Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాక్టీరియో ఫేజ్‌లను కనుగొన్న ఫ్రెడరిక్ విలియం ట్వోర్ట్

[బాలబాలికల కోసం ‘బాక్టీరియో ఫేజ్‌లను కనుగొన్న ఫ్రెడరిక్ విలియం ట్వోర్ట్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

ఫ్రెడరిక్ విలియం ట్వోర్ట్ ఇంగ్లాండులోని కెంబర్లీలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు డాక్టర్ విలియం హెన్రీ ట్వోర్ట్, ఎలిజబెత్ వెబస్టర్‌లు. బాక్టీరియో పేజ్‌లను మొదటిసారిగా కనుగొన్న ఆంగ్ల బాక్టీరియాలజిస్ట్. ఈయన లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో వైద్య విద్యను అభ్యసించారు. పశువులలో వచ్చే దీర్ఘకాలిక ప్రేగు సంబంధిత వ్యాధి అయినటువంటి జాన్స్ వ్యాధిపై పరిశోధన చేశారు. బ్రౌన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యానిమల్స్‌కు సూపరింటెండెంట్‌గా పని చేశారు.

1877వ సం.లో అక్టోబర్ 22వ తేదీన ఇంగ్లాడ్‌లో జన్మించారు. తల్లిదండ్రులకు ఉన్న పదకొండు మంది సంతానంలో ఈయన పెద్దవాడు. 1919లో ట్వోర్ట్, ఫ్రెడరిక్ జె. బానిస్టర్ కుమార్తె అయిన డోరతీ నోనిని వివాహం చేసుకున్నారు. కుష్టు బాసిల్లస్‌కు క్షయ బాసిల్లస్‌కు సన్నిహిత సంబంధం ఉందని ట్వోర్ట్ గుర్తించాడు.  ‘ఈ రెండు జీవులకు వాటి ప్రోటో ప్లాజాను నిర్మించుకోవడానికి ఒకే రకమైన రసాయన పదార్థాలు అవసరమవుతాయ’ని ట్వోర్ట్ అనుమానించారు. 20వ శతాబ్దం ప్రారంభం వరకు కూడా కుష్టు వ్యాధిని కలిగించే బాసిల్లస్‌ను ప్రయోగశాలలో పెంచలేకపోయారు. ఒక జీవి పెరుగుదలకు మరొక జీవి ఉత్పత్తి చేసిన పదార్థం అవసరం అవుతుందని ట్వోర్ట్ నిరూపించారు.

ఇంగ్లీషు బాక్టీరియాలజిస్ట్ అయిన ఫ్రెడరిక్ ట్వోర్ట్, పశువులకు వచ్చే దీర్ఘకాలిక పేగుల సంక్రమణ అయిన జాన్స్ వ్యాధిపై పరిశోధన చేసి, కుష్టు బాక్టీరియా పెరగడానికి విటమిన్ కె అవసరమని కనుగొన్నారు. ట్వోర్ట్, పెరుగుదల మాధ్యమంలో చనిపోయిన ట్యూబర్‌కిల్ బాసిల్లస్‌ను చేర్చి, కుష్టు బాసిల్లస్‌ను పెంచడంలో విజయం సాధించారు. ట్యూబర్‌కిల్ బాసిల్లస్ అందించిన ముఖ్యమైన పదార్థం విటమిన్ కె. ఒక జీవి, మరొక జీవి ఉత్పత్తి చేసిన పదార్థాన్ని అందుకున్నప్పుడు మాత్రమే పెరగగలదని ఆయన నిరూపించారు (ఇది బాక్టీరియా పోషణపై అధ్యయనాలకు ఆధారం). జాన్స్ బాసిల్లస్‌ను కూడా సాధారణ మాధ్యమాలలో పెంచలేకపోయారు. మాధ్యమంలో చనిపోయిన ట్యూబర్‌కిల్ బాసిల్లస్‌ను చేర్చడం విజయవంతమైంది మరియు జాన్స్ బాసిల్లస్‌ను మొదటిసారిగా పెంచారు. ఆయన మశూచి టీకాలను న్యూట్రియెంట్ అగర్ స్లాంట్స్‌పై ప్లేట్ చేసి, అనేక రంగులలో పెద్ద బాక్టీరియా సమూహాలను పొందారు. పరీక్షించినప్పుడు, సబ్‌కల్చర్ చేసినప్పుడు పెరగని సూక్ష్మమైన గాజులాంటి ప్రాంతాలను ఆయన కనుగొన్నారు. ఈ గాజులాంటి ప్రాంతాలు బాక్టీరియా కణాల నాశనం ఫలితంగా ఏర్పడతాయని, వాటి పెరుగుదలకు బాక్టీరియా అవసరమని ఆయన గ్రహించారు. ఈ విధంగా, ఆయన బాక్టీరియో ఫేజ్‌లను కనుగొన్నారు. “1915లో ప్రచురించిన ఒక చిన్న పత్రం కారణంగా ఈనాడు బాక్టీరియాలజిస్టులు మరియు వైరాలజిస్టులు ట్వోర్ట్‌ను గుర్తుంచుకుంటారు. ‘అతి సూక్ష్మ వైరస్‌ల స్వభావంపై ఒక పరిశోధన’ అనే శీర్షికతో, కొన్ని సంవత్సరాల తరువాత డి’హెరెల్ ‘బాక్టీరియోఫేజ్’ అని పిలవబోయే దాని ప్రభావాల పరిశీలన మొదటిసారిగా నమోదు చేయబడింది.” అని లిస్ విల్కిన్సన్ పేర్కొన్నారు.

ఇతర సేవలు, పురస్కారాలు మరియు గౌరవాలు:

అనేక విజయాల ఆధారంగా, ట్వోర్ట్‌కు గౌరవాలు లభించాయి. 1919లో లండన్ విశ్వవిద్యాలయంలో బాక్టీరియాలజీ ప్రొఫెసర్‌గా నియమించబడ్డారు. 1929లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. ట్వోర్ట్ పరిశోధనలలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న సమయంలోనే మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ట్వోర్ట్ రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్‌పై ఆసక్తితో ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత సలోనికాకు బయల్దేరి వెళ్ళి బేస్ ప్రయోగశాలకు ఇన్‌ఛార్జ్ అధిపతిగా ఉన్నారు. యుద్ధ సమయంలో ట్వోర్ట్ పరిశోధనలపై ఏకాగ్రత పెట్టలేకపోయారు. అందువల్ల 1919 వరకు కూడా బాక్టీరియో ఫేజ్ పరిశోధన తొలి దశలోనే ఉన్నది. బాక్టీరియోలైటిక్ ఏజెంట్లను ఉపయోగించి మానవులు మరియు జంతువులలో బాక్టీరియా వ్యాధులను నయం చేయాలని  ప్రయత్నించారు. బాక్టీరియో ఫేజ్ అధ్యాయాన్ని ప్రముఖ సైన్స్ సిరీస్‌లో ప్రచురించారు. ట్వోర్ట్ 1950వ సం.లో మార్చి 30వ తేదీన మరణించారు.

Exit mobile version