[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘ఏరువాక’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
గ్రీష్మం తరలిపోతూ
మృగశిర ప్రవేశంతో
ఆకసాన ముసిరిన మొయిళ్ళను చూడగానే
మోరలెత్తి మయూరములు
నర్తించుచుండగా
పూలవలే రాలు చిరుజల్లులు
నెర్రెలుబారిన భూమి ఒడిన చేరగానే
పొత్తిళ్ళ పాపాయిని చూసిన తల్లిలా
ఆనందంతో పరవశించింది నేలతల్లి
తల్లి అమృతమయమైన ప్రేమనందించినట్లు
అవని తనలో దాగిన
సుగంధాలను మనకందిస్తుంది
ఆ ఆనందపు జల్లులలో ముద్దయిన
రైతన్న హృదయం
తడిసిన నేలను పదును
చేయటానికి భూమాత ఆనతిచ్చిందని
తన చిరునవ్వుల జల్లులతో
భూదేవిని అభిషేకిస్తూ
నిండైన పంటలను పండించి
ప్రజల ఆకలిని తీర్చాలనే
నిష్కామమైన మనస్సుతో
అరక భుజాన వేసుకుని
ఆలి అందించిన చల్దిమూట
సంకలో ఇరికించి
తన తనవారి కష్టానికి వెరవక
పంచభూతాలతో మమేకమై
ఆరుగాలం పని చేస్తూ
ఎదురొచ్చే ఏరువాకను
స్వాగతిస్తూ
పుర్ణమనస్కుడైన యోగిపుంగవునిలా
కన్నతల్లిలాంటి
పొలం ఒడిని చేరటానికి
దీక్షతో కదిలివెళుతున్నాడు
అన్నదాత కృషీవలుడు.
