[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘గురుజాడ రాఘవశర్మగారు అవీ ఇవీ అన్నీ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
“జాతీయ భావముల్ చాటిన అప్పరాట్కవి మేటి సంఘ సంస్కర్త యతఁడు
చక్కని నుడి తీర్చి సాహితీ చారిత్రకంగానుముల దిద్దె శ్రీరామమూర్తి సుకవి
సంస్కృతాంధ్రముల లెస్సగ గైతపల్కునెర్పరిపూర్ణ చంద్రుండు పండితుండు
సత్కవి జాతీయ సమరయోధుండు, శాస్త్రజ్ఞుండు రాఘవశర్మ యొకడు
కలరు కలరిందునందు సత్కవులు, గ్రంథ
కర్తలున్ గార్యశూరులు కీర్తికాక
రమ్ము శ్రీ గురుజాడ వంశ, మ్మి కట్టి
వంశజుల మౌట మాత్వః ఫలము కాదె”
అని కవిశేఖర గురుజాడ రాఘవశర్మగారు జాతీయ సమర యోధుడు, శాస్త్రఙ్ఞుడూ అయిన తానూ, యుగ వైతాళికుడు గురజాడ అప్పారావుగారు, మహాకవి గురజాడ శ్రీరామమూర్తిగారు ఒకే వంశీకులమని చెప్పుకున్న పద్యం ఇది!
గాంధీగారు స్వాతంత్రోద్యమం కోసం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి పిన్నవయసులోనే స్వాతంత్రోద్యమంలోకి దూకిన జాతీయ సమర యోధుడాయన. పాఠశాల మాని ఖద్దరు ప్రచారకులయ్యారు. సహజంగానే అబ్బిన కవితాశక్తి ఆయన ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించేందుకు ఎంతో తోడ్పడింది. జాతీయగీతాలు రాసుకుంటూ, పాడుకుంటూ సమరశీలుడిగా ఎదిగారు. తెలుగు ప్రాంతాలన్నీ తిరిగి జాతీయ గీతాలన్నీ సేకరించి ఒక సంకలనంగా తెచ్చారు.
ఆనాడు సాహిత్య అకాడెమీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ డా. బెజవాడ గోపాలరెడ్డి జాతీయగీతాల సంకలనం చేయటానికి తగిన ఏకైక వ్యక్తి రాఘవశర్మగారేనని ప్రశంసించారు,
గురజాడ నుండి గురుజాడ దాకా
“దేశభక్తి కవితలో గురజాడ తొలికవి కాగా, గరిమెళ్ళతో పాటు బలిజేపల్లి, రాయప్రోలు, చెన్నాప్రగడ, మంగిపూడి, చిలకమర్తి, గడియారం, తుమ్మల, జాషువా, దువ్వూరి, త్రిపురనేని, ఏటుకూరి, అబ్బూరి, వానమామలై, కాళోజి, దాశరధి, వేదుల, మధునాపంతుల, ధవళ శ్రీనివాసరావు, గురుజాడ రాఘవశర్మ లాంటివారు స్వాతంత్ర్య సమరానికి ప్రచార కవితలు అందించినవాళ్లు అని నిబద్ధాక్షరిలో ఎబికె ప్రసాద్ గారు రాఘవశర్మగారిని ప్రస్తావించారు.
గురుజాడ రాఘవశర్మ గారు పద్యకవి, గేయకవి, పరిశోధకుడు కూడా! ఆయన ఏ రచన చేసినా అందులో చరిత్ర తొణికిసలాడుతుంది. చరిత్రను తెలియచెప్పటం ద్వారా జాతి ఔన్నత్యాన్ని చాటి దేశభక్తిని ప్రబోధించటం ఆయన లక్ష్యం!
“పెదనందిపాడు పన్నులనిరాకరణోద్యమము
శిస్తుదస్తువనూలు చేయ విసరిరి కరణముల్ దస్రముల కట్టగట్టి
జప్తు చేసినయాస్తి చౌకవేలము వేయ పాటబెట్ట డెవండు, పాడరాదు
బైటికి గొంపోవ ఏ బండ్లపైనే ని కాడి క్రిందకు యెద్దు కదలిరాదు
నిప్పు నీరుపాలు ఉప్పెన దొరకదు పల్మరింవరాడు బాలుడైన
బ్రిటిష్ పాలన స్థంభింప వీర కంకణములు దాల్చిరిలన్, పెదనందిపాడు ప్రజలు..
చూడియావులదునుమాడి భక్షించు రాక్షసమూక ధాటికి కదలిపోక
మానినీ సతుల నవమానింప వెడలు మూర్ఖులకు లొంగక, శాంతి గోలుపోక
కట్టెదుటన్ కొల్లగొట్టు యాస్తుల కాగ్రహింప కహింస యొక్కింత విడక,
రేయిబవలు దద్దరిల్లునటుల్ సేనపేల్చు మోతలకు కంపింపబోక
నాయకులయానపై పెదనందిపాడు
శాసనోల్లంఘనమున బ్రశంసనొందె
అపర ‘బార్లోలి యన, మన ఆంధ్రభూమి
ప్రబల యశ మొందె”
అంటూ గురుజాడ రాఘవశర్మగారు ఆనాటి పరిస్థితిని వివరించిన పద్యం ఇది. జాతీయ గీతాలు అనే గ్రంథంలో ఈ గేయాన్ని ప్రచురించారాయన!
“సాహసమున స్వరాజ్య స్థాపనకు పాటు
పడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి యొకతె
కడదాక దేశ రక్షణకు పోరాడె
నానాసాహెబు ప్రజానాయకుండు
పరరాజ్యమున్ ద్రోయ వన్నితంత్రమ్ముల
సాధించె ‘తాంతియా’ యోధుడొకండు
గడగడ వడికించె నడవి భిల్లుల గూర్చి
రాజ్యమున్ గొన ‘రామరాజొ’కండు
భారత స్వతంత్ర సంరంభ కారణమున
ప్రాణముల్ ధారవోసిరీ భరతభూమి
త్యాగులైనట్టి వీరినందఱిని భక్తి
సంస్మరింపుడీ! పుణ్యవాసరమునందు”
ఇలా సాగుతాయి రాఘవశర్మగారి గేయాలు.
“జండా ఎత్తర, జాతికి ముక్తిర
నిండగు శక్తిర, నిల్పర కీర్తిర ||జండా||
దండిగ వైరులు- గుండులు ప్రేల్చిన
చెండుడు నెత్తురు-కండలు రాల్చిన
ప్రాణముంటే, అభిమానముంటే మన
ప్రాణములైనన్ – బలిమొసంగి”
అని వారు వ్రాసిన పాట ఎంతో ఉత్తేజపూరితంగా సాగుతుంది.
మాదల వీరభద్రరావుగారు ‘భారతస్వాతంత్ర్యసమరంలో ఆంధ్రుల ఉజ్వలపాత్ర’ గ్రంథం తాను వ్రాయటానికి గురుజాడ రాఘవ శర్మగారు శ్రమించి సేకరించి పెట్టిన సమాచారం తనకెంతో ఉపకరించిందంటూ “అప్పట్లో వెలువడిన ఆ రాజకీయగ్రంథాలు, కరపత్రాలు ఆనేకం బ్రిటిష్ ప్రభుత్య నిషేధానికి గురియెనవి కాని, ప్రజల అభిమానానికి అవి ఎంతో పాత్రమైనవి. అవి పాతగ్రంధాలయాలలో గాని, స్టేట్ ఆర్కైప్స్‌లోగాని నేడు కనుపించడం లేదు. గురుజాడ రాఘవశర్మ కొంత వరకు వాటిని వెదకి సేకరించారు. వాటిలో కొన్నిటిని పునర్ముద్రించడం ఆంధ సాహిత్య అకాడమీ వారుచేసిన మంచిపని” అని వ్రాశారు.
తోట నరసయ్యగారి ఉదంతం
ఉప్పుసత్యాగ్రహం సమయంలో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిని అరెస్టు చేసిన తర్వాత, తత్యానందస్వామిగా ప్రసిద్ధులైన జాతీయ సమరయోధులు కొండపర్తి వీరభద్రాచార్యులుగారు బందరు వచ్చి కోనేరు సెంటరులో ఉన్న కుండస్తంభం మీద త్రివర్ణపతాకాన్ని ఎగరేశారు. పోలీసులు వెళ్ళి ఆ జెండాని తీసివేశారు, జెండా కర్రని విరిచేశారు. అంతలో గాంధీగారిని అరెస్టు చెసినట్లు వార్త గుప్ఫుమంది. సత్యాగహ శిబిరంనుండి శాంతి సైనికులు ఊరేగింపుగా బయల్దేరి కోనేరు సెంటరులో జెండాను పునః ప్రతిష్టించేందుకు వచ్చారు. తత్యానంద స్వామి కుండస్తంభం ఎక్కి జెండాకట్టబోతే, పోలీసుభటులు ఆయన్ని కిందకు లాగేశారు. మిగతా వలంటీర్లు జెండా ప్రతిష్ఠను కాపాడటానికి సమకట్టారు. పోలీసులు లారీలెత్తి స్తంభం ఎక్కనీయకుండా ఎక్కినవాళ్లను ఎక్కినట్టు క్రిందకు లాగేయసాగారు. అందినవాళ్లను అందినట్తు చితకబాదారు. సాయం వరదదాసు, చలసాని నాగభూషణం, తాడికొండ వీరభద్రయ్య అయ్యగారు, టివీ. ఆళ్వారు, ఈడుపుగల్లు సుబ్బారావు, చెరువు సుబ్బారావు వీళ్ళతో పాటు నెత్తురోడిన వాళ్లలో శ్రీ గురుజాడ రాఘవశర్మ కూడా ఉన్నారు. ఇదంతా చూసి, వస్తాదు తోటనరసయ్య నాయుడు ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ, తనను పట్టుకోబోయిన 15 మంది పోలీసు భటుల్ని తోసుకుంటూ స్తంభం ఎక్కి జెండాను కట్టడానికీ తీవ్ర ప్రయత్నం చేశాడు. పోలీసులు ఒక్కుమ్మడిగా నరసయ్యనాయుడును కొట్టి తన్ని కిందకు లాగేశారు. లాటీచార్జికి స్పృహతప్పి పోయే పర్యంతం జెండాను కిందకు దించనీయకుండా ఆయన ఎంతో పెనుగులాడుతూనే జెండాను కట్టారు.
బందరు కాంగ్రెస్ కార్యదర్శి
“1922 సభలో చెరుకువాడ వెంకబ నరసింహం గారు బందరు టవున్ కాంగ్రెస్ సంఘ కార్యదర్శి అండ్ ట్రెజరర్ అను పేరను కృష్ణాడిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో నిల్వ ఉన్న మొత్తమున్ను, కరెంటు యక్కౌంటున్నూ గురుజాడ రాఘవశర్మ గారు కార్యదర్శి పట్టణ కాంగ్రెస్ సంఘం, బందరు అను పేరను మార్చవలసిందిగా తీర్మానించటమైనది” అని ఆంధ్రపత్రిక 4-4-1924 సంచికలో వార్త ప్రచురితం అయ్యింది. న్యాయవాది వల్లూరి సూర్యనారాయణ ఆనాడు బందరు పట్టణ కాంగ్రెస్ సంఘం అధ్యక్షులుగా ఉన్నారు.
“బందరుపట్టణ శాంగ్రెను సంఘమువారు అస్పృశ్యత తొలగించుటకై రు 1160.6 ఖర్చు పెటదలచి యున్నారు. కాన, అస్పృశ్యత నివారణార్థము నహాయము కావలసినవారు ఈ సంఘమునకు వెంటనే దరఖాస్తులు పంపప్రార్థితులు, దరఖాస్తుదారులు ప్రభుత్వమువారి సహాయము పొందనివారై యుండవలెను” అంటూ రాఘవశర్మగారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. విషయం చిన్నదే గానీ 1924 నాటి సామాజిక పరిస్థితుల్ని ఇది కళ్లకు కడుతుంది.
స్యాతంత్ర్య సమరయోధులు, జాతీయకవి అయిన గురుజాడ రాఘవశర్మగారి మాటలలో “తల్లిని మించిన దైవములేదు. అట్టి సర్వారాధ్యయగు తల్లికి గూడ కన్నతల్లి యీ ధాత్రీమతల్లి. ఆ బంగారు తల్లి చల్లని యొడిలో పెరిగిన సంతతి యామె కెంతయో ఋణపడి యున్నది. సర్వజీవన ప్రదాత్రియగు ఆ తల్లిని స్మరించి యామె దివ్య పాద పంకజములకు ప్రణమిల్లని ప్రాణియుండదు. ఈ ఉదాత్త కమనీయ భావనలో యొడలు తెలియక ఉప్పొందిన కవి జీమూతములు వర్షించిన మధుర మంజుల సుధాస్రవంతులు దేశమాత కర్పించిన సుపాద్యములు..
మన ఇంటిపేరు గురించి ఒకటి రెండు మాటలు
వాడుకలో “గురుజాడలోని కొమ్ము ఊడి “గురజాడ” అయింది. అయినా కవి చరిత్రకారుడు శ్రీరామమూర్తి పంతులు ‘కవిశేఖర’ రాఘవశర్మగారు, ఇతరులు కొందరు ఆ కొమ్మును దానికి తగిలించే రాసుకొంటూ వచ్చారు. ర వర్గానికి కొమ్ము తగిలించి కొమ్ము మొలిపిస్తూ ఇంటిపేరులో గూడా గురుత్వాన్ని గర్భీకరించేందుకు ఇంకా కొందరు వ్యర్ధంగా ప్రయత్నిస్తున్నారు. ఒకే ఒక్క సందర్భంలో, అదిన్నీ గురునిజాడ అనే అర్థం రాబట్టేందుకని, అప్పారావు కూడా ‘గురుజాడ’ అని రాసుకోవలసివచ్చింది.
“ధృతి గురుజాడల నరిగెడు
గతి వెద్దలు జూడ జనితి గజువతి త్రోవన్..”
గురుజాడ ఇంటిపేరు గురించి:
“అయినా అన్ని దినాలొకరివి కావు. ‘పూలమ్మిన చోట’ సామెత ననుసరించక పట్టాభిరామయ్య పరపంచలు పట్టిపోయాడు. అలాంటివాళ్ళు మరెందరో ఉండేవారని రాఘవశర్మ గారి భోగట్టా. వ్యాపార వాణిజ్య స్థలాలకు, సంస్థానాలకు, ఎగబడి పోయిన మరొక బ్రాహ్మణ కుటుంబం – ఆ ఇంటిపేరే ఉన్నవాళ్ళది – గురజాడ గ్రామానికి దాపున పసుమర్తిలో ఉండేది. వీళ్ళకూ వాళ్ళకూ బావా మరిది వరసలట. అగ్రి కులస్తులు కూడా, నీతి దెలియని నీచుని రాజ్యాన, తెల్లయిజార్జు తొడిగి తలటోపీ పెట్టి నవ్వుల పాలౌతూ వచ్చారని గువ్వలచెన్న శతకకర్త వర్ణించిన రోజులలో, ఈ వలసలు మొదలై ఉంటాయి..” (మహోదయం (సంక్షిప్తం) జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం – కె వి రమణారెడ్డి).
“నడుములు కట్టి పదండి!
ఇంక తడవేల జడియక, నడుములుగట్టి పదండి
గడియ సైనెపగలేమీకఠిన పభుత్వము॥
పట్టాభిగారిని పట్టుకున్న వదలి పెట్టాము, వదలి పెట్టాము
నోరు గట్టిన, వదలి పెట్టాము,
కాళ్ళుగట్టిన వదలి పెట్టాము,
కట్టి కొట్టి జై లునపెట్ట, విడము
ఇంక నిట్టి దుష్ట ప్రభుత నెట్టి రాజ్యము గెలువ
నడుములు గట్టి పదండి!
చెరుకువాడ నరసింహముతో పోరు,
సేయ నంకల్పించె, వీడు –
ఇంచు కరయడు, తన శక్తి కనడు
ధర్మ మెరుగడు తొలుదొల్త వీడు
ముప్పై మూడు కొట్ట సింగముల నెదిరి పోరు”. ॥ నడుములుకట్టి పదండి॥
గురుజాడ రాఘవశర్మ గారి గీతాలు ప్రసిద్ధి పొందాయి.
“జాతీయోద్యము హేతువు
చేతన్ మచిలీపురమ్ము జేరితి సాగెన్
గైతయు జ్యోతిషమున్ వి
ఖ్యాతిగ, బృందావనమ్మె కాపురమాయెన్”
కవిశేఖర శ్రీ గురుజాడ రాఘవ శర్మ రచనలు పరిశీలన గురుజాడ రాజరాజేశ్వరి విశేష పరిశోధన చేసిన గ్రంథం.
శ్రీ గురుజాడ రాఘవశర్మ గారు స్వయంప్రకాశ పభోధినీ గ్రంథాన్ని ప్రశంసిస్తూ వ్రాసిన పద్యం:
“బమ్మెర పోతన్న బంధువాయేమి! యా
తఁడె పల్కినట్టుండు నడుమ నడుమ,
శ్రీనాథకవి నీకుఁ జేరువచుట్టమా
పలనాటి సామెతల్ కలయఁ జిమ్మ
పెద్దన్న యొరవడి పెట్టినాడా నీకు
క్రేళ్లురుకుచును పోకిళ్లు వోవ
నన్నయ తిక్కన లన్న మోమోటమా
తాత పోల్కిని బల్క్ యూఁత గొనఁగ
గాప్పవాండొక డున్ననే కొలము నందు
విఱ్ఱవీ’గెదరయ్య యా విధము కాక
అందఱందఱు బందుగులయ్యు నింత
మన్ననగఁ బల్కుదువె చందమౌళి సుకవి!”
(అక్కిరాజు చంద్రమౌళిశర్మ పైన రాఘవశర్మగారి ప్రశంస)
“రెండు దశౌబ్దుల నాటి ముచ్చట, మదరానులో కేంద సాహిత్య అకాదెమీ ప్రాంతీయ కార్యాలయంలో పని చేసే రోజులవి, ఆ రోజు ఉదయం ఆఫీసుకి బయలుదేరే నన్నాహంలో ఉన్నాను. మిత్రులు శ్రీ బి. యస్. రామారావు గారితో కలిసి శ్రీ గురుజాడ రాఘవశర్మగారు మా యింటికి వచ్చారు. గురుజాడ వారిని దర్శించడం అదే ప్రథమం. పరిచయాలయ్యాక ఆయన మాటల్లోకి దిగారు. ఆకాశగంగ అవనికి దిగి నట్టనిపించింది. ఆ నిర్ఘరాంభః ప్రవాహానికి గేయాలూ వద్యాలూ ఉత్తుంగ తరంగాలె శోభ చేకూర్చాయి, గరిమెళ్ళ సత్యనారాయణగారి ప్రసక్తి వచ్చింది. అ౦తే. చెప్ప నలవికాని ఆవేశం, నవోత్సాహం ఆయన్ని ఆవహించాయి. మాకొద్దీ తెల్ల దొరతనం.. ఆయన ఆలపించారు. ఇరుగు పొరుగువారు గుమిగూడారు. స్వాతంత్ర్యోద్యమకాలపు ఉత్సాహం అందరి లోనూ తొణికిసలాడింది. ఆఫీసు టైం మరిచిపోయాను. ఆయనంటే నాకు గురుత్వం ఏర్పడింది. ఆయన మాటల్లో ఎన్ని అమూల్య విషయాల్లో.. ఎందరి పేర్లు.. గురుజాడ వారితో పరిచయ భాగ్యం కలగడం నా పురాకృత సుకృతం. ఆ యశశ్ళరీరుణ్ణి సభక్తిక౦గా స్మరించుకుంటాను” చల్లా రాధాకృష్ణశర్మ వ్రాశారు.
మొదటి నుంచీ గరిమెళ్ళ స్వేచ్ఛాప్రియుడు. ఆ స్వేచ్భా ప్రయత్వం ఉద్యోగం చెయ్యాలనే కోరికకు సైంధవుడై అడ్జు తగిలి వుండవచ్చు. యల్, టి, (ఉపాధ్యాయ శిక్షణ) అయ్యేందుకు ఆయన రాజమహేంద్రదవరం వెళ్ళాడు. అది 1920. ఆ యేడు ట్రెయినింగు కళాశాలలో చేరాడు. కాని యిల్. టి. పూర్తి చేసినట్టు తెలియడం లేదు. గురుజాడ రాఘవశర్మగారి యూ మాటలు వరిశీలించండి: “జాతీయోద్యమములో చదువుకొన్న వాళ్ళందరు చెడిపోలేదే! యల్టీ పూర్తి చేసికొని నంపాదించుకొనుమని ఎందరో పెద్దలు వీరికి సలహా యిచ్చారు. – ఈ జాతీయ వీర విప్లవ కవికి ఆ సలహా లేవీ గిట్టేవి కావు. మూర్ణపు పట్టుదల విసిగి పోయేవారు కూడ కొందరు. కాని మేడేవల్లి నరసింగరావు గారు, “ఆయన యల్.టి. పాసయి ఛత్రపురంలో గాని ఇచ్ఛాపురంలో గాని ఉద్యోగం చేసినారని వినికిడి” అని తమ లేఖలో పేర్కొన్నారు. సత్యనారాయణ యల్.టి. పూర్తి చెయ్యలేదనే పలువురి అభిప్రాయం.
“..మహాకవులు మారుమూలల యూరు జేరు లేని యుపాధులలో అజ్ఞాత గర్భాల నుండి పైకువికి జీవమణులుగా ప్రకాశించి, స్యప్రకామున నిలిచి కీర్తిచంద్రికలు విరజిమ్ముచూ భావాంబరమున ధ్రువతారలుగా భాసిల్లుతారు. అట్టి సుకృత జీవులలో కీ. శే. గరిమెళ్ళ సత్యనారాయణ గారొకరు.. ఆయన ఒక జానపద గేయ ప్రబోధనాయకమణి, తెనుగు నాట జాతీయ కవిత్వమునకు ఒరవడి పెట్టిన ప్రముఖ కవి గణమున మన గరిమెళ్ళ వారొక మణిపూన. వారి దొక నూత్న పంథా.” – గురుజాడ రాఘవశర్మ,
పరిచయం:
రాఘవశర్మ, గురుజాడ (1899-1987): కవిశేఖర బిరుదాంకితులు. ప్రముఖ స్వాతంత్య సమరయోధులు, తామ్రపత్ర గ్రహీత. తెలుగులో వెలువడిన జాతీయద్యమ కాలపు పాటలు పద్యాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఆయన సంపాదకత్వంలో ప్రచురించబడిన జాతీయ గీతాలు అనే అమూల్య సంపుటం బహుధా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. గరిమెళ్ళ సత్యనారాయణ గారంటే ఆయనకి మహాభిమానం. ఆయన వ్రాసిన గరిమెళ్ళ సత్యనారాయణ గారి జీవిత చరిత్ర అవశ్య పఠనీయం.
శర్మగారు 1987, అగస్టు 25 న పరమపదించారు.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
