ప్రముఖ రచయిత, కవి, ఆదిలాబాద్ జానపద గేయాల సేకరణ కర్త, ప్రచురణ కర్త, పరిశోధకుడు, రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, మాదాడి నారాయణరెడ్డి (మానారె) కలం నుండి జాలువారిన ‘అబద్ధం బజారున పడ్డది’ కవితపై విశ్లేషణా వ్యాసం. కవిత ఏమిటని ఆసక్తితో చదివాను. అబద్ధం బజారున ఎలా పడ్డది? అబద్ధం కథా కమామీషు ఏమిటి? అబద్ధం గురించిన ఆలోచనలు నాలో రేకెత్తించింది. అబద్ధం అంటే ఏమిటి?
జవాబు: బద్ధము కానిది. కట్టుబాటు లేనటు వంటిది. బద్ధం అంటే విలువలకు లోబడి ఉన్నట్టిది. వాస్తవాన్ని ప్రకటించేది. నిజానికి వ్యతిరేక పదం అబద్ధం అని మనకు తెలుసు.
ఎవరైనా తాను ఇచ్చిన మాటకు ప్రమాణం చేస్తూ ఇలా చెబుతారు: “నేను నా మాటకు బద్దుడనై ఉంటాను”.. అంటే ఇచ్చిన మాటకు బద్ధుడనై ఉంటాను..” అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని అర్థం.
అబద్ధానికి ప్రమాణం అంటూ ఏమీ ఉండదు. ఇచ్చిన మాటకు నిలబడనప్పుడు అబద్ధం చెప్పినట్టుగా పరిగణిస్తున్నారు. అలా తాను చేయని పనిని తాను చేస్తాను అని చెప్పడాన్ని అబద్ధం అంటారు. అతడు మాటకు కట్టుబడి ఉండడని మనకు అర్థం అవుతోంది. అబద్ధం అంటే సత్యం కాకపోవడం. సత్యమనేది కష్టాలకు దారితీస్తుంది.
‘వేశ్యవలె వేయి రంగులు పులుముకుని
నగల వగల వెలుగులతో
టక్కు టెక్కుల టముకులు మ్రోగిస్తూ
అందలంలో అబద్ధం ఊరేగుతున్నది
అందంతో అందరిని అలరిస్తున్నది’
వ్యభిచారం లేదా పడుపు వృత్తి అంటే డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకోవడం. ఇలా జీవించేవారిని వేశ్యలు అంటారు. కొంతమంది స్త్రీలు పేదరికం, ఆకలి వల్ల వ్యభిచారిణులుగా మారుతారు. కొంతమంది స్త్రీలు తల్లిదండ్రుల నిర్లక్ష్యం, అదుపు ఆజ్ఞలు కొరవడడం చేత వ్యభిచారిణులుగా మారుతారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరుతో అమాయకపు బాలలని నిర్బంధించడం, కిడ్నాప్ చేసి వ్యభిచార కేంద్రాలకి అమ్మేస్తుంటాయి. కులట, జార స్త్రీ, ఒకరికన్నా ఎక్కువ పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉంటుంది. వెలయాలు అనగా బతుకు తెరువు కోసం వ్యభిచార వృత్తిని అవలంబించే స్త్రీ. చరిత్రలో రాజులు, చక్రవర్తులు, తమ భోగ విలాసాల కోసం వేశ్యలను పోషించేవారు. వేశ్య అందంగా కనిపించడానికి వేయి రంగుల సౌందర్య సాధనాలు ముఖానికి పూసుకుంటుంది. నగలతో శరీరాన్ని అలంకరించుకుంటుంది. వగల వెలుగులతో అంటే లేని ప్రేమను ఒయ్యారాలను ఒలకబోస్తూ విటులను ఆకర్షిస్తుంది. టక్కు అంటే మోసం అని అర్థమవుతుంది. టెక్కు అంటే యౌవనాధుల వల్ల కలిగే గర్వ చేష్ట. మోసంతో కూడుకున్న యవ్వనం వలన కలిగే ఒకింత గర్వంతో, సౌందర్య సాధనాలతో, నగలతో, వగలతో, వేశ్య స్త్రీ విటులను మైమరిపింపజేస్తుంది. అందలం అంటే పల్లకి అని అర్థమవుతుంది. పల్లకి ఎవ్వరు ఎక్కుతారు? పల్లకి ఎవ్వరు పడితే వారు ఎక్కరు. రాజులు రాణులు పల్లకి ఎక్కి ఊరేగడం, జనం వింతగా చూడడం, మన అందరికీ తెలుసు. నూతనంగా వివాహం చేసుకున్న వధూవరులను పల్లకిలో ఎక్కించి ఊరేగిస్తారు. అదొక ఆనవాయితీగా వస్తున్నది. వేశ్యవలె వేయి రంగులు పూసుకుని విలువైన నగలు ఆభరణాలు ధరించి దగదగలాడుతూ వగలు పోతూ లేని ప్రేమలో ఒయ్యారాలు ఒలకపోస్తూ సౌందర్య సాధనాలతో విశేషంగా అలంకరించుకొని అబద్ధం నయగారాలు పోతుంది. అబద్ధం పల్లకి ఎక్కి ఊరేగుతున్నది. అబద్ధం వేశ్యవలె అందంతో అలంకరించుకొని అందరినీ అలరిస్తున్నది అనే భావాన్ని కవి నారాయణరెడ్డి (మానారె) చక్కగా కవితలో వ్యక్తీకరించారు.
‘అబద్ధం గొంతు చించుకుని కూస్తున్నది
నిబద్ధిని బజారున కీడుస్తున్నది
అందరి చెవుల్లో అందంగా దూరుతున్నది
రసన రంగాల్లో రమ్యంగా నర్తిస్తున్నది’
అబద్ధం ఎక్కడపడితే అక్కడ మైక్ పెట్టి మాట్లాడినట్లుగా ఏ మాత్రం సంకోచం లేకుండా గొంతు చించుకొని కూస్తున్నది. నిబద్ధి అంటే నిజమని మనకు అర్థమవుతుంది. నిజాన్ని బజారున కీడుస్తున్నది. నిజం చెప్తే నేరం అంటారు. అబద్ధం చెప్పడమే ఒక రివాజుగా మారింది. అబద్ధం నిజం చెప్పిన వాళ్లను నేరస్థులను చేసి బజారున కీడుస్తున్న వారి లోని వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్నది. ఇవ్వాళ మారిన పరిస్థితులు, సామాజిక సమీకరణలు, మంచితనానికి విలువ ఇవ్వకపోవడం, మంచితనంగా నడిచేవాళ్లను చేతగానివాళ్లుగా చూడటం, మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. అబద్ధం అందరి చెవుల్లో అందంగా దూరుతున్నది. రసన అంటే ఇక్కడ నాలుక అని అర్థమవుతుంది. అబద్ధం అందరి నాలుకల రంగస్థలంపై రమ్యంగా నర్తిస్తున్నది. నృత్యం చేస్తున్నది. కవి నారాయణరెడ్డి (మానారె) భావాన్ని చక్కగా తెలియజేశారు.
‘పాప పంకిలమైన ప్రపంచంలో
పాపం! సత్యం కూర్చుంది యోగాసనంలో
పు గొడుతున్న బురదలో నించి
కమ్మని వలపుల పంచుతున్న పద్మం వలె’
పాపమనే బురదతో నిండిన ఈ విశాల ప్రపంచంలో సత్యం ఓ మూలన కూర్చుంది. కంపు గొడుతున్న బురదలో నించి సువాసనలు వెదజల్లుతున్న కమలం వలె అంటే బురదలో ఉన్నప్పటికీ ఎలాంటి బురద అంటకుండా చక్కగా ఉంటుంది. కమ్మని వలపులు అంటే ఇక్కడ చక్కటి ప్రేమలనే సువాసనలను వెదజల్లుతుంది. సత్యం కూడా ఎలాంటి దుర్గంధం, మాలిన్యం అంటకుండా పవిత్రంగా బురదలో ఉన్న కమలంలా సుగందాలు వెదజల్లుతూ తేటగా ఉంటుందని కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) భావయుక్తంగా చెప్పారు.
‘అబద్ధపు స్వకుచ మర్దనాన్ని
అహంభావపూరిత ఆడంబరాన్ని
ఆత్మ స్తుతి పరనిందా తత్వాన్ని
అవధులు లేని దాని ప్రచారాన్ని
‘పట్టించుకోవడం లేదు
పల్లెత్తు మాట అనడం లేదు’
స్వకుచ మర్దనం అంటే తనకు తానే పొగుడుకోవడం. అబద్ధం తనకు తానే పొగుడుకుంటుంది. ఇది మూడు రకాలు. 1) స్వకుచ మర్దనం 2) పరకుచ మర్దనం 3) పరస్పరకుచ మర్దనం.
మరియు దీన్నే 1) స్వ డబ్బా 2) పర డబ్బా 3) పరస్పర డబ్బా అని అంటారు.
అబద్ధం స్వకుచ మర్దనంతో తనకు తానే పొగుడుకుంటుంది. అబద్ధం అహంభావంతో కూడుకొని అంతా నేనే, అంతా నాదే గొప్ప, అని లేనిపోనివి చిలువలు పలువలుగా పైకి కనపడే విధంగా ఆడంబరంతో విర్ర వీగుతోంది. అబద్ధం ఆత్మ స్తుతి ప్రదర్శిస్తూ తనకు తానే పొగుడుకుంటుంది. అబద్ధం పరనింద అంటే ఇతరుల గురించి నీచంగా మాట్లాడుతుంది. ఆత్మ స్తుతి, పరనిందలు, ఈ రెండు ఆత్మహత్యతో సమానమని చెప్పుతారు. అబద్ధం ఆత్మ స్తుతి ప్రదర్శిస్తూ పరనింద తత్వంతో తన్మయత్వం పొందుతుంది. అబద్ధం హద్దులు లేని దాని ప్రచారాన్ని విస్తారంగా కొనసాగిస్తోంది. అబద్ధం చేసే దుష్కృత్యాలను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అబద్దాన్ని గురించి ఎవ్వరు ఎక్కడ పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. పల్లెత్తి అంటే నోరు తెరచి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం అని అర్థమవుతోంది. రాజకీయ నాయకులు అబద్ధం ఒక వ్యసనంగా మార్చుకొని వాగ్దానాలు చేస్తున్నారు. ప్రజలను అబద్ధంతో మురిపించి ఓట్లను దండుకుంటున్నారు. రాజకీయ నాయకులు అబద్దాలు చెప్పుతూ పబ్బం గడుపుతున్నారు. ప్రజలకు ఏ మేలు చేయడం లేదు. వారిని నిష్క్రియాపరులని చెప్పవచ్చు.
‘శాశ్వతమైన సత్యం చలించడం లేదు
ద్వంద్వాతీతుడైన స్థిర చిత్తునివలె
ప్రశాంత సమాధిని త్యజించడం లేదు
సర్వ సంగ పరిత్యాగి యోగి వలె’
ఏది మార్పు లేదో అది సత్యం. సత్యం నాశనము లేనిది. సత్యం అనేది క్షరము కానిది అంటే శాశ్వతమైంది. సత్యానికి చావు పుట్టుకలు ఉండవు. ప్రతి ఒక్కడు తనకు తెలిసింది సత్యం అనుకుంటాడు. సత్యమేవ జయతే అంటే సత్యమే జయిస్తుంది. కల్లలేని మాట సత్యం, సత్యం పద మూడు స్వరూపాలలో ఉంటుంది.
1) కల్ల లేని మాట, కపటం లేని మాట.
2) సమత. ప్రియమైన ఆప్రియమైన సమబుద్ది కలిగి ఉండటం.
3) దమము. బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల అశాంతి ఉండదు.
4) అమాత్సర్యం. మాత్సర్యము లేకపోవడం.
5) క్షమ.సహనం.
6) తితిక్ష. ఆందోళన లేదా విలాపం లేకుండా ఓర్పు కలిగినది.
7) అనసూయ. అసూయ లేకుండా ఉండటం
8) త్యాగము.
9) దానం.
10) ఆర్యత్వం
11) ద్రుతి. నిలకడ కలిగి ఉండటం.
12) సతతం దయ కలిగి ఉండటం.
13) అహింస.
ఈ పదమూడు లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని సత్యవ్రతుడు అంటారు. మహాత్ముడు హరిశ్చంద్రుని నాటకంతో ప్రేరణ పొంది సత్య వ్రతాన్ని పాటించి అహింసా సిద్ధాంతాన్ని ఆచరించాడు. సత్యం వద అని వేదం చెబుతుంది. అంటే సత్యమునే చెప్పుము. సత్య వాక్పరిపాలన కోసం శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. హరిశ్చంద్రుడు సత్యం కోసం సర్వసంపదలను, భోగాలను వదులుకొని భార్యాబిడ్డలను అమ్ముకున్నాడు. ద్వంద్వాతీతుడు సుఖదుఃఖాలు పట్టించుకోని వ్యక్తి. స్థిరమైన చిత్తముకల వ్యక్తి. పండితులు సుఖదుఃఖాలకు చలించరు. ప్రశాంత సమాధిని చేరుకున్న వారు ధ్యానంలో లీనమయిన వారు బయటి ప్రపంచాన్ని పట్టించుకోరు. స్నేహాలు బంధుత్వాలు అన్ని వదిలిపెట్టిన యోగి వలె, శాశ్వతమైన సత్యం చలించదు. సత్యం సుఖదుఃఖాలు పట్టించుకోని వ్యక్తి వలె, స్థిరచిత్తుని వలె ఉంటుంది. సత్యం ప్రశాంత సమాధిని త్యజించదు. సత్యం సర్వ సంగ పరిత్యాగి యోగి వలె ఉంటుందని కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) సత్యం యొక్క విశిష్టతను చక్కగా వ్యక్తం చేశారు.
‘అబద్దానికి దాసులు అంతేవాసులు
అసంఖ్యాకంగా ఉన్నా
అజాత శత్రువైన సత్యాన్ని
ఆవగింజంతైన కదిలించలేదు’
ఈ లోకంలో అబద్ధానికి దాసులు అంటే అబద్ధానికి చుట్టుపక్కలా ఇరువైపులా ఉండేవాళ్లు. అంతేవాసులు అంటే శిష్యులు. అసంఖ్యాకంగా అంటే లెక్కలేనంతమంది ఉంటారు. సత్యం అజాతశత్రువు లాంటిది. అజాతశత్రువు అంటే మనం ధర్మరాజును చెబుతాం. ధర్మరాజు ఎవరి మీద శత్రుత్వం లేనివాడు. ధర్మరాజు లాగే సత్యానికి ఎవరి మీద శత్రుభావం ఉండదు. ఆవగింజ చిన్నగా ఉంటుంది. ఆవగింజంతైన అంటే కొంచెం కూడా అబద్ధం కదిలించలేదు అనే సత్యాన్ని కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) ఘంటాపథంగా వ్యక్తీకరించారు.
‘అబద్ధోక్తులన్నీ హరిశ్చంద్రుని ముందు
విశ్వామిత్రుని యత్నాల వలె వ్యర్థమైన
అబద్ధపు ఆధిక్యతకు వశమైన లోకం
అబద్ధానిదే గెలుపనుకుంటున్నది’
అబద్ధపు మాటలు హరిశ్చంద్రుని సత్యవ్రతాన్ని భంగం చేయడానికి విశ్వామిత్రుడు చేసిన ప్రయత్నాల వలె సత్యం ముందు పని చేయలేదు. సత్యవ్రతుడుగా ఉండి హరిశ్చంద్రుడు భార్యాపిల్లలను అమ్ముకున్నాడు. కానీ సత్యాన్ని తప్పలేదు. సత్యం కొరకే పాటుపడ్డాడు. అందుకే మనం సత్య హరిశ్చంద్రుడు అని అంటుంటాం. సత్య హరిశ్చంద్రుని సత్యం నుంచి విడదీయాలని విశ్వామిత్రుడు చేసిన యత్నాలన్నీ వ్యర్థమైనవి. అబద్ధం ఆధిక్యతకు వశమైన లోకం, అబద్ధం యొక్క ఆధిక్యతను అంగీకరించింది. అందుకే అబద్ధం తనదే గెలుపనుకుంటున్నది. అబద్ధం ఎన్నడూ కూడా గెలవలేదనే భావాన్ని కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) చక్కగా వ్యక్తీకరించారు.
‘అందుకే! సత్యం ఎంత నిత్యమైన
సత్యానికి ప్రచారం ఎంతేని అవసరం
లేకపోతే దానికీ డిపాజిట్టు దక్కదు
ఈ కల్ల యుగంలో పట్టు చిక్కదు’
సత్యం ఎంతో గొప్పది. సత్యం నిత్యమైనది. అయినప్పటికీ సత్యానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేనిచో సత్యానికి డిపాజిట్ దక్కదు. అబద్ధాలతో పెనవేసుకొని యున్న ఈ కల్లయుగం అంటే ఈ కలియుగంలో సత్యానికి పట్టు చిక్కదు అనే కవి మాదాడి నారాయణరెడ్డి (మానారె) భావం చక్కగా ఉంది. సమాజానికి కనువిప్పు కలిగేలా ఉంది. కవి (మానారె) మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.