[మే 13న మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. జాకిర్ హుస్సేన్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
“మొత్తం భారతదేశం నా ఇల్లు మరియు దాని ప్రజలు నా కుటుంబం. ప్రజలు నన్ను కొంతకాలం పాటు ఈ కుటుంబానికి అధిపతి ఎంచుకున్నారు. న్యాయమైన సంపన్నమయిన మరియు సుందరమైన జీవితాన్ని నిర్మించే అద్భుతమైన పనిలో నిమగ్నమయిన గొప్ప ప్రజలకు తగిన గృహంగా, ఈ ఇంటిని బలంగా మరియు అందంగా తీర్చిదిద్దడానికి నేను మనస్ఫూర్తిగా కృషిచేస్తాను” ఈ అద్భుతమైన భావాన్ని పదాలలో నిక్షిప్తం చేసి పలికిన పలుకులు మన దేశ 2వ ఉపరాష్ట్రపతి, మరియు 3వ రాష్ట్రపతి అయిన క్రీ.శే. జాకిర్ హుస్సేన్ గారివి.
చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటుంటారు. వీరు డాక్టర్ చదవాలని సైన్స్ కోర్సులో చేరారు. కాని అనారోగ్యం మూలంగా ఒక సంవత్సరం చదువు ఆగిపోయింది. తర్వాత తత్వశాస్త్రం, ఆంగ్ల సాహిత్యం, అర్థశాస్త్ర, న్యాయశాస్త్ర విభాగాలలో బ్యాచులర్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లను పొందారు.
మహాత్మాగాంధీ పిలుపునందుకుని దేశంలో అనేక జాతీయ విద్యాలయాలు, కళాశాలలు అలీగఢ్ కలిసిన స్వతంత్ర స్థాపించబడినాయి. కొంతమంది ముస్లిం విద్యావంతులు, జాతీయనాయకులు కలిసి ‘జాతీయ విశ్వవిద్యాలయాన్ని’ స్థాపించారు. ఇదే తర్వాత ‘జామియా మిలియా ఇస్లామియా’ గా మారింది. 1925 లో ఢిల్లీకి తరలించబడింది. దీని వ్యవస్థాపకులలో ఒకరు జాకిర్ హుస్సేన్.
1926లో జర్మనీ వెళ్ళారు. బెర్లిన్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రంలో పి.హెచ్‌డి. పూర్తి చేసి డా. జాకిర్ హుస్సేన్‌గా తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చారు. 1948 వరకు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి, 1948 లో అలీఘడ్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు.
వీరికి విద్యారంగంలో గల పరిజ్ఞానాన్ని అభినివేశాన్ని, శ్రద్ధాసక్తులను గమనించిన గాంధీజీ (బేసిక్ ఎడ్యుకేషన్) గాంధేయ సిద్ధాంతాల పాఠ్యప్రణాళికను రూపొందించడానికి ఏర్పాటు చేసిన ‘జాతీయ ప్రాథమిక విద్యా కమిటీ’కి ఛైర్మన్‌గా సేవలను అందించమని ఆహ్వానించారు. వీరి ఆధ్వర్యంలో రూపొందించిన పాఠ్య ప్రణాళిక ప్రకారమే ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు భావి ఉపాధ్యాయులకు శిక్షణను అందించాయి.
ఈ అనుభవమే 1956 నుండి 1958 వరకు UNESCO (విద్యా, శాస్త్రీయ, మరియు సాంస్కృతిక సంస్థ కార్యనిర్వాహక మండలి) సభ్యుడిగా సేవలను అందించడానికి తోడ్పడింది. 1952, 1962 లలో రాజ్యసభ సభ్యుడిగా నియమించబడ్డారు. 1957లో బీహార్ గవర్నరగా పదవిని స్వీకరించారు. 1962లో రెండవ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
1967 మే 13 వ తేదీన క్లిష్ట పరిస్థితులలో అంటే అత్యంత ప్రతిష్ఠాకరంగా జరిగిన ఎన్నికలలో గెలిచి రాష్ట్రపతి అయ్యారు. అయితే అతి కొద్దికాలం మాత్రమే ఈ పదవీ బాధ్యతలను నిర్వహించారు.
1969 మే 3 వ తేదీన పదవిలో ఉండగానే మరణించారాయన.
విద్యారంగంలో వీరు నిర్వహించిన సాధించిన విజయాలకు ప్రతిగా 1954లో పద్మవిభూషణ్, 1963లో భారతరత్న వీరిని వరించాయి. 1962లో సాహిత్య అకాడమీ ఉపాద్యక్షుడిగా సేవలను అందించారు.
వీరు గొప్ప రచయిత, అనువాదకులు కూడా! ఆలా తాలీమ్, హిందుస్థాన్ మే తాలీమ్‌కి అజ్ సర్-ఎ-నౌ తన్జీమ్, ఖౌమీ తాలీబ్ వంటి గ్రంథాలను రచించారు. ప్లేటో వ్రాసిన ‘రిపబ్లిక్’ను, ఎడ్విన్ కానన్ రచించిన ‘ఎలిమెంట్స్ ఆఫ్ ఎకనామిక్స్’ గ్రంథాలను అనువదించారు.
భారతరత్న డా. జాకిర్ హుస్సేన్‌గా రాష్ట్ర పతిగా ఎన్నిక కావడం వారి ప్రత్యేకత.
వీరి జ్ఞాపకార్ధం 1969 జూన్ నెల 11 వ తేదీన 20 పైసల విలువతో ఒకస్టాంపు, 1998వ సంవత్సరం మే 3వ తేదీన 2-00 రూపాయల విలువతో ఒక స్టాంపు విడుదలయ్యాయి.
20 పైసల స్టాంపు స్టాంపుల చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకోవడం ఒక చారిత్రక విశేషం. సింహాసనాసీనులయిన జాకిర్ చిత్రం ఈ స్టాంపు మీద దర్శనమిస్తుంది. దీని అర్థం ‘పదవి’లో ఉండగానే స్వర్గస్తులవడం అన్నమాట.
ఇక 2-00 రూపాయల స్టాంపు మీద జాకిర్ పాస్‌పోర్ట్ చిత్రం కనిపిస్తుంది.
మే 13వ తేదీ డా. జాకిర్ హుసేన్ వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

