Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎరుపు నీడలు

[డా. సి. భవానీదేవి గారు రచించిన ‘ఎరుపు నీడలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

సూర్యాస్తమయం అవుతోంది. ఆకాశం నారింజరంగులో మసకబారుతోంది. ఆ చిన్నపట్టణం అంచున ఉన్న ఒక ఇల్లు.. బయటికి చూస్తే అందంగా.. లోపల మాత్రం మాటల మంటలు రగులుతున్నాయి.

రమేష్, సీత – ఇద్దరూ మంచి మనుషులే. కానీ చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారిపోయాయి. మాటలు కాస్త గట్టిగా మొదలై, తర్వాత కఠినంగా మారాయి. వాళ్ళ పిల్లాడు అర్జున్ మూలన నిలబడి భయం భయంగా చూస్తున్నాడు. ఆ పసి కళ్ళల్లో భయం, హృదయంలో గందరగోళం.

‘ఎందుకు ఇలా జరుగుతోంది?’ అనుకుంటున్నాడు అర్జున్.

ఇవతలకి వచ్చి టీవీ ఆన్ చేస్తే.. అక్కడ కూడా అవే దృశ్యాలు. సినిమాల్లో హీరోలు కోపంతో కొట్టుకుంటారు. రక్తం కారుతున్నట్లు చూపిస్తారు. అర్జున్ గుండెల్లో ఒక ప్రశ్న పెరుగుతోంది –

“ఇది నిజంగానే ధైర్యమా? ఇలా కూడా జరుగుతుందా?”

మరుసటి రోజు స్కూల్‌లో టీచర్ ఒక కథ చెప్తున్నారు. అర్జున్ యథాలాపంగానే వింటున్నాడు.

“ఒకప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. లక్షలమంది బాధపడ్డారు. చివరికి అందరూ గ్రహించారు. యుద్ధం గెలిచినా, మనిషి మనసు ఓడిపోతుంది”

టీచర్ మాటలు అర్జున్‌ని ఆలోచించేలా చేస్తున్నాయి.

ఇంట్లో జరిగే చిన్న గొడవలు కూడా ఒక చిన్నయుద్ధమే కాదా?

సినిమాల్లో ఎక్కువగా చూపించే ఆ క్రోధం.. రక్తపాతం, నేరాలు మన జీవితాల్లోకి చొరబడుతున్నాయా.. అనేగా టీచర్ చెప్పారు.

ఆ రోజు సాయంత్రం, ఇంట్లో మళ్లీ గొడవ మొదలైంది. అర్జున్‌కి చిరాకుగా భయంగా ఆందోళనగా ఉంది. ఉండబట్టలేక ఇద్దరి మధ్య నిలబడి తలదించుకుని కన్నీళ్లతో అన్నాడు.

“అమ్మా.. నాన్నా.. మీరు ఇలా పోట్లాడుకుంటుంటే నాకు భయమేస్తున్నది. ఇది సినిమా కాదు కదా..”

ఆ మాటలు విన్న వెంటనే, ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరిని ఒకరు చూశారు. కొడుకుకేసి చూస్తుంటే దుఃఖంగా ఉంది.

అర్జున్ నాన్న రమేష్ కాసేపు అలాగే కూర్చుండిపోయాడు. అతనికి తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తన తల్లిదండ్రులు కూడా ఇలాగే గొడవ పడేవారు. అప్పుడు తను అర్థం కానీ భయంతో వణికిపోయేవాడు. అప్పుడప్పుడు నాన్న అమ్మని కొట్టేవాడు. ఆమె గాజులు పగిలి ఇల్లంతా చెల్లాచెదరుగా పడిపోయేవి. అమ్మ చేతులకు గాజులు గుచ్చుకుని రక్తం కారేది.

అమ్మ కళ్ళనుండి కారే కన్నీళ్ళు తనకి రక్తంలా కనపడేది. అమ్మ తనను కావలించుకుని గట్టిగా ఏడుస్తుంటే తానూ ఏడ్చేవాడు. తెలియని అభద్రతాభావం వయస్సుతో పాటు పెరిగింది. అదే ఇప్పటి స్థితికి కారణమా..

“నేను అదే దారిలో ఎందుకు నడుస్తున్నాను?” అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.

అర్జున్ అమ్మ సీత కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. అచ్చం రమేష్ అమ్మలా..

“మనకీ పట్టుదల ఎందుకు రమేష్. మన మధ్య గెలుపోటముల ప్రమేయం ఎందుకు. నీ మాటే.. కానీ.. అర్జున్‌ని చూడు.. ఎలా దిగులుపడుతున్నాడో.. మనం కలిసుండాలని అనుకున్నాం కదా..” అని మృదువుగా చెప్పింది సీత.

ఆ రోజునుండి ఒక మార్పు జరిగింది.

వాళ్లు గొడవపడటం ఆపేశారు. మాట్లాడుకోవటం ప్రారంభించారు.

టీవీని ఆఫ్ చేసి, అర్జున్‌తో కలిసి కూర్చున్నారు.

సినిమాల్లో చూపించే రక్త దృశ్యాల కంటే.. నిజ జీవితంలో ప్రేమ ఎంత విలువైనదో అర్థం చేసుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత, అర్జున్ స్కూల్‌లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాడు.

విషయం: “హింస తగ్గితే ప్రపంచం ఎలా మారుతుంది?”

స్కూల్‌లో డ్రాయింగ్ పోటీల్లో అర్జున్ ఒక చిత్రాన్ని గీసాడు.

ఒక వైపు యుద్ధం, గొడవలు, భయంపడే మానవ సమాజం, పిల్లలు.. మరో వైపు నవ్వులతో కుటుంబాలు, విరబూసిన పువ్వులు, శాంతి.

చివర్లో ఇలా రాశాడు

“రక్తం చూపించే దృశ్యాలు మన కళ్ళను ఆకర్షించవచ్చు.. కానీ మన హృదయ బాధలని నయం చేసేది ప్రేమ మాత్రమే!”

ఆ చిత్రాన్ని చూసి అంతా ఎంతో మెచ్చుకున్నారు. టీచర్ అర్జున్ తలపై చేయి వేసి నిమురుతూ

“ఇది కేవలం డ్రాయింగ్ కాదు.. ఒక సందేశం.” అంటుంటే పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ప్రథమ బహుమతిని అర్జున్‌కి అందించారు.

అర్జున్ ఇంటికి వచ్చి అమ్మానాన్నలకు తాను గీసిన చిత్రం, పొందిన బహుమతి చూపించాడు. రమేష్, సీత కొడుకును కౌగిట చేర్చుకుని ముద్దు పెట్టారు. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తారకల్లా మెరిసాయి.

ఇప్పుడు ఆ ఇంట్లో మాటల యుద్ధ శబ్దాలు లేవు. మమకారం, జీవన మాధుర్యం ఉంది.

రమేష్ డైరీలో రాసుకుంటున్నాడు.

“సినిమాల్లో, కుటుంబాల్లో, ప్రపంచంలో కనిపించే హింస – అది మనిషి సహజ స్వభావం కాదు. మనలోని కోపాన్ని అర్థం చేసుకుని, దానిని ప్రేమగా మార్చగలిగితే.. ప్రపంచం నిజంగా మారుతుంది. ఎరుపు నీడలు తగ్గి.. తెలుపు వెలుగు పెరుగుతుంది.”

Exit mobile version