[కార్మిక రాజ్య బీమా సంస్థ వజ్రోత్సవం సందర్భంగా మల్లాప్రగడ రామారావు గారు రచించిన ‘కార్మిక రాజ్య బీమా సంస్థ వజ్రోత్సవ శుభవేళ – విహంగావలోకనం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]
నాందీ ప్రస్తావన
“కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణం”గా మన తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న కాన్పూర్ లో కార్మిక రాజ్య బీమా పథకానికి అంకురార్పణ చేసారు.
“సాంఘిక భద్రత చట్టాలు స్వాతంత్ర్యానంతర భారతదేశ నిర్మాణానికి పునాది. పారిశ్రామిక అభివృద్ధి కేవలం ఉత్పత్తి పెరుగుదలతో మాత్రమే కాక కార్మికుల ఆరోగ్యం, గౌరవం, భద్రతలతో కూడి ఉండాలి. సామాజిక భద్రత లేకుండా ప్రజాస్వామ్యం అసంపూర్ణం.” అన్నది ఆ దీర్ఘదర్శి భావన.
ఇంతింతై వటుడింతై..
ఓం ప్రధమంగా 24-2-52 న కాన్పూర్ మరియు ఢిల్లీలో గల 1,20,000 పారిశ్రామిక కార్మికులు ఈ చట్ట పరిధిలోనికి వచ్చారు.
మొదట్లో సెక్షన్ 2(12) ప్రకారం 20 అంతకంటే ఎక్కువ మందిని సంవత్సరంలో ఏదో ఒక రోజు నియమించి, ఉత్పత్తి ప్రక్రియలో విద్యుత్ ఉపయోగించే కర్మాగారాలకు ఈ చట్టం వర్తించేది. ఈ సెక్షన్ కు చేసిన సవరణ ద్వారా 20-10-1989 నుండి కనీసం 10 మంది కార్మికులు పనిచేసే కర్మాగారాలకు కూడా దీన్ని వర్తింపజేశారు.
కర్మాగారాలకే కాదు సంస్థలకు కూడా ఈఎస్ఐ వర్తింపు
చట్టంలో మొదటి నుండి ఉన్న సెక్షన్ 1(5) ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంలోని నిబంధనలను గాని, వాటిలో ఏవైనా నిబంధనలను గాని, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ లేదా ఇతరేతర సంస్థలకు విస్తరింపజేయవచ్చు. ఈ దిశగా తొలి అడుగు వేసిన రాష్ట్రం కేరళ. అక్కడ మార్చి,1975 నుండి కనీసం 20 మంది నియమితులైన దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలకు ఈఎస్ఐ చట్టం వర్తింపజేయబడింది. క్రమంగా మిగతా రాష్ట్రాలూ ఆ దారి పట్టాయి. దరిమిలా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఈ కనీస సంఖ్యను 10 కి తగ్గించాయి.
వామనుడు త్రివిక్రముడైనట్టే..
ఈ మాట ఊరికే అనలేదు. దఫదఫాలుగా, వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ ఎస్ ఐ 31 మార్చి 2025 నాటికి 3.84 కోట్ల బీమా ఉద్యోగులకు చేరువైంది. వేరే విధంగా చెప్పాలంటే, మన ప్రపంచంలో ఇంతకంటే తక్కువ జనాభాగల దేశాలే 139 ఉన్నాయి. బీమా కార్మికుల కుటుంబ సభ్యులను కలుపుకుంటే, ఈ ఎస్ ఐ లబ్ధిదారుల సంఖ్య 14.91 కోట్లకు చేరుతుంది. ఇంతకంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు, మన దేశంతో కలిపి, ఎనిమిదే !
తప్పని వేతన పరిమితి
దేశ పౌరులందరికీ బీమా సదుపాయం ఉండడం ఒక ఆదర్శం. దేశ ఆర్థిక పరిస్థితి అనుకూలించినప్పుడే అది సాధ్యం. అలాగే పరిశ్రమలలో, సంస్థలలో పనిచేసే యావన్మంది కార్మికులను ఇఎస్ఐ చట్టం పరిధిలోకి తీసుకురావడం కూడా దీర్ఘకాలిక లక్ష్యం.
ప్రారంభంలో నెల జీతం ₹.400 మించని వారికే ఈ చట్టం వర్తించేది. క్రమేపీ ఈ వేతన పరిమితి పెంచబడి 1-1-2017 నాటికి ₹.21,000 కు చేరుకుంది. అదే అంగవైకల్యం గల ఉద్యోగుల విషయానికొస్తే ₹.25,000 మించని వేతనం కలిగిన వారంతా ఈ చట్ట పరిధిలోకి వస్తారు.
ఒకే పథకం గొడుగు క్రింద బహుళ ప్రయోజనాలు
ఈ ఎస్ ఐ పథకం ప్రధానంగా ఉద్యోగులకు ఐదు హితలాభాలు – వైద్య సదుపాయం మరియు నాలుగు నగదు హితలాభాలు (క్యాష్ బెనిఫిట్స్) ప్రసాదిస్తుంది. అందుకనే కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ చిహ్నం (లోగో’) పంచదీపం.
1. వైద్యహితలాభం
చట్ట పరిధిలోనికి వచ్చిన రోజునుండి ఉద్యోగికి, అతని కుటుంబానికి ఈఎస్ఐ వైద్యశాలలలో, ఆసుపత్రులలో, రిఫరల్ ఆసుపత్రులలో బేషరుతుగా, వ్యయపరిమితి లేని వైద్య చికిత్స లభిస్తుంది.
2. అనారోగ్యకాల హితలాభం
అనారోగ్య కారణంగా విధులకు హాజరు కారాదని బీమా వైద్యులు నిర్ధారించిన బీమావ్యక్తికి ఒక సంవత్సరకాలంలో, ఆ వ్యక్తి రోజువారీ వేతనంలో దాదాపు 70 శాతం 91 రోజుల వరకు అనారోగ్యకాల హితలాభం చెల్లించబడుతుంది. ఇందుకుగాను, ఆ వ్యక్తి సంబంధిత చెల్లింపు కాలం (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి మార్చి) లో, కనీసం 78 రోజులు చందా చెల్లించి ఉండాలి. అప్పుడు సంబంధించిన ప్రయోజన కాలం (జనవరి నుండి జూన్ లేదా జూలై నుండి డిసెంబర్) లో ఈ హితలాభం చెల్లించబడుతుంది.
ఇందుకు అదనంగా ‘విస్తరించబడిన అనారోగ్యకాల హితలాభం’ ( ఎక్స్టెండెడ్ సిక్ నెస్ బెనిఫిట్) కూడా ఉంది. ఈఎస్ఐ గుర్తించిన 34 తీవ్రమైన వ్యాధులలో దేనివల్లగాని కార్మికులు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారని వైద్యులు నిర్ధారిస్తే, వారి రోజువారీ వేతనంలో దాదాపు 80 శాతం, గరిష్టంగా 2 సంవత్సరాలు (730 రోజులు) గాని, బీమా వ్యక్తికి 60 ఏళ్ల వయసు వరకు గాని (309 రోజులు దాటిన సందర్భాలలో) ఈ సదుపాయం లభిస్తుంది. ఇందుకుగాను ఆ ఉద్యోగి బీమావ్యక్తిగా కొనసాగాలి. నాలుగు చందాచెల్లింపు కాలాలలో కనీసం 156 రోజులు చందా చెల్లించి ఉండాలి. దానికి తోడు, ఆ నాలుగు చందా చెల్లింపు కాలాలలో కనీసం ఏదో ఒక కాలానికైనా అనారోగ్యకాల హితలాభానికి అర్హుడై ఉండాలి.
3. అంగవైకల్య కాలానికి హితలాభం
పనిలో జరిగిన ప్రమాదం కారణంగా గాయపడినవారికి లేదా వృత్తి జనిత వ్యాధికి గురైన వారికి ఉచిత చికిత్సతో పాటు, పనికి వెళ్లలేనన్ని రోజులకు ఈ హితలాభం చెల్లించబడుతుంది. తాత్కాలిక అంగవైకల్యం వున్నన్నాళ్ళు జీతంలో 90 శాతం లభిస్తుంది, శాశ్వత వైకల్యం ప్రాప్తించిన సందర్భాలలో బీమాదారుని ఆదాయార్జన సామర్థ్య నష్టాన్ని అంచనా వేయడం ద్వారా, గరిష్టంగా 100% అంగవైకల్యానికి జీతంలో దాదాపు 90 శాతం, కనిష్టంగా 1% అంగ వైకల్యానికి నెల జీతంలో 90 శాతంలో 1% చెల్లించబడుతుంది.
4. ప్రసూతి కాల హితలాభం
ఈఎస్ఐ పరిధిలో ఉన్న మహిళా ఉద్యోగులకు మొదటి రెండు కాన్పులకు ప్రసూతి కాలంలో 26 వారాలు, మూడో కాన్పునుండి 12 వారాలు, రోజువారీ సగటు వేతనంపై సెలవు మంజూరు చేయబడుతుంది. గరిష్టంగా ప్రసవానికి ముందు 6 వారాల నుండి ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు. ఉద్యోగి కోరుకుంటే అంతకంటే ముందే ఈ హితలాభం తీసుకుని, ప్రసవం తర్వాత మిగిలిన కాలానికి ఈ సదుపాయం పొందవచ్చు. అంతేకాదు. గర్భస్రావానికి 6 వారాలు, గర్భధారణ, ప్రసవం, ముందస్తు కాన్పు, గర్భస్రావం కారణంగా అనారోగ్యం ఏర్పడితే గరిష్టంగా మరో నెల రోజులు అదనపు ప్రసూతి హితలాభం లభిస్తుంది. ఈ హితలాభం పొందుతున్న సమయంలో ఆ ఉద్యోగి మరణిస్తే, మిగిలిన కాలానికి ఈ హితలాభం అర్హులైన కుటుంబ సభ్యులకు చెల్లించబడుతుంది.
5. ఆశ్రితులకు హితలాభం (డిపెండెంట్స్ బెనిఫిట్)
పనిలో జరిగిన ప్రమాదం కారణంగా, లేదా ఇంటి నుండి పనిలో చేరే నిమిత్తం పని ప్రదేశానికి వెళ్తున్నప్పుడు లేదా పనివేళలు ముగిసిన తర్వాత పనిచేసే ప్రదేశం నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదం కారణంగా ఎవరైనా మరణిస్తే, ఆ బీమావ్యక్తి భార్యకు, కొన్ని నిబంధనలకు లోబడి సంతానానికి, నెలవారి పింఛన్ వలె ఈ హితలాభం వర్తిస్తుంది. బీమావ్యక్తి ఇతర ఆశ్రితులకు ఈ హితలాభం చెల్లించవలసిన సందర్భాలలో, ఆ వ్యక్తుల నెలసరి ఆదాయం ₹.9000 కు మించకుంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ హితలాభం మరణించిన ఉద్యోగి జీతంలో దాదాపు 90 % ఉంటుంది.
అదునెరిగి కొత్త పుంతలు తొక్కడం ఈఎస్ఐ పథక లక్షణం
ఆర్థికంగా బలపడుతున్నకొలదీ, బీమా వ్యక్తుల అవసరాలనెరిగి ఇఎస్ఐ కల్పిస్తున్న నూతన పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బీమా వ్యక్తి మరణించినప్పుడు రూ.15,000/- వరకు అంత్య క్రియల ఖర్చుకు గాను ఇవ్వబడుతుంది.
- ఉద్యోగ విరమణ చేసిన లేదా అంగవైకల్యం కారణంగా ఉద్యోగంలో కొనసాగలేకపోయిన బీమాదారుకు, అతని/ఆమె జీవిత భాగస్వామికి సంవత్సరానికి రూ.120/- చెల్లింపుతో ఈఎస్ఐ వైద్యశాలలో, ఆసుపత్రులలో ఉచిత చికిత్స లభిస్తుంది.
- బీమాదారుని భార్య లేదా మహిళా బీమా వ్యక్తి ఈఎస్ఐ పథకం క్రింద ప్రసూతి సౌకర్యం లేనిచోట ప్రసవిస్తే, రెండు కాన్పులవరకు ₹.7,500/ చొప్పున ఇవ్వబడుతుంది
- విధి నిర్వహణలో భాగం కాని ప్రమాదాలలో 40% వైకల్యం చెందడం వలన గాని , కర్మాగారం లేదా సంస్థ మూసివేత వలన గాని, రిట్రెంచ్మెంట్ వలన గానీ ఉద్యోగం కోల్పోయిన బీమాదారులకు, వారి మొత్తం జీవితకాలంలో మొదటి 12 నెలలు బీమాదారుని సరాసరి వేతనముపై 50%, తదుపరి 12 నెలలు 25% నిరుద్యోగ లభిస్తుంది. ఇందుకుగాను. బీమావ్యక్తి అంతకుముందటి 2 సంవత్సరాల చందా కాలంలో కనీసం 78 రోజులు చందా చెల్లించి ఉండాలి. ఈ నిరుద్యోగ భృతి పొందే సమయంలో వారికి, వారి జీవిత భాగస్వామికి వైద్య సదుపాయం లభిస్తుంది. అంతేకాదు. ఈ సమయంలో బీమావ్యక్తులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వ సంస్థలలో తీసుకున్న వృత్తి శిక్షణకు చెల్లించిన మొత్తాలను ఒక ఏడాది పాటు కారాబీ తిరిగి చెల్లిస్తుంది.
- విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో కనీసం 40% వైకల్యం పొందిన, 45 సంవత్సరాలలోపు వున్న బీమాదారులకు 30 నుండి 45 రోజుల వరకు, వృత్తి పునరావాస కేంద్రాల నియమాల ప్రకారం, ప్రభుత్వ సంస్థలలోనూ, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలోనూ ఏదో ఒక వృత్తి శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఉంది.
- ఈఎస్ఐ సంస్థ నిర్వహిస్తున్న మెడికల్, డెంటల్, నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ప్రవేశాలలో బీమాదారుల పిల్లలకు కేటాయింపు ( రిజర్వేషన్) ఉంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ కళాశాలలో ఉన్న మొత్తం 2544 ప్రవేశాలలో బీమా దారుల పిల్లలకు 658 లభించాయి.
నిన్నటి విత్తనమే నేటి మహావృక్షం
“విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత” అన్నారు వేమన. ఒక వైద్యశాలతో ప్రారంభమైన ఈఎస్ఐ వైద్య సేవలు దేశవ్యాప్తంగా 1739 వైద్యశాలలు (డిస్పెన్సరీలు), 803 ప్రైవేట్ డాక్టర్ లు (ఇన్షూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్), సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సహా 166 ఆస్పత్రులుగా విస్తరించింది. వాటికి తోడు ప్రైవేట్ రంగంలో పలు ఆసుపత్రులతో చేసుకున్న ఒప్పందాల ద్వారా బీమా కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్యహితలాభం కలుగుతోంది.
నగదు రూపంలో చెల్లించే మిగిలిన నాలుగు హితలాభాల చెల్లింపు, అందుకు సంబంధిత సేవలు కోసం దేశవ్యాప్తంగా ఈఎస్ఐ శాఖా కార్యాలయాలు 728 ఉన్నాయి.
చట్టం వ్యాప్తి విస్తరిస్తోంది – చందా (కాంట్రిబ్యూషన్ )తగ్గుతోంది
ఈఎస్ఐ అమలకయ్యే ఖర్చు కార్మికులు, యాజమాన్యాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అందుకనే ఈఎస్ఐ కార్పొరేషన్ లో ఈ నాలుగు పక్షాల ప్రతినిధులు ఉంటారు. విశేషమేమంటే బీమా కార్మికుల పెరుగుదల అవకాశంగా, ఇఎస్ఐ నిర్వహణలో యజమానుల, కార్మికుల చందా వాటా తగ్గుతోంది. ప్రారంభంలో బీమాకార్మికుల వేతనాలలో 5 % ఉండే యజమానుల వాటా 3.25 % కు, కార్మికుల వాటా 2.25 % నుండి, 0.75 % కు తగ్గాయి.
మన ఫెడరల్ వ్యవస్థకు అద్దం ఈ చట్టం
మనదేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను అవే అమలు చేస్తాయి( ఉదాహరణకి దుకాణాలు మరియు సంస్థలు చట్టం) కేంద్ర ప్రభుత్వమే అమలు చేసే కేంద్ర చట్టాలు (ఉ. భవిష్య నిధి చట్టం), ఉభయ ప్రభుత్వాలు అమలు చేసే కేంద్ర చట్టాలు(ఉ. కర్మాగారాల చట్టం) ఉన్నాయి. కానీ, ఇఎస్ఐ చట్టం ప్రకారం నగదు లాభాలు (అనారోగ్య, ప్రసూతి, అంగ వైకల్య, ఆశ్రిత హితలాభాలు) చెల్లించే బాధ్యత పూర్తిగా ఇఎస్ఐ కార్పొరేషన్ ది కాగా, వైద్య సేవలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో బాటు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఈఎస్ఐ కార్పొరేషన్ కూడా పంచుకుంటుంది. ఇలాంటి పథకం ఇంకోటి లేకపోవడమే ఈ చట్టం ప్రత్యేకత.
భరతవాక్యం
ఇంతటి మానవీయ, మహోన్నత కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో, స్వలాభాపేక్ష లేశమంతైనా లేకుండా నిర్వహించే సిబ్బంది, అధికారులు, రాజకీయ నాయకత్వం ఆవశ్యకమన్నది స్పష్టమే.
అప్పుడే ఈఎస్ఐ వ్యవస్థాపక దినాన ప్రత్యేక సేవల పక్షోత్సవాలు ప్రారంభిస్తూ కేంద్ర కార్మిక మంత్రి మనసుఖ్ మాండవియా పేర్కొన్న “స్వస్థ్య హీ సేవా హై, ఔర్ సేవా హీ హమారా సంస్కార్ హై” (“ఆరోగ్యం మా లక్ష్యం, సేవ మా సంప్రదాయం”) వాస్తవమవుతుంది.

