ఒకప్పుడు అమెరికా వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.
ఇప్పుడు కాస్త పరిస్థితులు అనుకూలంగా ఏర్పడిన తర్వాత, అభివృద్ధి చెందుతున్న దేశాలవంటి మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంకా వెన్నంటి ఉండడం వల్ల స్తోమత వున్నవాళ్లు, విదేశాలలో చదువుకోవడానికి, ఆ తర్వాత ఉద్యోగం చేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో రెండు రకాల వాళ్ళు వున్నారు. మొదటి తరగతి ఎవరంటే, స్వయంగా విదేశాలకు వెళ్లాలనే నిర్ణయం తీసుకునే విద్యార్థులు (తల్లిదండ్రులకు ఇష్టంలేకపోయినా, పిల్లలకు నిరుత్సాహం కలిగించ కూడదనే ఉద్దేశంతో ఒప్పుకోవడం), ఇలా కాకుండా, పిల్లలకు ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు బలవంతం చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే పిల్లలు (కొంతమంది తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకోవడానికి పిల్లలను విదేశాలకు పంపే ప్రయత్నం చేస్తుంటారు).
అయితే కారణం ఏదైనా, పిల్లల చదువులు పూర్తి కావడం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవడం, అక్కడి వాళ్లనే ప్రేమించి పెళ్లి చేసుకోవడమో, తల్లిదండ్రులు పెళ్లి చేయడమో, లేకుంటే ఆధునిక పద్ధతుల్లో కలిసి జీవించడమో (లివింగ్ టుగెదర్) మొదలైన తర్వాత, పిల్లలు పుట్టడం, వారి పెంపకం కోసం తల్లిదండ్రుల, ముఖ్యంగా తల్లుల అవసరం వస్తుంది. అప్పుడు ఎంతో ప్రేమగా తమ దగ్గరకు రమ్మని తల్లిదండ్రులను ఆహ్వానిస్తారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడిపోతారోనని వెళ్లి అక్కడ వాయువేగంతో వాలిపోతారు. అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలు. ఇలాంటి సమస్యల్లో ఒక సమస్యను తీసుకుని, చక్కని కథను అల్లారు ప్రముఖ కథా/నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ శ్రీనివాస్ కొప్పిశెట్టి. వీరు స్వయంగా ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల, అక్కడ చూసిన అనుభవమో, స్వీయ అనుభవమో తెలియదు గానీ, ఈ కథ చదువుతుంటే, కథలా అనిపించదు.
కానీ రచయిత్రి సృష్టించిన సన్నివేశాలు, సంభాషణలు చదువుతుంటే పాఠకులు కథలో లీనమై కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చిన్న కథ అయినప్పటికీ, ఒక నవలకు సరిపడినంత వస్తువు ఇందులో వుంది. రచయిత్రి, కవయిత్రి కూడా కావడంతో కొన్ని వాఖ్యలు కవితాత్మకంగా సాగి, పాఠకుడికి ఆ క్షణంలోనే కథ చదవడం పూర్తిచేయాలనే ఆరాటం వెంటాడుతుంది. ఈ కథ రచయిత్రి రచించిన ‘చీకటి వెన్నెల’ అనే కథా సంపుటి లోనిది. ఈ సంపుటిలో ఈ కథతో పాటు మరో పన్నెండు, భిన్నమైన జీవిత గాథలు వున్నాయి. ఈ కథల సంపుటి, పాలపిట్ట ప్రచురణల ద్వారా అక్టోబర్ 2022 లో వెలువడింది.
చీకటి వెన్నెల – కథల సంపుటి పై ఆసక్తి గలవారు స్వయంగా రచయిత్రిని గానీ, ప్రచురణకర్తలను గానీ సంప్రదించవచ్చును. చక్కని కథలను అందించిన రచయిత్రికి అభినందనలు. (రచయిత్రి మొబైల్ 9866059615; ప్రచురణకర్త మొబైల్ 9848787284)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.