Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఎబోలా వైరస్ – గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ

ఆఫ్రికాఖండంలోని కాంగో మరియు ఉగాండా దేశాల్లో ఈ వైరస్ 246 మందికి సోకిందని భావిస్తే, అందులో 80 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో నడిచే ఎమర్జెన్సీ కమిటీ సలహా మేరకు అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని మే నెల 17వ తారీఖున ప్రకటించింది. 2005 తరువాత అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఎనిమిది సందర్భాల్లో, మూడుసార్లు ఎబోలా వైరస్ గురించే ప్రకటించడం జరిగిందంటే ఈ వైరస్ కున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బుండిబుగ్యో స్ట్రెయిన్ వలన ఈ వ్యాధి వ్యాపించింది.

అసలీ ఎబోలా వైరస్ అంటే ఏమిటి? అంత అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన, దీని ప్రాముఖ్యతేమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

ఇది ఒక ఆర్ఎన్ఏ (RNA) వైరస్. 1976లో కాంగోదేశం లోని ఎబోలా నది సమీప ప్రాంతంలో తొలిసారిగా గుర్తించడంతో దీనికి ఎబోలా వైరస్ అనే పేరు పెట్టారు. సాధారణంగా వైరస్ లు గుండ్రంగా గాని, షట్భుజి ఆకారంలో గాని ఉంటే ఈ వైరస్ సన్నని, పొడవైన పోగులా ఉంటుంది. ఈ వైరస్ లో, జైర్, సూడాన్, రెస్టాన్, ఐవరీ కోస్ట్, బుండిబుగ్యో అనే ఐదు రకాలను (ఆయా ప్రాంతాలలో వీటిని గుర్తించడంతో ఆ ప్రాంతాల పేర్లనే పెట్టడం జరిగింది) గుర్తించారు. వాటిల్లో జైర్ స్ట్రెయిన్ సోకితే మరణాల రేటు 90 శాతం ఉంటుంది.

ఇది ఎబోలా వైరస్ డిసీజ్, ఎబోలా హెమరేజిక్ ఫీవర్ (రక్తస్రావ జ్వరం) అనే వ్యాధులను కలగ చేస్తుంది. రోగుల శరీర స్రావాలన్నిటిలోనూ ఈ వైరస్ కనిపిస్తుంది. అందుకే రోగి శరీరద్రవాలు సోకడం ద్వారా మాత్రమే ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంటే రోగికి సమీపంలో ఉండి చికిత్స అందించే వారికి, రోగులకు సేవలను అందించిన వారికి మాత్రమే సోకుతుందీ వ్యాధి. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇంతవరకు నిర్ధారణైతే కాలేదు. ఐనా, అత్యవసర పరిస్థితిని ఎందుకు ప్రకటించారంటే, ఈ వ్యాధిలో మరణాల రేటు చాలా ఎక్కువగా (30-90%) ఉంటుంది కాబట్టి.

మరణాల రేటు ఎక్కువగా ఉండడానికి నాలుగు కారణాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. 1. వైరస్ రక్తనాళాలలోని లోపలి పొరను ధ్వంసం చెయ్యడంతో రక్తస్రావం జరగడం 2. త్రాంబోసైట్స్ అనబడే ఒక రకమైన రక్తకణాలు తగ్గడంతో, రక్తస్రావం జరిగినప్పుడు, రక్తం గడ్డ కట్టకపోవడం 3. మేక్రోఫేజెస్ మరియు లింఫోసైట్స్ అనే రోగ నిరోధక కణాలను ధ్వంసం చెయ్యడం 4. మన రక్షణ వ్యవస్థలోని వైరస్ లను అడ్డుకునే ఇంటరుఫెరాన్లను ధ్వంసం చెయ్యడం.

మైక్రోస్కోపు నుంచి కనబడే ఎబోలా వైరస్

వైరస్ సోకిన రెండురోజుల నుండి మూడు వారాల (సాధారణంగా 4-5 రోజులు) మధ్య ఎప్పుడైనా వ్యాధి సంభవించవచ్చు. రోగ లక్షణాలు చూస్తే సాధారణ వైరల్ జ్వరాలకున్నట్టు జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతునొప్పి, తలనొప్పి, నిస్సత్తువ, ఆకలి మందగించడం, కొంతమందిలో విరేచనాలు… మాత్రమే ఉన్నా, చూస్తుండగానే చర్మంపై ఎర్రని దద్దుర్లు కనిపించి, రక్తంతో కూడుకొని ఉండడం, శరీర అంతర్గత అవయవాలలో రక్తస్రావం జరగడంతో (దీనినే హెమరేజిక్ ఫీవర్ అంటాం), రక్తపోటు పడిపోయి, శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోయి, రోగి హైపోవొలీమిక్ షాక్ కు గురౌతాడు. దీన్నుండి కాలేయ, మూత్రపిండాల సమస్యలొస్తాయి. పైన చెప్పుకున్నవన్నీ ప్రాణాపాయం సంభవించడానికి దోహదం చేస్తాయి.

ఈ వ్యాధి నుండి బయటపడినా, ఆ రోగుల్లో కంటిచూపు మందగించడం, కీళ్ల నొప్పులు, నిస్సత్తువ చాలా కాలం వరకూ ఉంటాయి. దీనినే పోస్ట్ ఎబోలా సిండ్రోమ్ (Post Ebola Syndrome) అంటాం. కోలుకున్నాక, చాలా కాలం వరకు శరీర ద్రవాలలో (తల్లిపాలు, వీర్యం) ఈ వైరస్ కనిపిస్తుంది. అందుకని భార్యాభర్తలు తగు జాగ్రత్తలు (సుమారు సంవత్సరం పాటు) తీసుకోవాలి. బాలింతలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వకూడదు.

రోగనిర్ధారణ: 1. ఆర్.టి.పి.సి.ఆర్ (RT-PCR) ద్వారా వైరస్ జన్యువులను గుర్తించడం, 2. ఎలైజా (ELISA) టెస్టు ద్వారా వైరస్ ప్రోటీన్లను, యాంటీ బాడీలను గుర్తించడం 3. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (రీసెర్చ్ సెంటర్సులో మాత్రమే అందుబాటులో ఉంటుంది) ద్వారా వైరస్ ను గుర్తించడం

రోగ చికిత్స: ప్రస్తుతానికి ఈ వైరస్ కు సంబంధించి ప్రత్యేకమైన యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో లేనందువలన, రోగికున్న బాధలను తగ్గించడమే చికిత్సలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఈ రోగులను ప్రత్యేకమైన వార్డుల (Isolation Ward)లో ఉంచి చికిత్స అందించాలి. రోగులకు సేవ చేసేవారు, చికిత్స అందించేవారు పిపిఈ (PPE) కిట్లను తప్పనిసరిగా ధరించాలి. హ్యాండ్ హైజీన్ పాటించాలి. ప్రొటెక్షన్ లేకుండా మరణించిన వ్యక్తులను ముట్టుకున్న వారికి, వ్యాధి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకని ఈ వ్యాధితో చనిపోతే, కోవిడ్ తో మరణించిన వ్యక్తుల విషయంలో పాటించిన జాగ్రత్తలన్నీ పాటించాల్సి ఉంటుంది.

నివారణా చర్యలు: ప్రస్తుతానికి ఒక రకమైన టీకా (rVSV-ZEBOV) అందుబాటులో ఉంది. దీనిని వైద్య సిబ్బందికి, అంటురోగం ప్రబలినప్పుడు రోగి (Index case) చుట్టూ ఉన్న వ్యక్తులకు, ఆ వ్యక్తులు ఎవరితో కలిసి ఉంటారో (నివాసంలో గాని, పనిచేసే ప్రదేశంలో గాని) ఆ వ్యక్తులకు టీకాను వెయ్యడం ద్వారా (Ring Vaccination) ఒక రక్షణ వలయాన్ని తయారుచేసి, ఇతరులకు వ్యాపించకుండా చెయ్యడం ద్వారా ఈ వైరస్ ను అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తారు వైద్య నిపుణులు. ఇంకో రెండు టీకాలు ప్రయోగ దశలో ఉన్నాయి.

ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలలో కనిపిస్తూ, వ్యాధిని నిర్ధారించేలోగా ఎక్కువమందికి వ్యాపిస్తుంది. ఒక రకమైన గబ్బిలాల (Fruit bats) లో, కొన్ని రకాల కోతుల్లో ఈ వైరస్ ఉందని అనుమానించడం జరుగుతుంది. గాని, ఖచ్చితమైన పూర్తి సమాచారం లేదు.

మే 17న 246 అనుమానస్పద కేసులు 80 మరణాలు నమోదైతే, మే 18 వ తారీకు ఉదయానికి, 300 అనుమానాస్పద కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. అన్ని నివారణా చర్యలు తీసుకుంటున్నా, ఈ రకంగా కేసుల పెరుగుదల ఉండడంతో ఈ వైరస్ సోకిందని తెలియగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను జారీ చేసింది.

2007- 2008వ సంవత్సరంలో, ఉగాండాలోని బుండిబుగ్యో ప్రొవెన్స్ లో ఒకేసారి ఎక్కువగా వచ్చిన కేసుల్లో (Outbreak) మొదటిసారిగా ఈ స్ట్రెయిన్ ను గుర్తించి, బుండిబుగ్యో పేరును స్థిరీకరించారు. మరల 2012 లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మరొక అవుట్‌బ్రేక్‌కు కారణమైంది.

జైరో స్ట్రెయిన్ కన్నా తక్కువ ప్రమాదకారి (మరణాల రేటు 30%) ఐనా, దీనికెక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, వ్యాధి ఉన్నా టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు రావడం. దీనినే ఫాల్స్ నెగిటివ్ రిజల్ట్స్ అంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంతవరకు ఉన్న టెస్టులు, మిగిలిన స్ట్రెయిన్లను గుర్తించేవిగా రూపొందించబడటం. అలాగే ప్రస్తుతానికి ఈ స్ట్రెయిన్ కు వ్యాక్సిన్, ప్రత్యేకమైన చికిత్స లేకపోవడం. అందుకని ఇది సెంట్రల్ ఆఫ్రికాలోనే కాకుండా, సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉండడం ముఖ్య కారణం.

ఈ వ్యాసం రాసే సమయంలో 131 మరణాలు నమోదు చెయ్యబడ్డాయి. ఒక్క రోజులోనే, 26 మంది వ్యాధి అనుమానిత రోగులు మరణించడం వ్యాధి తీవ్రతను తెలుపుతుంది. ప్రస్తుతానికి నివారణా చర్యలు తీసుకుంటూ ఈ వ్యాధి చికిత్సకు మోనోక్లోనల్ యాంటీ బాడీస్ ను, నివారణకు వాక్సినును తయారు చేసే దిశగా రీసెర్చ్ జరుగుతుంది. వారి ప్రయత్నాలు ఫలించాలని, తొందరగా ఈ వ్యాధి అదుపులోకి రావాలని ఆశిద్దాం.

మనదేశంలో ఇంతవరకు, ఎబోలా వైరస్ కేసులు నమోదు చెయ్యబడలేదు. గాని, 2014లో ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ లో ఈ వైరస్ బయటపడింది. అలాగే, ఇంక్యుబేషన్ పీరియడ్ (రెండు రోజుల నుండి మూడు వారాలు)లో ఈ వైరసును గుర్తించలేం కాబట్టి, విమానయాన ప్రయాణికుల ద్వారా ఈ వ్యాధి మన దేశానికి వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని నిరంతర అప్రమత్తత అవసరం అనేది కాదనలేని సత్యం. అందుకని ప్రస్తుతం జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, అప్రమత్తతను పాటిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రజారోగ్య సంస్థలకు ఏ రకమైన ఆదేశాలు గాని, సూచనలు గాని ఇవ్వడం జరగలేదు. గాని అంతర్జాతీయ విమానయాన ప్రయాణికులు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలను సందర్శించేవారు తగిన జాగ్రత్తలు పాటించవలసినదిగా, ఒక మైక్రోబయాలజీ ప్రొఫెసరుగా సూచిస్తున్నాను.

Exit mobile version