్పుడు?
హంతక ప్రవృత్త దురాశాదుర్మదులు
కురుక్షేత్ర సంగ్రామం నుండీ
నేటి దాకా అవుతూనే వుంది నరమేధం.
జగజ్జేత అలెగ్జాండర్ ఈ
జగాన్ని వీడి వెళ్లేటప్పుడు
జగాని కిచ్చిన సందేశం గుర్తుకులేదా!
విశ్వంలోని దేశాలన్నీ
విశ్వాసంతో కలిసికట్టుగా ఉండలేక
జట్లు కడుతున్నాయి
కూటములుగా ఏర్పడుతున్నాయి.
రష్యా, చైనా, నార్త్ కొరియా పాకిస్థాన్
లొక కూటమిగా
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంటియా
లొక కూటమిగా
శతృపక్షాలుగా బలాబలాలు
నిరూపించు కొంటున్నాయి.
క్షణాల మీద విశ్వాన్ని కాల్చి బూడిద చేసే
అణ్వస్త్రాలున్నాయనే అహంకార బలమే వీరిది
నైతిక బలం లేని దేశాధీశులు వీరు.
మంగళం పాడేదెప్పుడీ ఘోర కలికి,
మంగళకరమయ్యేదెప్పుడీ భూమాతకి!
శ్రీ కల్లూరు జానకిరామరావు రచయిత అనువాదకులు. వీరి తండ్రి కీ.శే. కల్లూరు అహోబళరావు ప్రముఖ కవి, బహు గ్రంథకర్త. కృష్ణదేవరాయ గ్రంథమాల వ్యవస్థాపకులు. తల్లి కీ.శే. సీతమ్మ గారు.
జానకి రామరావు గారి భార్య కీ.శే. సుభద్రమ్మ. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం.
వీరి పుట్టిన తేదీ: 23(15) జూలై 1941. విద్యార్హత: B.A.Bed, M.A.( English)
హిందూపురం ఎంజీఎం హైస్కూల్లో 1964 నుండి 1990 వరకు 26 ఏళ్లు ఉపాధ్యాయుడిగానూ, 1990 నుండి 1999 వరకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ చేశారు.
ప్రస్తుత నివాసం బెంగుళూరు. ఫోన్: 9740849084